
సాక్షి, హైదరాబాద్ : త్వరలోనే విద్యుత్ చార్జీల పెంపు ఉంటుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. విద్యుత్ చార్జీలు పెంచకుంటే ఆ సంస్థల మనుగడ ఎలా అని ప్రశ్నించారు. దళితులు, గిరిజనులకు 101 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నామని.. వాళ్లకు ఎలాంటి పెంపు ఉండదన్నారు. పేదలకు ఇబ్బంది కలిగించబోమని స్పష్టం చేశారు. శుక్రవారం అసెంబ్లీలో పల్లె ప్రగతిపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంచాయతీరాజ్ చట్టాన్ని కఠిన తరం చేశామని చెప్పారు. జవాబుదారీతనం లేని ఉద్యోగులను తీసేస్తామన్నారు. గ్రామ పంచాయతీలకు సక్రమంగా నిధులు విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు. తక్కువ జనాభా ఉన్న పంచాయతీలకు కూడా నిధులు విడుదల చేస్తున్నామని తెలిపారు.
గ్రామాల అభివృద్ధికి చాలా మంది విరాళాలు ఇచ్చారని.. వారికి తెలంగాణ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు చెప్పారు. గ్రామ కార్యదర్శుల సంఖ్య పెంచామని గుర్తుచేశారు. పల్లెప్రగతి ద్వారా గ్రామీణ తెలంగాణ స్వరూపం మారుతోందన్నారు. 3 వేలకు పైగా గిరిజన ప్రాంతాలను పంచాయతీలుగా మార్చామని అన్నారు. గిరిజనుల సెంటిమెంట్లను గౌరవిస్తున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment