సాక్షి, హైదరాబాద్: తలసీమియా సికిల్ సొసైటీ లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2వేలమంది తలసీమియాతో బాధపడుతున్నారు.వీరికి నెలకు సగటున రెండువేల యూనిట్ల బ్లడ్ అవసరం కాగా, ప్రస్తుతం వెయ్యి యూనిట్లు కూడా సమకూరడం లేదు. ముదిరిన ఎండలు, కాలేజీలకు సెలవులే ఇందుకు కారణం. రక్తసేకరణ భారంగా మారడంతో నిర్వహకులు ఆ బాధ్యతను బాధితుల తల్లిదండ్రులకే అప్పగించడంతో వారు నానాతంటాలు పడుతున్నారు.
అయితే ప్రస్తుతం రక్తదానం చేసేందుకు దాతలు ఆశించినస్థాయిలో ముందుకు రావడంలేదు. సకాలంలో రక్తం దొరకక క్షతగాత్రులు పరలోకాలు వెళ్తున్నారు. తలసీమియా బాధితులకు రెండువారాలకోమారు రక్తాన్ని ఎక్కించాల్సి ఉంటుంది. శరీరబరువు, వయసును బట్టి ఒకటి నుంచి రెండుయూనిట్ల రక్తాన్ని తప్పక ఎక్కించాలి. ముదిరిన ఎండలకు తోడు కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించడంతో రక్తదాన శిబిరాలు ఏర్పాటుచేసినా దాతలు పెద్దగా ముందుకురావడం లేదని తలసీమియా సికిల్ సొసైటీ నిర్వాహకురాలు కొత్తపల్లి రత్నావళి ఆవేదన వ్యక్తం చేశారు. ఒ,ఎ,బి, నెగిటివ్ గ్రూపులకు చెందిన రక్తం దొరకక వారు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని పేర్కొంది.
రక్తనిధి కేంద్రాలపై కొరవడిన నిఘా : ఔషధనియంత్రణశాఖ రికార్డుల ప్రకారం నగరంలో 61 రక్తనిధి (బ్లడ్‌బ్యాంకులు) కేంద్రాలున్నాయి. ఇందులో 21 ప్రభుత్వాస్పత్రుల్లో ఉండగా, మిగిలినవి ప్రైవేటు ఆస్పత్రులు, స్వచ్ఛందసంస్థల ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. వీటిని నెలకోసారి తనిఖీ చేయాల్సి ఉండగా, అధికారులు పట్టించుకోకపోవడంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తలసీమియా బాధితులకు రక్తాన్ని ఉచితంగా సరఫరా చేయాలనే నిబంధన ఉన్నా..పట్టించుకోవడం లేదు. రక్తానికి రక్తం అంటూ బాధితుని బంధువుల్లో ఎవరైనా రక్తమిస్తే కానీ రోగికి అవసరమైన బ్లడ్‌గ్రూప్‌ను ఇవ్వడంలేదు. అది కూడా ఒక్కో యూనిట్‌కు రూ.1200 చొప్పున వసూలు చేస్తున్నారు.
రక్తాన్ని ఎన్నిసార్లు దానం చేయొచ్చు...
మనిషి శరీరంలో 5 లీటర్ల రక్తముంటుంది.
ఒక వ్యక్తి తన జీవితకాలంలో 168 సార్లు రక్తాన్ని దానం చేయొచ్చు.
రక్తంలో హిమోగ్లోబిన్ శాతం10 కంటే ఎక్కువున్న వారు రక్తాన్ని ఇవ్వొచ్చు.
18 నుంచి 60 ఏళ్లలోపు వారు ప్రతి మూడునెలలకోసారి ఇవ్వొచ్చు. ఇలా సేకరించిన రక్తాన్ని 120రోజుల్లో వాడాలి. లేదంటే పాడైపోతుంది.
35కిలోల కంటే తక్కువ బరువు, హెచ్‌ఐవీ, మలేరియా, కామెర్ల బాధితుల నుంచి రక్తాన్ని సేకరించరాదు.
బ్లడ్ ప్లీజ్..
Published Sat, May 10 2014 11:42 PM | Last Updated on Wed, Apr 3 2019 4:24 PM
Advertisement
Advertisement