రక్తనిధి ఖాళీ | Blood Shortage in Blood Banks in Hyderabad | Sakshi
Sakshi News home page

రక్తనిధి ఖాళీ

May 23 2019 8:11 AM | Updated on May 25 2019 12:24 PM

Blood Shortage in Blood Banks in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని రక్త నిధి కేంద్రాల్లో రక్తం నిల్వలు నిండుకున్నాయి. ఆపదలో రక్తనిధి కేంద్రానికి వెళ్లిన వారికి తీరా అక్కడ నిరాశే ఎదురవుతోంది. సకాలంలో అవసరమైన బ్లడ్‌ గ్రూప్‌ దొరక్క క్షతగాత్రులు, పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణులు, తలసీమియా బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం నగరంలో పగటి ఉష్ణోగ్రతలు 40–43 సెల్సియస్‌ డిగ్రీలు నమోదు అవుతున్నాయి. దీంతో త్వరగా నీరసించే ప్రమాదం ఉంది. దీనికి తోడు కళాశాలలకు వేసవి సెలవులు ప్రారంభం కావడంతో ఐపీఎం సహా రెడ్‌క్రాస్‌ సొసైటీ, వైఎంసీఏ, లయన్స్‌ క్లబ్‌ తదితర స్వచ్చంధ సంస్థలు రక్తదాన శిబిరాలు నిర్వహించినా ఆశించిన స్థాయిలో దాతలు ముందుకు రావడం లేదు. నారాయణగూడలోని ఐపీఎం సహా నగరంలోని అన్ని ప్రధాన ఆస్పత్రుల్లోని రక్తనిధి కేంద్రాల్లో రక్త నిల్వలు నిండుకోవడంతో రోగుల అసరాలు తీర్చలేని దుస్థితి నెలకొంది. 

క్షతగాత్రులకు నరకమే..: రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఉస్మానియా, గాంధీ, నిమ్స్, కేర్, యశోద, కామినేని, కిమ్స్‌ వంటి ఆసుపత్రులకు ఎక్కువగా తీసుకువస్తారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న వారిని సుల్తాన్‌బజార్, పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రులకు తరలిస్తున్నారు. అధిక రక్తస్త్రావంతో బాధపడుతున్న వీరికి చికిత్స సమయంలో రెండు నుంచి మూడు యూనిట్ల రక్తం అవసరం. అత్యవసర పరిస్థితుల్లో డాక్టర్‌ రాసిచ్చిన చీటీ తీసుకుని రక్తనిధి కేంద్రాలకు వెళ్తే, తీరా అక్కడ స్టాకు లేదంటున్నారు. ఒక వేళ ఉన్నా..బాధితుడి బంధువుల్లో ఎవరో ఒకరు రక్తదానం చేస్తేకాని అవసరమైన గ్రూపు రక్తాన్ని ఇవ్వబోమంటూ మెళిక పెడుతున్నారు. సకాలంలో రక్తం దొరక్క పోవడంతో గాంధీ, ఉస్మానియా, నిలోఫర్‌ ఆస్పత్రుల్లో చికిత్సలు వాయిదా పడుతున్నాయంటే ఆశ్చర్య పోనవసరం లేదు. ప్రైవేటు బ్లడ్‌ బ్యాంకులు దాతల నుంచి సేకరించిన రక్తంలో 30 శాతం ప్రభుత్వ ఆస్పత్రులకు సరఫరా చేయాలనే నిబంధన ఉన్నా పట్టించుకోవడం లేదు. కొందరు ప్రైవేటు బ్లడ్‌బ్యాంకుల నిర్వహకులు, కార్పొరేట్‌ ఆస్పత్రులు దాతల నుంచి సేకరించిన రక్తాన్ని రూ.1500–2500 వరకు విక్రయిస్తుండటం కొసమెరుపు.  

తలసీమియా బాధితులకు దొరకడం లేదు
నగరంలో సుమారు మూడు వేల మంది తలసీమియా బాధితులు ఉన్నారు. వీరిలో ప్రతి ఒక్కరికీ ప్రతి 15–20 రోజుల కోసారి రక్తం ఎక్కిం చాల్సి ఉంటుంది. ఇలా రోజుకు 30–40 యూనిట్ల రక్తం అవసరం. రక్తదాన శిబి రాలు ఏర్పాటు చేస్తే పగటి ఉష్ణోగ్రతలకు బయపడి రక్తదానం చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. రోగులకు రక్తం సరఫరా చేయ డం మాకు చాలా కష్టంగా మారింది. గత్యంతరం లేక చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ప్రైవేటు బ్లడ్‌ బ్యాంకుల నుంచి రక్తాన్ని కొనుగోలు చేస్తున్నారు.–అలీంబేగ్, సంయుక్త కార్యదర్శి,తలసీమియా అండ్‌ సికిల్‌ సెల్‌ సొసైటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement