'రక్త' కన్నీరు!
* థలసీమియా చిన్నారుల హాహాకారాలు
* రక్త దాతల కోసం ఎదురు చూపులు
* థలసీమియా సొసైటీలో 50 యూనిట్లకు పడిపోయిన రక్త నిల్వలు
* ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి
సాక్షి, హైదరాబాద్: థలసీమియా (రక్తహీనత)తో బాధపడుతున్న చిన్నారులు రక్తం కోసం హాహాకారాలు చేస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రక్తనిల్వలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో వారం రోజులుగా థలసీమియా బాధితులు ప్రాణాలకోసం పోరాడుతున్నారు.
వీరిలో మూడేళ్ల నుంచి పన్నెండేళ్ల వయసుగల చిన్నారులున్నారు. బాధితులకు పదిరోజులకు ఒకసారి రక్తం ఎక్కించాల్సి ఉండగా 16 రోజులకు కూడా రక్తం దొరకడం లేదు. ఉభయ తెలుగు రాష్ట్రాలకూ థలసీమియా సికిల్‌సెల్ సొసైటీ హైదరాబాద్‌లోనే ఉంది. ఈ సొసైటీ పరిధిలో ఇప్పటివరకూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన థలసీమియా బాధితులు సుమారు 2,500 మంది వరకూ పేర్లు నమోదు చేసుకున్నారు. వీళ్లుగాక మరో 2,500 మంది వరకూ బాధితులు ఉన్నారని అంచనా. ఈ సొసైటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని పురాణాహవేలి ప్రాంతంలో ప్రత్యేక రక్తనిధి కేంద్రం నడుస్తోంది.
దీనిద్వారా రక్తదాన శిబిరాలను నిర్వహించడం, సేకరించిన రక్తాన్ని శుద్ధిచేసి బాధితులకు ఎక్కించడం చేస్తుంటారు. కానీ రక్త దాతలు కరువవడంతో ఇక్కడ నిల్వలు తీవ్రంగా పడిపోయినట్టు సొసైటీ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
300 యూనిట్లనుంచి 50కి పడిపోయిన నిల్వలు
థలసీమియా సొసైటీ పరిధిలో నడుస్తున్న రక్తనిధి కేంద్రంలో ఎప్పుడూ 300 యూనిట్ల రక్తం స్టాకు ఉంటుంది. రోజూ 50 యూనిట్ల రక్తం వ్యయమవుతూ ఉంటుంది. అలాంటిది స్టాకు 50 యూనిట్లకు పడిపోవడం, దాతలు సకాలంలో స్పందించకపోవడంతో బాధితులు హాహాకారాలు చేస్తున్నారు. బాధితులకు సమయానికి రక్తం ఎక్కించకపోతే ఒకవిధంగా మృత్యువుతో పోరాడినట్టే ఉంటుంది. ఆరేళ్లలోపు చిన్నారులకు నెలకు ఒకసారి, తొమ్మిదేళ్లు దాటితే 20 రోజులకు రెండుసార్లు యూనిట్ రక్తం చొప్పున ఎక్కించాలి.
థలసీమియా బాధితులకు సెలైన్‌వాష్ చేసిన రక్తాన్నే ఎక్కించాలి మిగతా రక్తనిధి కేంద్రాల్లోని రక్తం వీరికి ఎక్కించేందుకు వీలుండదు. ఇలాంటి రక్తం థలసీమియా సొసైటీ కేంద్రంలోనే లభిస్తుంది. పైగా 5 రోజులకు మించి నిల్వ ఉన్న రక్తం వీరికి పనికిరాదు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బాధితులు చాలామంది ఇక్కడ రక్తం కొరత ఉండటంతో అక్కడే ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. బాధితులకు రక్త దాతలు యువ విద్యార్థులే. వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల నుంచే రక్తం సేకరిస్తారు. కానీ ప్రస్తుతం అడ్మిషన్లు, కౌన్సెలింగ్‌లు ఉండటంతో విద్యార్థులు రక్తమివ్వడానికి రావడం లేదు. దీంతో ఒక్కసారిగా థలసీమియా బాధితుల ఇబ్బందులు మొదలయ్యాయి.
దాతను నేనే తెచ్చుకోవాల్సి వస్తోంది
నాది నల్లగొండ జిల్లా మిర్యాల గూడ. నా కొడుకు వయసు 13 నెలలు. 25 రోజులకోమారు రక్తం ఎక్కించాలి. కానీ దొరకడం లేదు. నేనే దాతను వెతుక్కుని హైదరాబాద్‌కొచ్చి బిడ్డకు రక్తం ఇప్పిస్తున్నా. ఇది తలకు మించిన
భారమవుతోంది.
- నాగేశ్వరరావు, మిర్యాలగూడ