పుట్టగొడుగుల్లా వెలుస్తున్న అక్రమ వాటర్ బాట్లింగ్ యూనిట్లు లెసైన్స్‌డ్ కంపెనీల లేబుళ్లను వినియోగిస్తూ అక్రమాలకు పాల్పడుతుండడమేగాక, నాణ్యత లేని నీరు సరఫరా చేస్తున్నాయి. సంబంధితశాఖల అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోకపోవడంతో ఇవి యథేచ్ఛగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.
న్యూఢిల్లీ: చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ నీటి ఎద్దడి కొనసాగుతుండగా, నగరవ్యాప్తంగా ఉన్న 10 వేల అక్రమ నీటి సీసాల యూనిట్లతో పరిస్థితి మరింత విషమిస్తోంది. ఇవి లెసైన్స్‌డ్ కంపెనీల లేబుళ్లను వినియోగిస్తూ అక్రమాలకు పాల్పడుతుండడమేగాక, నాణ్యత రహిత నీళ్లు అమ్ముతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నాయి. జాతీయ రాజధాని ప్రాంతంలో 64 సంస్థలకు మాత్రమే వాటర్ బాట్లింగ్ లెసైన్సులు ఉన్నాయని బాటిల్డ్ వాటర్ ప్రాసెసెర్ల సంఘం అధ్యక్షుడు పంకజ్ అగర్వాల్ అన్నారు. ‘ఈ వేల యూనిట్లు సరఫరా చేసే బాటిళ్ల పరిమాణం లెసైన్స్‌డ్ యూనిట్లు సరఫరా చేసేవాటికంటే చాలా ఎక్కువ. ఈ పరిణామం మమ్మల్ని మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
అక్రమ వాటర్ బాట్లింగ్ యూనిట్లన్నీ ఎక్కువగా మురికివాడలు, అనధికార కాలనీల్లో ఉంటున్నాయి. నీటి శుద్ధతకు సంబంధించిన ఎటువంటి ప్రమాణాలనూ ఇవి పాటించడం లేదు. ఇరుకు ప్రాంతాల్లో ఉండడం వల్ల అధికారుల తనిఖీల నుంచి తప్పించుకుంటున్నాయి’ అని అగర్వాల్ వివరించారు. పశ్చిమ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఇటీవల సరఫరా చేసిన నీటి డ్రముల్లో బొద్దింకలు కనిపించడంతో అధికారులు దిగ్భ్రాంతికి గురయ్యారు. దీనిపై విచారణ నిర్వహించగా సరఫరాదారుడు అక్రమ వాటర్ బాట్లింగ్ యూనిట్ యజమాని అని తేలింది.
రికార్డుల్లో సదరు సంస్థ వివరాలు లేకపోవడంతో దాని చిరునామాను కూడా కనుక్కోలేకపోయారు. నోయిడాలోని ఒక మీడియా సంస్థకు సరఫరా చేసిన నీటిలోనూ పురుగులు కనిపించాయి. ‘రాజధానిలోనే పరిస్థితి ఇలా ఉంటే.. దేశంలోని మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటి ? అయితే ఈ సమస్యపై మా దగ్గర అధికారిక వివరాలు ఏవీ లేవు. ఇలా అక్రమంగా నడుస్తున్న వాటర్ బాట్లింగ్ యూనిట్ల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం మాకు అందజేయాలి. అప్పుడే మేం దీనిపై ఏమైనా చేయగలుగుతాం. ఇలాంటి పరిశ్రమల మూసివేత కోసం కఠిన నిబంధనలను అమలు చేస్తాం’ అని కేంద్ర వైద్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు.
ఢిల్లీవ్యాప్తంగా దాదాపు 10 వేలకుపైగానే అక్రమ వాటర్ బాట్లింగ్ యూనిట్లు ఉండవచ్చని ఉత్తరఢిల్లీ మేయర్ యోగేంద్ర చందోలియా అన్నారు. చాలా ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఉంది కాబట్టి ఇలాంటి వ్యాపారాలు బాగా లాభసాటిగా ఉంటాయని తెలిపారు. ‘ఈ ఏడాది మేం నిర్వహించిన సర్వేలో.. ఉత్తర ఢిల్లీలోనే దాదాపు రెండువేల మంది అక్రమంగా వాటర్ బాట్లింగ్ యూనిట్లు నడిపిస్తూ మాకు చిక్కారు. అయినా వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దీంతో వాళ్లంతా స్వేచ్ఛగా మళ్లీ వ్యాపారాలు కొనసాగించారు’ అని వివరించారు.
బ్యూరో ఆఫ్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ప్రమాణాలు పాటించకుండా అక్రమంగా ఏర్పాటైన వాటర్ బాట్లింగ్ యూనిట్లన్నింటినీ మూసివేయించాలని ఢిల్లీ హైకోర్టు 2010 మేలోనే ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయినప్పటికీ ఈ దిశగా ప్రయత్నాలేవీ జరగలేదు. నిబంధనల ప్రకారం లెసైన్స్‌డ్ వాటర్ బాట్లింగ్ యూనిట్లన్నీ నీటిని పరీక్షించడానికి ల్యాబొరేటరీని ఏర్పాటు చేసి, అందులో రసాయనాలు, సూక్ష్మజీవులు ఉన్నదీ లేనిదీ నిర్ధారించాలి. ప్రతి వారం నివేదికలను బీఐఎస్‌కు పంపించాలి. ప్రభుత్వ లాబొరేటరీకి కూడా నీటి నమూనాలు పంపించాలి. లెసైన్సు ఫీజుగా ఏటా రూ.లక్ష చెల్లించాలి. అక్రమంగా ఏర్పాటైన వాటర్ బాట్లింగ్ యూనిట్లేవీ ఈ నిబంధనలను పాటించడం లేదని అగర్వాల్ తెలిపారు.
వాళ్ల దగ్గర కనీసం నీటి శుద్ధీకరణ పరికరాలు కూడా లేవన్నారు. ‘లెసైన్స్‌డ్ వాటర్ బాట్లింగ్ సంస్థలు రోజుకు 10 వేల వరకు నీటి సీసాలు అమ్ముతుండగా, అక్రమ వాటర్ బాట్లింగ్ యూనిట్లు ఏకంగా 40 వేల సీసాల దాకా అమ్ముతున్నాయి. ఇది మాకు మరింత ఆందోళన కలిగి స్తోంది. గత రెండేళ్లలో ఇలాంటి యూనిట్ల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది’ అని తెలిపారు. నగరంలో అక్రమంగా ఏర్పాటైన వాటర్ బాట్లింగ్ యూనిట్లలో 50 శాతం అర్జున్‌నగర్, ద్వారక, జామియా నగర్ తదితర ప్రాంతాల్లో ఉన్నాయి. చిన్న చిన్న గదులు, ఇళ్లలో వీటిని ఏర్పాటు చేశారు. ప్రభుత్వానికి పైసా అయినా చెల్లించకుండానే వీటి యజమానులు నీటి సీసాలను యథేచ్ఛగా విక్రయిస్తున్నారని నోయడాలో డైమండ్ డ్యూ పేరుతో లెసైన్స్‌డ్ వాటర్ బాట్లింగ్ యూనిట్ నిర్వహించే రాకేశ్ కుమార్ సూరి అన్నారు.
ఈ యూనిట్లు నాణ్యత లేని నీరు సరఫరా చేయడమేగాక, కనీసం 15 శాతం అమ్మకపు పన్నును కూడా చెల్లించడం లేదని చెప్పారు. నిర్జన ప్రాంతాల్లో సీసాలు తయారు చేస్తారు కాబట్టి కరెంటు బిల్లుల బెడద కూడా లేదని సూరి వివరించారు. భూగర్భ జలాలను వినియోగించేందుకు వాటర్ బాట్లింగ్ యూనిట్లన్నీ లెసైన్సులను రిన్యూవల్ చేయించుకోవాలని కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధన లెసైన్స్‌డ్ యూని ట్లకు మాత్రమే వర్తిస్తుందని, అక్రమంగా ఏర్పాటైన వారు పైసా కూడా చెల్లించబోరని అగర్వాల్ తెలిపారు. లెసైన్స్‌డ్ వాటర్ బాట్లింగ్ యూనిట్‌కు కనీసం రూ.2-3 కోట్ల వరకు వ్యయమవుతుంది. దీనికితోడు భారీ ఎత్తున పన్నులు చెల్లించాలి. సంబంధిత అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోనంత వరకు ఇలాంటి అక్రమ సంస్థలు ప్రజారోగ్యంతో ఆటలాడుకుంటూనే ఉంటాయని అగర్వాల్ ముక్తాయించారు.
ప్రజారోగ్యంతో పరాచికం
Published Sun, Sep 7 2014 10:22 PM | Last Updated on Sat, Sep 2 2017 1:01 PM
Advertisement