సిటీ ‘కొత్వాల్’ రూప్ అరోన!
♦ తలసేమియా బాధితుడి కలను నిజం చేసిన ‘మేక్ ఏ విష్’
♦ సీఎం అపాయింట్‌మెంట్ కావాలి: పుష్ప జైన్
మంగళవారం సాయంత్రం 5.15 గంటలు...
బషీర్‌బాగ్‌లోని పోలీసు కమిషనర్ కార్యాలయం...
అప్పుడే ఆగిన వాహనం నుంచి ‘కొత్త కొత్వాల్’ దిగారు...
హుందాగా సెల్యూట్ చేయడంతో పాటు ‘సలామే సస్త్ర్’ స్వీకరించారు...
ఐదో అంతస్తులోకి వెళ్లిన ఆయన పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు...
ఆపై కాన్ఫరెన్స్ హాల్‌కు వచ్చి మీడియాను ఉద్దేశించి తన ప్రాధాన్యతలను చెప్పారు
సాక్షి, హైదరాబాద్: తలసేమియా వ్యాధితో బాధపడుతూ పోలీసు కావాలనే బలమైన ఆకాంక్ష ఉన్న సూర్యాపేటకు చెందిన ఎనిమిదేళ్ల బాలుడు మడిపల్లి రూప్ అరోనా కోరిక తీరిందిలా. నగరానికి చెందిన మేక్ ఏ విష్ ఇండియా ఫౌండేషన్ కృషి, నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి చొరవతో ఒక రోజు కొత్వాల్‌గా పనిచేయాలన్న ఆ బాలుడి కల మంగళవారం సాకారమైంది. నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన మాజీ కౌన్సిలర్ విక్రమ్, రంజితల కుమారుడు రూప్‌కు మూడేళ్ల వయసులో తలసేమియా ఉన్నట్లు బయటపడింది.
అప్పటి నుంచి ప్రతి రెండుమూడు వారాలకూ రక్త మార్పిడి తప్పనిసరి కావడంతో ఆ బాలుడిని హైదరాబాద్ పురానీహవేలీలోని తలసేమియా అండ్ సిక్ సెల్ సొసైటీలో చేర్చారు. అక్కడకు వెళ్లిన ‘మేక్ ఏ విష్’ ప్రతినిధులతో ఆ బాలుడు తన ‘కొత్వాల్’ ఆకాంక్షను వ్యక్తం చేశాడు. సంస్థకు చెందిన ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ డాక్టర్ పుష్పా దేవీ జైన్ విషయాన్ని పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన ఆమోదంతో మంగళవారం రూప్ ఒక రోజు పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. కొత్వాల్‌గా మీ ప్రాధాన్యం ఏమిటని విలేకరులు అడుగగా... ‘టు మెయిన్‌టైన్ ద లా అండ్ ఆర్డర్’ అంటూ హుందాగా బదులిచ్చాడు.
ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ కావాలి..
రూప్ కోరిక తీర్చిన పోలీసు కమిషనర్‌కు ధన్యవాదాలు. కొంతకాలంగా సీఎం అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తున్నాం. ఆయన్ను కలవాలని, ఒకరోజు ముఖ్యమంత్రిగా పనిచేయాలనే కోరికలతో ఆరుగురు పిల్లలు ఎదురు చూస్తున్నారు. అలానే హీరోలు మహేష్‌బాబు, పవన్ కల్యాణ్‌లను కలవడం కోసం కొందరు ఆర్తిగా వేచి ఉన్నారు.
- పుష్పా దేవి, మేక్ ఏ విష్
మనలానే మామూలు మనిషి కావాలి...
తన ఆకాంక్ష తీరినందున రూప్ ఉత్సాహంగా ఉండి, పూర్తిగా కోలుకుని.. ఆరోగ్యవంతుడు కావాలి. గత ఏడాది ఇలానే సాదిక్ అనే బాలుడి కోరిక తీర్చాం. ఇలాంటి అవకాశాలు హైదరాబాద్ సిటీ పోలీసుకు దక్కడం ఆనందంగా ఉంది.
- మహేందర్‌రెడ్డి, కొత్వాల్
మేనరిక వివాహాలు వద్దు...
మేనరిక, రక్తసంబంధ వివాహాలు చేసుకుంటే తలసేమియా వంటి వ్యాధులు వస్తాయి. సాధ్యమైనంత వరకు వీటికి దూరంగా ఉండాలి. ఈ వ్యాధిగ్రస్తులకు నిత్యం రక్తమార్పిడి తప్పనిసరి. వేసవిలో రక్తం కొరత ఉంటోంది. దాతలు ఆ సమయంలో ముందుకు రావాలి. ప్రభుత్వం సైతం స్పందించి ప్రతి జిల్లాకు ఒక రక్త మార్పిడి కేంద్రం (సెలైన్ వాష్ బ్లడ్ ట్రాన్స్‌మిషన్ సెంటర్) ఏర్పాటు చేస్తే అందరికీ ఉపయుక్తం. - విక్రమ్, రూప్ తండ్రి