విరివిగా రక్తదానం చేయొచ్చు
న్యూఢిల్లీ: ప్రజలు క్యాన్సర్, గుండెపోటుకు దూరంగా ఉండేందుకు క్రమం తప్పకుండా రక్తదానం చేయొచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ పేర్కొన్నారు. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా శనివారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. తరచుగా రక్తదానం చేయవచ్చని అన్నారు. ‘‘వైద్య పరిశోధనల ప్రకారం... తరచుగా రక్తదానం చేసే వారికి గుండెపోటు, క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం 80 శాతం తక్కువ’’ అని చెప్పారు. రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి మొదటగా తానే రక్తదానం చేశారు. రాష్ట్ర రక్తమార్పిడి మండలి, ఔషధ మార్పిడి విభాగం, ఇంద్రప్రస్థ అపోలో ఆస్పత్రి, బ్లడ్ ఫర్ ఆల్ అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఎయిడ్స్ నియంత్రణ విభాగం ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా మంత్రి హర్షవర్ధన్ మాట్లాడుతూ, వచ్చే రెండేళ్లలో దేశంలోని అన్ని జిల్లాల్లో బ్లడ్ బ్యాంక్‌లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆరోగ్యంగా ఉన్న పౌరులందరూ ఏడాదికి నాలుగుసార్లు రక్తదానం చేయాలని విజ్ఞప్తి చేశారు. అపోలో ఆస్పత్రికి చెందిన ఔషధ మార్పిడి విభాగం డెరైక్టర్ ఆర్‌ఎన్ మక్రూ మాట్లాడుతూ, దేశంలో ఏడాదికి 10 నుంచి 11 మిలియన్ యూనిట్ల రక్తం అవసరమని, కానీ 8.5 నుంచి 9 మిలియన్ యూనిట్ల రక్తం మాత్రమే సేకరించగలుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వచ్ఛందంగా రక్తదానం చేసే వారి సంఖ్య 70 శాతం మాత్రమేనని, అది ఒక్కసారి మాత్రమే వారు ముందుకు వస్తున్నారని మక్రూ పేర్కొన్నారు.
నేడు వర్ధన్‌కు డీఎంఏ సన్మానం
తమ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ను ఆదివారం సన్మానిస్తామని ఢిల్లీ మెడికల్ అసోసియేషన్ (డీఎంఏ) తెలిపింది. నిష్కళంకుడు, సమర్థుడైన వర్ధన్ నగరవాసులకు సుపరిచితుడని, తమ సంస్థ పూర్వ అధ్యక్షులలో వర్ధన్ ఎంతో పేరు ప్రఖ్యాతులుగలవాడని డీఎంఏ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఎయిమ్స్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో సన్మాన కార్యక్రమం జరుగుతుందని పేర్కొంది.