డెంగీ జ్వరంతో యువకుడి మృతి
Published Mon, Aug 26 2013 5:58 AM | Last Updated on Wed, Aug 1 2018 2:35 PM
నిడదవోలు, న్యూస్‌లైన్ : నిడదవోలు పట్టణంలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. 25 రోజుల క్రితం జ్వరాల కారణంగా ఇద్దరు మృతి చెందగా ఆదివారం డెంగీ లక్షణాలతో మరో యువకుడు చనిపోయాడు. పట్టణంలోని సుబ్బరాజుపేటకు చెందిన కొడమంచిలి వెంకట్రావు (23) రాజమండ్రి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. పది రోజులుగా జ్వరంతో బాధపడుతున్న వెంకట్రావుకు కుటుంబ సభ్యులు ముందుగా నిడదవోలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అక్కడి వైద్యులు పరీక్షలు చేసి డెంగీ లక్షణాలు ఉన్నట్లు నిర్ధారించారు.
మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు అతడిని రాజమండ్రి తరలించారు. కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్న వెంకట్రావుకు భార్య అన్నపూర్ణ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరోవైపు వెంకట్రావు భార్య అన్నపూర్ణ రెండు రోజుల క్రితమే తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతోంది. ఈ పరిస్థితుల్లో వెంకట్రావు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. పట్టణంలోని తీరుగూడెం, సుబ్బరాజుపేటలో విషజ్వరాలతో పలువురు బాధపడుతున్నారు. నెలవ్యవధిలో జ్వరాల కారణంగా ముగ్గురు చనిపోవడంతో పట్టణ ప్రజలు బెంబేలెత్తుతున్నారు.
పారిశుధ్యం అధ్వానం
పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న సుబ్బరాజుపేటలో పారిశుధ్యం అధ్వానంగా మారింది. కొందరు పందుల పెంపకందారులు కాలనీలో పలు చోట్ల ప్లాస్టిక్ డబ్బాలను ఏర్పాటు చేసి పాడైన ఆహార పదార్థాలను సేకరిస్తున్నారు. వారం రోజులకు ఒకసారి వచ్చి ఆ డబ్బాలను తీసుకెళుతున్నారు. అయితే వారం రోజుల పాటు ఆహార పదార్థాలు ఆ డబ్బాల్లో నిల్వ ఉండటంతో దోమలు విజృంభిస్తున్నాయి. దీంతో జ్వరాలబారిన పడుతున్నామని కాలనీ ప్రజలు వాపోతున్నారు.
Advertisement
Advertisement