ప్రభుత్వ పాలనలో పారదర్శకత తీసుకువస్తానని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ అనుభవజ్ఞుల సలహాలతో ప్రజలకు ఉపయోగపడే విధానాలను రూపొందించి విజయవంతంగా
న్యూఢిల్లీ: ప్రభుత్వ పాలనలో పారదర్శకత తీసుకువస్తానని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ అనుభవజ్ఞుల సలహాలతో ప్రజలకు ఉపయోగపడే విధానాలను రూపొందించి విజయవంతంగా అమలుచేస్తామని ఆయన మంగళవారం మీడియాకు తెలిపారు. ఈ-గవర్నెన్స్‌కు ప్రాధాన్యత కల్పించి అవినీతి జరగకుండా చూస్తామని చెప్పారు. ప్రజలకు ఇబ్బంది కాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రాజెక్టులపై పట్టు బిగించేందుకు అధికారులతో సమావేశమవుతానని తెలిపారు. ‘ఆస్తుల కన్నా ఆరోగ్యం ప్రధానం. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవడం ప్రతి ప్రభుత్వ విధి.
ఇందుకోసం తానేమీ కార్యక్రమాలు చేపట్టాలనుకునే విషయాలు కొద్ది రోజుల్లోనే మీడియాకు వివరిస్తాన’ని హర్షవర్ధన్ తెలిపారు. ప్రజల ఆరోగ్యం కోసం సరికొత్త ప్రణాళికలతో తమ ప్రభుత్వం ముందుకు వెళుతుందని చెప్పారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఆరోగ్యం విషయంలో సరైన జాగ్రత్తలు పాటించడకపోవడం వల్ల చాలా మంది రోగాల బారిన పడుతున్నారని డాక్టర్ హర్షవర్ధన్ సింగ్ అన్నారు. ప్రజలకు అన్ని రోగాలపై అవగాహన కలిగించేలా కూడా వివిధ కార్య క్రమాలకు శ్రీకారం చుడుతామని వివరించారు. ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా తమ మంత్రిత్వ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. తన మంత్రిత్వ శాఖ చేపట్టే కార్యక్రమాలను ప్రజలకు తెలియజెప్పేందుకోసం మీడియాతో మాట్లాడుతానని వెల్లడించారు.
మంత్రులకు శాఖల కేటాయింపు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర మంత్రులకు శాఖలు కేటాయించారు. ఢిల్లీ నుంచి కేబినెట్‌లో చోటు దక్కించుకున్న ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ హర్షవర్ధన్‌కు ఊహించినట్లుగానే ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ లభించింది. స్వతంత్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన జనరల్ వీకేసింగ్‌కు ఈశాన్య ప్రాంత అభివృద్ధి, ప్రవాస భారతీయ వ్యవహారాల మంత్రిత్వశాఖ , రావ్ ఇందర్‌జీత్‌సింగ్‌కు ప్రణాళీకరణ, స్టాటిస్టిక్స్, కార్యక్రమాల అమలు స్వత ంత్ర శాఖలతో పాటు రక్షణ శాఖ (సహాయ మంత్రి) అప్పగించారు. కృష్ణపాల్‌కు రోడ్డు రవాణా, రహదారులు, నౌకాయాన సహాయ మంత్రిత్వ శాఖ కేటాయించారు. తమ శాఖ బాధ్యతలు చేపట్టిన వీరు దేశాభివృద్ధి కోసం సత్వర నిర్ణయాలు తీసుకోవడంతో పాటు ప్రజలకు ఉపయోగపడేలా పాలన సాగిస్తామన్నారు.