సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని పలు ప్రభుత్వ రక్తనిధి కేంద్రాలను ‘రక్తహీనత’ జబ్బుపట్టి పీడిస్తోంది. కనీసం లెసైన్స్ లేకపోవడంతో పాటు రక్త సేకరణ, గ్రూపింగ్ నిర్వహణ, ప్రాసెస్, నిల్వ, పంపిణీ వ్యవస్థ, బయోమెడికల్ వేస్టేజ్ నిర్వహణ సరిగా లేకపోవడంతో నేడవి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాయి. వీటిని ఎప్పటికప్పుడు ఆధునీకరించాల్సిన ఆస్పత్రి యాజ మాన్యాలు పట్టించుకోక పోవడంతో ఆపద లో వచ్చిన రోగులకు కనీస సేవలు అందించలేక విమర్శలపాలవుతున్నాయి. నగరంలో 61 బ్లడ్‌బ్యాంకులు ఉండగా, వీటిలో 21 ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొనసాగుతున్నాయి.
వీటిలో ఏ ఒక్క ఆస్పత్రిలో కూడా ఇప్పటి వరకు కాంపొనెంట్ ప్రిపరేషన్ మిషన్(ప్లేట్‌లెట్స్ , ప్లాస్మాలను వేరు చేసే సాంకేతిక పరిజ్ఞానం) లేదంటే ఆశ్చర్యపోనవసరం లేదు. దీంతో డెంగీ, మలేరియా, ఇతర వైరల్ ఫీవర్స్‌తో బాధపడుతూ రక్తంలో ప్లేట్స్ పడిపోయి ప్రభుత్వ ఆస్పత్రులను ఆశ్రయించిన రోగులకు తీరా అక్కడ చేదు అనుభవమే ఎదురవుతోంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేటు రక్త నిధి కేంద్రాలను ఆశ్రయిస్తే.. ఒక్కో బాటిల్‌కు రూ. 25 నుంచి రూ. 30 వేలకుపైగా ఛార్జీ చేస్తున్నారు.
తలసీమియా బాధితులకు తప్పని తిప్పలు..
డ్రగ్‌కంట్రోల్ బోర్డు అధికారులు ప్రతి మూడు మాసాలకు ఒకసారి వీటిలో తనిఖీలు నిర్వహించి పనితీరుపై నివేదిక ఇవ్వాలి. సిబ్బంది కొరత పేరుతో ఆరు మాసాలకోసారి కూడా అటు వైపు చూడటం లేదు. దీంతో నిర్వహకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. రక్తదాన శిబిరాలు నిర్వహించి సేకరించిన రక్తంలో 30 శాతం రక్తాన్ని సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రులకు ఇవ్వాలనే నిబంధన ఉన్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు.
తలసీమియా బాధితులకు రక్తాన్నిఉచితంగా సరఫరా చేయాలనే నిబంధన ఉన్నా... ఒ క్కో బాటిల్‌పై రూ. 1200 నుంచి రూ.1500 వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశంపై ఇటీవల ఒక స్వచ్ఛంద సంస్థపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు కూడా వెళ్లాయి. ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఇక అరుదుగా లభించే, ఒ, ఎ, బి, నెగిటివ్ రక్తంతో పాటు తెల్లరక్త కణాలు, ప్లాస్మా వంటి వాటికి మరింత డిమాండ్ ఉంది. అత్యవసర పరిస్థితుల్లో ఇది కావాలంటే వారు అడిగినంత ఇచ్చుకోవాల్సిందే.
లెసైన్సు లేని ఆస్పత్రులకు నోటీసుల జారీ ..
ఔషధ నియంత్రణ శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఇటీవల ఆయా కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించగా విస్తుగొలిపే నిజాలు బయటికి వచ్చాయి. సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి, పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రులతో పాటు నిలోఫర్ నవజాత శిశువుల ఆస్పత్రి, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రుల్లోని రక్తనిధి కేంద్రాల్లో కనీస వసతులు లేవని పేర్కొంటూ ఇటీవల వాటికి నోటీసులు జారీ చేశారు. ఇకపై ఇక్కడ రక్తం సేకరించి, నిల్వ చేయడం రోగులకు ఏమాత్రం క్షేమం కాదని స్పష్టం చేశారు. అప్పటికే అక్కడ నిల్వ ఉన్న బ్లడ్ బాటిళ్లను సీజ్ చేశారు. ఇలా ఒక్క నిలోఫర్‌లోనే 45 బాటిళ్లను సీజ్ చేయడం విశేషం.
బ్లడ్ బ్యాంకులకు రక్తహీనత జబ్బు
Published Sun, Mar 22 2015 1:22 AM | Last Updated on Sat, Sep 2 2017 11:11 PM
Advertisement
Advertisement