Blood banks
-
‘బ్లడ్‌బ్యాంకులకు ‘రక్తహీనత’ అధ్వాన్నంగా పరిస్థితి
సాక్షి, దాదర్: ముంబైసహా రాష్ట్రంలోని వివిధ బ్లడ్ బ్యాంకుల్లో రక్తం నిల్వలు భారీగా తగ్గిపోయాయి. పరిస్ధితి ఇలాగే కొనసాగితే వివిధ ప్రభుత్వ, కార్పొరేషన్ ఆస్పత్రుల్లో అత్యవసరమైనవి మినహా సాధారణ ఆపరేషన్లన్నిటినీ వాయిదా వేయాల్సిన పరిస్ధితి ఎదురుకానుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ బ్లడ్ బ్యాంకుల్లో, కేంద్రాలలో కేవలం 43,062 యూనిట్ల రక్తం నిల్వలున్నాయి. అయినప్పటికీ కొన్ని బ్లడ్‌బ్యాంకులు ఇక్కడి రోగులకు అందించాల్సిన రక్తాన్ని ఇతర రాష్ట్రాలకు పంపిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. దీనిపై సీరియస్‌గా స్పందించిన రాష్ట్ర రక్త నిల్వల పరిషద్ కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. పరిస్ధితులు సాధారణ స్ధితికి వచ్చే వరకు ఇతర రాష్ట్రాలకు రక్తాన్ని పంపించడాన్ని నిషేధించాలని పరిషద్ నిర్ణయించింది. ప్రైవేట్ బ్లడ్‌బ్యాంకుల దోపిడీ... సాధారణంగా ఏటా దీపావళి, వేసవి సెలవుల్లో పెద్ద సంఖ్యలో జనాలు తమ కుటుంబ సభ్యులతో స్వగ్రామాలకు లేదా విహార యాత్రలకు, పుణ్యక్షేత్ర సందర్శనకు వెళుతుంటారు. ఈ సమాయల్లో స్వచ్చంద సేవా సంస్ధలు, రాజకీయ పార్టీలు అక్కడక్కడా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసినప్పటికీ దాతలు ఎవరూ ముందుకురారు. దీంతో దీపావళి, వేసవి సెలవుల్లో బ్లడ్ బ్యాంకుల్లో రక్తనిల్వల కొరత తీవ్రంగా ఉంటుంది. ఈసారి దీపావళి పర్వదినానికి అసెంబ్లీ ఎన్నికలు కూడా తోడు కావడంతో పరిస్ధితి మరింత దారుణంగా తయారైంది. అసెంబ్లీ ఎన్నికల కారణంగా అన్ని రాజకీయ పార్టీలకు చెందిన కార్యకర్తలు, పదాధికారులు బిజీగా ఉన్నారు. వీరిలో రక్తదాతలు కూడా ఉండడంతో పరిస్ధితి అధ్వాన్నంగా తయారైంది. ఎన్నికల కోడ్ అమలులో ఉండడంవల్ల రాజకీయ పార్టీల తరఫున రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడానికి వీలులేకుండా పోయింది. స్వయం సేవా సంస్ధలు శిబిరాలు ఏర్పాటు చేసినప్పటికి ఎన్నికల ప్రచారంలో ప్రజలు బిజీగా ఉండడంతో రక్త దానం చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. ఫలితంగా బ్లడ్ బ్యాంకుల్లో రక్తం నిల్వలు తగ్గిపోవడంతో అత్యవసర ఆపరేషన్లకే రక్తాన్ని సరఫరా చేస్తున్నారు. ఫలితంగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులు, వారి వెంట ఉన్న బంధువులు రక్తం కోసం ఉరుకులు, పరుగులు తీయాల్సిన పరిస్ధితి ఏర్పడింది. ప్రభుత్వ బ్లడ్ బ్యాంకుల్లో, కేంద్రాలలో రక్తం లభించకపోవడంతో ప్రైవేటు బ్లడ్ బ్యాంకులపై దృష్టిసారించారు. గత్యంతరం లేక వారు అడిగినంత చెల్లించి రక్తాన్ని తీసుకువస్తున్నారు. కొన్ని బ్లడ్ బ్యాంకుల్లో అయితే రోగుల బంధువులు రక్త దానం చేస్తేనే అందుకు బదులుగా అక్కడ నిల్వ ఉన్న బ్లడ్ గ్రూపు రక్తాన్ని ఇస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత కూడా కొద్ది రోజుల వరకూ ఇదే పరిస్థితి కొనసాగనుంది. ఫలితాల అనంతరం విజయోత్సవాలు, ర్యాలీలతో రాజకీయ పార్టీలు చాలా బిజీగా ఉంటాయి. అంతేగాకుండా పదాధికారులు, కార్యకర్తలు విందులు, వినోదాలతో బిజీగా ఉండడంవల్ల రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడానికి సమయం దొరకదు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత పరిస్ధితులన్నీ సాధారణ స్ధితికి వస్తే తప్ప రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడానికి వీలుకాదు. అంతవరకు రక్తం కొరతను చవిచూడక తప్పదని తాజా పరిస్ధితులను బట్టి స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల తరపున కాకుండా వివిధ ధార్మిక, సామాజిక సేవా సంస్ధల ద్వారా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని పరిషద్ పిలుపు నిచ్చింది. నివాస సొసైటీల ఆవరణలో, పాఠశాల మైదానాలలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించింది. శిబిరాలు తమకు దగ్గరలోనే ఉండటం వల్ల రక్తదాతలు స్వచ్చందంగా ముందుకు వస్తారని పరిషద్ భావిస్తోంది. లేదంటే ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగుల పరిస్ధితి చేయి దాటిపోయే ప్రమాద ముందని ఆందోళన వ్యక్తంచేసింది. -
హైదరాబాద్ లో బ్లడ్ బ్యాంకుల పై డ్రగ్ కంట్రోల్ బ్యూరో సోదాలు
-
HYD: డ్రగ్ కంట్రోల్ అధికారుల దాడులు.. 9 బ్లడ్ బ్యాంకులకు నోటీసులు
సాక్షి, హై దరాబాద్: నగరంలోని పలు బ్లడ్ బ్యాంకుల్లో డ్రగ్ కంట్రోల్ బ్యూరో ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. నిబంధనలు పాటించని 9 బ్లడ్ బ్యాంకులకు నోటీసులు జారీ చేసింది. ప్లేట్లెట్స్, ప్లాస్మా నిల్వ, రక్త సేకరణ పరీక్షల్లో లోపాలున్నట్లు గుర్తించింది. మలక్‌పేట, చైతన్యపురి, లక్డీకపూల్, హిమయాత్ నగర్,సికింద్రాబాద్, కోఠి, మెహదీపట్నం, బాలానగర్, ఉప్పల్ ప్రాంతాల్లోని బ్లడ్ బ్యాంకుల్లో తనిఖీలు నిర్వహించారు. కాగా, సాధారణ తనిఖీల్లో భాగంగా డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఫిబ్రవరి 2న మూసాపేటలోని హీమో సరీ్వసెస్ లాబోరేటరీలో తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. సామర్థ్యానికి మించి నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. నిర్వాహకుడు ఆర్ రాఘవేంద్రనాయక్ అక్రమంగా ప్లాస్మాను నిల్వ చేసి, అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. శ్రీకర, న్యూలైఫ్ బ్లడ్ బ్యాంకుల నుంచి హోల్ బ్లడ్‌ను సేకరించి, ప్లాస్మాను వేరు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు నిర్ధారించారు. ఈ అక్రమాల్లో భాగస్వామిగా ఉన్న మియాపూర్‌లోని శ్రీకర ఆస్పత్రి బ్లడ్ బ్యాంకు సహా, దారుషిఫాలోని న్యూలైఫ్ ఎడ్యుకేషన్ సొసైటీ బ్లడ్ బ్యాంకు కూడా ఉంది. ఈ రెండు బ్లడ్ బ్యాంకుల లైసెన్సులను రద్దు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం గ్రేటర్లో ఐపీఎం సహా 76 ప్రభుత్వ, ప్రైవేటు, ఎన్జీఓ బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి. ఆయా బ్లడ్ బ్యాంకుల నిర్వాహకులు ప్రముఖుల బర్త్‌డేల పేరుతో ఇంజినీరింగ్ కాలేజీలు, కార్పొరేట్ కంపెనీల్లో తరచూ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తుంటారు. ఆపదలో ఉన్న రోగులను కాపాడాలనే ఉద్దేశంతో చాలా మంది తమ రక్తాన్ని దానం చేసేందుకు ముందుకు వస్తుంటారు. దాతల నుంచి సేకరించిన రక్తాన్ని ప్రాసెస్ చేసి, ప్రభుత్వం నిర్ణయించిన ధరకే రోగుల కు అందజేయాల్సి ఉంది. కానీ నగరంలోని పలు బ్లడ్ బ్యాంకుల నిర్వాహకులు అక్రమాలకు పాల్పడుతున్నారు. దాతల నుంచి సేకరించిన రక్తంలో 30 శాతం రక్తాన్ని ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఎంఎన్‌జే కేన్సర్ సహా ఇతర ప్రభుత్వ ఆస్పత్రులకు ఉచితంగా అందజేయాలనే నిబంధన ఉంది. దీనిని నగరంలోని పలు బ్లడ్‌బ్యాంకుల నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. -
Hyderabad: బ్లడ్ బ్యాంకుల అనుమతులు రద్దు..
సాక్షి, హైదరాబాద్: ఎండలు ముదురుతున్నాయి. విద్యార్థులకు వార్షిక పరీక్షలు సమీపిస్తున్నాయి. ఆశించిన స్థాయిలో దాతలు ముందుకు రాకపోవడంతో రక్తదాన శిబిరాలు కూడా నిర్వహించడం లేదు. ఫలితంగా నగరంలోని పలు రక్తనిధి కేంద్రాల్లో రక్తపు నిల్వలు నిండుకున్నాయి. దీనిని పలు బ్లడ్‌బ్యాంకుల నిర్వాహకులు అవకాశంగా తీసుకుంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వచి్చన రోగులకు హోల్ బ్లడ్ సహా ప్లాస్మా, ప్లేట్‌లెట్స్‌ను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. బ్లడ్ బ్యాంకుల పేరుతో భారీగా దండుకుంటున్నారు. ఈ రక్తపిశాచులపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో డ్రగ్ కంట్రోల్ అడ్మిని్రస్టేషన్ అధికారులు అప్రమత్తమై..అనుమానం ఉన్న బ్లడ్ బ్యాంకులపై దాడులు నిర్వహించారు. స్వచ్ఛంద సేవ ముసుగులో వ్యాపారం చేస్తున్న పలు బ్లడ్ బ్యాంకులను గుర్తించి, వాటి లైసెన్సులను రద్దు చేశారు. ఫక్తు వ్యాపారం ప్రస్తుతం గ్రేటర్లో ఐపీఎం సహా 76 ప్రభుత్వ, ప్రైవేటు, ఎన్జీఓ బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి. ఆయా బ్లడ్ బాం్యకుల నిర్వాహకులు ప్రముఖుల బర్త్‌డేల పేరుతో ఇంజినీరింగ్ కాలేజీలు, కార్పొరేట్ కంపెనీల్లో తరచూ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తుంటారు. ఆపదలో ఉన్న రోగులను కాపాడాలనే ఉద్దేశంతో చాలా మంది తమ రక్తాన్ని దానం చేసేందుకు ముందుకు వస్తుంటారు. దాతల నుంచి సేకరించిన రక్తాన్ని ప్రాసెస్ చేసి, ప్రభుత్వం నిర్ణయించిన ధరకే రోగుల కు అందజేయాల్సి ఉంది. కానీ నగరంలోని పలు బ్లడ్ బ్యాంకుల నిర్వాహకులు అక్రమాలకు పాల్పడుతున్నారు. దాతల నుంచి సేకరించిన రక్తంలో 30 శాతం రక్తాన్ని ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఎంఎన్‌జే కేన్సర్ సహా ఇతర ప్రభుత్వ ఆస్పత్రులకు ఉచితంగా అందజేయాలనే నిబంధన ఉంది. దీనిని నగరంలోని పలు బ్లడ్‌బ్యాంకుల నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. కృత్రిమ కొరత సృష్టించి రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులు అధిక రక్త్రస్తావంతో బాధపడుతుంటారు. గర్భిణుల ప్రసవాలతో పాటు పలు కీలక సర్జరీల్లోనూ రక్త్రస్తావం అధికంగా ఉంటుంది. ఇలాంటి వారికి తక్షణమే ఆయా గ్రూపుల రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. డెంగీ జ్వరంతో బాధపడే వారికి తెల్లరక్తకణాలు ఎక్కించాల్సి ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో రోగుల బంధువులు నమూనాలు తీసుకుని సమీపంలోని రక్తనిధి కేంద్రాలను ఆశ్రయిస్తుంటారు. రోగుల బంధువుల్లో ఉన్న బలహీనతను అక్రమార్కులు అవకాశంగా తీసుకుంటున్నారు. హోల్ బ్లడ్ సహా ప్లాస్మా, ప్లేట్‌లెట్స్‌ను ఆయా బ్లడ్ బ్యాంకుల సామర్థ్యానికి మించి నిల్వ చేసి, మార్కెట్లో కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. రక్తపు కొరత పేరుతో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు సాధారణ తనిఖీల్లో భాగంగా డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఫిబ్రవరి 2న మూసాపేటలోని హీమో సరీ్వసెస్ లాబోరేటరీలో తనిఖీలు నిర్వహించారు. సామర్థ్యానికి మించి నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. నిర్వాహకుడు ఆర్ రాఘవేంద్రనాయక్ అక్రమంగా ప్లాస్మాను నిల్వ చేసి, అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. శ్రీకర, న్యూలైఫ్ బ్లడ్ బ్యాంకుల నుంచి హోల్ బ్లడ్‌ను సేకరించి, ప్లాస్మాను వేరు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు నిర్ధారించారు. ఈ అక్రమాల్లో భాగస్వామిగా ఉన్న మియాపూర్‌లోని శ్రీకర ఆస్పత్రి బ్లడ్ బ్యాంకు సహా, దారుషిఫాలోని న్యూలైఫ్ ఎడ్యుకేషన్ సొసైటీ బ్లడ్ బ్యాంకు కూడా ఉంది. ఈ రెండు బ్లడ్ బ్యాంకుల లైసెన్సులను రద్దు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
నెల్లూరు రెడ్‌క్రాస్ బ్లడ్‌బ్యాంక్: రాష్ట్రంలో మొదటి స్థానం.. దేశంలో రెండో స్థానం
ఈయన పేరు ఎం.మధుసూదన్‌రావు, నెల్లూరు. రక్తదాన మోటివేటర్. కేవలం మోటివేటర్గానే కాకుండా క్రమం తప్పకుండా ప్రతి మూడు, నాలుగు నెలలకో దఫా రక్తదానం చేస్తున్నారు. ఇప్పటికే 110 దఫాలు రక్తదానం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచాడు. ఈయన పేరు చంద్రగిరి అజయ్‌బాబు, నెల్లూరులోని పొదలకూరు రోడ్డులో నివాసం ఉంటున్నాడు. దూరప్రాంత గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ప్రస్తుతం బ్లడ్‌బ్యాంకు కన్వీనర్‌గా కూడా అదనపు బాధ్యతలు నిర్వరిస్తున్నాడు. పాఠశాలలో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాక ఇంటికి వెళ్లకుండా నేరుగా బ్లడ్ బ్యాంకుకే వస్తారు. అక్కడ బ్లడ్‌బ్యాంకులో స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నాడు. ఈయన ఇప్పటి వరకు 93 దఫాలుగా రక్తదానం చేసి పలువురికి స్ఫూర్తి దాయకంగా నిలిచాడు. నెల్లూరు (అర్బన్): ప్రాణాపాయంలో క్షతగాత్రుల ఊపిరి నిలిపేందుకు అత్యవసరంగా రక్తం అందించాల్సి ఉంది. రక్తహీనతతో ఉన్న గర్భిణులు, ఇతర సర్జరీల సమయంలో రక్తం అవసరమైనప్పుడు, హీమోఫీలియో, తలసేమియా రోగులకు క్రమం తప్పకుండా రక్తం అందించాల్సి వచ్చినప్పుడు వారి ప్రాణాలు కాపాడేందుకు తామున్నామంటూ అనేక మంది స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్నారు. ప్రాణదాతలుగా నిలుస్తూ జిల్లాకు గుర్తింపు తెచ్చారు. ఎంతో మందికి స్ఫూర్తిదాతలు నిలుస్తున్నారు. భారతదేశంలో స్వచ్ఛంద రక్తదాన ఉద్యమానికి మార్గదర్శకుడు, ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ పితామహుడు డాక్టర్ జేజీ జోలి. ఆయన చేసిన పరిశోధనలు, కృషి వల్లనే అక్టోబర్ 1వ తేదీని జాతీయ రక్తదాన దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటిందింది. డాక్టర్ జేజీ జోలి స్వచ్ఛంద రక్తదాన ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాడు. అదే స్ఫూర్తితో జిల్లాలో ఎంతో మంది స్వచ్ఛంద రక్తదాతలుగా మారారు. జిల్లాలో ఉన్న పలు బ్లడ్‌బ్యాంకులు రోగుల రక్త కొరత తీర్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. నగరంలో రెడ్‌క్రాస్‌తో పాటు నోవాబ్లడ్ బ్యాంకు, పెద్దాస్పత్రి, నారాయణ, అపోలో ఆస్పత్రిలో బ్లడ్ బ్యాంకులున్నాయి. అందులో రెడ్‌క్రాస్ బ్లడ్‌బ్యాంకు 90 శాతం వరకు రోగులను ఆదుకుంటుంది. రాష్ట్రంలో మొదటి స్థానం.. దేశంలో రెండో స్థానం 1997లో రెడ్‌క్రాస్ సొసైటీ బ్లడ్‌బ్యాంకు పూర్తి స్థాయి వినియోగంలోకి వచ్చింది. నెల్లూరు రెడ్‌క్రాస్ బ్లడ్‌బ్యాంకు సేవలు రాష్ట్రంలో ప్రథమ, దేశంలో రెండో స్థానాల్లో నిలుస్తున్నాయి. కోవిడ్ సమయంలో వందలాది మంది కరోనా రోగులకు ప్లాస్మాదానం చేయడంలో దేశంలోనే మొదటి స్థానాన్ని జిల్లా రెడ్‌క్రాస్ బ్లడ్‌బ్యాంకు సాధించింది. రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంకుకు 3 మొబైల్ వాహనాలు జిల్లా రెడ్‌క్రాస్ బ్లడ్‌బ్యాంకు సేవలు బాగుండడంతో ఇటీవల రూ.1.25 కోట్లతో రెండు మొబైల్ వాహనాలను ఇండియన్ రెడ్‌క్రాస్–న్యూఢిల్లీ నెల్లూరుకు అందజేశారు. పదిరోజుల క్రితం వీటిని రాష్ట్రమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కలెక్టర్ చక్రధర్‌బాబు ప్రారంభించారు. జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం రూ.కోటి నిధులతో మరో మొబైల్ బస్సును ఇక్కడికి పంపారు. దీంతో మొత్తం రూ.2.25 కోట్లతో మూడు ఆధునిక మొబైల్ వాహనాలు నెల్లూరు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఈ మొబైల్ బస్సులో ఒకే దఫా ఐదుగురు రక్తదానం చేసేందుకు సీటింగ్, డాక్టర్‌కు రెస్ట్ రూం, పరీక్షలు చేసేందుకు, రక్తదానం చేసిన తర్వాత రెస్ట్ తీసుకునేందుకు వసతులు ఏర్పాటు చేశారు. సెంట్రలైజ్డ్ ఏసీని వాహనంలో ఏర్పాటు చేశారు. గ్రామీణులు ముందుకు రావాలి రక్తదానంపై అవగాహన అవసరం. దీంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రస్తుతం 1000 మందిలో ఐదుగురు మాత్రమే పట్టణాల్లో రక్తదానం చేస్తున్నారు. గ్రామీణులు పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు. రక్తదానం చేసేందుకు ముందుకు రావాలి. 1000 మందిలో కనీసం 15 మంది రక్తదానం చేసినప్పుడు కొరత తీరుతుంది. నేను 49 దఫాలు రక్తదానం చేశాను. – మోపూరు భాస్కర్‌నాయుడు, నోవా బ్లడ్‌బ్యాంకు అడ్మినిస్ట్రేటర్ రక్తం కొరత ఉంది ఎంతోమంది సభ్యులు స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్నారు. వారందరికీ వందనాలు. అయితే డెంగీ వంటి సీజనల్ వ్యాధులు ప్రబలినప్పుడు రోగుల అవసరాలకు తగిన విధంగా రక్తం అందక ఇబ్బందులు పడుతున్నాం. అందువల్ల రక్తదానం అనేది కుటుంబ సంప్రదాయంగా మారాలి. రక్తం ఇవ్వడం ఆరోగ్యానికి మంచిది. బ్లడ్ బ్యాంకు సేవలను విస్తృతం చేస్తున్నాం. ఇకమీదట నేరుగా గ్రామా ల్లో పెద్ద ఎత్తున క్యాంపులు నిర్వహిస్తాం. రోగులకు ఇబ్బంది లేకుండా చేస్తాం. – పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ -
ఆస్పత్రుల్లో దారుణ పరిస్థితులు.. ఎండలు.. వైరస్ భయంతో ముందుకు రావట్లేదు
సాక్షి, హైదరాబాద్: రక్తానికి రక్తం! ఇదేదో సినిమాలో విన్పించే డైలాగ్ కాదు. నగరంలోని ఏ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లోని బ్లడ్‌బ్యాంక్‌కు వెళ్లినా ప్రస్తుతం ఇదే డైలాగ్ రిపీటవుతోంది. ‘మీ సంబంధీకులు ఎవరైనా ఆస్పత్రిలో ఉండి.. రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి ఉంటే... మీలో ఎవరో ఒకరు రక్తదానం చేయాల్సిందే. లేకుంటే రక్తం ఇవ్వలేం’ అని ఇక్కడి సిబ్బంది చెబుతున్నారు. దీనికి కారణం తీవ్రంగా ఏర్పడిన రక్తం కొరతే. నగరంలోని అన్ని ప్రధానాస్పత్రులతో పాటు బ్లడ్ బ్యాంకులలోనూ ప్రస్తుతం రక్త నిల్వలు లేవు. అన్ని స్థాయిల విద్యార్థులకు పరీక్షలు సమీపిస్తుండడం, ఎండలు పెరగడం, వైరస్ భయాల వంటి కారణాలతో ఇప్పుడు రక్తదానం చేసే వారు కరువయ్యారు. ఫలితంగా అత్యవసర పరిస్థితుల్లో ఆయా ఆస్పత్రుల్లోని బ్లడ్ బ్యాంకులకు చేరుకున్న క్షతగాత్రులకు, సర్జరీ బాధితులకు, తలసేమియా రోగులకు ప్రాణసంకటం ఏర్పడింది. బంధువుల్లో ఎవరైనా రక్తదానం చేసేందుకు ముందుకు వస్తే కానీ...ఆయా బాధితులకు అవసరమైన గ్రూప్ రక్తం దొరకని దుస్థితి నెలకొంది. చదవండి: మళ్లీ బుసకొట్టిన సెస్.. ఈసారి డీజిల్ సెస్ వడ్డించిన ఆర్టీసీ ఆందోళనలో క్షతగాత్రులు..సర్జరీ బాధితులు ఉస్మానియా, గాంధీ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా పని చేస్తున్న బోధనాసుపత్రులతో పాటు కార్పొరేట్ ప్రైవేటు ఆస్పత్రుల్లో రోజుకు సగటున వెయ్యికిపైగా చికిత్సలు జరుగుతున్నట్లు అంచనా. వీరిలో రోడ్డు, అగ్ని, ఇతర ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులతో పాటు, పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణులు, కేన్సర్, గుండె పోటు, కాలేయం, మూత్ర పిండాల సంబంధిత సమస్యతో బాధపడుతున్న వారే అధికం. సాధారణంగా ఏదైనా రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారు అధిక రక్తస్త్రావంతో బాధపడుతుంటారు. కేవలం గాయాలైన సందర్భంలోనే కాదు సర్జరీ సమయంలో రక్తస్త్రావం అవుతుంది. వీరికి వెంటనే రక్తం ఎక్కించాల్సి ఉంది. ఇలా రోజుకు సగటున రెండు నుంచి మూడు వేల యూనిట్ల రక్తం అవసరమవుతుంది. కానీ ఆశించిన స్థాయిలో బ్లడ్ దొరకడం లేదు. అంతేకాదు కాలేయ, గుండె, ఊపిరితిత్తుల మార్పిడి చికిత్సలకు 20–30 యూనిట్లు అవసరం. ఆ మేరకు లభ్యత లేక పోవడంతో సర్జరీలు వాయిదా వేయాల్సి వస్తోంది. ఒ–నెగటివ్ నిల్ హైదరాబాద్ జిల్లాలో 70 రక్తనిధి కేంద్రాలు ఉండగా, రంగారెడ్డి జిల్లాలో 14, మేడ్చల్ జిల్లాలో 8 రక్తనిధి కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ఉస్మానియా, నిమ్స్, నిలోఫర్, రెడ్‌క్రాస్, ఆదిత్య, ఒవైసీ, స్టార్, ఆస్పత్రుల్లో మాత్రమే కొన్ని గ్రూపుల రక్తం నిల్వలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 200 యూనిట్లకు మించి లభ్యత లేదు. అది కూడా ఎ, బి, ఏబీ పాజిటివ్ గ్రూపులకు సంబంధించిన రక్తపు నిల్వలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కీలకమైన ఒ–నెగటివ్ గ్రూప్ రక్తం అసలే లేదు. తలసీమియా బాధితుల ప్రాణసంకటం తలసీమియా సికిల్ సొసైటీలో 3031 మంది బాధితులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరిలో తెలంగాణకు చెందిన వారు 2235 మంది ఉండగా, ఏపీ కి చెందిన వారు 705 మంది ఉన్నారు. మరో 91 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. వీరిలో కొంత మందికి నెలకు రెండు యూనిట్లు (500 ఎంఎల్) రక్తం అవసరం కాగా, మరికొంతమందికి ఒక యూనిట్ (250 ఎంఎల్) అవసరమవుతుంది. రక్తనిధి కేంద్రాల్లో వీరికి అవసరమైన గ్రూపు రక్తం దొరక్కపోవడంతో బాధితులే దాతలను సమకూర్చుకోవాల్సి వస్తోంది. నెలకు రెండు సార్లు రక్తాన్ని ఎక్కించుకోవాల్సిన వారు ఒకసారితో సరిపెట్టుకుంటున్నారు. ఫలితంగా రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పడిపోయి..చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడాల్సిన పరిస్థితి నెలకొంది. -
63 జిల్లాల్లో బ్లడ్ బ్యాంకులు లేవు
న్యూఢిల్లీ: దేశంలో 3,500 లైసెన్స్డ్ బ్లడ్ బ్యాంకులు ఉండగా, 63 జిల్లాల్లో అసలు బ్లడ్ బ్యాంకులు లేవని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ శుక్రవారం లోక్‌సభలో తెలిపారు. జాతీయ రక్త విధానం కింద ప్రతి జిల్లాలో కనీసం ఒక్క బ్లడ్‌బ్యాంక్ అయినా ఉండేలా చూస్తున్నామని పేర్కొన్నారు. అయితే అర్బన్, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఉండే బ్లడ్ బ్యాంకులను కలపబోవడం లేదని తెలిపారు. ఎక్కువ పరిమాణంలో రక్తం దొరకే చోటు నుంచి దాన్ని నిల్వ చేసి, తక్కువగా దొరికే స్టోరేజీలకు పంపే దిశగా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. దేశంలో చాలా రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో జిల్లాల విభజన జరుగుతూ పోవడం వల్ల జిల్లాకో బ్లడ్ బ్యాంక్ ఉండటం లేదన్నారు. అలాంటి చోట్లకు పాత బ్లడ్‌బ్యాంకుల నుంచే రక్తం సరఫరా జరగాలన్నారు. -
కరోనా ఎఫెక్ట్: ముంబైలో రక్తం దొరకట్లేదు
సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరాన్ని రక్తం కొరత వేధిస్తోంది. నగరంలోని బ్లడ్‌బ్యాంకుల్లో రక్తం నిల్వలు కనిష్టస్థాయికి తగ్గిపోయాయి. ప్రస్తుతం కేవలం 25 వేల యూనిట్ల రక్తం మాత్రమే అందుబాటులో ఉంది. ఈ రక్తం కేవలం వారం లేదా పది రోజులకు సరిపోనుంది. దీంతో ఈ రక్తం నిల్వలు అయిపోతే పరిస్థితి ఏమిటా అని అటు డాక్టర్లు, రోగులు తలలు పట్టుకుంటున్నారు. గతేడాది బ్లడ్ బ్యాంకుల్లో రక్తం నిల్వల పరిస్థితి రోజురోజుకు దిగజారడంతో స్వయంగా ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే చొరవ తీసుకున్నారు. ముంబైలో రక్తం కొరత తీవ్రంగా ఉందని, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని సార్వజనిక మండళ్లకు, సేవా సంస్థలకు పిలుపునిచ్చారు. ఆ మేరకు అనేక మండళ్లు, సేవా సంస్థలు ముందుకు వచ్చి రక్తాన్ని సేకరించాయి. దీంతో కొన్నిరోజుల పాటు బ్లడ్ బ్యాంకుల్లో నిల్వలు పెరిగినప్పటికి.. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి కరోనా మళ్లీ పడగ విప్పడంతో పరిస్థితి మొదటికి వచ్చింది. కరోనాతో రక్తదాన శిబిరాలు బంద్ కరోనా కారణంగా రక్తదాన శిబిరాలు నిర్వహణ సాధ్యం కావడం లేదు. సాధారణంగా రక్తదాన శిబిరాలు నిర్వహించడంలో కాలేజీలు, ఐటీ, కార్పొరేట్ సెక్టార్లు అగ్రస్థానంలో ఉండేవి. కానీ కరోనా వల్ల వీటి కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఐటీ, కార్పొరేట్ సెక్టార్లలో చాలా మంది వర్క్ ఫ్రం హోమ్ చేసుకుంటున్నారు. దీంతో గతేడాది నుంచి రక్తదాన శిబిరాలు నిర్వహించలేకపోయారు. స్వ యంగా వచ్చి రక్తం ఇచ్చే దాతలూ కరువయ్యారు. దీంతో బ్లడ్ బ్యాంకుల్లో రక్తం నిల్వలు గణనీయంగా తగ్గిపోయి కొరత ఏర్పడింది. ముంబైలో ప్రతీరోజు సరాసరి మూడు నుంచి ఐదు వేల యూనిట్ల రక్తం అవసరముంటుంది. పైగా బ్లడ్ బ్యాంకుల్లో నిల్వచేసిన రక్తం కేవలం 35 రోజుల వరకే ఉపయోగపడుతుంది. ఆ తరువాత రక్తంలోని కణాలు చనిపోవడం, శక్తి క్షీణించి నిరుపయోగంగా మారుతాయని నిపుణులు అంటున్నారు. దీంతో ఎప్పటికప్పుడు తాజా రక్తాన్ని సేకరించి నిల్వచేయాల్సి ఉంటుంది. అత్యవసర ఆపరేషన్లు మాత్రమే.. నగరంలో రక్తం కొరత వల్ల ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు చాలా ఇబ్బంది అవుతోంది. అత్యవసర ఆపరేషన్లకు మాత్రమే రక్తం సరఫరా జరుగుతోంది. రక్తం కొరత నేపథ్యంలో సామాన్య రోగులకు చేయాల్సిన ఆపరేషన్లను డాక్టర్లు వాయిదా వేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా అత్యవసరమై ఆపరేషన్ చేయమని కోరితే.. రక్తం తెచ్చుకొమ్మని డాక్టర్లు సూచిస్తున్నారు. దీంతో కొందరు బంధువులు రోగులను ఆస్పత్రిలోనే ఉంచి రక్తం కోసం బ్లడ్‌బ్యాంకుల చుట్టూ తిరుగుతూ నానా తంటాలు పడుతున్నారు. ఇక కొన్ని బ్లడ్ బ్యాంకులు, ప్రైవేటు కేంద్రాలు రక్తం ఇచ్చేందుకు అంగీకరించినప్పటికీ.. అందుకు బదులుగా తమ రక్తాన్ని దానం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. లేకపోతే దాతలను వెంట తీసుకురావాలని అంటున్నాయి. అలా అయితేనే రక్తం ఇస్తామని చెబుతుండటంతో ఏం చేయాలో తెలియక రోగుల బంధువులు అయోమయంలో పడిపోతున్నారు. వ్యాక్సిన్‌తో కొందరిలో అయోమయం కరోనా టీకా తీసుకున్న కొందరు రక్తదానం చేసే విషయంలో సందిగ్ధంలో ఉన్నారు. తాము రక్తం ఇవ్వవచ్చో లేదో తెలియక అయోయమానికి గురవుతున్నారు. వ్యాక్సిన్ తీసుకునే ముందుగానీ, టీకా తీసుకున్న తరువాత గానీ కొన్ని రోజులపాటు రక్తదానం చేయకూడదని వదంతులు వస్తున్నాయి. రెండు నెలల వరకు రక్తదానం చేయకూడదని కొందరు, పక్షం రోజుల తరువాత రక్తదానం చేయవచ్చని మరికొందరు రకరకాలుగా చెబుతుండటంతో దాతలకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. దీంతో రక్తం ఇవ్వాలని ఉన్నప్పటికి కొందరు దాతలు భయపడి రక్తదానానికి ముందుకు రావడం లేదు. -
రోగుల ప్రాణాలతో మందులోళ్ల చెలగాటం..
సాక్షి, హైదరాబాద్: కొన్ని ఔషధ కంపెనీలు, మందుల దుకాణాలు, బ్లడ్ బ్యాంకులు నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి. రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో మెడికల్ షాపుల్లో గడువు తీరిన, నాసిరకం మందుల అమ్మకంతో రోగులకు ముప్పు పొంచి ఉంటోంది. ఔషధ నియంత్రణశాఖ పరిధిలో జరిగే ఉల్లంఘనల్లో దాదాపు 75% మెడికల్ షాపుల్లో జరిగేవేనని అధికారులు అంటున్నారు. ప్రధానంగా రిఫ్రిజిరేటర్లో ఉంచాల్సిన ఔషధాలను వేడి వాతావరణంలో పెట్టడం, సాధారణ మెడికల్ షాపు ల్లోనూ పశువుల మందులు విక్రయించడం, ఫార్మ సిస్ట్ లేకపోవడం, ప్రిస్క్రిప్షన్ లేకుండానే అమ్మడం, ఒక బ్రాండ్‌కు బదులు మరో బ్రాండ్ మందులు అంటగట్టడం, నిర్ణీత ధర కంటే ఎక్కువకు అమ్మడం, రికార్డుల నిర్వహణ సరిగా లేకపోవడం వంటి ఉల్లంఘనలు జరిగినట్లు సర్కారు గుర్తించింది. అలాగే కొన్ని ఔషధ కంపెనీలు కూడా నాణ్యతలేని ముడి సరుకులతో ఔషధాలు తయారు చేస్తున్నాయని తేలింది. అంతేగాక లేబిలింగ్ సరిగా ఉండకపోవడం, తక్కువధర ఉండాల్సిన వాటికి ఎక్కువ ధర నిర్ణయించడం తదితర ఉల్లంఘనలు జరిగాయి. మరోవైపు బ్లడ్‌బ్యాంకుల్లోనూ విపరీతంగా ఉల్లంఘనలు జరిగాయి. 2 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రతలో రక్తాన్ని నిల్వ ఉంచకపోవడం, నిర్దేశిత టెస్టుల్లో కొన్ని చేయకపోవడం జరుగుతోంది. తద్వారా సేకరించిన రక్తంలో ఏవైనా ఇన్ఫెక్షన్లు ఉంటే స్వీకరించే రోగులకు అంటుకునే ప్రమాదం ఉంటుంది. అలాగే మెడికల్ ఆఫీసర్ లేకుండానే టెక్నీషియన్లతో బ్లడ్ బ్యాంకును నడిపించడం వంటి ఉల్లంఘనలు జరిగాయి. ప్లాస్మా, రెడ్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్ వంటి వాటికి ప్రత్యేక లైసెన్సు లేకుండా నడపడం తీవ్రమైన ఉల్లంఘనగా అధికారులు చెబుతున్నారు. 21,087 ఉల్లంఘనల్లో 18 వేలు మెడికల్ షాపుల్లోనే.. మందుల దుకాణాలు, ఫార్మసీ కంపెనీలు, బ్లడ్ బ్యాంకులు, స్టోరేజీ సెంటర్లలో గత ఐదేళ్లలో ఏకంగా 21,087 ఉల్లంఘనలు జరిగినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అసెంబ్లీకి సమర్పించిన నివేదిక వెల్లడించింది. 2016–17 నుంచి 2020–21 జనవరి వరకు ఈ ఐదేళ్లలో ఫార్మసీ కంపెనీలు, మందుల దుకాణాలు, బ్లడ్‌బ్యాంకులు, స్టోరేజీ సెంటర్లలో 87,700 తనిఖీలు నిర్వహించారు. వీటిల్లో 21,087 ఉల్లంఘనలను గుర్తించారు. ఏకంగా 24 శాతం ఉల్లంఘనలు జరగడం విస్మయం కలిగిస్తోంది. గడిచిన ఐదేళ్లలో 12,801 శాంపిళ్లను పరీక్షించగా... 1,348 కేసులు ప్రాసిక్యూషన్ వరకు వెళ్లాయి. ఔషధ నియంత్రణ సంస్థలోని కొందరు అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడం వల్లే యదేచ్ఛగా ఉల్లంఘనలు జరుగుతున్నాయని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నారు. ఉల్లంఘనలు జరిగిన వాటిల్లో దాదాపు 18 వేలు మెడికల్ షాపుల్లోనే జరిగినట్లు ఔషధ నియంత్రణశాఖ వర్గాలు చెబుతున్నాయి. (చదవండి: ‘బల్సిందా నీ.. ఊర్కో బే’ బోధన్ ఎమ్మెల్యే బూతు పురాణం) వైద్య ఆరోగ్యశాఖ నివేదికలోని మరికొన్ని అంశాలు.. గతేడాది కరోనా నేపథ్యంలో అనారోగ్యానికి గురైనా చాలామంది ఆసుపత్రులకు రావడానికి జంకారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఔట్ పేషెంట్లు, ఇన్ పేషెంట్ల సంఖ్య బాగా పడిపోయింది. ప్రసవాలు మాత్రం గణనీయంగా పెరిగాయి. ప్రతిష్టాత్మక నిమ్స్ ఆసుపత్రిలో 2019లో ఔట్పేషెంట్లు 6.03 లక్షల మంది కాగా, 2020లో ఆ సంఖ్య ఏకంగా 2.98 లక్షలకు పడిపోయింది. అలాగే 2019లో 47,359 మంది ఇన్న్ పేషెంట్లుగా చికిత్స తీసుకోగా, 2020లో ఆ సంఖ్య 25,931కు పడిపోయింది. ఇక శస్త్రచికిత్సలు 2019లో 24,638 జరగ్గా, 2020లో సగానికికంటే తక్కువగా 11,073కు పడిపోయాయి. 2019లో మూత్రపిండాల మార్పిడి చికిత్సలు 105 జరగ్గా, 2020లో 30కు పడిపోయాయి. మోకాళ్ల మార్పిడి చికిత్సలు 2019లో 173 కాగా, 2020లో 34కు పడిపోయాయి. వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలోని 108 ఆసుపత్రులకు సగటున ఏడాదికి 1.08 కోట్ల మంది ఔట్ పేషెంట్లు వస్తుండగా, 2020–21లో జనవరి వరకు కేవలం 60.52 లక్షల మందే వచ్చారు. ఇన్ పేషెంట్లు 9.55 లక్షలు అంచనా కాగా, ఆ సంఖ్య 6.96 లక్షలకు పడిపోయింది. అయితే కరోనా కాలంలో 108 జిల్లా, ఏరియా ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు గణనీయంగా పెరిగాయి. వాటిల్లో సగటున ఏడాదికి 81,600 ప్రసవాలు జరుగుతుండగా, 2020లో ఏకంగా 1,24,278 ప్రసవాలు జరగడం విశేషం. ఆయా ఆసుపత్రుల్లో ల్యాబ్ టెస్ట్‌లు 36.95 లక్షల నుంచి 40.44 లక్షలకు చేరుకోవడం గమనార్హం. సగటు ఏడాదికి జరిగే ఈసీజీలు 63,175 కాగా.. గత ఏడాది ఏకంగా 79,970 జరిగాయి. ఇక తెలంగాణ డయాగ్నస్టిక్‌లలో 2019లో 9.05 లక్షల పరీక్షలు జరగ్గా, 2020లో 7.61 లక్షలకు పడిపోయాయి. 9 ప్రభుత్వ బోధనాసుపత్రులు, 22 స్పెషాలిటీ ఆసుపత్రుల్లో 2019లో 76.83 లక్షల మంది ఔట్ పేషెంట్లు వైద్య సేవలు పొందగా, 2020లో ఆ సంఖ్య సగానికి అంటే 38.25 లక్షలకు పడిపోయింది. ఇన్ పేషెంట్ల సంఖ్య 2019లో 5,91,772 కాగా, 2020లో 3.98 లక్షలకు పడిపోయింది. 2019లో ఈ ఆసుపత్రుల్లో 3.22 లక్షల శస్త్రచికిత్సలు జరగ్గా, 2020లో 1.48 లక్షలు జరిగాయి. ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 2019–20లో 3.50 లక్షల మంది వైద్య సేవలు పొందగా, 2020–21 మార్చి 10వ తేదీ నాటికి 2.26 లక్షల మంది సేవలు పొందారు. (చదవండి: ఉపాధి పనికి ఆలయ అర్చకుడు ) -
రక్త దాత స్ఫూర్తి ప్రదాత
ఎంతో కాలంగా రక్తం లభ్యత అనేది రోజు రోజుకూ పెనుభూతంలా మారుతున్న సామాజిక సమస్యగా పరిణమిస్తోంది. రోడ్డు ప్రమాదాలు, కేన్సర్ చికిత్సలు, తలసేమియా చికిత్స, ప్రసవ సమయం.. ఇలా పలు అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరం మరింత ఎక్కువగా ఉంటుంది. గత దశాబ్దకాలంగా రక్తదానం గురించి అవగాహన పెరిగినప్పటికీ రక్తనిల్వలు సరిపడా ఉండడం లేదు. ఆరోగ్యకరమైన ప్రతీ వ్యక్తి స్వచ్చందంగా రక్తదాతగా మారడం మాత్రమే దీనికి పరిష్కారం. ఈ విషయంలో అవగాహన కలిగిస్తూ పలువురికి స్ఫూర్తి నిస్తున్నారు కొందరు నగరవాసులు. అక్టోబర్ 1న జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవ సందర్భంగా ప్రత్యేక కథనం. తీ 3 సెకన్లకు ఒక వ్యక్తి రక్త కొరతతో మరణిస్తున్నాడు అని గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో నాలుగు కోట్ల యూనిట్ల రక్త నిల్వలు అవరం కాగా ప్రస్తుతం సమకూరుతున్నది మాత్రం 40 లక్షల యూనిట్లు మాత్రమే. సాంకేతికత ఎంత పెరిగినా ఒకరి నుంచి మరొకరికి అందించడం తప్ప రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయలేమనేది నిజం. కానీ రక్తదానంపై ఇంకా ప్రజల్లో పలు సందేహాలున్నాయి. అయితే అవన్నీ అపోహలు మాత్రమేనని, క్రనీసం18 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి, 50 కేజీల కన్నా ఎక్కువ బరువున్న ప్రతీ ఆరోగ్యకరమైన వ్యక్తి నిస్సందేహంగా రక్తదానం చేయవచ్చునని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. పతీ మూడు నెలలకు ఒకసారి రక్తదానం, అలాగే 15 రోజులకు ఒకసారి ప్లేట్లెట్స్ దానం చేయొచ్చునని, రక్తదానం వలన మరింత ఆరోగ్యంగా మారడమే కాకుండా పలు వ్యాధులు ఎదుర్కొనే రోగనిరోదక శక్తి పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ‘సోషల్’ తో మేలు.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రతి నిత్యం నగరానికి వేల యూనిట్ల రక్త అవసరం.. సోషల్‌మీడియా ప్రభావం పెరిగాక స్వచ్చందంగా రక్తదానానికి ముందుకు వచ్చే దాతల సంఖ్య కూడా పెరిగింది. బ్లడ్ డొనేషన్ గ్రూప్స్ ద్వారా, సోషల్‌మీడియా యాప్స్‌ని అనుసరించి నిమిషాల్లో అవసరమున్న చోటుకే వచ్చి రక్తదానం చేస్తున్నారు. కొన్ని ఆస్పత్రులలో బ్లడ్ బ్యాంక్ నుంచి తీసుకువచ్చే ప్యాకెట్లకు బదులు నేరుగా దాత నుంచి రక్తం తీసుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. దీని వలన స్వచ్చంద రక్తదాతల ఆవశ్యకత పెరిగింది. రెడ్ డ్రాప్...సేవ్ లైఫ్ నగరంలోని జూబ్లీహిల్స్‌లో నివసించే రెహమాన్ ఇప్పటి వరకు 92 సార్లు రక్తదానం చేశాడు. అంతేకాదు సిటీలో ఎవరికి రక్తం అవసరమైనా ఇతరుల నుండి రక్తదానం చేయించడంలో ముందుంటాడు. రెహమాన్ పుట్టిన కొన్ని నెలలకే రక్తహీనతతో తల్లి మరణించింది. ఊహ తెలిశాక.. ఆరు యూనిట్ల రక్తం అందక నాన్న చనిపోయాడు. తన జీవితంలోనే చోటు చేసుకున్న ఈ సంఘటనలతో చలించిపోయిన రెహమాన్ ఎవరికి రక్తం అవసరమున్నా వెళ్లి ఇచ్చేవాడు. అమ్మ ప్రాణం పోసి జన్మనిస్తే రక్తదాత తన రక్తంతో మరుజన్మనిస్తాడు అంటాడు రెహమన్. రక్తదాతల అవసరాన్ని గమనించి రెడ్‌డ్రాప్ యువజన సేవా సమితి అనే స్వచ్చంధ సంస్థను ఏర్పాటు చేసి రక్తదానానికి తనవంతు కృషి చేస్తున్నాడు. తన సంస్థ ద్వారా ఇప్పటి వరకు 9600 మందిని ఆయన రక్తదాతలుగా మార్చారు. యాబైకి పైగా రక్తదాన శిబిరాలు నిర్వహించి బ్లడ్‌బ్యాంక్‌లకు రక్తాన్ని అందించారు. ప్రస్తుతం అందరూ తనని ప్రేమగా రెడ్‌డ్రాప్ రెహమాన్ అని పిలుస్తారు. అవగాహన పెరిగింది.. నేను ఇప్పటి వరకు 18 సార్లు రక్తదానం చేశాను. టెక్నాలజీ పెరిగాక రక్తదానం అనేది మరింత సులభంగా మారింది. ఈ మధ్య ఎవరికి రక్తం అవసరౖమైనా సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేయడంతో అక్కడి ప్రాంతంలో ఉన్న డోనర్స్ స్పందిస్తున్నారు. చాలా గ్రూప్‌లలో నేను సభ్యునిగా ఉన్నాను. నేను ఇవ్వలేని పరిస్తితులలో నా స్నేమితులకు ఫార్వడ్ చేస్తాను. –మహ్మద్ రఫీ, సాఫ్ట్వేర్. 55 సార్లు రక్తమిచ్చా... రక్తదానం వలన మరోవ్యక్తికి ప్రాణం నిలుస్తుంది. వ్యక్తిగతంగా ఇంతకన్నా గొప్ప పని ఇంకేది ఉండదు. ఇప్పటి వరకు నేను 55 సార్లు రక్తదానం చేశాను.మారుమూల గ్రామాల నుండి చికిత్స కోసం ఎందరో నగరానికి వస్తుంటారు.వారికి అత్యవసర పరిస్థితుల్లో రక్తం ఎక్కడి నుంచి తీసుకోవాలో తెలియదు. అలాంటప్పుడు రక్తదాతల అవసరం చాలా ఉంటుంది. ఎవరైనా సమయానికి రక్తం అందక చనిపోతే మనిషిగా మనం ఓడిపోయినట్టే అని నా భావన. అందుకే ప్రతి మూడు నెలలకు గాంధీ హస్పిటల్, రెడ్‌క్రాస్ సొసైటీ తదితర ప్రాంతాలలో స్వచ్చందంగా వెళ్లి రక్తదానం చేస్తుంటాను. –కొండల్‌రెడ్డి, రైతు స్వరాజ్య వేదిక. -
రక్తం అవసరం ఉన్నవారికి ఇకపై సులభంగా
ఢిల్లీ : ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయ తాండవం చేస్తుంది. ఈ క్లిష్టమైన సమయంలో రక్తం అవసరం ఉన్నవారికి సులభంగా అందించేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ గురువారం ‘ఈ బ్లడ్ సర్వీసెస్’ అనే యాప్‌ను ప్రారంభించారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ (ఐఆర్సీఎస్) భాగస్వామ్యంతో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని మంతత్రి ఈ సందర్భంగా తెలిపారు. ఈ యాప్‌లో రిజిస్టర్ చేసుకుంటే కొద్ది నిమిషాల్లోనే రక్తం అందిస్తారని, సింగిల్ విండో యాక్సెస్ ద్వారా ఈ సేవలు పొందడం చాలా సులభమని హర్షవర్దన్ పేర్కొన్నారు. (కరోనా కొత్త హాట్ స్పాట్ ఢిల్లీ ) The App will act as a boon for the needy. @IndianRedCross has always assisted the Government in various health programs. I commend this effort that they have made during difficult #COVID19. The needy will now have easy access to blood now@cdacindia @MoHFW_INDIA @WHO @pagthals pic.twitter.com/ZblUXas0NO — Dr Harsh Vardhan (@drharshvardhan) June 25, 2020 ఎంతో పారదర్శకంగా పనిచేయడంతో పాటు రక్తం అత్యవసరమైన వారికి తొందరగా చేరుస్తారని అన్నారు. రక్తం కావాలనుకునే వారు యాప్‌లో రిజిస్టార్ చేసుకోవాలని, దీని ద్వారా ఏఏ ప్రాంతాల్లో రక్తం నిల్వలు అందుబాటులో ఉన్నాయన్న సమాచారం తెలుస్తుందని చెప్పారు. రక్తం అవసరమైన వారికి బ్లడ్ బ్యాంకుల ద్వారా కనీసం నాలుగు యూనిట్లు అందుతుందని చెప్పారు. రెడ్‌క్రాస్ సంస్థ వివిధ ఆరోగ్య కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతూ ప్రభుత్వానికి ఎల్లప్పుడూ సహాయం అందిస్తోందని మంత్రి కొనియాడారు. కరోనా లాంటి కష్టకాలంలోనూ ప్రజలకు అండగా నిలబడిందని హర్షవర్దన్ ప్రశంసించారు. (నా కూతురు కెప్టెన్ అని నాన్న అంటుంటే.. ) -
ఉస్మానయా..
సాక్షి, సిటీబ్యూరో: డెంగీ జ్వరాలతో బాధపడుతూ చికిత్స కోసం ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి చేరుకునే రోగులకు శుభవార్త. ఇకపై అత్యవసర పరిస్థితుల్లో ప్లేట్లెట్ల కోసం ప్రైవేట్ రక్తనిధి కేంద్రాల వెంట పరుగులు తీయాల్సిన అవసరం లేదు. ఇందుకు పెద్ద మొత్తంలో చెల్లింపు చేయాల్సిన అవసరం కూడా లేదు. తెలంగాణలో డెంగీ జ్వరాల తీవ్రత, ఆస్పత్రికి చేరుకుంటున్న రోగుల అవసరాల దృష్ట్యా ఇకపై ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలోనే సింగిల్ డోనర్ ప్లేట్లెట్ మెషీన్ అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఆ మేరకు అత్యాధునిక ఎస్డీపీ మెషీన్‌ను దిగుమతి చేసుకుని ట్రయల్ రన్ నిర్వహిస్తోంది. ప్రస్తుతం టెక్నీషియన్లకు శిక్షణ ఇస్తోంది. త్వరలోనే ఈ సేవలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానుంది. అత్యాధునిక ఈ ఎస్డీపీ మిషన్ అందుబాటులోకి రావడం వల్ల డోనర్ నుంచి రక్తం బయటికి తీయకుండా నేరుగా ప్రాసెస్ చేసే అవకాశం ఉంది. రోగికి 350 ఎంఎల్ ప్లేట్లెట్స్ ఎక్కించడం వల్ల వాటి సంఖ్యను ఏకకాలంలో 30 వేలకుపైగా పెంచొచ్చు. ఆర్డీపీ ద్వారా సేకరించిన ప్లేట్‌లెట్స్‌తో పోలిస్తే.. ఎస్డీపీ నుంచి ప్రాసెస్ చేసిన ప్లేట్లెట్స్ ఎక్కించడం వల్ల రోగి కోల్పోయిన ప్లేట్లెట్ల సంఖ్యను త్వరగా పునరుద్ధరించే అవకాశం ఉంది. అంతేకాదు ఇకపై పేద రోగులు ప్లేట్లెట్ల కోసం ప్రైవేటు రక్తనిధి కేంద్రాల వెంట పరుగెత్తాల్సిన అవ సరం కూడా లేదు. అవగాహన లేమి.. చికిత్సల్లో నిర్లక్ష్యం గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది డెంగీ జ్వరాలు పెద్ద మొత్తంలో నమోదయ్యాయి. జ్వర పీడితులతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు కిటకిటలాడాయి. ఒకానొక దశలో ఆయా ఆస్పత్రుల్లో అడ్మిషన్లు కూడా దొరకని దుస్థితి తలెత్తింది. గాంధీ, నిమ్స్, నిలోఫర్ ఆస్పత్రుల్లో ఈ సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ మిష న్లు ఉన్నప్పటికీ...వాటిలో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ప్లేట్లెట్స్ కోసం రోగుల బంధువులకు ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా ఉస్మానియాలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తున్న రోగుల్లో చాలా వరకు మూడు, నాలుగో స్టేజ్‌లో వస్తున్న వారే అధికం. పేద ప్రజల్లో డెంగీ జ్వరాలపై సరైన అవగాహాన లేకపోవడం, సాధారణ జ్వరంగా భావించి చికిత్సలను నిర్లక్ష్యం చేయడం వల్ల రక్తంలో ప్లేట్లె ట్స్ కౌంట్ పడిపోయి రోగనిరోధక శక్తి తగ్గుతోంది. 40 వేలలోపు బాధితులే అధికం నిజానికి మనిషి రక్తంలో 1.50 లక్షల నుంచి 4.50 లక్షల వరకు ప్లేట్లెట్స్ ఉంటాయి. జ్వర పీడితుల్లో ఈ కౌంట్ తగ్గుతుంది. ప్రస్తుతం ఆస్పత్రులకు వస్తున్న చాలామంది రోగుల్లో ప్లేట్లెట్ కౌంట్ 40వేల లోపే ఉంటోంది. వాస్తవానికి 25వేల వరకున్న పెద్ద ప్రమాదం ఏమీ ఉండదు. ఒకవేళ కౌంట్ 20 వేలకు పడిపోయి నోరు, ముక్కు నుంచి బ్లీడింగ్ అయితే వెంటనే ప్లేట్లెట్స్ పునరుద్ధరించాలి. లేదంటే షాక్‌కు గురై కోమాలోకి వెళ్లి చనిపోయే ప్రమాదం ఉంది. దాతల నుంచి సేకరించిన రక్తాన్ని తొలుత గ్రూపులుగా విభజించి, ఆ తర్వాత ర్యాండమ్ పద్ధతిలో ప్రాసెస్ చేస్తున్నారు. ప్రస్తుతం దీని నుంచి ప్లాస్మా, పీఆర్పీ, ఎస్డీపీ, ఆర్బీసీ వంటి సెల్స్‌ను వేరుచేసి ప్యాకెట్లో నిల్వ చేస్తున్నారు. అదే సింగిల్ డోనర్ మెషీన్లో ఇంత పెద్ద ప్రాసెస్ అవసరం ఉండదు. దాతను నేరుగా మెషీన్‌కు అనుసంధానం చేసి, అవసరమైన ప్లేట్‌లెట్స్‌ను మాత్రమే సేకరించే అవకాశం ఉంది. ఒకే సమయంలో 2000 ఎంఎల్ రక్తాన్ని ప్రాసెస్ చేస్తుంది. చాలా తక్కువ సమయంలోనే ముప్పైవేలకుపైగా ప్లేట్‌లెట్స్‌ను పునరుద్ధరించే అవకాశం ఉంది. -
రక్తదాతల కోసం ఎదురు చూపులు
వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు క్రైం : నెగటివ్ గ్రూపు కలిగిన రక్త దాత దొరకాలంటే అనేక అగచాట్లు పడాల్సి వస్తోంది. అలాంటిది ఒకే వ్యక్తికి 30 యూనిట్ల నెగిటివ్ గ్రూపు రక్తం కావాలంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేం. సహృదయంతో ఆ గ్రూపు కలిగిన దాతలు ముందుకు వస్తే తప్ప ఇంత పెద్ద మొత్తంలో రక్తాన్ని సేకరించలేం. వైఎస్సార్ జిల్లా రాజుపాళెం మండలంలోని కొర్రపాడు గ్రామానికి చెందిన హుస్సేన్‌బాషా అనే 20 ఏళ్ల యువకుడు బ్లడ్ సర్కులేషన్ సంబంధిత వ్యాధితో వారం రోజుల నుంచి తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతన్ని పరిశీలించిన వైద్యులు చికిత్స సమయంలో నెల రోజుల పాటు రోజుకు ఒక బ్యాగ్ చొప్పున 30 బ్యాగుల రక్తం ఎక్కించాలని తెలిపారు. అతడిది ఏ నెగిటివ్ రక్తం కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందసాగారు. బ్లడ్ బ్యాంకుల నుంచి తెచ్చిన రక్తాన్ని స్విమ్స్ ఆస్పత్రి లో అనుమతించరు. నేరుగా డోనర్ ఆస్పత్రి బ్లడ్ బ్యాంక్‌కు వచ్చి రక్తం ఇవ్వాల్సి ఉంటుంది. ఏ నెగిటివ్ బ్లడ్ గ్రూపు కలిగిన దాతల కోసం హుస్సేన్‌బాషా కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఆ యువకుడికి వెంటిలేటర్ సాయంతో వైద్యం అందిస్తున్నారు. దాతలు 9390819132 అనే నంబర్‌కు ఫోన్ చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మధ్య తర గతి కుటుంబానికి చెందిన హుస్సేన్‌బాషా కు టుంబ సభ్యులకు చిన్న పాటి ఖర్చులు భరాయించే స్థోమత కూడా లేదు. ఆస్పత్రిలో రో జు వారి ఖర్చులు కూడా ఎక్కువ అవుతున్నాయి. దాతలు స్పందించాలని వారు కోరుతున్నారు. -
ప్లేట్లెట్స్ ఒక ప్యాకెట్ రూ.14వేలు
ఏలూరు కొత్తపేటకు చెందిన ఇలియాజ్‌కు డెంగీ జ్వరం వచ్చింది. ఆస్పత్రికి వెళితేడెంగీ అని వైద్యులు నిర్ధారించారు. ఆకస్మికంగా ఒకరోజు ప్లేట్లెట్స్ కౌంట్ 20వేలకు పడిపోయిందని వైద్యులు చెప్పారు. అర్జెంటుగా ప్లేట్లెట్స్ ఎక్కించకపోతే మనిషి ప్రాణాపాయస్థితికి చేరతాడని హెచ్చరించారు. ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రికి వైద్యం కోసం తీసుకువెళ్లగా అక్కడ పరీక్షించిన వైద్యులు తమవద్ద ప్లేట్లెట్స్ లేవని, విజయవాడ కార్పొరేట్ ఆస్పత్రికి తీసుకువెళ్ళాలని రిఫర్ చేశారు. ఆ కార్పొరేట్ ఆస్పత్రికి తీసుకువెళితే ప్లేట్‌లెట్స్‌కు సుమారుగా రూ.14వేల వరకూ ఖర్చు అవుతుందని చెప్పారు. అంటే మూడు రోజులపాటు అక్కడ వైద్యం చేయించుకుంటే అయ్యే ఖర్చు సుమారుగా రూ.50 వేలు. దీంతో బంధువుల నోట మాటరాలేదు. ఏమి చేయాలో దిక్కుతోచనిస్థితిలో ఉండిపోయారు. చివరకు రెడ్‌క్రాస్ బ్లడ్‌బ్యాంకులో సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ (ఎస్డీపీ) ఇవ్వటంతో ఊపిరిపీల్చుకున్నారు.ఇలా.. ప్లేట్లెట్స్ దొరకక, లభ్యమైనా ఖర్చు భరించలేక ఎందరో రోగులు అష్టకష్టాలు పడుతున్నారు ఏలూరు టౌన్: జిల్లాలో డెంగీ రోగుల పరిస్థితి దారుణంగా మారింది. ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోవటంతో రోగులు ప్రాణాపాయస్థితికి చేరుతున్నారు. జిల్లాలో డెంగీ బాధితులు సంఖ్య రోజురోజుకూ పెరిగిపోవటం ఆందోళనకు గురిచేస్తోంది. ఏలూరులోని జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రికి రోగులను తీసుకువచ్చినా వైద్యం చేసే పరిస్థితి కనిపించటంలేదు. మెడికల్ సూపరింటెండెంట్, వైద్య అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఆస్పత్రిలోని బ్లడ్ బ్యాంకుల్లో ప్లేట్లెట్స్ లేవని, తామేమీ చేయలేమని రోగుల బంధువులకు చెప్పటంతో వారు లబోదిబోమంటున్నారు. ఇక ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులకు తీసుకువెళ్ళలేని పేదవర్గాలప్రజల ప్రాణాలకు భరోసాలేని దుస్థితి నెలకొంది. వైద్య అధికారులకు ఎన్నిసార్లు హెచ్చరికలు జారీ చేసినా పరిస్థితిలో మార్పు కానరావటం లేదు. మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన వైద్యులు తూతూ మంత్రంగానే చికిత్స చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్లేట్‌లెట్స్‌కు భారీగా వసూళ్లు ప్రభుత్వ, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులు మినహా ప్రైవేటు బ్లడ్ బ్యాంకుల్లో ప్లేట్లెట్స్ కావాలంటే భారీగా సొమ్ములు చెల్లించాల్సిందే. ప్రైవేటు బ్లడ్ బ్యాంకులు ఏకంగా ఒక ప్యాకెట్ ప్లేట్లెట్స్ కోసం రూ.12వేల నుంచి రూ.16వేల వరకూ వసూలు చేస్తున్నాయి. ఏలూరులోని జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలోని బ్లడ్‌బ్యాంకులో కనీసం నామమాత్రంగా అయినా రక్తనిల్వలు లేని దుస్థితి నెలకొంది. రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకులో మాత్రమే రోగులకు కావాల్సిన రక్తాన్ని సరఫరా చేస్తున్నారు. డెంగీ పరీక్షలు చేస్తున్న ప్రభుత్వాస్పత్రిలో ప్లేట్లెట్స్ కౌంట్ డౌన్ అయితే మాత్రం విజయవాడ, గుంటూరు వంటి ప్రాంతాల్లోని కార్పొరేట్ ఆస్పత్రులకు రిఫర్ చేయటం పరిపాటిగా మారింది. ప్రభుత్వ ఆధీనంలో పెద్దగా బ్లడ్ బ్యాంకులు లేకపోవటం, ప్రభుత్వ బ్లడ్ బ్యాంకుల్లోని సిబ్బందిలో చిత్తశుద్ధి లోపించటంతో మాకేంటీ అన్నట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ బ్లడ్ బ్యాంకులు ఏలూరు, జంగారెడ్డిగూడెంలో ఉండగా, రెడ్‌క్రాస్ బ్లడ్‌బ్యాంకులు ఏలూరు, తణుకు, నరసాపురంలో ఉన్నాయి. వీటికి అనుసంధానంగా స్టోరేజీ పాయింట్లు పాలకొల్లు, పెనుగొండ, భీమవరం, తాడేపల్లిగూడెం, కొవ్వూరు, భీమడోలు, చింతలపూడిలో ఏర్పాటు చేశారు. ఇక ఏలూరు, తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం, జంగారెడ్డిగూడెం తదితర ప్రాంతాల్లో ప్రైవేటు బ్లడ్ బ్యాంకులు ఉండగా, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా బ్లడ్ బ్యాంకులు పనిచేస్తున్నాయి. బ్లడ్ బ్యాంకుల్లో రక్తనిల్వలు నిల్ జిల్లా వ్యాప్తంగా ఆయా రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులు, వివిధ వ్యాధులకు సంబంధించి ఆపరేషన్ల సందర్భంలోనూ రోగి ప్రాణాలు రక్షించేందుకు ప్రాణాధారం రక్తమే. కానీ జిల్లాలో అత్యవసర పరిస్థితుల్లో రక్తనిధుల్లో రక్త నిల్వలు లేకపోవటం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో ఒక నెలకు సుమారుగా 5000యూనిట్ల వరకూ రక్త నిల్వలు అవసరం అవుతాయని అంచనా. కానీ జిల్లా వ్యాప్తంగా క్యాంపులు, ఇతర దాతల ద్వారా సేకరించిన రక్త నిల్వలు 3000యూనిట్ల వరకూ మాత్రమే ఉంటుందని చెబుతున్నారు. ఇక డెంగీ వంటి వ్యాధుల బారిన పడిన రోగికి అత్యవసరంగా ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోవటంతో రక్తం అవసరం అవుతుంది. కానీ రక్త దాతలనుంచి రక్తం సేకరించేందుకు శ్రమించాల్సి వస్తోంది. రక్తాన్ని స్వీకరించటానికి వివిధ నిబంధనలు, ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా కష్టంగా మారుతోంది. దాతల నుంచి రక్తసేకరణ చేయాలి జిల్లాలో అవసరమైన మేరకు బ్లడ్ బ్యాంకుల్లో రక్తనిధులు లేవు. రక్త దాతలను ప్రోత్సహించి, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్తసేకరణ పెద్ద ఎత్తున చేపట్టాలి. ప్రజల్లో రక్తదానంపై అవగాహన కల్పించాలి. యువత, విద్యార్థులు కొంతవరకూ ముందుకు రావటంతోనే చాలా వరకు ప్రాణాలు కాపాడగలుగుతున్నాం. జిల్లాలో సుమారుగా 5వేల యూనిట్ల వరకూ రక్తనిల్వలు అవసరం అవుతాయి. కానీ ఆ మేరకు రక్త సేకరణ జరగటంలేదనే చెప్పాలి. రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంకుల్లో తక్కువ ధరకు, పేదలకు ఉచితంగానూ ప్లేట్లెట్స్ సరఫరా చేస్తున్నాం. రక్తసేకరణపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.– చిట్టిబాబు, రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంకుజిల్లా కో–ఆర్డినేటర్ -
అత్యంత అరుదైన రక్తవర్గం బాంబే బ్లడ్ గ్రూప్
ఈ మధ్యనే మైన్మార్‌లో ఒక మహిళ గుండెకు శస్త్ర చికిత్స జరిగింది. అయితే ఆమెది బాంబే బ్లడ్ గ్రూప్ కావడంతో ఆ దేశంలో ఎక్కడా ఆ గ్రూపు రక్తం దొరకలేదు. దీంతో ఆమె కోసం రెండు యూనిట్ల బాంబే బ్లడ్ గ్రూప్ రక్తాన్ని భారత్ నుంచి మైన్మార్ పంపించారు. ఆ దేశంలో రక్తం దొరక్కపోవడంతో మైన్మార్‌లోని యాంగూన్ ఆస్పత్రి డాక్టర్లు భారత్‌లో ఉన్న సంకల్ప్ ఇండియా సంస్థను సంప్రదించారు. ఈ ఫౌండేషన్ బాంబే బ్లడ్ ఉన్న బ్లడ్ బ్యాంకులు, డోనర్స్‌ను రక్తం అవసరమైన వారు సంప్రదించేలా చేస్తుంది. http://www.bombaybloodgroup.org/ వెబ్సైట్ ద్వారా వారికి రక్తం అందేలా చూస్తుంది. మైన్మార్ కేసులో ఫౌండేషన్ కర్ణాటకలోని దావణగెరెలో ఉన్న బ్లడ్ బ్యాంకును సంప్రదించడంతో వారి పని సులువైంది. అరుదుగా... సాధారణంగా రక్తం అవసరమైతే బ్లడ్ బ్యాంకులను సంప్రదిస్తారు. లేదా చుట్టుపక్కల ఎవరైనా డోనర్ ఉంటే వారి నుంచి తీసుకుంటారు. కానీ ‘బాంబే’ బ్లడ్ గ్రూప్ విషయంలో మాత్రం కష్టం. ఎందుకంటే భారతదేశంలో సుమారు 10 వేల మందిలో ఒకరు మాత్రమే ఈ బ్లడ్ గ్రూప్ కలిగినవారు ఉన్నారట. ‘ఈ గ్రూప్ వాళ్లను వెతకడం చాలా కష్టం. సాధారణ పరీక్షల వల్ల బాంబే బ్లడ్ గ్రూప్ గురించి తెలుసుకోలేం. అందుకే చాలా మందికి తమది బాంబే బ్లడ్ గ్రూప్ అని తెలీదు. రక్తం ఎక్కిస్తున్న సమయంలో ‘ఓ’ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కానప్పుడే వారికి బ్లడ్ గ్రూప్ తెలుస్తుంది. ఎలా గుర్తిస్తారు? ఈ గ్రూపు మనలో ఉందో లేదో తెలుసుకోవాలంటే.. ఒక ‘ఓ’ సెల్ పరీక్ష చేయాలి. రక్తం ‘ఓ’ బ్లడ్ గ్రూప్‌కు సంబంధించినది అయితే, ఆ పరీక్షలో రియాక్షన్ రాదు. కానీ ‘బాంబే’ బ్లడ్ గ్రూప్‌లో యాంటీబాడీస్ ఉండడం వల్ల ‘ఓ’ సెల్‌తో కూడా రియాక్షన్ ఉంటుంది. దాంతో అది ‘బాంబే’ గ్రూప్ అని తెలుస్తుంది. ఆ రక్తం గురించి తెలుసుకోడానికి యాంటీ కేపిటెల్ ‘ఎ’ లాక్టిన్ టెస్ట్ కూడా చేస్తారు. బాంబే బ్లడ్ గ్రూప్ అరుదైనది కాబట్టి... క్రయో ప్రిజర్వేషన్ అనే ఒక టెక్నిక్ ద్వారా ఆ రక్తాన్ని నిల్వ చేస్తారు. ఈ పద్ధతిలో రక్తాన్ని చాలా తక్కువ ఉష్ణోగ్రతలో ఉంచుతారు. భిన్నంగా ఎందుకంటే..? బాంబే బ్లడ్ గ్రూప్ మిగతా బ్లడ్ గ్రూపులకంటే భిన్నంగా ఉండడానికి ప్రత్యేక కారణం ఉంది. మన రక్తంలో ఉండే ఎర్ర రక్తకణాల్లో కొన్ని షుగర్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఎవరి బ్లడ్ గ్రూప్ ఏదో అవే నిర్ధారిస్తాయి. ఈ మాలిక్యూల్స్ నుంచి ‘కేపిటల్ హెచ్ యాంటీజన్’ తయారవుతుంది. దానివల్ల మిగతా యాంటీజెన్ ఎ, బి తయారయ్యి బ్లడ్ గ్రూప్ ఏర్పడుతుంది. బాంబే బ్లడ్ గ్రూప్ వారిలో షుగర్ మాలిక్యూల్స్ తయారు కాలేవు. అందుకే అందులో ‘కేపిటల్ హెచ్ యాంటిజెన్’ ఉండదు. అవి ఎలాంటి బ్లడ్ గ్రూపులోకి రాదు. కానీ, ఆ రక్తం ఉన్న వారి ప్లాస్మాలో యాంటీబాడీ ఎ, బి, హెచ్లు ఉంటాయి. ఈ బ్లడ్ గ్రూపు ఉన్న వారి జీవితం పూర్తిగా మామూలుగా ఉంటుంది.– విజయ దిలీప్ పోకల బాంబే అనే పేరు ఎలా వచ్చింది అన్ని బ్లడ్ గ్రూపులు ఇంగ్లిష్ అల్ఫాబెట్స్ ఎ, బి, ఓ లాంటి పేర్లతో ఉంటాయి. కానీ ఈ బ్లడ్ గ్రూప్ ఒక నగరం పేరుతో ఉంది. దీనికి ఒక ప్రత్యేకమైన ఒక కారణం ఉంది. మొట్టమొదట దీనిని మహారాష్ట్ర రాజధాని బాంబే (ప్రస్తుతం ముంబై)లో గుర్తించారు. వైఎం భెండె 1952లో ఈ గ్రూప్ రక్తం కనుగొన్నారు. ఇప్పుడు కూడా ఈ గ్రూప్ రక్తం ఉన్నవారు ఎక్కువగా ముంబైలోనే కనిపిస్తున్నారు. ఇక్కడ ఎక్కువగా కనిపించడానికి వంశపారంపర్యమే కారణం. ప్రస్తుతం బాంబే బ్లడ్ గ్రూప్ ఉన్న వారు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నారు. -
బ్లడ్ అలెర్ట్!
సాక్షి, విశాఖపట్నం: ఏదైనా ఆపద రానుందని తెలిస్తే అప్రమత్తంగా ఉండాలని రెడ్ అలెర్ట్ ప్రకటిస్తారు. ఇప్పుడు విశాఖకు ‘బ్లడ్’ అలెర్ట్ ప్రకటించాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. విశాఖపట్నంలో రోజురోజుకు రక్తానికి డిమాండ్ పెరుగుతోంది. ఉత్తరాంధ్ర నుంచే కాదు.. పొరుగు జిల్లాలు, పొరుగున ఉన్న ఒడిశా, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి రోగులు, క్షతగాత్రులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. వీరికి అవసరమైన రక్తాన్ని ఇక్కడ ఉన్న బ్లడ్‌బ్యాంకులు సమకూరుస్తున్నాయి. విశాఖలో శస్త్రచికిత్సలు, ప్రసవాలు, డెంగీ బాధితులు, అవయవ మార్పిడులు పెరుగుతున్నాయి. ఒకపక్క రక్తదాతలు పెరుగుతున్నా అంతకు మించి డిమాండ్ పెరుగుతోంది. ఇలా ఏటా 10 శాతం చొప్పున రక్తదాతల అవసరం పెరుగుతూ వస్తోంది. సాధారణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం జనాభాలో ఒక శాతం రక్తం నిల్వలు అవసరమవుతాయి. జిల్లా జనాభా 44 లక్షలుంది. ఈ లెక్కన ఏటా 44 వేల యూనిట్ల రక్తం సరిపోతుంది. కానీ ఇరుగు పొరుగు జిల్లాలు, రాష్ట్రాల నుంచి విశాఖ వచ్చే రోగులు/క్షతగాత్రుల తాకిడితో ఇప్పుడు లక్ష యూనిట్లకు పైగా రక్తం కావలసి వస్తోంది. వీటిని సమకూర్చడానికి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ.. విశాఖలో 17 బ్లడ్ బ్యాంకులున్నాయి. ఇవి పెరుగుతున్న రక్తం డిమాండ్‌కు అనుగుణంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే డిగ్రీ, ఇంజినీరింగ్ కాలేజీలతో ఈ బ్లడ్ బ్యాంకులు అవగాహన కుదుర్చుకున్నాయి. ఏటా రెండు సార్లు ఈ కళాశాలల్లో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ రక్తపు నిల్వలను సమకూర్చుకుంటున్నాయి. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు కూడా విరివిగా రక్తదానానికి ముందుకొస్తున్నారు. ఇలా సగటున ఏటా 85 వేల యూనిట్ల రక్తాన్ని సేకరిస్తున్నాయి. ఒకసారి సేకరించిన రక్తం 30 రోజులకు మించి నిల్వ ఉండదు. అందువల్ల రక్త సేకరణ జరిగాక ఆ 30 రోజుల్లోగా వినియోగించకపోతే వృథా అయిపోతుంది. కొన్నిసార్లు ఎక్కువ రక్తం యూనిట్లు అవసరం పడడం, మరికొన్ని సార్లు అంతగా డిమాండ్ లేకపోవడం వంటి కారణాలతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఏ ఏడాది సేకరణ ఎంత ? సంవత్సరం యూనిట్లు 2016–17 82,390 2017–18 82,339 2018–19 97,626 మూడు నెలల్లో సేకరించిన యూనిట్లు మార్చి 6,984 ఏప్రిల్ 6,314 మే 7,539 2018 ఎపిడమిక్ సీజన్లో.. ఆగస్ట్ 11,532 సెప్టెంబర్ 11,150 అక్టోబర్ 6,418 వ్యాధుల సీజన్ మొదలు.. వర్షాలతో పాటు వ్యాధుల సీజనూ మొదలవుతోంది. దోమకాటుతో డెంగీ, టైఫాయిడ్, మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధులు విజృంభించనున్నాయి. వీటి బారిన పడిన వారికి ఒక్కసారిగా ప్లేట్లెట్లు పడిపోతాయి. వీరికి తక్షణమే రక్తం ఎక్కించి ప్రాణం కాపాడవలసి ఉంటుంది. వర్షాకాలం సీజన్లో విశాఖ నగరం, ఏజెన్సీలో ఏటా పెద్ద సంఖ్యలో ఈ జ్వర మరణాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా డెంగ్యూ సోకిన వారికి ప్లేట్లెట్లు శరవేగంగా పడిపోయి. రోగి ప్రాణానికే ముప్పు వాటిల్లుతుంది. వీరికి రక్తం నుంచి ప్లేట్లెట్లను వేరు చేసి రోగికి ఎక్కిస్తారు. కొన్ని జబ్బుల వారికి ప్లాస్మా, ఎర్ర రక్తకణాలు, ఫ్రెష్ ఫ్రోజెన్ ప్లాస్మా వంటివి అవసరమవుతాయి. వీటిని కూడా రక్తం నుంచి సెపరేట్ చేసి అవసరమైన వారికిస్తారు. మిగిలిన రక్తాన్ని హిమోగ్లోబిన్ అవసరమున్న వారికిస్తారు. ఏజెన్సీలో రక్తహీనత, తలసేమియా, ఎనీమియా, సికిల్‌సెల్ వంటి వ్యాధులతో బాధపడే వారు అధికంగా ఉంటారు. వీరికి రక్తం ఎక్కించి ప్రాణాపాయం నుంచి తప్పిస్తారు. ఇప్పుడు వ్యాధుల సీజను ప్రారంభం కావడంతో మరో నాలుగు నెలల పాటు రెట్టింపు రక్తపు నిల్వలు కావలసి ఉంటుంది. సాధారణ రోజుల్లో నెలకు ఐదారు వేల యూనిట్ల రక్తం అవసరం ఉండగా ఈ ఎపిడమిక్ సీజనులో రెట్టింపు సంఖ్యలో అంటే.. 12 వేల యూనిట్ల రక్తం అవసరమవుతుందని వైద్యారోగ్య శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం విశాఖలో 22 వేలకు పైగా యూనిట్ల రక్తం నిల్వ ఉంది. కొరత రాకుండా చూస్తున్నాం విశాఖ ఆస్పత్రులకు రక్తం అవసరం ఉండే రోగులు, క్షతగాత్రులు ఎక్కువగా వస్తుంటారు. రక్తదాతల్లో అవగాహన కల్పించడంతో పాటు అవసరమైన వారికి తక్షణమే సమకూర్చే చర్యలు తీసుకుంటున్నాం. కాలేజీ విద్యార్థులే కాదు.. 80 శాఖల ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇందులో భాగస్వాములను చేస్తున్నాం. వ్యాధుల సీజన్ ప్రారంభం కావడంతో డెంగీ తదితర రోగులకు సరిపడినన్ని ప్లేట్లెట్లను అందుబాటులో ఉంచుతున్నాం. పాడేరులో త్వరలో బ్లడ్‌బ్యాంకు ఏర్పాటవుతోంది. అక్కడున్న బ్లడ్ స్టోరేజి యూనిట్‌ను ముంచంగిపుట్టుకు తరలిస్తాం. జిల్లాలో మొబైల్ బ్లడ్ కలెక్షన్ వాహనాన్ని నర్సీపట్నం, అనకాపల్లిల్లో అందుబాటులో ఉంచాం. ఎపిడమిక్ సీజన్లో రక్తం కొరత రాకుండా అప్రమత్తంగా ఉన్నాం. – రోణంకి రమేష్, ఏడీఎంహెచ్‌వో -
రక్తనిధి ఖాళీ
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని రక్త నిధి కేంద్రాల్లో రక్తం నిల్వలు నిండుకున్నాయి. ఆపదలో రక్తనిధి కేంద్రానికి వెళ్లిన వారికి తీరా అక్కడ నిరాశే ఎదురవుతోంది. సకాలంలో అవసరమైన బ్లడ్ గ్రూప్ దొరక్క క్షతగాత్రులు, పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణులు, తలసీమియా బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం నగరంలో పగటి ఉష్ణోగ్రతలు 40–43 సెల్సియస్ డిగ్రీలు నమోదు అవుతున్నాయి. దీంతో త్వరగా నీరసించే ప్రమాదం ఉంది. దీనికి తోడు కళాశాలలకు వేసవి సెలవులు ప్రారంభం కావడంతో ఐపీఎం సహా రెడ్‌క్రాస్ సొసైటీ, వైఎంసీఏ, లయన్స్ క్లబ్ తదితర స్వచ్చంధ సంస్థలు రక్తదాన శిబిరాలు నిర్వహించినా ఆశించిన స్థాయిలో దాతలు ముందుకు రావడం లేదు. నారాయణగూడలోని ఐపీఎం సహా నగరంలోని అన్ని ప్రధాన ఆస్పత్రుల్లోని రక్తనిధి కేంద్రాల్లో రక్త నిల్వలు నిండుకోవడంతో రోగుల అసరాలు తీర్చలేని దుస్థితి నెలకొంది. క్షతగాత్రులకు నరకమే..: రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఉస్మానియా, గాంధీ, నిమ్స్, కేర్, యశోద, కామినేని, కిమ్స్ వంటి ఆసుపత్రులకు ఎక్కువగా తీసుకువస్తారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న వారిని సుల్తాన్‌బజార్, పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రులకు తరలిస్తున్నారు. అధిక రక్తస్త్రావంతో బాధపడుతున్న వీరికి చికిత్స సమయంలో రెండు నుంచి మూడు యూనిట్ల రక్తం అవసరం. అత్యవసర పరిస్థితుల్లో డాక్టర్ రాసిచ్చిన చీటీ తీసుకుని రక్తనిధి కేంద్రాలకు వెళ్తే, తీరా అక్కడ స్టాకు లేదంటున్నారు. ఒక వేళ ఉన్నా..బాధితుడి బంధువుల్లో ఎవరో ఒకరు రక్తదానం చేస్తేకాని అవసరమైన గ్రూపు రక్తాన్ని ఇవ్వబోమంటూ మెళిక పెడుతున్నారు. సకాలంలో రక్తం దొరక్క పోవడంతో గాంధీ, ఉస్మానియా, నిలోఫర్ ఆస్పత్రుల్లో చికిత్సలు వాయిదా పడుతున్నాయంటే ఆశ్చర్య పోనవసరం లేదు. ప్రైవేటు బ్లడ్ బ్యాంకులు దాతల నుంచి సేకరించిన రక్తంలో 30 శాతం ప్రభుత్వ ఆస్పత్రులకు సరఫరా చేయాలనే నిబంధన ఉన్నా పట్టించుకోవడం లేదు. కొందరు ప్రైవేటు బ్లడ్‌బ్యాంకుల నిర్వహకులు, కార్పొరేట్ ఆస్పత్రులు దాతల నుంచి సేకరించిన రక్తాన్ని రూ.1500–2500 వరకు విక్రయిస్తుండటం కొసమెరుపు. తలసీమియా బాధితులకు దొరకడం లేదు నగరంలో సుమారు మూడు వేల మంది తలసీమియా బాధితులు ఉన్నారు. వీరిలో ప్రతి ఒక్కరికీ ప్రతి 15–20 రోజుల కోసారి రక్తం ఎక్కిం చాల్సి ఉంటుంది. ఇలా రోజుకు 30–40 యూనిట్ల రక్తం అవసరం. రక్తదాన శిబి రాలు ఏర్పాటు చేస్తే పగటి ఉష్ణోగ్రతలకు బయపడి రక్తదానం చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. రోగులకు రక్తం సరఫరా చేయ డం మాకు చాలా కష్టంగా మారింది. గత్యంతరం లేక చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ప్రైవేటు బ్లడ్ బ్యాంకుల నుంచి రక్తాన్ని కొనుగోలు చేస్తున్నారు.–అలీంబేగ్, సంయుక్త కార్యదర్శి,తలసీమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ -
లంకలో వెల్లువెత్తిన రక్తదాతలు
కొలంబో: శ్రీలంకలో ఉగ్రవాదుల దుశ్చర్య వల్ల వందలాది మంది క్షతగాత్రులుగా మారారు. బాంబు దాడుల్లో గాయపడిన వారిలో చాలామందిని కొలంబో నేషనల్ హాస్పిటల్, బట్టికలోవా ఆసుపత్రులకు తరలించారు. ఆయా ఆసుపత్రుల్లో రక్తం నిల్వలు సరిపడా లేకపోవడంతో, బాధితులను రక్షించేందుకు వెంటనే రక్తదానం చేయాలంటూ శ్రీలంక నేషనల్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ సర్వీస్ సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేసింది. దీనికి ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. రక్తదాన కేంద్రాల వద్ద జనం బారులు తీరారు. తమ రక్తం ఇచ్చేందుకు పోటీ పడ్డారు. అంతేకాకుండా బాధితులకు రక్తం ఇచ్చేందుకు ముందుకు రావాలంటూ తమ మిత్రులకు కూడా సమాచారం చేరవేశారు. ఫలానా గ్రూప్ రక్తం అత్యవసరంగా కావాలని పేర్కొంటూ చాలామంది ట్విట్టర్లో ట్వీట్లు చేశారు. రక్తంఇచ్చేందుకు వచ్చిన వారి ఫొటోలను షేర్ చేశారు. రాజధాని కొలంబోలోని నేషనల్ బ్లడ్ బ్యాంకు రక్తదాతలతో కిక్కిరిసిపోయింది. సమీపంలోని ఆసుపత్రులు, రక్తదాన కేంద్రాల్లో రక్తదానం చేయాలంటూ ముస్లింలకు ముస్లిం కౌన్సిల్ ఆఫ్ శ్రీలంక పిలుపునిచ్చింది. ఉగ్రదాడులను కొలంబో ఆర్చిబిషప్ మాల్కోమ్ కార్డినల్ రంజిత్ తీవ్రంగా ఖండించారు. రక్తదానం చేసి, క్షతగాత్రులకు అండగా నిలవాలని ప్రజలకు సూచించారు. క్యాన్సిలేషన్ చార్జీలు రద్దు చేసిన ఎయిర్ ఇండియా న్యూఢిల్లీ: ఉగ్రవాద దాడుల నేపథ్యంలో శ్రీలంక రాజధాని కొలంబో నుంచి భారత్‌కు ఈ నెల 24వ తేదీ వరకూ రాకపోకలు సాగించే తమ విమానాల్లో టికెట్ల క్యాన్సిలేషన్ చార్జీలను ఎయిర్ ఇండియా యాజమాన్యం రద్దు చేసింది. అలాగే రీషెడ్యూలింగ్ చార్జీలను సైతం వసూలు చేయబోమని ట్విట్టర్లో ప్రకటించింది. ఎయిర్ ఇండియా నిత్యం ఢిల్లీ నుంచి రెండు, చెన్నై నుంచి ఒక విమానాన్ని కొలంబోకు నడుపుతోంది. -
ఇకపై అవి బ్లడ్ సెంటర్లు!
న్యూఢిల్లీ: దేశంలో బ్లడ్ బ్యాంకుల పేరును బ్లడ్ సెంటర్లుగా సవరించాలని కేంద్రం ప్రతిపాదించింది. రక్తదానం కోసం పాటిస్తున్న నియమనిబంధనల్ని సవరించాలని నిర్ణయించింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగానే బ్లడ్ బ్యాంక్ అనే పేరును బ్లడ్ సెంటర్‌గా మారుస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. సాధారణంగా రక్తాన్ని సేకరించడం, నిల్వచేయడం, అవసరమున్న రోగులకు అందించడం వంటి సేవల్ని బ్లడ్ బ్యాంకులు నిర్వహిస్తాయన్నారు. -
రక్తదాతలు కావలెను
నిర్మల్అర్బన్ : ‘నేను 40 సార్లు రక్తదానం చేశాను. కానీ నా అవసరాలకు బ్లడ్‌బ్యాంక్ లో రక్తం దొరకలేదు. మా పెద్దమ్మ పేరు పద్మావతి. సారంగాపూర్ మండలం. రెండు రోజుల క్రితం కిందపడింది. తొంటి భాగంలో ఆపరేషన్ చేయాలన్నారు. ఏ పాజిటివ్ రక్తం రెండు యూనిట్లు కావాలన్నారు. బ్లడ్ బ్యాంకు వెళ్లా. అక్కడ రక్తం లేదన్నారు. ఏం చేయాలో పాలుపోలేదు. తెలిసిన వారిని సంప్రదించా. ఒకరు ముం దుకు వచ్చి యూనిట్ అందజేశారు. మరొకరి కోసం వెతికాను. బంధువుల నుంచి రక్త మార్పిడి పద్ధతిలో యూనిట్ సేకరించా. మా లాంటి వారికే రక్తం లభించని పరిస్థితి ఉంటే.. సామాన్యులు ఎంత ఇబ్బంది పడతున్నారో అర్థం చేసుకోవచ్చు’ అని నిర్మల్ కు చెందిన రాజ్‌కుమార్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది ఆయన ఒక్కడికి ఏర్పడిన సమస్యనే కాదు. ప్రతీ రోజు రక్తం కోసం ఇబ్బందిపడుతున్న వారందరి సమస్య. జిల్లా ఆసుపత్రిని రక్తలేమి వెంటాడుతోంది. నెల రోజులుగా బ్లడ్ బ్యాంక్‌లో రక్తం లేకపోవడంతో రోగులు, వారి బంధువులు అవస్థలు పడుతున్నారు. ప్రభు త్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందే వారికి అత్యవసర సమయాల్లో రక్తం దొరక్కపోవడంతో రక్తదాతల కోసం అన్వేషించాల్సిన పరిస్థితి. వేసవి కావడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోంది. గాడి తప్పుతున్న బ్లడ్ బ్యాంకు నిర్వహణ .. నిర్మల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంకును 2009లో ప్రారంభించారు. దీని ద్వారా తొలుత రోగులకు బాగానే సేవలు అందాయి. అయితే మూడేళ్లుగా బ్లడ్ బ్యాంకు నిర్వహణ గాడి తప్పింది. డ్రగ్ యాక్ట్ ప్రకారం బ్లడ్ బ్యాంకు నిర్వహణకు ప్రత్యేక వైద్యుడు ఉండాలి. రక్తదాన శిబిరాల ఏర్పాటు నుంచి రక్త పరీక్షలు, దాతల నుంచి రక్త సేకరణ, అవసరమైన వారికి రక్తం అందించడం, ఇలా అన్ని బ్లడ్ బ్యాంకు పనులు వైద్యుడి ప ర్యవేక్షణలో జరగాల్సి ఉంటుంది. అయితే ఏడాదిన్నరగా ప్రత్యేక వైద్యుడు లేడు. ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్లలో ఒకరికి అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆయన పూర్తిస్థాయిలో సమయాన్ని కేటాయించ లేకపోతున్నారు. 250 యూనిట్ల సామర్థ్యం ఉన్నా.. బ్లడ్ బ్యాంకులో 250 యూనిట్లు వరకు నిల్వ చేసే సామర్థ్యం ఉంది. రక్తదాన శిబిరాలు నిర్వహించి దాతల నుంచి రక్తం సేకరించి నిల్వ చేసుకోవచ్చు. అయితే మూడు నెలలుగా శిబిరాలు ఏర్పాటు చేయలేదు. గతేడాది 28 రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయగా కేవలం 504 యూనిట్లు మాత్రమే సేకరించగలిగారు. జనవరిలో శిబిరం ఏర్పాటు చేయగా వచ్చిన యూనిట్లు, దాతలు నేరుగా వచ్చి అందజేసిన యూనిట్లు, రక్తం అవసరమైన వారి నుంచి మార్పిడి పద్ధతి ద్వార రక్తం సేకరిస్తూ కొద్దో గొప్ప రక్త నిల్వలు అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. ప్రస్తుతం రక్త నిధి కేంద్రంలో రక్త నిల్వలు లేవు. నిండుకున్న రక్త నిల్వలు... జిల్లా కేంద్రం కావడంతో రక్తం కోసం బ్లడ్‌బ్యాంక్‌ను సంప్రదించే వారి సంఖ్య ఎక్కువగానే ఉం టుంది. ప్రతీ రోజు సరాసరిగా 10 మంది రక్తం కోసం బ్లడ్ బ్యాంకును సంప్రదిస్తున్నారు. నెలకు సుమారు 200 నుంచి 300 మంది వరకు రక్తం కోసం వస్తుంటారు. ఒక్కొక్కరికి ఒక్కో యూనిట్ చొప్పున అవసరం ఏర్పడినా, నెలకు కనీసం 200 యూనిట్లు అయినా అవసరం పడుతుంది. అయి తే శిబిరాలు ఏర్పాటు చేయకపోవడంతో నిల్వల కొరత ఏర్పడుతుంది. దీంతో రోగుల అవసరానికి తగినట్లు రక్తం యూనిట్లను సరఫరా చేయడంలో విఫలమవుతున్నారు. సాధారణంగా రక్తం పాజిటివ్ గ్రూపుల కొరత ఉండదు. కానీ ప్రస్తుతం నెగటివ్‌తో పాటు పాజిటివ్ గ్రూపుల రక్తం కూడా అందుబాటులో ఉండటం లేదు. ఇక అరుదైన రక్తం యూనిట్లు దొరకడం కష్టమే అవుతుంది. ఏ నెగిటివ్, ఏబీ నెగిటివ్ గ్రూపుల రక్తం అరుదుగా దొరుకుతుంది. అత్యవసర సమయాల్లో స్టాక్ తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఏరియా ఆస్పత్రిలోని బ్లడ్ బ్యాంకులో ఏ రక్తం గ్రూపులు కూడా అందుబాటులో లేవు. రక్త నిల్వలు నిండుకుండటంతో రోగులు, వారి కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడుతున్నారు. రక్తమార్పిడి ద్వారనే... నిర్మల్ జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత ప్రభుత్వ ఆస్పత్రిలో రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మ ఒడి, కేసీఆర్ కిట్‌తో ప్రసవాల సంఖ్య పెరిగింది. అలాగే ఏరియా ఆసుపత్రిలోనూ శస్త్ర చికిత్సలు పెరిగాయి. దీంతో ఎక్కువ యూనిట్ల రక్తం అందుబాటులో ఉండాల్సిన అవసరం ఏర్పడింది. అయితే అవసరానికి తగినంత సేకరణ లేకపోవడంతో కొరత నెలకొంది. ఏ రోగికైనా రక్తం అవసరం ఉంటే బంధువులో, తెలిసిన వారో రక్తదానం చేస్తేనే అవసరమైన వారికి రక్తాన్ని ఇస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి తప్పనిసరిగా రక్తం అవసరం ఉంటే ఇవ్వాల్సి ఉంటుంది. కానీ రక్త నిల్వలు లేకపోవడంతో మార్పిడి చేయాల్సి వస్తుంది. దీంతో ఆస్పత్రి సిబ్బంది కూడా ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలో ప్రైవేట్ రక్త నిల్వ కేంద్రం లేకపోవడంతో అత్యవసర సమయాల్లో దాతల కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. చికిత్సలకు నరకయాతన .. జిల్లాలో కేసీఆర్ కిట్, అమ్మ ఒడి పథకాల అమలుతో ప్రసవాల సంఖ్య పెరిగింది. ప్రసూతి ఆసుపత్రిలో ప్రతీ నెలా వందకు పైగా ప్రసవాలు జరుగుతున్నాయి. ప్రతి రోజు కనీసం 10 నుంచి 20 మందికి రక్తం అవసరమవుతోంది. పేద రోగులు అనారోగ్యానికి గురైనపుడు మార్పిడి కో సం రక్తం ఇచ్చేందుకు సైతం ఎవరు లేకపోవడం తో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రక్తనిధి కేంద్రంలో ప్రసూతి, ఏరియా ఆసుపత్రిలోని అర్హులైన రోగులకు ఉచితంగా రక్తం అందించాల్సి ఉంటుంది. కానీ రక్త నిల్వలు లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. రక్తం అందుబాటులో లేకపోవడంతో శస్త్ర చికిత్సలు చేసుకునేవారు, గర్భిణులు నరకయాతన పడుతున్నారు. అత్యవసర సమయాల్లో రక్తం కోసం దాతల కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. దాతలు లభించకపోతే నిజామాబాద్ వంటి నగరాల చుట్టు తిరగాల్సి వస్తుంది. రూ. 1000 నుంచి రూ.1500 రక్తం కొనుగోలు చేస్తున్నారు. రక్తం కొరత తీర్చడానికి సంబంధిత వైద్య అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. రక్తం కొరత తీర్చడానికి ఎలాంటి ప్రణాళికలు రూపొందించడం లేదు. రక్తదాతల స్పందిస్తేనే.. ప్రస్తుతం వేసవి కావడంతో రక్తదానం చేసేందుకు దాతలు వెనకడుగు వేస్తున్నారు. వేసవి సెలవులు కావడంతో కళాశాలలు లేకపోవడం, యువత సైతం సెలవులకు వెళ్లిపోవడం, శిబిరాలు ఏర్పా టు చేయకపోవడంతో రక్తం సేకరణ పూర్తిగా తగ్గిపోయింది. దీంతో నిల్వలు నిండుకున్నాయి. ఉన్న తాధికారులు స్పందించి అవగాహన సదస్సులు, శిబిరాలు ఏర్పాటు చేసి రక్తదానం చేసేలా ప్రతీ ఒక్కరిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తే తప్ప యూ నిట్లు దొరకడం కష్టం. యువకులు, స్వచ్ఛంద సం స్థలు, ఉన్నతాధికారులు స్పందించి రక్తం సేకరించడానికి సాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా అధికారుల చొరవ తీసుకోవాలని రోగులు, వారి బంధువులు కోరుతున్నారు. -
రక్త కన్నీరు!
నగరంలో రక్తనిధి కేంద్రాలన్నీ ఖాళీ అయ్యాయి. ఆపదలో బ్లడ్ బ్యాంక్‌లకు వెళ్లిన వారికి నిరాశే మిగులుతోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని బ్లడ్ బ్యాంకులు, స్వచ్ఛంద సంస్థలు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసినా..ఆశించిన స్థాయిలో దాతలు ముందుకు రావడం లేదు. దీంతో వివిధ ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులు, పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణులు, తలసేమియా బాధితులకు సకాలంలో రక్తం దొరక్క తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నారాయణగూడలోని ఐపీఎం సహా నగరంలోని అన్ని ప్రధాన ఆస్పత్రుల్లోని రక్తనిధి కేంద్రాల్లో నిల్వలు నిండుకోవడంతో రోగుల్లో ఆందోళన మొదలైంది. ఇదిలా ఉంటే గాంధీ గైనకాలజీ విభాగం వైద్యుల నిర్లక్ష్యం మూలంగా సుమారు 270 యూనిట్ల రక్తం ఎందుకూ పనికిరాకుండా పోయింది. సాక్షి, సిటీబ్యూరో/చార్మినార్: రక్త నిధి కేంద్రాల్లో రక్తం నిల్వలు నిండుకున్నాయి. నారాయణగూడలోని ఐపీఎం సహా నగరంలోని అన్ని ప్రధాన ఆస్పత్రుల్లో రక్తనిధి కేంద్రాల్లో నిల్వలు నిండుకోవడంతో రోగుల్లో ఆందోళన మొదలైంది. మరో వైపు గాంధీ గైనకాలజీ విభాగం వైద్యుల నిర్లక్ష్యం మూలంగా సుమారు 270 యూనిట్ల రక్తం ఎందుకు పనికిరాకుండా పోయింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రసవానికి ముందు వైద్యుల సలహా మేరకు రోగులు తెచ్చుకున్న దానిలో వినియోగం కాకుండా మిగిలిపోయిన ప్యాకెట్లను రక్తనిధి కేంద్రంలో భద్రపరచాల్సి ఉండగా, వైద్యులు పట్టించుకోకపోవడంతో అది ఎందుకూ పనికిరాకుండా పోయింది. ఈ అంశంపై సంబంధిత విభాగం వైద్యులకు నోటీసులు జారీ చేయడంతో సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆస్పత్రి సూపరింటిండెంట్ డాక్టర్ శ్రావణ్‌కుమార్ తెలిపారు. రక్తదానం తగ్గింది ఇంటర్మీడియట్, డిగ్రీ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించడం, పరీక్షల సీజన్ కావడంతో ఇంజనీరింగ్ విద్యార్థులు రక్తాన్ని దానం చేసేందుకు ముందుకు రావడం లేదు. వీరితో పాటు రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారితో పాటు ప్రసవం కోసం వచ్చిన మహిళలకు రక్తం అవసరం. అధిక రక్తస్త్రావంతో బాధపడుతున్న వీరికి చికిత్సల సమయంలో రెండు నుంచి మూడు యూనిట్ల రక్తం అవసరం ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో డాక్టర్ రాసి ఇచ్చిన చీటీ తీసుకుని బాధితుని బంధువులు ఆయా రక్తనిధి కేంద్రాల వద్దకు వెళ్తే, తీరా అక్కడ స్టాకు లేదంటున్నారు. ఒక వేళ ఉన్నా..బాధితుని బంధువుల్లో ఎవరో ఒకరు రక్తదానం చేస్తేకానీ అవసరమైన గ్రూపు రక్తాన్ని ఇవ్వబోమంటూ మెలిక పెడుతున్నారు. ప్రైవేటు బ్లడ్‌బ్యాంకులు దాతల నుంచి సేకరించిన రక్తంలో 30 శాతం ఉస్మానియా బ్లడ్‌బ్యాంక్‌కు సరఫరా చేయాలనే నిబంధన ఉన్నా పట్టించుకోవడం లేదు. గాడిన పెట్టే వ్యవస్థ ఏదీ..? నగరంలో 55 బ్లడ్‌బ్యాంకులు ఉండగా, ఔషధ నియంత్రణశాఖ రికార్డుల్లో ఈ సంఖ్య 61 నమోదైంది. ఇందులో 21 బ్లడ్‌బ్యాంకులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉండగా, మిగిలినవి ప్రైవేటు ఆసుపత్రులు, స్వచ్చంద సంస్థల ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లోని రోగులకు తక్కువ ధరకే రక్తాన్ని అందించాల్సిన బ్లడ్‌బ్యాంకులు సంపాదనే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. రక్త సేకరణ మొదలు, రక్తశుద్ధి, నిల్వ, నిర్వహణలో అనేక లోపాలున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి మూడు మాసాలకోసారి వీటిని తనిఖీ చేసి ఎప్పటికప్పుడు వాటిని గాడిలో పెట్టాల్సిన డ్రగ్ కంట్రోల్ బోర్డు ఇన్స్పెక్టర్లు కనీసం ఆరు మాసాలకు ఒకసారి కూడా అటు వైపు వెళ్లక పోవడంతో ప్రైవేటు రక్తనిధి కేంద్రాల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో బాటిల్‌పై రూ.1200 నుంచి రూ.2000 వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తలసేమియా బాధితుల వేదన తలసేమియా చిన్నారులకు రక్తం కరువైంది. పురానీహవేలీలోని తలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ, బ్లడ్ బ్యాంక్‌లో రక్తం నిండుకుంది. దాతలెవరూ ముందుకు రాకపోవడంతో రక్తం సమస్య తలెత్తింది. దీంతో చిన్నారుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోంది. రక్తంలో ఎర్ర రక్త కణాలు (ఆర్బీసీ) తగ్గిపోయి...ఇక వాటి ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయినప్పుడు తలసేమియా వ్యాధి వస్తుంది. తలసేమియాతో బాధపడే చిన్నారులకు 3 వారాలకు ఒకసారి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయాలి. ఇక్కడి సొసైటీ కార్యాలయంలో 2 వేలకు పైగా తలసేమియా చిన్నారులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. రోజుకు 30–40 యూనిట్ల రక్తం అవసరం. ఇంత పెద్ద మొత్తంలో రక్తం అందుబాటులో లేకపోవడంతో చిన్నారుల తల్లిదండ్రులతో పాటు సొసైటీ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధ్యమైనంత వెంటనే రక్తదాతలు ముందుకు వచ్చి తమ రక్తాన్ని దానం చేయకపోతే పరిస్థితులు విషమిస్తాయని...రక్తదానం చేయడానికి యువకులు స్వచ్చందంగా ముందుకు రావాలని సొసైటీ సభ్యులు కోరుతున్నారు. చిన్నారుల జీవితాలను కాపాడడానికి ఈ సొసైటీ ప్రత్యేకంగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, బ్లడ్ బ్యాంక్‌లను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి కూడా తలసేమియా బాధితులు ఇక్కడికి వస్తుంటారు. రక్తదానం చేయడానికిముందుకు రండి... పురానీహవేళీలోని తలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. రక్తాన్ని దానం చేయడానికి దాతలు ఎప్పుడైనా రావచ్చని నిర్వాహకులు కోరుతున్నారు. మరిన్ని వివరాలకు 8885534913, 040–24520159 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు. తలసేమియా బాధితులను ఆదుకోండి రక్తంలో హిమోగ్లోబిన్ శాతం10 కంటే ఎక్కువ ఉన్న వారు రక్తం దానం చేయొచ్చు. ఆసక్తి ఉన్న వారు ఎన్ని సార్లయినా దానం చేయవచ్చు. 18 నుంచి 60 ఏళ్ల వయసులోని వారు ప్రతి ఆరు మాసాలకు ఒక సారి రక్తాన్ని ఇవ్వొచ్చు. సేకరించిన రక్తాన్ని 120 రోజుల్లో విధిగా వినియోగించాలి. లేదంటే పాడై పోయే ప్రమాదం ఉంది. యువత రక్తదానంకు ముందుకు రావాలి. తలసేమియా చిన్నారులను ఆదు కోవాలి. – అలీమ్‌బేగ్, జాయింట్ సెక్రటరీ,తలసేమియా సికిల్ సెల్ సొసైటీ -
కొత్తగా 26 ప్రభుత్వ బ్లడ్ బ్యాంకులు
సాక్షి, హైదరాబాద్: బాలింతల ఆరోగ్య పరిరక్షణ లో వైద్య, ఆరోగ్య శాఖ మరో ముందడుగు వేస్తోంది. రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వ బ్లడ్‌బ్యాంకులను ఏర్పాటు చేయనుంది. ఉత్తమ ప్రమాణాలతో కూడిన రక్తాన్ని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 26 బ్లడ్ బ్యాంకులను ఏర్పాటు చేస్తోంది. అం దులో జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) ఆధ్వర్యంలో 13, రాష్ట్ర వైద్య విధాన పరి షత్ ఆధ్వర్యంలో మరో 13 బ్లడ్ బ్యాంకులను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో ఎన్హెచ్ఎం ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంకులను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. భూపాలపల్లి, అచ్చంపేట, మల్కాజ్‌గిరిలోని బ్లడ్ బ్యాంకులను జనవరి 15న ప్రారంభించేందుకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ 26 కొత్త బ్లడ్ బ్యాంకుల్లో 6 నెలల్లోపు పూర్తి స్థాయి సేవలు ప్రారంభం కానున్నాయి. పేదలకు ఉపయోగపడేందుకు వీలుగా ప్రభుత్వ ఆస్పత్రుల ప్రాంగణంలోనే వీటి నిర్మాణం జరుగుతోంది. కాన్పు సమయంలో అధిక రక్తస్రావం జరిగే సందర్భాల్లో ఒక్కోసారి 2 నుంచి 10 యూనిట్ల వరకు రక్తం అవసరమవుతోంది. సరిపడా రక్తం అందుబాటులో లేకపోవడం వల్ల కొన్నిసార్లు బాలింత మరణాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే బ్లడ్ బ్యాంకులను ఏర్పాటు చేస్తున్నారు. ‘ప్రైవేటు’కు అడ్డుకట్ట..! రాష్ట్రంలో ఏటా 4 లక్షల యూనిట్ల రక్తం అవసరముంటోంది. డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వ బ్లడ్ బ్యాంకులు లేకపోవడంతో ప్రైవే టు వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రైవేటు బ్లడ్ బ్యాంకులు ఒక్కో యూనిట్‌కు దాదాపు రూ.3 వేల నుంచి 5 వేలు వసూ లు చేస్తున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలోని బ్లడ్ బ్యాంకులతో ఈ దోపిడీకి అడ్డకట్ట పడనుంది. వీటికి అనుబంధంగా 21 రక్త నిధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. రక్తాన్ని పరీక్షలు నిర్వహిం చి రక్త నిధి కేంద్రాల్లో భవిష్యత్తు అవసరాల కోసం భద్రపరిచేలా వీటిని రూపొందిస్తున్నారు. ఉత్తమ ప్రమాణాలు.. కొత్త బ్లడ్ బ్యాంకుల నిర్మాణంలో నాణ్యత పరంగా ఎక్కడా రాజీ పడకూడదని అధికారులు నిర్ణయించారు. అధునాతన సాంకేతిక ప్రమాణాలతో వీటిని నిర్మిస్తున్నారు. 200 యూనిట్ల నిల్వ సామర్థ్యంతో నిర్మిస్తున్న ఒక్కోబ్లడ్ బ్యాంకు కోసం గరిష్టంగా రూ.65 లక్షలు ఖర్చు చేస్తున్నా రు. ప్రభుత్వ, ప్రైవేటు కలిపి రాష్ట్రంలో 136 బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి. వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలో ప్రస్తుతం 28 ఉన్నాయి. ఇప్పటికే ఉన్న వా టిని ఉత్తమ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు వైద్య, ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేస్తోంది. అన్ని బ్లడ్ బ్యాంకులను దశలవారీగా నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ (ఎన్ఏబీహెచ్) ధ్రువీకరణ పొందేలా తీర్చి దిద్దుతోంది. కొత్త బ్లడ్ బ్యాంకులు.. జాతీయ ఆరోగ్య మిషన్: మలక్‌పేట, నాంపల్లి, నారాయణపేట్, అచ్చంపేట, మల్కాజ్గిరి, షాద్‌నగర్, బాన్సువాడ, భైంసా, పెద్దపల్లి, పరకాల, భూపాలపల్లి, ఏటూరునాగారం, మంథని. రాష్ట్ర వైద్య విధాన పరిషత్: నాగర్‌కర్నూల్, ఘట్కేసర్, కొండాపూర్, మెదక్, బోధన్, ఉట్నూరు, ఆసిఫాబాద్, గోదావరిఖని, నర్సంపేట, మహబూబాబాద్, ములుగు, భువనగిరి, కింగ్‌కోఠి (హైదరాబాద్). -
6 లక్షల లీటర్ల రక్తం వృథా
ఒకవైపు అత్యవసరమైన ఆపరేషన్ల కోసం రక్తం కావాలంటూ నిరంతరం చాలామంది కాళ్లకు బలపాలు కట్టుకుని తిరుగుతారు. కానీ మరోవైపు బ్లడ్ బ్యాంకులు, ఆస్పత్రుల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల భారీగా రక్తం వృథా అవుతోంది. దేశవ్యాప్తంగా గడిచిన ఐదేళ్లలో ఇలా వృథా అయిన రక్తం మొత్తం 28 లక్షల యూనిట్లు!! లీటర్లలో చెప్పాలంటే మొత్తం 6 లక్షల లీటర్ల రక్తం వృథా అయ్యింది. 53 వాటర్ ట్యాంకర్లు నింపడానికి ఇది సరిపోతుంది. వాస్తవానికి మన దేశంలో ఏడాదికి 30 లక్షల యూనిట్ల రక్తం రోగులకు అందడం లేదు. హోల్ బ్లడ్, ప్లాస్మా, ప్లేట్లెట్లు దొరక్కపోవడం వల్ల గర్భిణుల మరణాలు తరచు సంభవిస్తున్నాయి. ప్రమాదాలలో కూడా మృతుల సంఖ్య పెరగడానికి సమయానికి రక్తం అందకపోవడమే ప్రధాన కారణం. బ్లడ్ బ్యాంకులలో రక్తాన్ని కొంతకాలం పాటు నిల్వ ఉంచవచ్చు. కానీ ఆ తర్వాత అది ఎందుకూ పనికిరాదు. ఇలా రక్తాన్ని వృథా చేస్తున్న రాష్ట్రాలలో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు ముందున్నాయి. కేవలం 2016-17 సంవత్సరంలోనే 6.57 లక్షల యూనిట్ల రక్తం, దాని ఉత్పత్తులను వృథాగా పారేశారు. సాధారణంగా హోల్ బ్లడ్‌ను గానీ ఎర్ర రక్తకణాలను గానీ 35 రోజుల్లోగా వాడేయాల్సి ఉంటుంది. కానీ ప్లాస్మా అయితే ఏడాది వరకు ఉంచచ్చు. వృథా అవుతున్న దాంట్లో 50 శాతం ప్లాస్మా కూడా ఉండటం మరీ దారుణం. చేతన్ కొఠారీ అనే వ్యక్తి దేశవ్యాప్తంగా రక్తం వాడకం గురించి సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నకు జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (నాకో) ఈ సమాధానాలు ఇచ్చింది. పది లక్షల యూనిట్ల రక్తాన్ని సేకరించి అందరికంటే ముందున్న మహారాష్ట్ర.. వృథాలో కూడా ముందే ఉంది. రక్త సేకరణలో రెండు, మూడు స్థానాల్లో పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలున్నాయి. వృథా చేయడంలో మహారాష్ట్ర, యూపీ, కర్ణాటక మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. ప్రధానంగా బ్లడ్ బ్యాంకులు, ఆస్పత్రుల మధ్య సమన్వయం లేకపోవడం.. రక్తాన్ని గురించిన సమాచారాన్ని పంచుకునే నెట్వర్కులు పటిష్టంగా లేకపోవడం వల్లే ఇలా జరుగుతోందని తెలుస్తోంది. రక్తదాన శిబిరాలు భారీ ఎత్తున నిర్వహిస్తున్నా, వాటిలో చాలావరకు ప్రచారానికి మాత్రమే పనికొస్తున్నాయి తప్ప అక్కడినుంచి రక్తాన్ని సరిగా బ్లడ్ బ్యాంకులకు చేర్చడం లేదన్న అపవాదు కూడా ఉంది. క్యాంపులలో ఏకంగా వెయ్యి నుంచి 3వేల యూనిట్ల వరకు రక్తాన్ని సేకరిస్తున్నారని, దీన్నంతటినీ నిల్వ చేయడానికి తమకు స్థలం కూడా ఉండట్లేదని ఒక రక్తనిధి నిర్వాహకురాలు చెప్పారు. దానికంటే ప్రతి మూడునెలలకు ఒకసారి నేరుగా బ్లడ్ బ్యాంకులకు వెళ్లి రక్తదానం చేస్తే మంచిదని అన్నారు. -
రక్త కన్నీరు...
ప్రైవేటు బ్లడ్ బ్యాంకుల ఇష్టారాజ్యం రోగులకు గడువు ముగిసిన,ఇన్ఫెక్షన్ సోకిన రక్తం సరఫరా సాక్షి, హైదరాబాద్: నగరంలో పలు బ్లడ్ బ్యాంక్‌ల రక్త దాహానికి రోగులు బలవుతున్నారు. సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆస్పత్రిలో ఇటీవల ఓ బాలింతకు నార్మల్ సెలైన్ వాటర్ కలిపిన కల్తీ రక్తం ఎక్కించడంతో ఆమె మృతి చెందిన విషయం మరువక ముందే... తాజాగా నాచారంలోని ఓ ఆస్పత్రి నిర్వాహకులు రక్తహీనతతో బాధపడుతున్న ఓ యువతికి ఇన్ఫెక్షన్ రక్తం ఎక్కించారు. ఆమె ఓ చేయిని కోల్పోవాల్సి రావడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కార్పొరేట్, స్వచ్ఛంద సంస్థల ముసుగులో నిర్వహిస్తున్న పలు బ్లడ్ బ్యాంకులు కనీస ప్రమాణాలు పాటించడం లేదు. గడువు ముగిసిన, ఇన్ఫెక్షన్ సోకిన రక్తాన్ని ఎక్కించడంతో బాధితులు కాళ్లు, చేతులే కాదు... ప్రాణాలనూ కోల్పోవాల్సి వస్తోంది. ప్రస్తుతం చేతిని పోగొట్టుకుని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు వైష్ణవి విషయంలోనూ ఇదే జరిగినట్లు వైద్యులు అభిప్రాయపడుతున్నారు. కనీస ప్రమాణాలు కరువు: రాష్ట్ర వ్యాప్తంగా 132 రక్తనిధి కేంద్రాలుండగా, వీటిలో హైదరాబాద్‌లోనే 61 ఉన్నాయి. వీటిలో 21 రక్తనిధి కేంద్రాలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొనసాగు తున్నాయి. మిగిలినవి వివిధ ట్రస్టులు, స్వచ్ఛంద సంస్థల అదీనంలో ఉన్నాయి. వీటిలో ఎక్కడా రక్తదాతలు, స్వీకర్తల వివరాలు నమోదు చేయడం లేదు. అర్హులైన టెక్నీషియన్లు లేరు. సేకరించిన రక్తాన్ని గ్రూపులుగా విభజించి, శుద్ధి చేసిన తర్వాత నిల్వ చేయడం, చివరకు బయోమెడికల్ వేస్టేజ్ నిర్వ హణ అంతా లోపభూయిష్టమే. 3 మాసాలకోసారి తని ఖీలు చేసి, ప్రమాణాలను పెంచాల్సిన ఔషధ నియంత్రణ మండలి అధికారులు ఇవేవీ పట్టించుకోవడం లేదు. ఏడాది క్రితం ప్రమాణాలు పాటించని కేంద్రాలకు నోటీçసులు జారీ చేసినట్లు వారు చెబుతున్నా... ఆచరణలో అమలు కావడం లేదు. యూనిట్‌కు రూ.1,500పైనే... యువజన సంఘాలు, ప్రైవేటు రక్తనిధి కేంద్రాలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ కళాశాలలు, ఐటీ, కార్పొరేట్ కంపెనీల్లో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తుంటారు. అనేక మంది ముందుకు వచ్చి తమ రక్తాన్ని దానం చేస్తుంటారు. ఇలా సేకరించిన దానిలో 30 శాతం రక్తాన్ని ఉస్మానియా, గాంధీ వంటి ప్రభుత్వ ఆస్పత్రులకు ఉచితంగా సరఫరా చేయాలి. రెడ్‌క్రాస్ సొసైటీ, లయన్స్‌క్లబ్ మినహా ఇతరులెవరూ అలా ఇవ్వడం లేదు. అంతేకాదు... తలసీమియా బాధితులకు ఉచితంగా సరఫరా చేయాలనే నిబంధన ఉన్నా... ఒక్కో బాటిల్‌పై రూ.1,200 నుంచి రూ.1,500 వరకు వసూలు చేస్తున్నారు. రక్తంలో నార్మల్సెలైన్ వాటర్ కలిపి కల్తీకి పాల్పడుతుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. -
బ్లడ్ లెస్ బ్యాంకులు!
- ఒకరు ఇస్తేనే మరొకరికి రక్తం ఇస్తామంటూ బ్లడ్‌బ్యాంకుల కండీషన్ - ముందుకు రాని దాతలు.. ఇబ్బందుల్లో రోగులు - నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సాక్షి, సిటీబ్యూరో: రక్తానికి రక్తం! ఇదేదో ఫ్యాక్షన్ సినిమాలో వినిపించే డైలాగ్ అనుకోకండి. అత్యవసర పరిస్థితుల్లో తమకు రక్తం కావాలంటూ బ్లడ్‌బ్యాంకులకు వచ్చేవారికి ఇప్పుడు ఎదురవుతున్న సమస్య ఇది. గత కొన్ని రోజులుగా నగరంలోని పలు బ్లడ్ బ్యాంకులను ‘రక్తహీనత’ జబ్బుపట్టి పీడిస్తోంది. ఆశించిన స్థాయిలో దాతలు ముందుకు రాకపోవడంతో అసరాలు తీర్చలేని పరిస్థితి నెల కొంది. బాధితుని బంధువుల్లో ఎవరో ఒకరు రక్తదానం చేస్తేనే అవసరమైన గ్రూప్ రక్తం (రక్తానికి రక్తం!) ఇస్తామంటూ బ్లడ్‌బ్యాంకు ఇన్చార్జిలు మెలిక పెడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని బ్లడ్‌బ్యాంకులు, స్వచ్ఛంద సంస్థలు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసినా..ఆశించిన స్థాయిలో దాతలు ముందుకు రావడం లేదు. దీంతో వివిధ ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులు, పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణులు, తలసీమియా బాధితులకు సకాలంలో రక్తం దొరక్క తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వివిధ ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి రక్తమోడుతూ ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌కు చేరుకున్న బాధితులకు రక్తం దొరకని దుస్థితి. ఒక వేళ ఉన్నా ఒక యూనిట్‌కు మించి ఇవ్వడం లేదు. ఉస్మాయాలో ప్రతి నెలా 500 నుంచి 600 యూనిట్ల రక్తం అవసరం. రోజుకు 40 మంది వస్తే కేవలం పది మందికే సమకూర్చగలుగుతున్నారు. దాతల నుంచి సేకరించిన రక్తంలో 30 శాతం ఉస్మానియాకు సరఫరా చేయాలనే నిబంధన ఉన్నా..నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. బ్లడ్ బ్యాంకులపై సరైన నియంత్రణ లేక పోవ డం వల్ల ఒక్కో బాటిల్‌పై రూ.1200 నుం చి రూ.1500 వరకు వసూలు చేస్తున్నారు. ‘మిషన్ టెన్ మిలియన్’ చార్మినార్: తలసేమియా వ్యాధిపై అవగాహన కల్పించేందుకు తలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ వారు ‘మిషన్ టెన్ మిలియన్’ నినాదంతో ఆదివారం నుంచి ప్రత్యేక కార్యక్రమం ప్రారంభిస్తున్నారు. జూలై 2వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. తలసేమియాతో బాధపడే చిన్నారులకు ఈ సొసైటీ ద్వారా అవసరమైనప్పుడల్లా రక్తాని ఉచితంగా అందిస్తున్నారు. చిన్నారుల జీవితాలను కాపాడడానికి ప్రత్యేకంగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, బ్లడ్ బ్యాంక్‌లను ఏర్పాటు చేశారు. పాతబస్తీ పురానీహవేలీలో ఉన్న ఈ సొసైటీ సభ్యులు డాక్టర్ రమణా దండమూడి, మనోజ్ రూపాని, డాక్టర్ సుమన్ జైన్, అలీంబేగ్, కె. రత్నావళి, డాక్టర్ జె. రాజేశ్వర్, రమా ఉప్పల తదితరులు తలసేమియా బాధితులకు విశేషసేవలందించి మానవత్వాన్ని చాటుకుంటున్నారు. రక్త దానం చేయాలనుకునేవారు, రక్తం అవసరమైన తలసేమియా బాధిత చిన్నారులు సొసైటీ సంయుక్త కార్యదర్శి అలీం బేగ్ (9246534913)ను సంప్రదించవచ్చు.