రక్త కన్నీరు...
- ప్రైవేటు బ్లడ్ బ్యాంకుల ఇష్టారాజ్యం
- రోగులకు గడువు ముగిసిన,ఇన్‌ఫెక్షన్ సోకిన రక్తం సరఫరా
సాక్షి, హైదరాబాద్: నగరంలో పలు బ్లడ్ బ్యాంక్‌ల రక్త దాహానికి రోగులు బలవుతున్నారు. సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆస్పత్రిలో ఇటీవల ఓ బాలింతకు నార్మల్ సెలైన్ వాటర్ కలిపిన కల్తీ రక్తం ఎక్కించడంతో ఆమె మృతి చెందిన విషయం మరువక ముందే... తాజాగా నాచారంలోని ఓ ఆస్పత్రి నిర్వాహకులు రక్తహీనతతో బాధపడుతున్న ఓ యువతికి ఇన్‌ఫెక్షన్ రక్తం ఎక్కించారు. ఆమె ఓ చేయిని కోల్పోవాల్సి రావడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కార్పొరేట్, స్వచ్ఛంద సంస్థల ముసుగులో నిర్వహిస్తున్న పలు బ్లడ్ బ్యాంకులు కనీస ప్రమాణాలు పాటించడం లేదు. గడువు ముగిసిన, ఇన్‌ఫెక్షన్ సోకిన రక్తాన్ని ఎక్కించడంతో బాధితులు కాళ్లు, చేతులే కాదు... ప్రాణాలనూ కోల్పోవాల్సి వస్తోంది. ప్రస్తుతం చేతిని పోగొట్టుకుని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు వైష్ణవి విషయంలోనూ ఇదే జరిగినట్లు వైద్యులు అభిప్రాయపడుతున్నారు.
కనీస ప్రమాణాలు కరువు: రాష్ట్ర వ్యాప్తంగా 132 రక్తనిధి కేంద్రాలుండగా, వీటిలో హైదరాబాద్‌లోనే 61 ఉన్నాయి. వీటిలో 21 రక్తనిధి కేంద్రాలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొనసాగు తున్నాయి. మిగిలినవి వివిధ ట్రస్టులు, స్వచ్ఛంద సంస్థల అదీనంలో ఉన్నాయి. వీటిలో ఎక్కడా రక్తదాతలు, స్వీకర్తల వివరాలు నమోదు చేయడం లేదు. అర్హులైన టెక్నీషియన్లు లేరు. సేకరించిన రక్తాన్ని గ్రూపులుగా విభజించి, శుద్ధి చేసిన తర్వాత నిల్వ చేయడం, చివరకు బయోమెడికల్ వేస్టేజ్ నిర్వ హణ అంతా లోపభూయిష్టమే. 3 మాసాలకోసారి తని ఖీలు చేసి, ప్రమాణాలను పెంచాల్సిన ఔషధ నియంత్రణ మండలి అధికారులు ఇవేవీ పట్టించుకోవడం లేదు. ఏడాది క్రితం ప్రమాణాలు పాటించని కేంద్రాలకు నోటీçసులు జారీ చేసినట్లు వారు చెబుతున్నా... ఆచరణలో అమలు కావడం లేదు.
యూనిట్‌కు రూ.1,500పైనే...
యువజన సంఘాలు, ప్రైవేటు రక్తనిధి కేంద్రాలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ కళాశాలలు, ఐటీ, కార్పొరేట్ కంపెనీల్లో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తుంటారు. అనేక మంది ముందుకు వచ్చి తమ రక్తాన్ని దానం చేస్తుంటారు. ఇలా సేకరించిన దానిలో 30 శాతం రక్తాన్ని ఉస్మానియా, గాంధీ వంటి ప్రభుత్వ ఆస్పత్రులకు ఉచితంగా సరఫరా చేయాలి. రెడ్‌క్రాస్ సొసైటీ, లయన్స్‌క్లబ్ మినహా ఇతరులెవరూ అలా ఇవ్వడం లేదు. అంతేకాదు... తలసీమియా బాధితులకు ఉచితంగా సరఫరా చేయాలనే నిబంధన ఉన్నా... ఒక్కో బాటిల్‌పై రూ.1,200 నుంచి రూ.1,500 వరకు వసూలు చేస్తున్నారు. రక్తంలో నార్మల్‌సెలైన్ వాటర్ కలిపి కల్తీకి పాల్పడుతుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది.