రక్త కన్నీరు! | Blood Shortage Problem In Hyderabad | Sakshi
Sakshi News home page

రక్త కన్నీరు!

Published Wed, Apr 18 2018 10:17 AM | Last Updated on Wed, Apr 3 2019 4:22 PM

Blood Shortage Problem In Hyderabad - Sakshi

తలసేమియా సొసైటీ బ్లడ్‌ బ్యాంక్‌లో చిన్నారులకు బ్లడ్‌ ట్రాన్స్‌ఫ్యూజన్‌ చేస్తున్న దృశ్యం

నగరంలో రక్తనిధి కేంద్రాలన్నీ ఖాళీ అయ్యాయి. ఆపదలో బ్లడ్‌ బ్యాంక్‌లకు వెళ్లిన వారికి నిరాశే మిగులుతోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని బ్లడ్‌ బ్యాంకులు, స్వచ్ఛంద సంస్థలు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసినా..ఆశించిన స్థాయిలో దాతలు ముందుకు రావడం లేదు. దీంతో వివిధ ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులు, పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణులు, తలసేమియా బాధితులకు సకాలంలో రక్తం దొరక్క తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నారాయణగూడలోని ఐపీఎం సహా నగరంలోని అన్ని ప్రధాన ఆస్పత్రుల్లోని రక్తనిధి కేంద్రాల్లో నిల్వలు నిండుకోవడంతో రోగుల్లో ఆందోళన మొదలైంది. ఇదిలా ఉంటే గాంధీ గైనకాలజీ విభాగం వైద్యుల నిర్లక్ష్యం మూలంగా సుమారు 270 యూనిట్ల రక్తం ఎందుకూ పనికిరాకుండా పోయింది. 

సాక్షి, సిటీబ్యూరో/చార్మినార్‌: రక్త నిధి కేంద్రాల్లో రక్తం నిల్వలు నిండుకున్నాయి. నారాయణగూడలోని ఐపీఎం సహా నగరంలోని అన్ని ప్రధాన ఆస్పత్రుల్లో రక్తనిధి కేంద్రాల్లో నిల్వలు నిండుకోవడంతో రోగుల్లో ఆందోళన మొదలైంది. మరో వైపు గాంధీ గైనకాలజీ విభాగం వైద్యుల నిర్లక్ష్యం మూలంగా సుమారు 270 యూనిట్ల రక్తం ఎందుకు పనికిరాకుండా పోయింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రసవానికి ముందు వైద్యుల సలహా మేరకు రోగులు తెచ్చుకున్న దానిలో వినియోగం కాకుండా మిగిలిపోయిన ప్యాకెట్లను రక్తనిధి కేంద్రంలో భద్రపరచాల్సి ఉండగా, వైద్యులు పట్టించుకోకపోవడంతో అది ఎందుకూ పనికిరాకుండా పోయింది. ఈ అంశంపై సంబంధిత విభాగం వైద్యులకు నోటీసులు జారీ చేయడంతో సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆస్పత్రి సూపరింటిండెంట్‌ డాక్టర్‌ శ్రావణ్‌కుమార్‌ తెలిపారు. 

రక్తదానం తగ్గింది
ఇంటర్మీడియట్, డిగ్రీ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించడం, పరీక్షల సీజన్‌ కావడంతో ఇంజనీరింగ్‌ విద్యార్థులు రక్తాన్ని దానం చేసేందుకు ముందుకు రావడం లేదు. వీరితో పాటు రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారితో పాటు ప్రసవం కోసం వచ్చిన మహిళలకు రక్తం అవసరం. అధిక రక్తస్త్రావంతో బాధపడుతున్న వీరికి చికిత్సల సమయంలో రెండు నుంచి మూడు యూనిట్ల రక్తం అవసరం ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో డాక్టర్‌ రాసి ఇచ్చిన చీటీ తీసుకుని బాధితుని బంధువులు ఆయా రక్తనిధి కేంద్రాల వద్దకు వెళ్తే, తీరా అక్కడ స్టాకు లేదంటున్నారు. ఒక వేళ ఉన్నా..బాధితుని బంధువుల్లో ఎవరో ఒకరు రక్తదానం చేస్తేకానీ అవసరమైన గ్రూపు రక్తాన్ని ఇవ్వబోమంటూ మెలిక పెడుతున్నారు. ప్రైవేటు బ్లడ్‌బ్యాంకులు దాతల నుంచి సేకరించిన రక్తంలో 30 శాతం ఉస్మానియా బ్లడ్‌బ్యాంక్‌కు సరఫరా చేయాలనే నిబంధన ఉన్నా పట్టించుకోవడం లేదు. 

గాడిన పెట్టే వ్యవస్థ ఏదీ..?
నగరంలో 55 బ్లడ్‌బ్యాంకులు ఉండగా, ఔషధ నియంత్రణశాఖ రికార్డుల్లో ఈ సంఖ్య 61 నమోదైంది. ఇందులో 21 బ్లడ్‌బ్యాంకులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉండగా, మిగిలినవి ప్రైవేటు ఆసుపత్రులు, స్వచ్చంద సంస్థల ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లోని రోగులకు తక్కువ ధరకే రక్తాన్ని అందించాల్సిన బ్లడ్‌బ్యాంకులు సంపాదనే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. రక్త సేకరణ మొదలు, రక్తశుద్ధి, నిల్వ, నిర్వహణలో అనేక లోపాలున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి మూడు మాసాలకోసారి వీటిని తనిఖీ చేసి ఎప్పటికప్పుడు వాటిని గాడిలో పెట్టాల్సిన డ్రగ్‌ కంట్రోల్‌ బోర్డు ఇన్‌స్పెక్టర్లు కనీసం ఆరు మాసాలకు ఒకసారి కూడా అటు వైపు వెళ్లక పోవడంతో ప్రైవేటు రక్తనిధి కేంద్రాల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో బాటిల్‌పై రూ.1200 నుంచి రూ.2000 వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

తలసేమియా బాధితుల వేదన
తలసేమియా చిన్నారులకు రక్తం కరువైంది. పురానీహవేలీలోని తలసేమియా అండ్‌ సికిల్‌ సెల్‌ సొసైటీ, బ్లడ్‌ బ్యాంక్‌లో రక్తం నిండుకుంది. దాతలెవరూ ముందుకు రాకపోవడంతో రక్తం సమస్య తలెత్తింది. దీంతో చిన్నారుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోంది. రక్తంలో ఎర్ర రక్త కణాలు (ఆర్‌బీసీ) తగ్గిపోయి...ఇక వాటి ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయినప్పుడు తలసేమియా వ్యాధి వస్తుంది. తలసేమియాతో బాధపడే చిన్నారులకు 3 వారాలకు ఒకసారి బ్లడ్‌ ట్రాన్స్‌ఫ్యూజన్‌ చేయాలి. ఇక్కడి సొసైటీ కార్యాలయంలో 2 వేలకు పైగా తలసేమియా చిన్నారులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. రోజుకు 30–40 యూనిట్ల రక్తం అవసరం. ఇంత పెద్ద మొత్తంలో రక్తం అందుబాటులో లేకపోవడంతో చిన్నారుల తల్లిదండ్రులతో పాటు సొసైటీ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధ్యమైనంత వెంటనే రక్తదాతలు ముందుకు వచ్చి తమ రక్తాన్ని దానం చేయకపోతే పరిస్థితులు విషమిస్తాయని...రక్తదానం చేయడానికి యువకులు స్వచ్చందంగా ముందుకు రావాలని సొసైటీ సభ్యులు కోరుతున్నారు. చిన్నారుల జీవితాలను కాపాడడానికి ఈ సొసైటీ ప్రత్యేకంగా బ్లడ్‌ ట్రాన్స్‌ఫ్యూజన్, బ్లడ్‌ బ్యాంక్‌లను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి కూడా తలసేమియా బాధితులు ఇక్కడికి వస్తుంటారు.  

రక్తదానం చేయడానికిముందుకు రండి...
పురానీహవేళీలోని తలసేమియా అండ్‌ సికిల్‌ సెల్‌ సొసైటీ బ్లడ్‌ బ్యాంక్‌ ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. రక్తాన్ని దానం చేయడానికి దాతలు ఎప్పుడైనా రావచ్చని నిర్వాహకులు కోరుతున్నారు. మరిన్ని వివరాలకు 8885534913, 040–24520159 ఫోన్‌ నెంబర్లలో సంప్రదించవచ్చు.

తలసేమియా బాధితులను ఆదుకోండి
రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతం10 కంటే ఎక్కువ ఉన్న వారు రక్తం దానం చేయొచ్చు. ఆసక్తి ఉన్న వారు ఎన్ని సార్లయినా దానం చేయవచ్చు. 18 నుంచి 60 ఏళ్ల వయసులోని వారు ప్రతి ఆరు మాసాలకు ఒక సారి రక్తాన్ని ఇవ్వొచ్చు. సేకరించిన రక్తాన్ని 120 రోజుల్లో విధిగా వినియోగించాలి. లేదంటే పాడై పోయే ప్రమాదం ఉంది. యువత రక్తదానంకు ముందుకు రావాలి. తలసేమియా చిన్నారులను ఆదు కోవాలి.   
– అలీమ్‌బేగ్, జాయింట్‌ సెక్రటరీ,తలసేమియా సికిల్‌ సెల్‌ సొసైటీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement