Talasemiya disease
-
తలసేమియా నివారణకు గ్లోబల్ అలయన్స్ కృషి
చికాగో: ప్రపంచం ఎయిడ్స్ వ్యాధి నివారణ దినోత్సవం (డిసెంబర్ 1) సందర్భంగా.. తలసేమియా, సికిల్ సెల్ వ్యాధులను నివారించటం కోసం అమెరికాకు చెందిన గ్లోబల్ స్ట్రాటజిక్ అలయన్స్ సంస్థ అవగాహన కార్యక్రమాలను నిర్వహించింది. చికాగోలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్లోబల్ స్ట్రాటజిక్ అలయన్స్ చైర్మన్ డాక్టర్ విజయ్ ప్రభాకర్ మాట్లాడుతూ.. తలసేమియా, సికిల్ సెల్ వ్యాధుల బారిన పడిన చిన్నారులకు చికిత్స అందించటం కోసం విరాళాలు సేకరిస్తున్నామని తెలిపారు. సికిల్‌సెల్ వ్యాధి రూపుమాపడానికి ‘ఎండ్‌తాల్‌నౌ’ పనిచేస్తోందని విజయ్ ప్రభాకర్ తెలిపారు. ‘ఎండ్‌తాల్‌నౌ’ అంటే తలసేమియాను అంతమొందించడమే అని ఆయన పేర్కొన్నారు. ఇక తలసేమియా వ్యాధిని నివారించడానికి సహదేవ్ పౌండేషన్ విరాళాలు సేకరించిందని ‘ఎండ్‌తాల్‌నౌ’ సహ వ్యవస్థాపకుడు ప్రదీప్ కండిమల్లా కొనియాడారు. తలసేమియా వ్యాధిని నివారించడానికి 10,000 మంది రక్త దానం చేశారని పేర్కొన్నారు. భారీ ఎత్తున రక్తదానం చేయటంతో గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు లభించిందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ నర్మదా కుప్పుస్వామి మాట్లాడుతూ.. సికిల్ సెల్ వ్యాధిని అంతమొందించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. తలసేమియా వ్యాధి బారిన పడిన చిన్నారులు పదేళ్లు కూడా బతకలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఎమిరేట్స్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రకాశం టాటా మాట్లాడుతూ.. ‘ఎండ్‌తాల్‌నౌ’ చేస్తున్న సేవలను అభినందించారు. చిన్నారులను రక్షించడమే ‘ఎండ్‌తాల్‌నౌ’ లక్ష్యమన్నారు. ఇక గ్లోబల్ స్ట్రాటజిక్ అలయన్స్ (జీఎస్ఏ) ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ అజిత్ సింగ్ మాట్లాడుతూ.. జీఎస్ఏ ప్రతి ఏడాది డిసెంబర్ 1న తలసేమియా వ్యాధి నివారించడానికి ప్రత్యేక కార్యక్రమాలను రూపొందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ తెలుగు సంగీత గాయకులు ప్రవీణ్ జలగామ, ఆయన తనయుడు శిశిర్ రాఘవ జలగామ తమ సంగీతం ద్వారా తలసేమియా వ్యాధి నివారించడానికి కృషి చేస్తున్నారని తెలిపారు. కాగా ఈ కార్యక్రమాన్ని అశోక్ పగడాలా నిర్వహించగా.. స్వదేశ్ మీడియాకు చెందిన ఉగందర్ నగేష్, సాయి రవిసురుబొట్ల, చార్లెస్ రూటెన్‌బర్గ్ రియాల్టీ ఆఫ్ సొల్యూషన్స్, ప్రొఫెషనల్ మోర్ట్గేజ్ సొల్యూషన్స్, అశోక్ లక్ష్మణన్, సంతిగ్రమ్ కేరళ ఆయుర్వేద నేపర్‌విల్లే, డాక్టర్ సుద్దేశ్వర్ గుబ్బా, అనికా దుబేలు స్పాన్సర్లుగా వ్యవహరించారు. -
రక్త కన్నీరు!
నగరంలో రక్తనిధి కేంద్రాలన్నీ ఖాళీ అయ్యాయి. ఆపదలో బ్లడ్ బ్యాంక్‌లకు వెళ్లిన వారికి నిరాశే మిగులుతోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని బ్లడ్ బ్యాంకులు, స్వచ్ఛంద సంస్థలు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసినా..ఆశించిన స్థాయిలో దాతలు ముందుకు రావడం లేదు. దీంతో వివిధ ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులు, పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణులు, తలసేమియా బాధితులకు సకాలంలో రక్తం దొరక్క తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నారాయణగూడలోని ఐపీఎం సహా నగరంలోని అన్ని ప్రధాన ఆస్పత్రుల్లోని రక్తనిధి కేంద్రాల్లో నిల్వలు నిండుకోవడంతో రోగుల్లో ఆందోళన మొదలైంది. ఇదిలా ఉంటే గాంధీ గైనకాలజీ విభాగం వైద్యుల నిర్లక్ష్యం మూలంగా సుమారు 270 యూనిట్ల రక్తం ఎందుకూ పనికిరాకుండా పోయింది. సాక్షి, సిటీబ్యూరో/చార్మినార్: రక్త నిధి కేంద్రాల్లో రక్తం నిల్వలు నిండుకున్నాయి. నారాయణగూడలోని ఐపీఎం సహా నగరంలోని అన్ని ప్రధాన ఆస్పత్రుల్లో రక్తనిధి కేంద్రాల్లో నిల్వలు నిండుకోవడంతో రోగుల్లో ఆందోళన మొదలైంది. మరో వైపు గాంధీ గైనకాలజీ విభాగం వైద్యుల నిర్లక్ష్యం మూలంగా సుమారు 270 యూనిట్ల రక్తం ఎందుకు పనికిరాకుండా పోయింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రసవానికి ముందు వైద్యుల సలహా మేరకు రోగులు తెచ్చుకున్న దానిలో వినియోగం కాకుండా మిగిలిపోయిన ప్యాకెట్లను రక్తనిధి కేంద్రంలో భద్రపరచాల్సి ఉండగా, వైద్యులు పట్టించుకోకపోవడంతో అది ఎందుకూ పనికిరాకుండా పోయింది. ఈ అంశంపై సంబంధిత విభాగం వైద్యులకు నోటీసులు జారీ చేయడంతో సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆస్పత్రి సూపరింటిండెంట్ డాక్టర్ శ్రావణ్‌కుమార్ తెలిపారు. రక్తదానం తగ్గింది ఇంటర్మీడియట్, డిగ్రీ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించడం, పరీక్షల సీజన్ కావడంతో ఇంజనీరింగ్ విద్యార్థులు రక్తాన్ని దానం చేసేందుకు ముందుకు రావడం లేదు. వీరితో పాటు రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారితో పాటు ప్రసవం కోసం వచ్చిన మహిళలకు రక్తం అవసరం. అధిక రక్తస్త్రావంతో బాధపడుతున్న వీరికి చికిత్సల సమయంలో రెండు నుంచి మూడు యూనిట్ల రక్తం అవసరం ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో డాక్టర్ రాసి ఇచ్చిన చీటీ తీసుకుని బాధితుని బంధువులు ఆయా రక్తనిధి కేంద్రాల వద్దకు వెళ్తే, తీరా అక్కడ స్టాకు లేదంటున్నారు. ఒక వేళ ఉన్నా..బాధితుని బంధువుల్లో ఎవరో ఒకరు రక్తదానం చేస్తేకానీ అవసరమైన గ్రూపు రక్తాన్ని ఇవ్వబోమంటూ మెలిక పెడుతున్నారు. ప్రైవేటు బ్లడ్‌బ్యాంకులు దాతల నుంచి సేకరించిన రక్తంలో 30 శాతం ఉస్మానియా బ్లడ్‌బ్యాంక్‌కు సరఫరా చేయాలనే నిబంధన ఉన్నా పట్టించుకోవడం లేదు. గాడిన పెట్టే వ్యవస్థ ఏదీ..? నగరంలో 55 బ్లడ్‌బ్యాంకులు ఉండగా, ఔషధ నియంత్రణశాఖ రికార్డుల్లో ఈ సంఖ్య 61 నమోదైంది. ఇందులో 21 బ్లడ్‌బ్యాంకులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉండగా, మిగిలినవి ప్రైవేటు ఆసుపత్రులు, స్వచ్చంద సంస్థల ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లోని రోగులకు తక్కువ ధరకే రక్తాన్ని అందించాల్సిన బ్లడ్‌బ్యాంకులు సంపాదనే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. రక్త సేకరణ మొదలు, రక్తశుద్ధి, నిల్వ, నిర్వహణలో అనేక లోపాలున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి మూడు మాసాలకోసారి వీటిని తనిఖీ చేసి ఎప్పటికప్పుడు వాటిని గాడిలో పెట్టాల్సిన డ్రగ్ కంట్రోల్ బోర్డు ఇన్స్పెక్టర్లు కనీసం ఆరు మాసాలకు ఒకసారి కూడా అటు వైపు వెళ్లక పోవడంతో ప్రైవేటు రక్తనిధి కేంద్రాల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో బాటిల్‌పై రూ.1200 నుంచి రూ.2000 వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తలసేమియా బాధితుల వేదన తలసేమియా చిన్నారులకు రక్తం కరువైంది. పురానీహవేలీలోని తలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ, బ్లడ్ బ్యాంక్‌లో రక్తం నిండుకుంది. దాతలెవరూ ముందుకు రాకపోవడంతో రక్తం సమస్య తలెత్తింది. దీంతో చిన్నారుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోంది. రక్తంలో ఎర్ర రక్త కణాలు (ఆర్బీసీ) తగ్గిపోయి...ఇక వాటి ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయినప్పుడు తలసేమియా వ్యాధి వస్తుంది. తలసేమియాతో బాధపడే చిన్నారులకు 3 వారాలకు ఒకసారి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయాలి. ఇక్కడి సొసైటీ కార్యాలయంలో 2 వేలకు పైగా తలసేమియా చిన్నారులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. రోజుకు 30–40 యూనిట్ల రక్తం అవసరం. ఇంత పెద్ద మొత్తంలో రక్తం అందుబాటులో లేకపోవడంతో చిన్నారుల తల్లిదండ్రులతో పాటు సొసైటీ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధ్యమైనంత వెంటనే రక్తదాతలు ముందుకు వచ్చి తమ రక్తాన్ని దానం చేయకపోతే పరిస్థితులు విషమిస్తాయని...రక్తదానం చేయడానికి యువకులు స్వచ్చందంగా ముందుకు రావాలని సొసైటీ సభ్యులు కోరుతున్నారు. చిన్నారుల జీవితాలను కాపాడడానికి ఈ సొసైటీ ప్రత్యేకంగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, బ్లడ్ బ్యాంక్‌లను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి కూడా తలసేమియా బాధితులు ఇక్కడికి వస్తుంటారు. రక్తదానం చేయడానికిముందుకు రండి... పురానీహవేళీలోని తలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. రక్తాన్ని దానం చేయడానికి దాతలు ఎప్పుడైనా రావచ్చని నిర్వాహకులు కోరుతున్నారు. మరిన్ని వివరాలకు 8885534913, 040–24520159 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు. తలసేమియా బాధితులను ఆదుకోండి రక్తంలో హిమోగ్లోబిన్ శాతం10 కంటే ఎక్కువ ఉన్న వారు రక్తం దానం చేయొచ్చు. ఆసక్తి ఉన్న వారు ఎన్ని సార్లయినా దానం చేయవచ్చు. 18 నుంచి 60 ఏళ్ల వయసులోని వారు ప్రతి ఆరు మాసాలకు ఒక సారి రక్తాన్ని ఇవ్వొచ్చు. సేకరించిన రక్తాన్ని 120 రోజుల్లో విధిగా వినియోగించాలి. లేదంటే పాడై పోయే ప్రమాదం ఉంది. యువత రక్తదానంకు ముందుకు రావాలి. తలసేమియా చిన్నారులను ఆదు కోవాలి. – అలీమ్‌బేగ్, జాయింట్ సెక్రటరీ,తలసేమియా సికిల్ సెల్ సొసైటీ -
సిటీ ‘కొత్వాల్’ రూప్ అరోన!
♦ తలసేమియా బాధితుడి కలను నిజం చేసిన ‘మేక్ ఏ విష్’ ♦ సీఎం అపాయింట్మెంట్ కావాలి: పుష్ప జైన్ మంగళవారం సాయంత్రం 5.15 గంటలు... బషీర్‌బాగ్‌లోని పోలీసు కమిషనర్ కార్యాలయం... అప్పుడే ఆగిన వాహనం నుంచి ‘కొత్త కొత్వాల్’ దిగారు... హుందాగా సెల్యూట్ చేయడంతో పాటు ‘సలామే సస్త్ర్’ స్వీకరించారు... ఐదో అంతస్తులోకి వెళ్లిన ఆయన పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు... ఆపై కాన్ఫరెన్స్ హాల్‌కు వచ్చి మీడియాను ఉద్దేశించి తన ప్రాధాన్యతలను చెప్పారు సాక్షి, హైదరాబాద్: తలసేమియా వ్యాధితో బాధపడుతూ పోలీసు కావాలనే బలమైన ఆకాంక్ష ఉన్న సూర్యాపేటకు చెందిన ఎనిమిదేళ్ల బాలుడు మడిపల్లి రూప్ అరోనా కోరిక తీరిందిలా. నగరానికి చెందిన మేక్ ఏ విష్ ఇండియా ఫౌండేషన్ కృషి, నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి చొరవతో ఒక రోజు కొత్వాల్‌గా పనిచేయాలన్న ఆ బాలుడి కల మంగళవారం సాకారమైంది. నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన మాజీ కౌన్సిలర్ విక్రమ్, రంజితల కుమారుడు రూప్‌కు మూడేళ్ల వయసులో తలసేమియా ఉన్నట్లు బయటపడింది. అప్పటి నుంచి ప్రతి రెండుమూడు వారాలకూ రక్త మార్పిడి తప్పనిసరి కావడంతో ఆ బాలుడిని హైదరాబాద్ పురానీహవేలీలోని తలసేమియా అండ్ సిక్ సెల్ సొసైటీలో చేర్చారు. అక్కడకు వెళ్లిన ‘మేక్ ఏ విష్’ ప్రతినిధులతో ఆ బాలుడు తన ‘కొత్వాల్’ ఆకాంక్షను వ్యక్తం చేశాడు. సంస్థకు చెందిన ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ డాక్టర్ పుష్పా దేవీ జైన్ విషయాన్ని పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన ఆమోదంతో మంగళవారం రూప్ ఒక రోజు పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. కొత్వాల్‌గా మీ ప్రాధాన్యం ఏమిటని విలేకరులు అడుగగా... ‘టు మెయిన్టైన్ ద లా అండ్ ఆర్డర్’ అంటూ హుందాగా బదులిచ్చాడు. ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కావాలి.. రూప్ కోరిక తీర్చిన పోలీసు కమిషనర్‌కు ధన్యవాదాలు. కొంతకాలంగా సీఎం అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నాం. ఆయన్ను కలవాలని, ఒకరోజు ముఖ్యమంత్రిగా పనిచేయాలనే కోరికలతో ఆరుగురు పిల్లలు ఎదురు చూస్తున్నారు. అలానే హీరోలు మహేష్‌బాబు, పవన్ కల్యాణ్‌లను కలవడం కోసం కొందరు ఆర్తిగా వేచి ఉన్నారు. - పుష్పా దేవి, మేక్ ఏ విష్ మనలానే మామూలు మనిషి కావాలి... తన ఆకాంక్ష తీరినందున రూప్ ఉత్సాహంగా ఉండి, పూర్తిగా కోలుకుని.. ఆరోగ్యవంతుడు కావాలి. గత ఏడాది ఇలానే సాదిక్ అనే బాలుడి కోరిక తీర్చాం. ఇలాంటి అవకాశాలు హైదరాబాద్ సిటీ పోలీసుకు దక్కడం ఆనందంగా ఉంది. - మహేందర్‌రెడ్డి, కొత్వాల్ మేనరిక వివాహాలు వద్దు... మేనరిక, రక్తసంబంధ వివాహాలు చేసుకుంటే తలసేమియా వంటి వ్యాధులు వస్తాయి. సాధ్యమైనంత వరకు వీటికి దూరంగా ఉండాలి. ఈ వ్యాధిగ్రస్తులకు నిత్యం రక్తమార్పిడి తప్పనిసరి. వేసవిలో రక్తం కొరత ఉంటోంది. దాతలు ఆ సమయంలో ముందుకు రావాలి. ప్రభుత్వం సైతం స్పందించి ప్రతి జిల్లాకు ఒక రక్త మార్పిడి కేంద్రం (సెలైన్ వాష్ బ్లడ్ ట్రాన్స్మిషన్ సెంటర్) ఏర్పాటు చేస్తే అందరికీ ఉపయుక్తం. - విక్రమ్, రూప్ తండ్రి