ఈయన పేరు ఎం.మధుసూదన్‌రావు, నెల్లూరు. రక్తదాన మోటివేటర్. కేవలం మోటివేటర్‌గానే కాకుండా క్రమం తప్పకుండా ప్రతి మూడు, నాలుగు నెలలకో దఫా రక్తదానం చేస్తున్నారు. ఇప్పటికే 110 దఫాలు రక్తదానం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచాడు.
ఈయన పేరు చంద్రగిరి అజయ్‌బాబు, నెల్లూరులోని పొదలకూరు రోడ్డులో నివాసం ఉంటున్నాడు. దూరప్రాంత గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ప్రస్తుతం బ్లడ్‌బ్యాంకు కన్వీనర్‌గా కూడా అదనపు బాధ్యతలు నిర్వరిస్తున్నాడు. పాఠశాలలో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాక ఇంటికి వెళ్లకుండా నేరుగా బ్లడ్ బ్యాంకుకే వస్తారు. అక్కడ బ్లడ్‌బ్యాంకులో స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నాడు. ఈయన ఇప్పటి వరకు 93 దఫాలుగా రక్తదానం చేసి పలువురికి స్ఫూర్తి దాయకంగా నిలిచాడు.
నెల్లూరు (అర్బన్): ప్రాణాపాయంలో క్షతగాత్రుల ఊపిరి నిలిపేందుకు అత్యవసరంగా రక్తం అందించాల్సి ఉంది. రక్తహీనతతో ఉన్న గర్భిణులు, ఇతర సర్జరీల సమయంలో రక్తం అవసరమైనప్పుడు, హీమోఫీలియో, తలసేమియా రోగులకు క్రమం తప్పకుండా రక్తం అందించాల్సి వచ్చినప్పుడు వారి ప్రాణాలు కాపాడేందుకు తామున్నామంటూ అనేక మంది స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్నారు. ప్రాణదాతలుగా నిలుస్తూ జిల్లాకు గుర్తింపు తెచ్చారు. ఎంతో మందికి స్ఫూర్తిదాతలు నిలుస్తున్నారు. భారతదేశంలో స్వచ్ఛంద రక్తదాన ఉద్యమానికి మార్గదర్శకుడు, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్ పితామహుడు డాక్టర్ జేజీ జోలి. ఆయన చేసిన పరిశోధనలు, కృషి వల్లనే అక్టోబర్ 1వ తేదీని జాతీయ రక్తదాన దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటిందింది.
డాక్టర్ జేజీ జోలి స్వచ్ఛంద రక్తదాన ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాడు. అదే స్ఫూర్తితో జిల్లాలో ఎంతో మంది స్వచ్ఛంద రక్తదాతలుగా మారారు. జిల్లాలో ఉన్న పలు బ్లడ్‌బ్యాంకులు రోగుల రక్త కొరత తీర్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. నగరంలో రెడ్‌క్రాస్‌తో పాటు నోవాబ్లడ్ బ్యాంకు, పెద్దాస్పత్రి, నారాయణ, అపోలో ఆస్పత్రిలో బ్లడ్ బ్యాంకులున్నాయి. అందులో రెడ్‌క్రాస్ బ్లడ్‌బ్యాంకు 90 శాతం వరకు రోగులను ఆదుకుంటుంది.
రాష్ట్రంలో మొదటి స్థానం.. దేశంలో రెండో స్థానం
1997లో రెడ్‌క్రాస్ సొసైటీ బ్లడ్‌బ్యాంకు పూర్తి స్థాయి వినియోగంలోకి వచ్చింది. నెల్లూరు రెడ్‌క్రాస్ బ్లడ్‌బ్యాంకు సేవలు రాష్ట్రంలో ప్రథమ, దేశంలో రెండో స్థానాల్లో నిలుస్తున్నాయి. కోవిడ్ సమయంలో వందలాది మంది కరోనా రోగులకు ప్లాస్మాదానం చేయడంలో దేశంలోనే మొదటి స్థానాన్ని జిల్లా రెడ్‌క్రాస్ బ్లడ్‌బ్యాంకు సాధించింది.
రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంకుకు 3 మొబైల్ వాహనాలు
జిల్లా రెడ్‌క్రాస్ బ్లడ్‌బ్యాంకు సేవలు బాగుండడంతో ఇటీవల రూ.1.25 కోట్లతో రెండు మొబైల్ వాహనాలను ఇండియన్ రెడ్‌క్రాస్–న్యూఢిల్లీ నెల్లూరుకు అందజేశారు. పదిరోజుల క్రితం వీటిని రాష్ట్రమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కలెక్టర్ చక్రధర్‌బాబు ప్రారంభించారు. జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం రూ.కోటి నిధులతో మరో మొబైల్ బస్సును ఇక్కడికి పంపారు. దీంతో మొత్తం రూ.2.25 కోట్లతో మూడు ఆధునిక మొబైల్ వాహనాలు నెల్లూరు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఈ మొబైల్ బస్సులో ఒకే దఫా ఐదుగురు రక్తదానం చేసేందుకు సీటింగ్, డాక్టర్‌కు రెస్ట్ రూం, పరీక్షలు చేసేందుకు, రక్తదానం చేసిన తర్వాత రెస్ట్ తీసుకునేందుకు వసతులు ఏర్పాటు చేశారు. సెంట్రలైజ్డ్ ఏసీని వాహనంలో ఏర్పాటు చేశారు.
గ్రామీణులు ముందుకు రావాలి
రక్తదానంపై అవగాహన అవసరం. దీంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రస్తుతం 1000 మందిలో ఐదుగురు మాత్రమే పట్టణాల్లో రక్తదానం చేస్తున్నారు. గ్రామీణులు పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు. రక్తదానం చేసేందుకు ముందుకు రావాలి. 1000 మందిలో కనీసం 15 మంది రక్తదానం చేసినప్పుడు కొరత తీరుతుంది. నేను 49 దఫాలు రక్తదానం చేశాను.
– మోపూరు భాస్కర్‌నాయుడు, నోవా బ్లడ్‌బ్యాంకు అడ్మినిస్ట్రేటర్
రక్తం కొరత ఉంది
ఎంతోమంది సభ్యులు స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్నారు. వారందరికీ వందనాలు. అయితే డెంగీ వంటి సీజనల్ వ్యాధులు ప్రబలినప్పుడు రోగుల అవసరాలకు తగిన విధంగా రక్తం అందక ఇబ్బందులు పడుతున్నాం. అందువల్ల రక్తదానం అనేది కుటుంబ సంప్రదాయంగా మారాలి. రక్తం ఇవ్వడం ఆరోగ్యానికి మంచిది. బ్లడ్ బ్యాంకు సేవలను విస్తృతం చేస్తున్నాం. ఇకమీదట నేరుగా గ్రామా ల్లో పెద్ద ఎత్తున క్యాంపులు నిర్వహిస్తాం. రోగులకు ఇబ్బంది లేకుండా చేస్తాం.
– పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment