రక్తదాతలు కావలెను | Need blood donors | Sakshi
Sakshi News home page

రక్తదాతలు కావలెను

Published Thu, May 17 2018 11:52 AM | Last Updated on Wed, Apr 3 2019 4:24 PM

Need blood donors - Sakshi

రక్తదానం చేస్తున్న యువకుడు  

నిర్మల్‌అర్బన్‌ : ‘నేను 40 సార్లు రక్తదానం చేశాను. కానీ నా అవసరాలకు బ్లడ్‌బ్యాంక్‌ లో రక్తం దొరకలేదు. మా పెద్దమ్మ పేరు పద్మావతి. సారంగాపూర్‌ మండలం. రెండు రోజుల క్రితం కిందపడింది. తొంటి భాగంలో ఆపరేషన్‌ చేయాలన్నారు. ఏ పాజిటివ్‌ రక్తం రెండు యూనిట్లు కావాలన్నారు. బ్లడ్‌ బ్యాంకు వెళ్లా. అక్కడ రక్తం లేదన్నారు. ఏం చేయాలో పాలుపోలేదు. తెలిసిన వారిని సంప్రదించా. ఒకరు ముం దుకు వచ్చి యూనిట్‌ అందజేశారు.

మరొకరి కోసం వెతికాను. బంధువుల నుంచి రక్త మార్పిడి పద్ధతిలో యూనిట్‌ సేకరించా. మా లాంటి వారికే రక్తం లభించని పరిస్థితి ఉంటే.. సామాన్యులు ఎంత ఇబ్బంది పడతున్నారో అర్థం చేసుకోవచ్చు’ అని నిర్మల్‌ కు చెందిన రాజ్‌కుమార్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది ఆయన ఒక్కడికి ఏర్పడిన సమస్యనే కాదు. ప్రతీ రోజు రక్తం కోసం ఇబ్బందిపడుతున్న వారందరి సమస్య.  జిల్లా ఆసుపత్రిని రక్తలేమి వెంటాడుతోంది. నెల రోజులుగా బ్లడ్‌ బ్యాంక్‌లో రక్తం లేకపోవడంతో రోగులు, వారి బంధువులు అవస్థలు పడుతున్నారు.

ప్రభు త్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందే వారికి అత్యవసర సమయాల్లో రక్తం దొరక్కపోవడంతో రక్తదాతల కోసం అన్వేషించాల్సిన పరిస్థితి. వేసవి కావడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోంది. 

గాడి తప్పుతున్న బ్లడ్‌ బ్యాంకు నిర్వహణ ..         

నిర్మల్‌ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని బ్లడ్‌ బ్యాంకును 2009లో ప్రారంభించారు. దీని ద్వారా తొలుత రోగులకు బాగానే సేవలు అందాయి. అయితే మూడేళ్లుగా బ్లడ్‌ బ్యాంకు నిర్వహణ గాడి తప్పింది. డ్రగ్‌ యాక్ట్‌ ప్రకారం బ్లడ్‌ బ్యాంకు నిర్వహణకు ప్రత్యేక వైద్యుడు ఉండాలి. రక్తదాన శిబిరాల ఏర్పాటు నుంచి రక్త పరీక్షలు, దాతల నుంచి రక్త సేకరణ, అవసరమైన వారికి రక్తం అందించడం, ఇలా అన్ని బ్లడ్‌ బ్యాంకు పనులు వైద్యుడి ప ర్యవేక్షణలో జరగాల్సి ఉంటుంది.

అయితే ఏడాదిన్నరగా ప్రత్యేక  వైద్యుడు లేడు. ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్లలో ఒకరికి అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆయన పూర్తిస్థాయిలో సమయాన్ని కేటాయించ లేకపోతున్నారు.   

250 యూనిట్ల సామర్థ్యం ఉన్నా.. 

బ్లడ్‌ బ్యాంకులో 250 యూనిట్లు వరకు నిల్వ చేసే సామర్థ్యం ఉంది. రక్తదాన శిబిరాలు నిర్వహించి దాతల నుంచి రక్తం సేకరించి నిల్వ చేసుకోవచ్చు. అయితే  మూడు నెలలుగా శిబిరాలు ఏర్పాటు చేయలేదు. గతేడాది 28 రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయగా కేవలం 504 యూనిట్లు మాత్రమే సేకరించగలిగారు. జనవరిలో శిబిరం ఏర్పాటు చేయగా వచ్చిన యూనిట్లు, దాతలు నేరుగా వచ్చి అందజేసిన యూనిట్లు, రక్తం అవసరమైన వారి నుంచి మార్పిడి పద్ధతి ద్వార రక్తం సేకరిస్తూ కొద్దో గొప్ప రక్త నిల్వలు అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. ప్రస్తుతం రక్త నిధి కేంద్రంలో రక్త నిల్వలు లేవు. 

నిండుకున్న రక్త నిల్వలు... 

జిల్లా కేంద్రం కావడంతో రక్తం కోసం బ్లడ్‌బ్యాంక్‌ను సంప్రదించే వారి సంఖ్య ఎక్కువగానే ఉం టుంది. ప్రతీ రోజు సరాసరిగా 10 మంది రక్తం కోసం బ్లడ్‌ బ్యాంకును సంప్రదిస్తున్నారు. నెలకు సుమారు 200 నుంచి 300 మంది వరకు రక్తం కోసం వస్తుంటారు. ఒక్కొక్కరికి ఒక్కో యూనిట్‌ చొప్పున అవసరం ఏర్పడినా, నెలకు కనీసం 200 యూనిట్లు అయినా అవసరం పడుతుంది. అయి తే శిబిరాలు ఏర్పాటు చేయకపోవడంతో నిల్వల కొరత ఏర్పడుతుంది. దీంతో రోగుల అవసరానికి తగినట్లు రక్తం యూనిట్లను సరఫరా చేయడంలో విఫలమవుతున్నారు. సాధారణంగా రక్తం పాజిటివ్‌ గ్రూపుల కొరత ఉండదు.

కానీ ప్రస్తుతం నెగటివ్‌తో పాటు పాజిటివ్‌ గ్రూపుల రక్తం కూడా అందుబాటులో ఉండటం లేదు. ఇక అరుదైన రక్తం యూనిట్లు దొరకడం కష్టమే అవుతుంది. ఏ నెగిటివ్, ఏబీ నెగిటివ్‌ గ్రూపుల రక్తం అరుదుగా దొరుకుతుంది. అత్యవసర సమయాల్లో స్టాక్‌ తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఏరియా ఆస్పత్రిలోని బ్లడ్‌ బ్యాంకులో ఏ రక్తం గ్రూపులు కూడా అందుబాటులో లేవు. రక్త నిల్వలు నిండుకుండటంతో రోగులు, వారి కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడుతున్నారు. 

రక్తమార్పిడి ద్వారనే... 

నిర్మల్‌ జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత ప్రభుత్వ ఆస్పత్రిలో రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మ ఒడి, కేసీఆర్‌ కిట్‌తో ప్రసవాల సంఖ్య పెరిగింది. అలాగే ఏరియా ఆసుపత్రిలోనూ శస్త్ర చికిత్సలు పెరిగాయి. దీంతో ఎక్కువ యూనిట్ల రక్తం అందుబాటులో ఉండాల్సిన అవసరం ఏర్పడింది. అయితే అవసరానికి తగినంత సేకరణ లేకపోవడంతో కొరత నెలకొంది. ఏ రోగికైనా రక్తం అవసరం ఉంటే బంధువులో, తెలిసిన వారో రక్తదానం చేస్తేనే అవసరమైన వారికి రక్తాన్ని ఇస్తున్నారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి తప్పనిసరిగా రక్తం అవసరం ఉంటే ఇవ్వాల్సి ఉంటుంది. కానీ రక్త నిల్వలు లేకపోవడంతో మార్పిడి చేయాల్సి వస్తుంది. దీంతో ఆస్పత్రి సిబ్బంది కూడా ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలో ప్రైవేట్‌ రక్త నిల్వ కేంద్రం లేకపోవడంతో అత్యవసర సమయాల్లో దాతల కోసం ఎదురు చూడాల్సి వస్తుంది.

 
చికిత్సలకు నరకయాతన .. 

జిల్లాలో కేసీఆర్‌ కిట్, అమ్మ ఒడి పథకాల అమలుతో ప్రసవాల సంఖ్య పెరిగింది. ప్రసూతి ఆసుపత్రిలో ప్రతీ నెలా వందకు పైగా ప్రసవాలు జరుగుతున్నాయి. ప్రతి రోజు కనీసం 10 నుంచి 20 మందికి రక్తం అవసరమవుతోంది. పేద రోగులు అనారోగ్యానికి గురైనపుడు మార్పిడి కో సం రక్తం ఇచ్చేందుకు సైతం ఎవరు లేకపోవడం తో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రక్తనిధి కేంద్రంలో ప్రసూతి, ఏరియా ఆసుపత్రిలోని అర్హులైన రోగులకు ఉచితంగా రక్తం అందించాల్సి ఉంటుంది.

కానీ రక్త నిల్వలు లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. రక్తం అందుబాటులో లేకపోవడంతో శస్త్ర చికిత్సలు చేసుకునేవారు, గర్భిణులు నరకయాతన పడుతున్నారు. అత్యవసర సమయాల్లో రక్తం కోసం దాతల కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. దాతలు లభించకపోతే నిజామాబాద్‌ వంటి నగరాల చుట్టు తిరగాల్సి వస్తుంది. రూ. 1000 నుంచి రూ.1500 రక్తం కొనుగోలు చేస్తున్నారు. రక్తం కొరత తీర్చడానికి సంబంధిత వైద్య అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. రక్తం కొరత తీర్చడానికి ఎలాంటి ప్రణాళికలు రూపొందించడం లేదు.

రక్తదాతల స్పందిస్తేనే.. 

ప్రస్తుతం వేసవి కావడంతో రక్తదానం చేసేందుకు దాతలు వెనకడుగు వేస్తున్నారు. వేసవి సెలవులు కావడంతో కళాశాలలు లేకపోవడం, యువత సైతం సెలవులకు వెళ్లిపోవడం, శిబిరాలు ఏర్పా టు చేయకపోవడంతో రక్తం సేకరణ పూర్తిగా తగ్గిపోయింది. దీంతో నిల్వలు నిండుకున్నాయి. ఉన్న తాధికారులు స్పందించి అవగాహన సదస్సులు, శిబిరాలు ఏర్పాటు చేసి రక్తదానం చేసేలా ప్రతీ ఒక్కరిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తే తప్ప యూ నిట్లు దొరకడం కష్టం. యువకులు, స్వచ్ఛంద సం స్థలు, ఉన్నతాధికారులు స్పందించి రక్తం సేకరించడానికి సాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా అధికారుల చొరవ తీసుకోవాలని రోగులు, వారి బంధువులు కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement