
మంచిర్యాల రెడ్‌క్రాస్ బ్లడ్‌బ్యాంకులో రక్తం ఎక్కించుకుంటున్న తలసేమియా వ్యాధిగ్రస్తులు
మంచిర్యాలటౌన్: తలసేమియా.. ఓ ప్రాణాంతక వ్యాధి. అధికారుల లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5 వేలకుపైగా తలసేమియా బాధితులు ఉన్నారు. వాస్తవానికి వీరి సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వైద్యపరీక్షలు చేస్తేగానీ ఈ వ్యాధి ఉన్నట్లు గుర్తించలేకపోతున్నారు. దీంతో ఎంత మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారనే దానిపై పూర్తిస్థాయిలో లెక్కలు లేవు. తలసేమియా వ్యాధికి గురైన బాధితులు 15 రోజులకోసారి రక్తం ఎక్కించుకోవాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో మంచిర్యాల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో ఉచితంగా రక్తం ఎక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చడంతో ఒక్కో రోగి మందుల కోసం నెలకు రూ.6 వేలకుపైగా అయ్యే ఖర్చు బాధితులకు మిగులుతోంది. ఇలాంటి వ్యాధిగ్రస్తులకు ముఖ్యంగా కావాల్సింది రక్తమే. ఆ రక్తమే ప్రస్తుతం వారికి దొరకడం కష్టంగా మారింది. రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా ఎన్నో రకాలుగా ప్రయత్నించినా.. బాధితులు మాత్రం ఇబ్బంది పడుతూనే ఉన్నారు. నేడు ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
వ్యాధి లక్షణాలు.. జాగ్రత్తలు
తలసేమియా వంశపారపర్యంగా తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వస్తుంది. మైనర్, ఇంటర్మీడియెట్, మేజర్ దశల్లో ఉంటుంది. తలసేమియా అల్ఫా, బీటా రెండు రకాలు. ఒక అల్ఫా చెంజ్ కానీ, ఒక బీటా చెంజ్ తగ్గినప్పుడు మైనర్ వ్యాధి ఉన్నట్లు. వీళ్లు వ్యాధిగ్రస్తులైనప్పటికీ రక్త మార్పిడి అవసరం లేదు. వీరు వ్యాధి తీవ్రతతో బాధపడరు. కానీ వారి నుంచి వారి పిల్లలకు వ్యాధి సంక్రమిస్తుంది. ఇంటర్మీడియెట్, మేజర్స్‌లో చెన్స్ ఎక్కువగా దెబ్బతింటాయి. హిమోగ్లోబిన్(హెచ్‌బీ) తగ్గుతుంది. వారికి రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. రోగి శరీరంలో ఒక యూనిట్ రక్తం ఎక్కిస్తే, ఒక గ్రాము హెచ్‌బీ పెరుగుతుంది. హిమోగ్లోబిన్ మెయింటనెన్స్ కనీసం 10.5 గ్రాములు శాతం ఉండేలా చూసుకోవాలి. ప్రతి పదిహేను రోజులకోసారి వీరికి రక్తం అవసరం. జ్వరం రావడం, ఆకలి తగ్గడం, కామెర్లు, మూత్రం పసుపు రంగులో రావడం, ఇన్‌ఫెక్షన్ జరగడం వంటి లక్షణాలతో మనిషి ఎదుగుదల నిలిచిపోతుంది. హిమోగ్లోబిన్ తగ్గడంతో ఎముకల సాంద్రత తగ్గి ఎముకలు విరిగే అవకాశాలుంటాయి. వ్యాధిగ్రస్తులు ఐరన్ సంబంధిత మందులు, ఆహార పదార్థాలు, వంటపాత్రలు వాడరాదు. కాల్షియం (ఎముకలను బలపరిచే) పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.
మంచిర్యాల బ్లడ్‌బ్యాంక్‌లో సేవలు..
ఉమ్మడి జిల్లాలోనే తలసేమియా వ్యాధిగ్రస్తులకు వైద్య పరీక్షలు చేసేందుకు అవసరమైన పరికరాలు మంచిర్యాల ప్రభుత్వాసుపత్రిలోని రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్లడ్‌బ్యాంకులో లభిస్తున్నాయి. 514 మందికి ప్రతినెలా రక్తాన్ని ఉచితంగా ఎక్కిస్తున్నారు. తలసేమియా వ్యాధి సోకిందో..? లేదో..? తెలుసుకునేందుకు అవసరమైన హెచ్‌బీ ఏ2 పరీక్ష చేసే హెచ్‌పీసీఎల్ మిషన్‌ను మంచిర్యాలలోని రెడ్‌క్రాస్ సొసైటీ బ్లడ్‌బ్యాంకుకు అప్పటి జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఐటీడీఏ తరఫున అందించారు. దీంతో ఇప్పుడు ఎవరికి తలసేమియా వ్యాధి సోకిందో పరీక్షించేందుకు అవకాశం ఏర్పడింది. సహజంగా తలసేమియా బాధితులకు 15 యూనిట్ల రక్తం ఎక్కించిన తర్వాత ఐరన్ చిల్లేషన్ మెడిసిన్ ఇవ్వాలి. ఈ మెడిసిన్ రోగి శరీరంలోకి తరుచూ రక్తాన్ని ఎక్కించడం వల్ల పేరుకుపోయిన ఐరన్‌ను తగ్గిస్తుంది. దీంతో రోగిలో హెచ్‌బీ శాతం పెరుగుతుంది. ఈ మందు అందించే సెలైన్ బాక్స్ ఆర్‌బీసీ మిషన్(సీబీఆర్‌ఎం)ను మంచిర్యాల రెడ్‌క్రాస్ సొసైటీకి సింగరేణి సంస్థ అందజేసింది. తలసేమియా వ్యాధిని గుర్తించే రక్తపు క్షీణతను గుర్తించే హెచ్‌పీఎల్‌పీ పరికరం ఉట్నూరు, మంచిర్యాలలో అందుబాటులో ఉంది. శరీరంలో ఐరన్ లెవల్స్ పెరగడం వల్ల, తలసేమియా వ్యాధిగ్రస్తులు 30 ఏళ్ల వరకే జీవిస్తున్నారు.
ఉచితంగా రక్తం మార్పిడి
ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మంచిర్యాలలోని బ్లడ్‌బ్యాంకులో 514 మంది తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఉచితంగా రక్తం ఎక్కిస్తున్నాం. రక్తం ఎక్కించిన ప్రతిసారి ఐరన్ నిల్వ ఎంత మేర ఉందో పరీక్షించాల్సి ఉంటుంది. ఇందుకు అవసరమైన సీరం అబార్ట్ ఐ 100 ఎస్‌ఆర్ మిషన్‌ను సింగరేణి అందించింది. ఆరోగ్యశ్రీలో ఉండడంతో 514 మందికి ఉచితంగా రక్తం ఎ క్కించడంతో పాటు, మందులను అందిస్తున్నాం.– చందూరి మహేందర్, రెడ్‌క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment