ప్లేట్‌లెట్స్‌ ఒక ప్యాకెట్‌ రూ.14వేలు | Blood Shortage in Blood Banks West Godavari | Sakshi
Sakshi News home page

బాబోయ్‌ ప్లేట్‌‘రేటు’! దొరకడం గగనమే!

Published Mon, Oct 14 2019 1:31 PM | Last Updated on Mon, Oct 14 2019 1:31 PM

Blood Shortage in Blood Banks West Godavari - Sakshi

ఏలూరు కొత్తపేటకు చెందిన ఇలియాజ్‌కు డెంగీ జ్వరం వచ్చింది. ఆస్పత్రికి వెళితేడెంగీ అని వైద్యులు నిర్ధారించారు. ఆకస్మికంగా ఒకరోజు ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ 20వేలకు పడిపోయిందని వైద్యులు చెప్పారు. అర్జెంటుగా ప్లేట్‌లెట్స్‌ ఎక్కించకపోతే మనిషి ప్రాణాపాయస్థితికి చేరతాడని హెచ్చరించారు. ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రికి వైద్యం కోసం తీసుకువెళ్లగా అక్కడ పరీక్షించిన వైద్యులు తమవద్ద ప్లేట్‌లెట్స్‌ లేవని, విజయవాడ కార్పొరేట్‌ ఆస్పత్రికి తీసుకువెళ్ళాలని రిఫర్‌ చేశారు. ఆ కార్పొరేట్‌ ఆస్పత్రికి తీసుకువెళితే ప్లేట్‌లెట్స్‌కు సుమారుగా రూ.14వేల వరకూ ఖర్చు అవుతుందని చెప్పారు. అంటే మూడు రోజులపాటు అక్కడ వైద్యం చేయించుకుంటే అయ్యే ఖర్చు సుమారుగా రూ.50 వేలు. దీంతో బంధువుల నోట మాటరాలేదు. ఏమి చేయాలో దిక్కుతోచనిస్థితిలో ఉండిపోయారు. చివరకు రెడ్‌క్రాస్‌ బ్లడ్‌బ్యాంకులో సింగిల్‌ డోనర్‌ ప్లేట్‌లెట్స్‌ (ఎస్‌డీపీ) ఇవ్వటంతో ఊపిరిపీల్చుకున్నారు.ఇలా.. ప్లేట్‌లెట్స్‌ దొరకక, లభ్యమైనా ఖర్చు భరించలేక ఎందరో రోగులు అష్టకష్టాలు పడుతున్నారు

ఏలూరు టౌన్‌: జిల్లాలో డెంగీ రోగుల పరిస్థితి దారుణంగా మారింది. ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ పడిపోవటంతో రోగులు ప్రాణాపాయస్థితికి చేరుతున్నారు. జిల్లాలో డెంగీ బాధితులు సంఖ్య రోజురోజుకూ పెరిగిపోవటం ఆందోళనకు గురిచేస్తోంది. ఏలూరులోని జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రికి రోగులను తీసుకువచ్చినా వైద్యం చేసే పరిస్థితి కనిపించటంలేదు. మెడికల్‌ సూపరింటెండెంట్, వైద్య అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఆస్పత్రిలోని బ్లడ్‌ బ్యాంకుల్లో ప్లేట్‌లెట్స్‌ లేవని, తామేమీ చేయలేమని రోగుల బంధువులకు చెప్పటంతో వారు లబోదిబోమంటున్నారు. ఇక ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రులకు తీసుకువెళ్ళలేని పేదవర్గాలప్రజల ప్రాణాలకు భరోసాలేని దుస్థితి నెలకొంది. వైద్య అధికారులకు ఎన్నిసార్లు హెచ్చరికలు జారీ చేసినా పరిస్థితిలో మార్పు కానరావటం లేదు. మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన వైద్యులు తూతూ మంత్రంగానే చికిత్స చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

ప్లేట్‌లెట్స్‌కు భారీగా వసూళ్లు
ప్రభుత్వ, రెడ్‌ క్రాస్‌ బ్లడ్‌ బ్యాంకులు మినహా ప్రైవేటు బ్లడ్‌ బ్యాంకుల్లో ప్లేట్‌లెట్స్‌ కావాలంటే భారీగా సొమ్ములు చెల్లించాల్సిందే. ప్రైవేటు బ్లడ్‌ బ్యాంకులు ఏకంగా ఒక ప్యాకెట్‌ ప్లేట్‌లెట్స్‌ కోసం రూ.12వేల నుంచి రూ.16వేల వరకూ వసూలు చేస్తున్నాయి.  ఏలూరులోని జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలోని బ్లడ్‌బ్యాంకులో కనీసం నామమాత్రంగా అయినా రక్తనిల్వలు లేని దుస్థితి నెలకొంది. రెడ్‌ క్రాస్‌ సొసైటీ బ్లడ్‌ బ్యాంకులో మాత్రమే రోగులకు కావాల్సిన రక్తాన్ని సరఫరా చేస్తున్నారు. డెంగీ పరీక్షలు చేస్తున్న ప్రభుత్వాస్పత్రిలో ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ డౌన్‌ అయితే మాత్రం విజయవాడ, గుంటూరు వంటి ప్రాంతాల్లోని కార్పొరేట్‌ ఆస్పత్రులకు రిఫర్‌ చేయటం పరిపాటిగా మారింది. ప్రభుత్వ ఆధీనంలో పెద్దగా బ్లడ్‌ బ్యాంకులు లేకపోవటం, ప్రభుత్వ బ్లడ్‌ బ్యాంకుల్లోని సిబ్బందిలో చిత్తశుద్ధి లోపించటంతో మాకేంటీ అన్నట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.  ప్రభుత్వ బ్లడ్‌ బ్యాంకులు ఏలూరు, జంగారెడ్డిగూడెంలో ఉండగా, రెడ్‌క్రాస్‌ బ్లడ్‌బ్యాంకులు ఏలూరు, తణుకు, నరసాపురంలో ఉన్నాయి. వీటికి అనుసంధానంగా స్టోరేజీ పాయింట్లు పాలకొల్లు, పెనుగొండ, భీమవరం, తాడేపల్లిగూడెం, కొవ్వూరు, భీమడోలు, చింతలపూడిలో ఏర్పాటు చేశారు. ఇక ఏలూరు, తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం, జంగారెడ్డిగూడెం తదితర ప్రాంతాల్లో ప్రైవేటు బ్లడ్‌ బ్యాంకులు ఉండగా, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా బ్లడ్‌ బ్యాంకులు పనిచేస్తున్నాయి.

బ్లడ్‌ బ్యాంకుల్లో రక్తనిల్వలు నిల్‌
జిల్లా వ్యాప్తంగా ఆయా రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులు, వివిధ వ్యాధులకు సంబంధించి ఆపరేషన్ల సందర్భంలోనూ రోగి ప్రాణాలు రక్షించేందుకు ప్రాణాధారం రక్తమే. కానీ జిల్లాలో అత్యవసర పరిస్థితుల్లో రక్తనిధుల్లో రక్త  నిల్వలు లేకపోవటం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో ఒక నెలకు సుమారుగా 5000యూనిట్ల వరకూ రక్త నిల్వలు అవసరం అవుతాయని అంచనా. కానీ జిల్లా వ్యాప్తంగా క్యాంపులు, ఇతర దాతల ద్వారా సేకరించిన రక్త నిల్వలు 3000యూనిట్ల వరకూ మాత్రమే ఉంటుందని చెబుతున్నారు.   ఇక డెంగీ వంటి వ్యాధుల బారిన పడిన రోగికి అత్యవసరంగా ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ పడిపోవటంతో రక్తం అవసరం అవుతుంది. కానీ రక్త దాతలనుంచి రక్తం సేకరించేందుకు శ్రమించాల్సి వస్తోంది. రక్తాన్ని స్వీకరించటానికి వివిధ నిబంధనలు, ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా కష్టంగా మారుతోంది.

దాతల నుంచి రక్తసేకరణ చేయాలి
జిల్లాలో అవసరమైన మేరకు బ్లడ్‌ బ్యాంకుల్లో రక్తనిధులు లేవు. రక్త దాతలను ప్రోత్సహించి, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్తసేకరణ పెద్ద ఎత్తున చేపట్టాలి. ప్రజల్లో రక్తదానంపై అవగాహన కల్పించాలి. యువత, విద్యార్థులు కొంతవరకూ ముందుకు రావటంతోనే చాలా వరకు ప్రాణాలు కాపాడగలుగుతున్నాం. జిల్లాలో సుమారుగా 5వేల యూనిట్ల వరకూ రక్తనిల్వలు అవసరం అవుతాయి. కానీ ఆ మేరకు రక్త సేకరణ జరగటంలేదనే చెప్పాలి. రెడ్‌క్రాస్‌ బ్లడ్‌ బ్యాంకుల్లో తక్కువ ధరకు, పేదలకు ఉచితంగానూ ప్లేట్‌లెట్స్‌ సరఫరా చేస్తున్నాం. రక్తసేకరణపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.– చిట్టిబాబు, రెడ్‌క్రాస్‌ బ్లడ్‌ బ్యాంకుజిల్లా కో–ఆర్డినేటర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement