ఆన్‌లైన్‌కు నోచుకోని బ్లడ్‌బ్యాంక్‌లు! | Online unproduced blood banks | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌కు నోచుకోని బ్లడ్‌బ్యాంక్‌లు!

Published Thu, Jan 16 2014 4:03 AM | Last Updated on Sat, Sep 2 2017 2:38 AM

Online unproduced blood banks

విజయనగరం ఆరోగ్యం, న్యూస్‌లైన్: అత్యవసర సమయాల్లో రక్తం అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఎక్కడికక్కడ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నా, బ్లడ్‌బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నా ఈ పరిస్థితుల్లో మార్పు రావడం లేదు. దీంతో ప్రభుత్వం బ్లడ్‌బ్యాంక్ వివరాలను ఆన్‌లైన్ చేయాలని ఆదేశించింది. కానీ ఈ ఆదేశాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి ఆరేళ్లవుతున్నా ఇంతవరకు జిల్లా అధికారులు ఆన్‌లైన్ చేయలేదు. కనీసం ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేయలేదు.బ్లడ్‌బ్యాంక్‌ల్లో జరుగుతున్న అవకతవకలకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 2008లో బ్లడ్ బ్యాంక్‌లను ఆన్‌లైన్ చేయాలని ఆదేశించింది. జిల్లాలో కేంద్రాస్పత్రిలో ఒక బ్లడ్‌బ్యాంక్, విజయనగరంలో రెడ్‌క్రాస్ సొసైటీ బ్లడ్‌బ్యాంక్, పార్వతీపురంల్లో రెడ్‌క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్, నెల్లిమర్ల మిమ్స్‌లో బ్లడ్ బ్యాంక్, విజయనగరంలో శ్రీనివాస్ బ్లడ్ బ్యాంక్ ఉన్నాయి. ఏ బ్లడ్ బ్యాంక్‌లో కూడా ఆన్‌లైన్ విధానం అమలుకావడం లేదు. 
 
 నిర్లక్ష్యానికి ఆరేళ్లు
 ఆన్‌లైన్ చేయాలని ప్రభుత్వం ఆదేశించి ఆరేళ్లు గడుస్తోంది. ఈ ఆరేళ్లలో ఒక్క బ్లడ్‌బ్యాంక్ కూడా దీనిపై కనీస చర్యలు తీసుకోలేదు. అన్ని విషయాలు తెలిసినా ఉన్నతాధికారులు నోరు మెదపకుండా ఉండడం అనుమానాలకు తావిస్తోంది. బ్లడ్ బ్యాంక్‌ల్లో ఉన్న రక్తం వివరాలు ఆన్‌లైన్‌లో చేయక పోవడం వల్ల రక్త నిల్వలు ఎంత ఉన్నాయో తెలీదు. దీనివల్ల నిల్వలు పక్కదారి పట్టే అవకాశం ఉంది. కొన్ని బ్లడ్ బ్యాంకుల్లో రక్తాన్ని అమ్ముకుంటున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. యూనిట్ రక్తాన్ని రూ. 1000 నుంచి రూ. 1500 వరకు విక్రయిస్తున్నట్టు సమాచారం. 
 
 ఆన్‌లైన్‌లో పొందుపరచడం వల్ల లాభాలు 
 ఆన్‌లైన్‌లో వివరాలు పొందుపరచడం వల్ల ఏ బ్లడ్‌బ్యాంక్‌లో ఎక్కడ ఉందనేది ఎక్కడ నుం చి అయినా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా రోగి బంధువులు రక్తం కోసం వెళ్లినప్పుడు రక్తం లేదని చెప్పడానికి ఆస్కారం ఉండదు. రక్తం సరఫరాలో అక్రమాలకు తావుండదు. ఇంత ప్రాధాన్యం ఉన్నా కాసుల కోసం బ్లడ్ బ్యాంక్ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు రక్త నిధుల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచాలని పలువురు కోరుతున్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement