ఎంతో కాలంగా రక్తం లభ్యత అనేది రోజు రోజుకూ పెనుభూతంలా మారుతున్న సామాజిక సమస్యగా పరిణమిస్తోంది. రోడ్డు ప్రమాదాలు, కేన్సర్ చికిత్సలు, తలసేమియా చికిత్స, ప్రసవ సమయం.. ఇలా పలు అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరం మరింత ఎక్కువగా ఉంటుంది. గత దశాబ్దకాలంగా రక్తదానం గురించి అవగాహన పెరిగినప్పటికీ రక్తనిల్వలు సరిపడా ఉండడం లేదు. ఆరోగ్యకరమైన ప్రతీ వ్యక్తి స్వచ్చందంగా రక్తదాతగా మారడం మాత్రమే దీనికి పరిష్కారం. ఈ విషయంలో అవగాహన కలిగిస్తూ పలువురికి స్ఫూర్తి నిస్తున్నారు కొందరు నగరవాసులు. అక్టోబర్ 1న జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవ సందర్భంగా ప్రత్యేక కథనం.
తీ 3 సెకన్లకు ఒక వ్యక్తి రక్త కొరతతో మరణిస్తున్నాడు అని గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో నాలుగు కోట్ల యూనిట్ల రక్త నిల్వలు అవరం కాగా ప్రస్తుతం సమకూరుతున్నది మాత్రం 40 లక్షల యూనిట్లు మాత్రమే. సాంకేతికత ఎంత పెరిగినా ఒకరి నుంచి మరొకరికి అందించడం తప్ప రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయలేమనేది నిజం. కానీ రక్తదానంపై ఇంకా ప్రజల్లో పలు సందేహాలున్నాయి. అయితే అవన్నీ అపోహలు మాత్రమేనని, క్రనీసం18 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి, 50 కేజీల కన్నా ఎక్కువ బరువున్న ప్రతీ ఆరోగ్యకరమైన వ్యక్తి నిస్సందేహంగా రక్తదానం చేయవచ్చునని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. పతీ మూడు నెలలకు ఒకసారి రక్తదానం, అలాగే 15 రోజులకు ఒకసారి ప్లేట్‌లెట్స్ దానం చేయొచ్చునని, రక్తదానం వలన మరింత ఆరోగ్యంగా మారడమే కాకుండా పలు వ్యాధులు ఎదుర్కొనే రోగనిరోదక శక్తి పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.
‘సోషల్’ తో మేలు..
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రతి నిత్యం నగరానికి వేల యూనిట్ల రక్త అవసరం.. సోషల్‌మీడియా ప్రభావం పెరిగాక స్వచ్చందంగా రక్తదానానికి ముందుకు వచ్చే దాతల సంఖ్య కూడా పెరిగింది. బ్లడ్ డొనేషన్ గ్రూప్స్ ద్వారా, సోషల్‌మీడియా యాప్స్‌ని అనుసరించి నిమిషాల్లో అవసరమున్న చోటుకే వచ్చి రక్తదానం చేస్తున్నారు. కొన్ని ఆస్పత్రులలో బ్లడ్ బ్యాంక్ నుంచి తీసుకువచ్చే ప్యాకెట్లకు బదులు నేరుగా దాత నుంచి రక్తం తీసుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. దీని వలన స్వచ్చంద రక్తదాతల ఆవశ్యకత పెరిగింది.
రెడ్ డ్రాప్...సేవ్ లైఫ్
నగరంలోని జూబ్లీహిల్స్‌లో నివసించే రెహమాన్ ఇప్పటి వరకు 92 సార్లు రక్తదానం చేశాడు. అంతేకాదు సిటీలో ఎవరికి రక్తం అవసరమైనా ఇతరుల నుండి రక్తదానం చేయించడంలో ముందుంటాడు. రెహమాన్ పుట్టిన కొన్ని నెలలకే రక్తహీనతతో తల్లి మరణించింది. ఊహ తెలిశాక.. ఆరు యూనిట్ల రక్తం అందక నాన్న చనిపోయాడు. తన జీవితంలోనే చోటు చేసుకున్న ఈ సంఘటనలతో చలించిపోయిన రెహమాన్ ఎవరికి రక్తం అవసరమున్నా వెళ్లి ఇచ్చేవాడు. అమ్మ ప్రాణం పోసి జన్మనిస్తే రక్తదాత తన రక్తంతో మరుజన్మనిస్తాడు అంటాడు రెహమన్. రక్తదాతల అవసరాన్ని గమనించి రెడ్‌డ్రాప్ యువజన సేవా సమితి అనే స్వచ్చంధ సంస్థను ఏర్పాటు చేసి రక్తదానానికి తనవంతు కృషి చేస్తున్నాడు. తన సంస్థ ద్వారా ఇప్పటి వరకు 9600 మందిని ఆయన రక్తదాతలుగా మార్చారు. యాబైకి పైగా రక్తదాన శిబిరాలు నిర్వహించి బ్లడ్‌బ్యాంక్‌లకు రక్తాన్ని అందించారు. ప్రస్తుతం అందరూ తనని ప్రేమగా రెడ్‌డ్రాప్ రెహమాన్ అని పిలుస్తారు.
అవగాహన పెరిగింది..
నేను ఇప్పటి వరకు 18 సార్లు రక్తదానం చేశాను. టెక్నాలజీ పెరిగాక రక్తదానం అనేది మరింత సులభంగా మారింది. ఈ మధ్య ఎవరికి రక్తం అవసరౖమైనా సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేయడంతో అక్కడి ప్రాంతంలో ఉన్న డోనర్స్ స్పందిస్తున్నారు. చాలా గ్రూప్‌లలో నేను సభ్యునిగా ఉన్నాను. నేను ఇవ్వలేని పరిస్తితులలో నా స్నేమితులకు ఫార్వడ్ చేస్తాను. –మహ్మద్ రఫీ, సాఫ్ట్‌వేర్.
55 సార్లు రక్తమిచ్చా...
రక్తదానం వలన మరోవ్యక్తికి ప్రాణం నిలుస్తుంది. వ్యక్తిగతంగా ఇంతకన్నా గొప్ప పని ఇంకేది ఉండదు. ఇప్పటి వరకు నేను 55 సార్లు రక్తదానం చేశాను.మారుమూల గ్రామాల నుండి చికిత్స కోసం ఎందరో నగరానికి వస్తుంటారు.వారికి అత్యవసర పరిస్థితుల్లో రక్తం ఎక్కడి నుంచి తీసుకోవాలో తెలియదు. అలాంటప్పుడు రక్తదాతల అవసరం చాలా ఉంటుంది. ఎవరైనా సమయానికి రక్తం అందక చనిపోతే మనిషిగా మనం ఓడిపోయినట్టే అని నా భావన. అందుకే ప్రతి మూడు నెలలకు గాంధీ హస్పిటల్, రెడ్‌క్రాస్ సొసైటీ తదితర ప్రాంతాలలో స్వచ్చందంగా వెళ్లి రక్తదానం చేస్తుంటాను. –కొండల్‌రెడ్డి, రైతు స్వరాజ్య వేదిక.
Comments
Please login to add a commentAdd a comment