సాక్షి, న్యూఢిల్లీ: గాంధీ జయంతి వేడుకలు ఈ ఏడాది విభిన్నంగా జరిగాయి. ప్రధానమంత్రి, మంత్రులు, ఎంపీలు, రాజకీయ నేతలు, అధికారులు... అంతా చీపుళ్లు పట్టారు. గాంధీజీ కలలు కన్నవిధంగా భారత్‌ను పరిశుభ్రమైన దేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వచ్ఛ్ భారత్ అభియాన్‌ని గురువారం ప్రారంభించడంతో వీవీఐపీల నుంచి మొదలుకుని సామాన్యుల వరకు అందరూ లాంఛనంగా చీపుళ్లు పట్టి ఈ కార్యక్రమానికి తమవంతు సహకారం అందించారు. వీధులు, పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలతోపాటు అనేక ప్రాంతాల్లో పారిశుధ్య కార్యక్రమాలు జరిగాయి.
ఇదో వరం లాంటిది: హర్షవర్ధన్
స్వచ్ఛ్ భారత్ అభియాన్ దాచిఉంచిన ఓ వరం లాంటిదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర ్ధన్ పేర్కొన్నారు. ‘స్వచ్ఛ్ భారత్ అభియాన్’లో భాగంగా లేడీ హార్డింగే ఆస్పత్రి ఆవరణలో గురువారం నిర్వహించిన పారిశుధ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ప్రత్యేకించి ఆరోగ్య మంత్రిత్వ శాఖకు ఇదో మంచిరోజు. ఇంకా చెప్పాలంటే దాచిఉంచిన వరం లాంటిది. కార్యాలయాలు, ఆవాసాల పరిసరాల్లో పారిశుధ్య కార్యక్రమాలను చేపట్టడం వల్ల వ్యాధులను నియంత్రించేందుకు వీలవుతుంది. ఇందువల్ల మన సొమ్మేమీ ఖర్చు కాదు. పారిశుధ్యం, ఆరోగ్య పరిరక్షణ ఏకకాలంలో జరిగిపోతుంటాయి’ అని అన్నారు. పోలియో నిర్మూలన కార్యక్రమం తొలుత జాతీయ రాజధాని నగరంలోనే ప్రారంభమైందని, ఆ తర్వాత అది దేశవ్యాప్తంగా అమలైందని అన్నారు. కాగా అంతకుముందు ఆయన తన మంత్రిత్వ శాఖ సిబ్బందితో స్వచ్ఛ్ భారత్ అభియాన్ ప్రతిజ్ఞ చేయించారు.
ఆంధ్రా ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో...
జనక్‌పురిలోని ఆంధ్రా ఎడ్యుకేషన్ సొసైటీ ఎన్‌టీ రామారావు మెమోరియల్ సీనియర్ సెకండరీ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా స్వచ్ఛ్ భారత్ అభియాన్‌లో పాలుపంచుకున్నారు. పాఠశాల వైస్ ప్రిన్సిపల్ లత ఆధ్వర్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు స్వచ్ఛ్ భారత్ ప్రతిజ్ఞచేసి తరగతి గదులతోపాటు పాఠశాల ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. ప్రసాద్‌నగర్‌లో: ప్రసాద్‌నగర్‌లోని ఆంధ్రా ఎడ్యుకేషన్ సొసైటీ డా. బి.వి. నాథ్ అండ్ టి. ఆర్ రావు మెమోరియల్ సీనియర్ సెకండరీ స్కూలులో గురువారం స్వచ్ఛ్ విద్యాలయ్, స్వచ్ఛ్ ఢిల్లీ కార్యక్రమం జరిగింది. మేనేజర్ ఐ.ఎస్. రావు, ప్రిన్సిపల్ ధనలక్ష్మి, వైస్‌ప్రిన్సిపల్ ఉమాపతినాయుడు ,ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి పాఠశాల ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. కాగా ఈ కార్యక్రమాన్ని నెల రోజులపాటు నిర్విహ స్తామని ఇకో క్లబ్ అధ్యక్షురాలు బి.వి. ప్రసన్నలక్ష్మి తెలిపారు.
మురుగుకాల్వను శుభ్రం చేసిన కేజ్రీవాల్
స్వచ్ ్ఛ భారత్ అభియాన్‌కు మద్దతు ఇస్తానని ప్రకటించిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ గురువారం ప్రధానమంత్రి నివాసం వద్ద నున్న ఓ కాలనీలో మురికికాలువను శుభ్రం చేశారు. దిగువ ఆదాయ వర్గాలు ఎక్కువగా నివసించే బీఆర్ క్యాంపులో ఆయన నాలాను శుభ్రం చేశారు. ఎన్‌డీఎంసీ పారిశుధ్య పనివారితో కలిసి నాలాను శుభ్రం చేసిన కేజ్రీవాల్ ఆ తరువాత వారితో కలిసి తేనీరు తాగారు. బీఆర్ క్యాంపు కేజ్రీవాల్ నియోజకవర్గమైన న్యూఢిల్లీ పరిధి కిందికి వస్తుంది. మిగతా ఆప్ శాసనసభ్యులు కూడా తమ తమ నియోజకవర్గాల్లో పారిశుధ్య కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఇక బీజేపీ నేతలు కూడా తమ కార్యకర్తలతో కలసి పారిశుధ్య పనుల్లో పాల్గొన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు, మూడు మున్సిపల్ కార్పొరేషన్ల కౌన్సిలర్లు, ఇంకా అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు స్వచ్ఛ్ భారత్ అభియాన్‌లో పాల్గొన్నారు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) తన డిపోలు, పరిసరాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టింది. ఢిల్లీ రవాణా సంస్థ (డీటీసీ) అధికారులు బస్టాపులతోపాటు షెల్టర్లలో పారిశుధ్య పనులు నిర్వహించారు. ు. జామియా మిలియా విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ తలత్ అహ్మద్ ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందితో స్వచ్ఛ్ భారత్ ప్రతిజ్ఞ చేయిం చారు. ఢిల్లీ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ దినేష్‌సింగ్ విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని గాంధీభవన్‌లో స్వచ్ఛ్ భారత్ అభియాన్‌ను ప్రారంభించారు.
కాగా, స్వచ్ఛ్ భారత్ అభియాన్‌లో ఢిల్లీ పోలీసు శాఖ, ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ), ఢిల్లీ జల్‌బోర్డు (డీజేబీ), ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్ తదితర ప్రభుత్వ సంస్థలు కూడా పాలుపంచుకున్నాయి. ఈ విషయమై ప్రభుత్వ కార్యదర్శి మాట్లాడుతూ స్వచ్ఛ్ భారత్ అభియాన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగించాలంటూ ప్రిన్సిపల్ సెక్రటరీలు, కార్యదర్శులు, అన్ని విభాగాల అధిపతులను ఆదేశించినట్టు తెలిపారు. తరచూ తాము తనిఖీలు చేపడతామన్నారు.
విభిన్నంగా గాంధీ జయంతి అందరి చేతిలో చీపురు
Published Thu, Oct 2 2014 10:41 PM | Last Updated on Sat, Sep 2 2017 2:17 PM
Advertisement