న్యూఢిల్లీ: సమగ్ర వ్యాధి నిరోధక కార్యక్రమం(యూఐపీ)ని దేశవ్యాప్తంగా విస్తరించాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా మరణిస్తున్న పిల్లల్లో 95 శాతం మందిని కాపాడుకునే అవకాశమున్నా కాపాడుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాధినిరోధక కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా దాదాపు పిల్లలకు వచ్చే 80 శాతం వ్యాధులను అడ్డుకోవచ్చని చెప్పారు. డయేరియాకు కారణమయ్యే రోటా వైరస్‌పై నగరంలో జరిగిన 11వ అంతర్జాతీయ సదస్సును ప్రారంభించిన మంత్రి అనంతరం దేశంలోని ప్రజల ఆరోగ్య స్థితిపై మాట్లాడారు.
పజల్లో ఆరోగ్య స్పృహను కల్పించడం ద్వారా, మంచి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవాటు చేయడం ద్వారా 80 శాతం వ్యాధులను అడ్డుకోవచ్చన్నారు. పరిశోధనలు, ఆవిష్కరణలు జరిగినంత మాత్రాన వ్యాధులను అడ్డుకోలేమన్నారు. అయితే వ్యాధుల నియంత్రణ కోసం దేశంలో మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరముందని హర్షవర్ధన్ అభిప్రాయపడ్డారు. అదే సమయంలో వ్యాధులపట్ల, ఆరోగ్యకరమైన జీవన విధానంపట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక కార్యచరణ ప్రణాళికను రూపొందించే ప్రయత్నంలో ఉందని చెప్పారు.
అయితే రూపొందించే ప్రణాళికలు కేవలం కాగితాలకే పరిమితమయ్యేలా కాకుండా ప్రజలకు ఉపయోగకరంగా ఉండేలా తీర్చిదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ముఖ్యంగా తల్లీ, బిడ్డల ప్రాణాలను కాపాడేందుకు ప్రత్యేక కార్యచరణ అవసరమని, ఆ దిశగా ముందు విధివిధానాలు రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ఆరోగ్యశాఖ కార్యదర్శి లవ్ వర్మ మాట్లాడుతూ... డయేరియా నియంత్రణ కార్యక్రమం ఆగస్టు 8తో ముగిసిందని, పక్షం రోజులపాటు నిర్వహించిన ఈ కార్యక్రమం ఆశించిన స్థాయిలో అవగాహన కల్పించిందన్నారు. శిశు మరణాల్లో ఎక్కువ మంది డయేరియా కారణంగానే మరణిస్తున్నారని, రోటా వైరస్ వ్యాక్సినేషన్ వల్ల శిశుమరణాలు మరింత తగ్గే అవకాశముందన్నారు.
అవగాహనే అసలు మందు
Published Wed, Sep 3 2014 10:37 PM | Last Updated on Sat, Sep 2 2017 12:49 PM
Advertisement