న్యూఢిల్లీ: విధుల్లో ఉన్న వైద్యులపై ఎవరు దాడి చేసినా.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ కోరారు. ఈ మేరకు ఆయన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులకు లేఖలు రాసినట్టు పీటీఐ వార్తాసంస్థ తెలిపింది. డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందిని దాడుల నుంచి రక్షించేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చే విషయాన్ని పరిశీలించాలని ఆయన ముఖ్యమంత్రులను కోరారు.
గతవారం కోల్‌కతా మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో 85 ఏళ్ల వ్యక్తి చనిపోవడంతో వారి బంధువులు ఆసుపత్రి సిబ్బందిపై దాడి చేసి.. దౌర్జన్యానికి దిగారు. ఈ ఘటనలో ఆసుపత్రి సిబ్బందితోపాటు పలువురు జూనియర్ డాక్టర్లకు గాయాలయ్యాయి. ఈ ఘటనల నేపథ్యంలో తమకు రక్షణ కల్పించాలని జూడాలు కోరగా.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సరిగా స్పందించకపోవడంతో వైద్యుల నిరసన తీవ్రతరమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వివాదం ఇంకా పెద్దది కాకుండా చూడాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ఇప్పటికే మమతకు సూచించారు. ఈ నేపథ్యంలోనే విధుల్లో ఉన్న వైద్యులకు తగిన రక్షణ కల్పించాలంటూ ఆయన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు.
మరోవైపు ఆందోళనకు దిగిన జూడాలను చర్చలకు మమత ప్రభుత్వం ఆహ్వానించగా జూడాలు ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. తమ ఉద్యమాన్ని నీరు గార్చే కుట్రలో భాగంగానే ఈ చర్చల నాటకం ఆడుతున్నారంటూ జూడాలు ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment