National Voluntary Blood Donation Day
-
Chetana Parikh: రక్తదాతకు వందనం
ఇన్ని కోట్ల మంది ఉన్న మనదేశంలో 100 సార్లు రక్తదానం చేసినవారు కేవలం 125 మంది ఉన్నారు. వీరిలో స్త్రీలు ఇద్దరే ఉండగా మూడవ వ్యక్తిగా అహ్మదాబాద్‌కు చెందిన చేతన పారిఖ్ నిలిచింది. అక్టోబర్ 1న వందోసారి రక్తదానం చేయడం ద్వారా ఆమె ఈ ఘనత సొంతం చేసుకుంది. రక్తదాన అవసరాన్ని ప్రచారం చేయడమే కాక అనితరసాధ్యంగా పాటిస్తున్న చేతన పరిచయం. అక్టోబర్ 1, ఆదివారం, అహ్మదాబాద్‌లోని జె.ఎల్.ఠాకూర్ రెడ్‌క్రాస్ భవన్. ‘నేషనల్ వాలంటరీ బ్లడ్ డొనేషన్ డే’ సందర్భంగా రెడ్‌క్రాస్ సంస్థ నిర్వహిస్తున్న మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్. అందరూ 58 ఏళ్ల చేతన పారిఖ్ కోసం ఎదురు చూస్తున్నారు. కాసేపటికి ఆమె వచ్చింది. రక్తం ఇవ్వడానికి అలవాటుగా చేతిని ముందుకు సాచింది. మెడికల్ స్టాఫ్ ఆమె చేతిలో సూది గుచ్చారు. ఆమె ఒంటి నుంచి రక్తం సాచెట్ వైపు ప్రవహించసాగింది. అంతే. అందరూ చప్పట్లు హోరెత్తించారు. ఎందుకంటే ఆ రోజుతో ఆమె అలా రక్తాన్ని ఇవ్వడం వందోసారి. మన దేశంలో దశాబ్దాలుగా రెడ్ క్రాస్ నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాల్లో ఇప్పటి వరకు కేవలం ఇద్దరు స్త్రీలే నూరుసార్లు రక్తం ఇచ్చారు. చేతన పారిఖ్ మూడో వ్యక్తి. కాలేజీ రోజుల నుంచి అమ్మమ్మ వయసు వరకూ ఆమె ఎప్పుడూ రక్తదానం చేస్తూనే ఉంది. ఇక మీదట కూడా చేస్తూనే ఉంటాను అంటోంది. 1985లో మొదటిసారి చేతన పారిఖ్ అహ్మదాబాద్‌లోనే పుట్టి పెరిగింది. నగరంలోని కలుపూర్ కాలేజీలో చదువుకుంది. ‘అది 1985వ సంవత్సరం. మా కాలేజీకి రెడ్ క్రాస్ వాళ్లు వచ్చి రక్తం ఇమ్మని అభ్యర్థించారు. అప్పటికి రక్తదాన ఉద్యమం ఊపందుకోలేదు. చాలా అపోహలు ఉండేవి. కొద్దిమంది అబ్బాయిలు ముందుకొచ్చారు. నేను, ఇంకో అమ్మాయి మాత్రమే రక్తం ఇచ్చాం. మా ఇంటిలో ఇది తెలిసి చాలా ఆందోళన చెందారు. రక్తం ఇవ్వడం వల్ల శరీరానికి నష్టం అనుకునేవారు ఆ రోజుల్లో. కాని రక్తం అందక చాలా మంది మరణిస్తున్నారని అప్పటికే నాకు తెలుసు. ఇది చేయదగ్గ మంచి పని అనిపించింది. అప్పటి నుంచి రక్తం ఇస్తూనే ఉన్నాను’ అంటుంది చేతన పారిఖ్. కుటుంబంతో ఉద్యమం చేతన భర్త వినిత్ పారిఖ్ సాదాసీదా డాక్టర్. పెళ్లయ్యాక చేతన తన భర్తను రక్తదానం వైపు ప్రోత్సహించింది. ఒక డాక్టర్‌గా రక్తదానం ఎంత అవసరమో తెలియడం వల్ల వినిత్ కూడా భార్య నుంచి స్ఫూర్తి పొందాడు. ఇద్దరూ కలిసి రెడ్ క్రాస్‌లో చేరారు. ఒకరికి చెప్పడమే కాదు తాము క్రమం తప్పకుండా రక్తదానం ఇస్తూ స్ఫూర్తిగా నిలిచారు. ‘నా భర్త వినిత్ నా కంటే ముందే నూరుసార్లు రక్తం ఇచ్చినవాళ్ల లిస్ట్‌లోకి ఎక్కారు. నేను తాజాగా ఆ లిస్ట్‌లో చేరాను. మనం చేసి చూపిస్తే మిగిలినవారు అందుకుంటారు. నా కొడుకు హన్షిల్, నా కుమార్తె మేహ ఇద్దరూ డాక్టర్లే. వారు కూడా మాతో కలిసి రక్తదానం చేస్తూనే ఉంటారు. ఇద్దరూ ఇప్పటికి చెరో ముప్పైసార్లు రక్తం ఇచ్చారు. ఇలా మా కుటుంబంలోని నలుగురు సభ్యులం కలిసి మొత్తం 260 సార్లు రక్తం ఇచ్చాం. ఇన్నిసార్లు ఇచ్చిన మరో కుటుంబం లేదేమో మన దేశంలో’ అంటుంది చేతన. పెళ్లిలో వినూత్నం చేతన రక్తదానం కోసం ప్రతి సందర్భాన్ని ఉపయోగించుకుంటుంది. కూతురు పెళ్లిలో ఆమె రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం విశేషం. అందులో పెళ్లికొడుకు స్వయంగా రక్తం ఇచ్చాడు. పెళ్లికి వచ్చిన బంధుజనుల్లో చాలామంది రక్తం ఇవ్వగా 58 యూనిట్ల సేకరణ జరిగింది. ‘రక్తం విలువ సరిగ్గా అది అవసరమైనప్పుడు తెలుస్తుంది. రక్తం ల్యాబ్‌లో తయారు కాదు. మనిషే ఇవ్వాలి. అందుకు మానవత్వం ఉండాలి. మన మానవత్వం నిరూపించుకోవడానికి రక్తదానానికి మించిన మార్గం లేదు’ అంటుంది చేతన. ఒక గృహిణిగా ఉంటూనే ఆమె చేస్తున్న ఈ విశిష్ట ప్రచారం, సేవ ఒక్కరికైనా స్ఫూర్తి కలిగిస్తే అంతే చాలు. -
రక్త దాత స్ఫూర్తి ప్రదాత
ఎంతో కాలంగా రక్తం లభ్యత అనేది రోజు రోజుకూ పెనుభూతంలా మారుతున్న సామాజిక సమస్యగా పరిణమిస్తోంది. రోడ్డు ప్రమాదాలు, కేన్సర్ చికిత్సలు, తలసేమియా చికిత్స, ప్రసవ సమయం.. ఇలా పలు అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరం మరింత ఎక్కువగా ఉంటుంది. గత దశాబ్దకాలంగా రక్తదానం గురించి అవగాహన పెరిగినప్పటికీ రక్తనిల్వలు సరిపడా ఉండడం లేదు. ఆరోగ్యకరమైన ప్రతీ వ్యక్తి స్వచ్చందంగా రక్తదాతగా మారడం మాత్రమే దీనికి పరిష్కారం. ఈ విషయంలో అవగాహన కలిగిస్తూ పలువురికి స్ఫూర్తి నిస్తున్నారు కొందరు నగరవాసులు. అక్టోబర్ 1న జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవ సందర్భంగా ప్రత్యేక కథనం. తీ 3 సెకన్లకు ఒక వ్యక్తి రక్త కొరతతో మరణిస్తున్నాడు అని గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో నాలుగు కోట్ల యూనిట్ల రక్త నిల్వలు అవరం కాగా ప్రస్తుతం సమకూరుతున్నది మాత్రం 40 లక్షల యూనిట్లు మాత్రమే. సాంకేతికత ఎంత పెరిగినా ఒకరి నుంచి మరొకరికి అందించడం తప్ప రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయలేమనేది నిజం. కానీ రక్తదానంపై ఇంకా ప్రజల్లో పలు సందేహాలున్నాయి. అయితే అవన్నీ అపోహలు మాత్రమేనని, క్రనీసం18 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి, 50 కేజీల కన్నా ఎక్కువ బరువున్న ప్రతీ ఆరోగ్యకరమైన వ్యక్తి నిస్సందేహంగా రక్తదానం చేయవచ్చునని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. పతీ మూడు నెలలకు ఒకసారి రక్తదానం, అలాగే 15 రోజులకు ఒకసారి ప్లేట్లెట్స్ దానం చేయొచ్చునని, రక్తదానం వలన మరింత ఆరోగ్యంగా మారడమే కాకుండా పలు వ్యాధులు ఎదుర్కొనే రోగనిరోదక శక్తి పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ‘సోషల్’ తో మేలు.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రతి నిత్యం నగరానికి వేల యూనిట్ల రక్త అవసరం.. సోషల్‌మీడియా ప్రభావం పెరిగాక స్వచ్చందంగా రక్తదానానికి ముందుకు వచ్చే దాతల సంఖ్య కూడా పెరిగింది. బ్లడ్ డొనేషన్ గ్రూప్స్ ద్వారా, సోషల్‌మీడియా యాప్స్‌ని అనుసరించి నిమిషాల్లో అవసరమున్న చోటుకే వచ్చి రక్తదానం చేస్తున్నారు. కొన్ని ఆస్పత్రులలో బ్లడ్ బ్యాంక్ నుంచి తీసుకువచ్చే ప్యాకెట్లకు బదులు నేరుగా దాత నుంచి రక్తం తీసుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. దీని వలన స్వచ్చంద రక్తదాతల ఆవశ్యకత పెరిగింది. రెడ్ డ్రాప్...సేవ్ లైఫ్ నగరంలోని జూబ్లీహిల్స్‌లో నివసించే రెహమాన్ ఇప్పటి వరకు 92 సార్లు రక్తదానం చేశాడు. అంతేకాదు సిటీలో ఎవరికి రక్తం అవసరమైనా ఇతరుల నుండి రక్తదానం చేయించడంలో ముందుంటాడు. రెహమాన్ పుట్టిన కొన్ని నెలలకే రక్తహీనతతో తల్లి మరణించింది. ఊహ తెలిశాక.. ఆరు యూనిట్ల రక్తం అందక నాన్న చనిపోయాడు. తన జీవితంలోనే చోటు చేసుకున్న ఈ సంఘటనలతో చలించిపోయిన రెహమాన్ ఎవరికి రక్తం అవసరమున్నా వెళ్లి ఇచ్చేవాడు. అమ్మ ప్రాణం పోసి జన్మనిస్తే రక్తదాత తన రక్తంతో మరుజన్మనిస్తాడు అంటాడు రెహమన్. రక్తదాతల అవసరాన్ని గమనించి రెడ్‌డ్రాప్ యువజన సేవా సమితి అనే స్వచ్చంధ సంస్థను ఏర్పాటు చేసి రక్తదానానికి తనవంతు కృషి చేస్తున్నాడు. తన సంస్థ ద్వారా ఇప్పటి వరకు 9600 మందిని ఆయన రక్తదాతలుగా మార్చారు. యాబైకి పైగా రక్తదాన శిబిరాలు నిర్వహించి బ్లడ్‌బ్యాంక్‌లకు రక్తాన్ని అందించారు. ప్రస్తుతం అందరూ తనని ప్రేమగా రెడ్‌డ్రాప్ రెహమాన్ అని పిలుస్తారు. అవగాహన పెరిగింది.. నేను ఇప్పటి వరకు 18 సార్లు రక్తదానం చేశాను. టెక్నాలజీ పెరిగాక రక్తదానం అనేది మరింత సులభంగా మారింది. ఈ మధ్య ఎవరికి రక్తం అవసరౖమైనా సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేయడంతో అక్కడి ప్రాంతంలో ఉన్న డోనర్స్ స్పందిస్తున్నారు. చాలా గ్రూప్‌లలో నేను సభ్యునిగా ఉన్నాను. నేను ఇవ్వలేని పరిస్తితులలో నా స్నేమితులకు ఫార్వడ్ చేస్తాను. –మహ్మద్ రఫీ, సాఫ్ట్వేర్. 55 సార్లు రక్తమిచ్చా... రక్తదానం వలన మరోవ్యక్తికి ప్రాణం నిలుస్తుంది. వ్యక్తిగతంగా ఇంతకన్నా గొప్ప పని ఇంకేది ఉండదు. ఇప్పటి వరకు నేను 55 సార్లు రక్తదానం చేశాను.మారుమూల గ్రామాల నుండి చికిత్స కోసం ఎందరో నగరానికి వస్తుంటారు.వారికి అత్యవసర పరిస్థితుల్లో రక్తం ఎక్కడి నుంచి తీసుకోవాలో తెలియదు. అలాంటప్పుడు రక్తదాతల అవసరం చాలా ఉంటుంది. ఎవరైనా సమయానికి రక్తం అందక చనిపోతే మనిషిగా మనం ఓడిపోయినట్టే అని నా భావన. అందుకే ప్రతి మూడు నెలలకు గాంధీ హస్పిటల్, రెడ్‌క్రాస్ సొసైటీ తదితర ప్రాంతాలలో స్వచ్చందంగా వెళ్లి రక్తదానం చేస్తుంటాను. –కొండల్‌రెడ్డి, రైతు స్వరాజ్య వేదిక. -
ఎన్నిసార్లు దానం చేసినా తరగని నిధి
నేడు జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం నేషనల్ వాలంటరీ బ్లడ్ డొనేషన్ డేని ఏటా అక్టోబర్ ఒకటవ తేదీన నిర్వహిస్తున్నాం. స్వరూప క్రిష్ణన్, డాక్టర్ జె.జి జోలీల చొరవతో 1975లో మొదలైన ఈ పద్ధతి నిరంతరాయంగా విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజలకు రక్తదానం ఆవశ్యకత తెలియచేస్తూ రక్తదానం చేయడానికి చైతన్యం కలిగించడం ప్రాణాపాయంలో ఉన్న పేషెంట్లకు సమయానికి రక్తం అందించి ప్రాణాలు కాపాడడం రోడ్డు ప్రమాదాలు, ఆపరేషన్ల వంటి అవసరాలకు తగినంత రక్తం నిల్వలు ఉండేలా నిధిని ఏర్పాటు చేయడం రక్తదాతల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెంచి రక్తదానం చేయడం పట్ల ఆసక్తిని పెంచడం ఆరోగ్యకరమైన రక్తాన్ని పరిశుభ్రమైన పద్ధతుల్లో సేకరించి ఆరోగ్య సంస్థ నిబంధనల మేరకు నిల్వ చేయడం... నేషనల్ వాలంటరీ బ్లడ్ డొనేషన్డే ప్రధాన ఉద్దేశాలు. మహారాష్ట్ర, త్రిపుర, తమిళనాడు, వెస్ట్‌బెంగాల్ రాష్ట్రాల్లో రక్తదాతలు ఎక్కువగా ఉన్నారు. ఈ క్రమంలో ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో 93 శాతం ప్రజలు రక్తదానం చేయడానికి పేర్లను నమోదు చేసుకున్నారు. వారిలో ఎక్కువ మంది ఎక్కువసార్లు రక్తదానం చేశారు. రక్తదానం చేయడమంటే ప్రాణదానం చేయడమే. ఈ లక్ష్యంతో ముందుకు రావడానికి ప్రతి ఒక్కరికీ పిలుపునిచ్చే ఆ సందర్భంలో మరింత సమాచారం కోసం కింది వెబ్సైట్లను చూడవచ్చు. indianblooddonors.com; bharatbloodbank.com bloodbankindia.net; friends2support; indianredcross society