Red Cross Blood Bank
-
నెల్లూరు రెడ్‌క్రాస్ బ్లడ్‌బ్యాంక్: రాష్ట్రంలో మొదటి స్థానం.. దేశంలో రెండో స్థానం
ఈయన పేరు ఎం.మధుసూదన్‌రావు, నెల్లూరు. రక్తదాన మోటివేటర్. కేవలం మోటివేటర్గానే కాకుండా క్రమం తప్పకుండా ప్రతి మూడు, నాలుగు నెలలకో దఫా రక్తదానం చేస్తున్నారు. ఇప్పటికే 110 దఫాలు రక్తదానం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచాడు. ఈయన పేరు చంద్రగిరి అజయ్‌బాబు, నెల్లూరులోని పొదలకూరు రోడ్డులో నివాసం ఉంటున్నాడు. దూరప్రాంత గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ప్రస్తుతం బ్లడ్‌బ్యాంకు కన్వీనర్‌గా కూడా అదనపు బాధ్యతలు నిర్వరిస్తున్నాడు. పాఠశాలలో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాక ఇంటికి వెళ్లకుండా నేరుగా బ్లడ్ బ్యాంకుకే వస్తారు. అక్కడ బ్లడ్‌బ్యాంకులో స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నాడు. ఈయన ఇప్పటి వరకు 93 దఫాలుగా రక్తదానం చేసి పలువురికి స్ఫూర్తి దాయకంగా నిలిచాడు. నెల్లూరు (అర్బన్): ప్రాణాపాయంలో క్షతగాత్రుల ఊపిరి నిలిపేందుకు అత్యవసరంగా రక్తం అందించాల్సి ఉంది. రక్తహీనతతో ఉన్న గర్భిణులు, ఇతర సర్జరీల సమయంలో రక్తం అవసరమైనప్పుడు, హీమోఫీలియో, తలసేమియా రోగులకు క్రమం తప్పకుండా రక్తం అందించాల్సి వచ్చినప్పుడు వారి ప్రాణాలు కాపాడేందుకు తామున్నామంటూ అనేక మంది స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్నారు. ప్రాణదాతలుగా నిలుస్తూ జిల్లాకు గుర్తింపు తెచ్చారు. ఎంతో మందికి స్ఫూర్తిదాతలు నిలుస్తున్నారు. భారతదేశంలో స్వచ్ఛంద రక్తదాన ఉద్యమానికి మార్గదర్శకుడు, ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ పితామహుడు డాక్టర్ జేజీ జోలి. ఆయన చేసిన పరిశోధనలు, కృషి వల్లనే అక్టోబర్ 1వ తేదీని జాతీయ రక్తదాన దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటిందింది. డాక్టర్ జేజీ జోలి స్వచ్ఛంద రక్తదాన ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాడు. అదే స్ఫూర్తితో జిల్లాలో ఎంతో మంది స్వచ్ఛంద రక్తదాతలుగా మారారు. జిల్లాలో ఉన్న పలు బ్లడ్‌బ్యాంకులు రోగుల రక్త కొరత తీర్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. నగరంలో రెడ్‌క్రాస్‌తో పాటు నోవాబ్లడ్ బ్యాంకు, పెద్దాస్పత్రి, నారాయణ, అపోలో ఆస్పత్రిలో బ్లడ్ బ్యాంకులున్నాయి. అందులో రెడ్‌క్రాస్ బ్లడ్‌బ్యాంకు 90 శాతం వరకు రోగులను ఆదుకుంటుంది. రాష్ట్రంలో మొదటి స్థానం.. దేశంలో రెండో స్థానం 1997లో రెడ్‌క్రాస్ సొసైటీ బ్లడ్‌బ్యాంకు పూర్తి స్థాయి వినియోగంలోకి వచ్చింది. నెల్లూరు రెడ్‌క్రాస్ బ్లడ్‌బ్యాంకు సేవలు రాష్ట్రంలో ప్రథమ, దేశంలో రెండో స్థానాల్లో నిలుస్తున్నాయి. కోవిడ్ సమయంలో వందలాది మంది కరోనా రోగులకు ప్లాస్మాదానం చేయడంలో దేశంలోనే మొదటి స్థానాన్ని జిల్లా రెడ్‌క్రాస్ బ్లడ్‌బ్యాంకు సాధించింది. రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంకుకు 3 మొబైల్ వాహనాలు జిల్లా రెడ్‌క్రాస్ బ్లడ్‌బ్యాంకు సేవలు బాగుండడంతో ఇటీవల రూ.1.25 కోట్లతో రెండు మొబైల్ వాహనాలను ఇండియన్ రెడ్‌క్రాస్–న్యూఢిల్లీ నెల్లూరుకు అందజేశారు. పదిరోజుల క్రితం వీటిని రాష్ట్రమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కలెక్టర్ చక్రధర్‌బాబు ప్రారంభించారు. జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం రూ.కోటి నిధులతో మరో మొబైల్ బస్సును ఇక్కడికి పంపారు. దీంతో మొత్తం రూ.2.25 కోట్లతో మూడు ఆధునిక మొబైల్ వాహనాలు నెల్లూరు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఈ మొబైల్ బస్సులో ఒకే దఫా ఐదుగురు రక్తదానం చేసేందుకు సీటింగ్, డాక్టర్‌కు రెస్ట్ రూం, పరీక్షలు చేసేందుకు, రక్తదానం చేసిన తర్వాత రెస్ట్ తీసుకునేందుకు వసతులు ఏర్పాటు చేశారు. సెంట్రలైజ్డ్ ఏసీని వాహనంలో ఏర్పాటు చేశారు. గ్రామీణులు ముందుకు రావాలి రక్తదానంపై అవగాహన అవసరం. దీంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రస్తుతం 1000 మందిలో ఐదుగురు మాత్రమే పట్టణాల్లో రక్తదానం చేస్తున్నారు. గ్రామీణులు పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు. రక్తదానం చేసేందుకు ముందుకు రావాలి. 1000 మందిలో కనీసం 15 మంది రక్తదానం చేసినప్పుడు కొరత తీరుతుంది. నేను 49 దఫాలు రక్తదానం చేశాను. – మోపూరు భాస్కర్‌నాయుడు, నోవా బ్లడ్‌బ్యాంకు అడ్మినిస్ట్రేటర్ రక్తం కొరత ఉంది ఎంతోమంది సభ్యులు స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్నారు. వారందరికీ వందనాలు. అయితే డెంగీ వంటి సీజనల్ వ్యాధులు ప్రబలినప్పుడు రోగుల అవసరాలకు తగిన విధంగా రక్తం అందక ఇబ్బందులు పడుతున్నాం. అందువల్ల రక్తదానం అనేది కుటుంబ సంప్రదాయంగా మారాలి. రక్తం ఇవ్వడం ఆరోగ్యానికి మంచిది. బ్లడ్ బ్యాంకు సేవలను విస్తృతం చేస్తున్నాం. ఇకమీదట నేరుగా గ్రామా ల్లో పెద్ద ఎత్తున క్యాంపులు నిర్వహిస్తాం. రోగులకు ఇబ్బంది లేకుండా చేస్తాం. – పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ -
మళ్లీ అడుగంటిన రక్త నిల్వలు
జిల్లాకు పెద్ద దిక్కు రిమ్స్ ఆసుపత్రి. రోగం ముదిరినా ... రోడ్డు ప్రమాదం జరిగినా ప్రాణం కాపాడుకోవడానికి ఎంతో ఆశతో వస్తారు ... కానీ ఇక్కడే రిక్తహస్తం ఎదురైతే... అదే జరుగుతోంది... నిధులు లేక ఆధునిక వైద్య పరికరాలు లేకపోతే సర్లే అనుకోవచ్చు ... వైద్య నిపుణుల నియామకం లేకపోతే ఉన్నవాళ్లతో ఏదోలా వైద్యం చేయించుకోవచ్చు ... కానీ ఉండాల్సిన రక్త నిల్వలే కొరవడితే ఎవరిదీ పాపం? సరిగ్గా ఆరు నెలల కిందట ఇదే పరిస్థితి తలెత్తితే తొలుత సమస్య తీవ్రతను ‘సాక్షి’ గుర్తించింది. ఈ సమస్యను వార్తగా కాకుండా సామాజిక బాధ్యతగా తీసుకుంది. వరుస కథనాలతో ఇటు అధికార యంత్రాంగాన్ని, అటు స్వచ్ఛంద సంస్థలను, కళాశాల ప్రతినిధులను కదిలించింది. సమస్య తీవ్రతను తెలుసుకున్నవాళ్లంతా తలో చేయి వేశారు. రక్తదాన శిబిరాలతో తమ దాతృత్వాన్ని చూపించారు. జిల్లా కలెక్టర్ విజయకుమార్, అప్పటి డీఎంహెచ్ఓ, ఇతర అధికారులు నడుం బిగించి ప్రత్యేక దృష్టి పెట్టడంతో ఆగిపోతున్న శ్వాసకు బాసటగా నిలిచారు. ఆ సంతోషం పట్టుమని ఆరునెలలు కూడా మిగలలేదు. సజావుగా సాగుతుందనుకున్న బ్లడ్ బ్యాంకులకు మళ్లీ రక్త హీనత ఏర్పడింది. మిణుకు, మిణుకుమంటూ కొట్టుమిట్టాడుతున్న పెద్దప్రాణానికి చేతులొడ్డాల్సిన తరుణం ఆసన్నమయింది. ఒంగోలు సెంట్రల్ : రిమ్స్ రక్త నిధిలో ప్రతి రోజూ 50 యూనిట్లకు తక్కువకాకుండా రక్తం నిల్వ ఉండాలి. కానీ 30 యూనిట్ల రక్తం ఉండడడం గనమవుతోంది. అధికారుల నిర్లక్ష్య ఫలితమే దీనికి కారణం. రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్‌కు చైర్మన్‌గా జిల్లా కలెక్టర్ ఉండటంతోపాటు జెడ్పీ సీఈఓ ఇన్చార్జిగా ఉన్నారు. స్టెప్ అధికారులు, ఇతర స్వచ్ఛంద సంస్థలు రెడ్ క్రాస్కే వచ్చిన రక్తం తరలిస్తుండడంతో అక్కడి బ్లడ్‌బ్యాంక్‌లో నిల్వలు మాత్రం ప్రజల అవసరాలకు సరిపోతున్నాయి. అంటే 35 యూనిట్ల రక్తం అందుబాటులో ఉంటోంది. కానీ రిమ్స్ రక్తనిధి మాత్రం నిండుకుంది. ఇలా తగ్గుతున్న సమయంలోనే సంబంధిత రిమ్స్ అధికారులు గుర్తించి పరిస్థితి తీవ్రతను కనీసం కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యను చక్కదిద్దాలి. నిర్లక్ష్యం ఆవహించడంతో చేతులు కాలుతున్నా చర్యలు మాత్రం లేకపోవడంతో ఆ పరిస్థితి ఏర్పడుతోంది. గత నెలలో రెండు క్యాంపులు నిర్వహించినా కేవలం 44 యూనిట్ల రక్తం మాత్రమే సమకూరింది. అన్ని పరీక్షలు చేసి 40 యూనిట్లు అందుబాటులోకి తెచ్చారు. ప్రతి రోజూ 50కిపైగా శస్త్రచికిత్సలు రిమ్స్‌లో ప్రతి రోజూ 50కిపైగా శస్త్రచికిత్సలు జరుగుతుంటాయి. ఇన్ పేషంట్లుగా ఉన్న కొన్ని రకాల వ్యాధులతో బాధ పడుతున్న వారికి రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. వీటికితోడు రెండు సిజేరియన్ కాన్పులు, మరో నాలుగు సహజ కాన్పులు జరుగుతుంటాయి. జిల్లాలో జాతీయ రహదారిపై తరచూ జరుగుతున్న ప్రమాదాలు, ఇతరత్రా రోడ్డు ప్రమాదాలు, ఘర్షణలతో ఆసుపత్రికి వస్తున్న వారి సంఖ్య ప్రతిఏటా పెరుగుతూనే ఉంది. ఈ నేపధ్యంలో రక్తం అందుబాటులో లేకపోవడంతో నిలవాల్సిన ప్రాణం కూడా గాలిలో కలిసిపోతోంది. ‘ప్రయివేటు’వైపు వైపు పరుగులు ప్రభుత్వ ఆసుపత్రుల బలహీనతలను ఆసరా చేసుకొని ప్రయివేటు బ్లడ్ బ్యాంకులు దోపిడీకి తెరదీస్తున్నాయి. రోగి అవసరాన్ని బట్టి వారి బంధువుల వద్ద నగరంలోని ప్రయివేటు బ్లడ్ బ్యాంకులు నిర్ణీత ధరకంటే అధికంగా వసూలు చేస్తున్నారు. యూనిట్‌కు రూ.3 వేలు, అవసరమైన గ్రూపు రక్తం కావాలంటే ఇంకా అదనంగా చెల్లించాల్సి వస్తోంది. ఎవరైనా రక్తం ప్యాకెట్ కోసం వస్తే అదే పరిణామంలో రక్తం ఇస్తే డబ్బులు చెల్లించనవసరం లేదు. దీన్నే రిప్లేస్మెంట్ అంటారు. కానీ కొన్ని ప్రయివేటు బ్లడ్‌బ్యాంకులు మాత్రం రీ ప్లేస్‌మెంట్‌కు ససేమిరా అంటున్నాయి. డబ్బులు చేతిలో పడితేనే బ్యాగ్ ఇస్తామనడంతో పేదల పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతోంది. ప్రజల్లో రక్తదానంపై అవగాహన కల్పించి చైతన్యం రగిలించాల్సిన రక్త నిధి కేంద్రాల్లో పని చేస్తున్న మోటివేటర్స్ ఆ బాధ్యతనే విస్మరిస్తున్నారు. కొరత వాస్తవమే, అందరూ స్పందించాలి. డాక్టర్ అదిలక్ష్మి ఎం.డి రిమ్స్, బ్లడ్ బ్యాంక్ ఇన్చార్జి రక్తం తక్కువ ఉన్న మాట నిజమే. రీ ప్లేస్ మెంట్ విధానం ద్వారానే రక్తాన్ని సేకరిస్తున్నాం. ఉద్యోగులు, విధ్యార్దులు స్పందించి రక్తదానం చేస్తే ఆపదలో ఉన్నవారికి సహాయం చేసినవారవుతారు. రక్తదానంతో మరింత ఆరోగ్యం రక్తదానం చేస్తే బలహీనమైపోతామనే భయం చాలా మందిలో ఉంది. ఆరోగ్యంగా ఉన్న స్త్రీ పురుషులు 18-60 సంవత్సరాల వయస్సులోపుండీ 45 కేజీలకుపైగా బరవున్న వారరందరూ రక్తం ఇవ్వవచ్చు. సంవత్సరానికి మూడుసార్లు ఇస్తే ఆరోగ్యం మీ సొంతం అంటున్నారు వైద్య నిపుణులు. -
అమరుల త్యాగాలు మరువలేం
జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యాన రక్తదాన శిబిరం రక్తదానం చేసిన 61 మంది సిబ్బంది అభినందించిన ఎస్పీ కోనేరుసెంటర్ (మచిలీపట్నం) : అంకితభావంతో విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా ఎస్పీ విజయ్ కుమార్ పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర, వారు చూపే చొరవ విశేషమైందని ఆయన కొనియాడారు. ఈ నెల 21వ తేదీన పోలీసు అమరులవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక పోలీస్ కల్యాణ మండపంలో శనివారం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యాన స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని ఎస్పీ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విధుల్లో ప్రాణాలు కోల్పోయిన అమరులను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబరు 21వ తేదీన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని లాంఛనంగా నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలో జరిగే వారోత్సవాల్లో పోలీస్ సిబ్బంది అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, ఓపెన్ హౌస్, రక్తదాన శిబిరాలు వంటివి నిర్వహిస్తున్నట్లు వివరించారు. బాధితులకు న్యాయం చేయటంతోపాటు సేవా కార్యక్రమాల్లోనూ పోలీసులు భాగస్వాములు కావాలని ఎస్పీ సూచించారు. సమాజానికి ఉత్తమ సేవలను అందిస్తూ ప్రజల నుంచి మన్ననలను పొందేందుకు విశేష కృషి చేయాలన్నారు. శాఖాపరమైన విషయాల్లో నిజాయితీగా వ్యవహరిస్తూ అధికారుల మన్ననలు పొందాలని పేర్కొన్నారు. ఈ శిబిరంలో జిల్లాలోని 61 మంది వివిధ హోదాల్లో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానం చేసిన అధికారులు, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా ప్రభుత్వాస్పత్రి బ్లడ్ బ్యాంకు సిబ్బంది, పట్టాభి రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంకు సిబ్బంది పాల్గొని రక్తాన్ని సేకరించారు. ఈ కార్యక్రమంలో బందరు డీఎస్పీ డాక్టర్ కేవీ శ్రీనివాసరావు, ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్, వోఎస్డీ వృషికేశవరెడ్డి, సీఐలు పి.మురళీధర్, జి.శ్రీనివాస్, టి.సత్యనారాయణ, వీఎస్‌ఎస్‌వీ మూర్తి, ఆర్మ్డ్ రిజర్వు ఇన్స్పెక్టర్ కృష్ణంరాజు, నాగిరెడ్డి, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఇదీ ‘రక్త’చరిత్ర!
విజయనగరం ఆరోగ్యం: మనిషి మాత్రమే రక్తం ఇచ్చి సాటి మనిషిప్రాణాలు కాపాడగలడని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంక్ అధికారులు నిత్యం చెబుతుంటారు. కానీ రక్తదాతల నుంచి సేకరించిన రక్తాన్ని పూర్తి స్థాయిలో రోగులకు అందించకుండా రెడ్‌క్రాస్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బ్లడ్‌బ్యాంక్‌లో ఉన్న రక్తం వివరాలు గ్రూపుల వారీగా స్టాక్ బోర్డులో పెట్టకుండా బ్లాక్‌లో విక్రయిస్తున్నారనే పలువురు ఆరోపిస్తున్నారు. రక్తదాన శిబిరంలో సేకరించిన రక్తానికి హెచ్ఐవీ, హెచ్‌బీఎస్‌ఏజీ, వీడీఆర్ఎల్, హైపటైటిస్‌బి వంటి వ్యాధుల పరీక్షలు నిర్వహించి రిఫ్రిజిరేటర్లో భద్రపరచాలి. రిఫ్రిజిరేటర్లో ఉన్న రక్తం వివరాలను గ్రూపుల వారీగా స్టాక్ బోర్డుపై నమోదు చేయాలి. ప్రతిరోజూ స్టాక్ ఎంత ఉంది, ఏఏ గ్రూపుల రక్తం ఎంత ఉందనే వివరాలు నమోదు చేయాలి. కానీ ఇక్కడ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. బ్లడ్‌బ్యాంక్‌లో రక్త నిల్వలు ఉన్నప్పటికీ రక్తంలేదని స్టాక్ బోర్డులో చూపిస్తున్నారు. బ్లడ్‌బ్యాంక్‌లో రక్తం ఉన్నప్పటికీ లేదని బోర్డులో చూపించడం వల్ల రోగి బంధువులు రక్తంకోసం నానా అవస్థలు పడుతున్నారు. ఆపదలో ఉన్న రోగులకు రక్తం అందించి ఆదుకోవాల్సిన వారు ప్రాణాలు ప్రాణాలు గాల్లో కలిసిపోయేలా వ్యవహరిస్తున్నారనే రోగుల బంధువులు వాపోతున్నారు. ప్రాణాలు గాల్లో కలిసిపోయేలా వ్యవహరిస్తున్నారనే రోగుల గాల్లో కలిసిపోయేలా వ్యవహరిస్తున్నారని రోగుల బంధువులు వాపోతున్నారు. రక్తాన్ని బ్లాక్‌లో విక్రయిస్తున్నారనే ఆరోపణలు బోర్డులో రక్తం లేదని చూపించి రక్తాన్ని బ్లాక్‌లో విక్రయిస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఒక్కో బ్యాగ్‌ను రూ.1500 నుంచి రూ.2వేల వరకు విక్రయిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మిగిలిన బ్లడ్ బ్యాంక్‌లలోనూ ఇదే పరిస్థితి. ఇదే విషయంపై రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంక్ ప్రతినిధి శ్రీధర్ వద్ద సాక్షి ప్రస్తావించగా బోర్డులో రక్తం వివరాలు పూర్తిస్థాయిలో నమోదు చేయని మాట వాస్తవమేనని అంగీకరించారు. అత్యవసర పరిస్థితుల నిమిత్తం 17 బ్యాగ్‌లను ఉంచామని తెలిపారు. -
రక్తదానంలో ‘పొదిలి’ వాసులు ఆదర్శం
పొదిలి : రక్తదానం చేసి ఆపదలో ఉన్న ప్రాణాలు కాపాడడంలో తామే ముందుంటామని మండల వాసులు నిరూపించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఎంపీడీఓ జీవీ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన వచ్చింది. సుమారు 270 మంది రక్తదానం చేసేందుకు ముందుకొచ్చారు. రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంకు ప్రతినిధులు ఆ మేరకు సిద్ధం కాకపోవడంతో 190 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి శిబిరాన్ని సందర్శించి, రక్తదాతలకు పండ్లు పంపిణీ చేశారు. మంచి కార్యక్రమం నిర్వహించారంటూ ఎంపీడీఓని అభినందించారు. జిల్లాలో ఎప్పుడూ ఇంత స్పందన రాలేదని బ్లడ్ బ్యాంకు డాక్టర్ పి.సత్యనారాయణ చెప్పారు. స్టెప్ అధికారి శ్రీమన్నారాయణ శిబిరాన్ని పర్యవేక్షించారు. రక్తదాతలకు ఎంపీడీఓ అభినందనలు తెలిపారు. పండ్ల వ్యాపారుల సంఘ అధ్యక్షుడు షేక్ సుభాని, వైఎస్ఆర్ సీపీ నాయకులు వాకా వెంకటరెడ్డి, టీడీపీ నాయకులు గునుపూడి భాస్కర్ రక్తదాతలకు పండ్లు, రొట్టెలు, జ్యూస్, బిస్కట్లు అందచేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కోవెలకుంట్ల నరసింహారావు, జెడ్పీటీసీ సభ్యుడు సాయి రాజేశ్వరరావు, కోఆప్షన్ సభ్యులు షేక్ మస్తాన్‌వలి, సీడీపీఓ రేచల్ సరళ, ఈఓఆర్డీ జి.నాగేశ్వరరావు, క్రిష్ణయ్య, వైఎస్ఆర్ టీఎఫ్ జిల్లా నాయకులు సానికొమ్ము జగన్మోహనరెడ్డి, ఎన్జీఓ అసోసియేషన్ నాయకులు నారు శ్రీనివాసరెడ్డి, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, జి.శ్రీనివాసులు, కల్లం సుబ్బారెడ్డి, గొలమారి చెన్నారెడ్డి, రాచమల్ల వెంకటరామిరెడ్డి, కంచర్ల శ్రీనివాసులు, పులి వెంకటేశ్వరరెడ్డి, కె.చిన్న సోమయ్య పాల్గొన్నారు. -
రక్తహీనత
బ్లడ్‌బ్యాంకుల్లో రక్తపు నిల్వల కొరత అరుదైన గ్రూప్ రక్తం కోసం అవస్థలు రెండేళ్లుగా పనిచేయని రెడ్‌క్రాస్ బ్లడ్‌బ్యాంక్ రక్తదానంపై కొరవడుతున్న అవగాహన {పోత్సాహం లేక ముందుకు రాని యువత డోనర్స్‌కు సమ్మర్ ఎఫెక్ట్ గుంటూరు మెడికల్ : జిల్లాను రక్తకొరత పీడిస్తోంది. రక్త నిల్వ కేంద్రాలు నిండుకుంటున్నాయి. అరుదైన గ్రూప్ రక్తం అవసరమైతే అంతే సంగతులు. ఏదైనా ప్రమాదం జరిగి అత్యవసరంగా బ్లడ్ అవసరమైనవారికి అందించేందుకు కూడా తగిన రక్తం లేకపోవడం దురదృష్టకరం. మండుతున్న ఎండలతో రక్తదానం చేసేందుకు ఎవ్వరూ ముందుకు రావకపోవడం..., రక్తదానం చేసేవారిలో అధికంగా ఉండేది విద్యార్థులే. కళాశాలలకు ఏప్రిల్, మే నెలల్లో సెలవులు రావడంతో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసే అవకాశాలు లేకవడంతో ఈ పరిస్థితి కనిపిస్తోంది. రోడ్డు ప్రమాద బాధితులకు, ప్రాణాపాయస్థితిలో ఉన్న వారికి ఆపరేషన్లు చేసి ప్రాణాలు కాపాడేందుకు అవసరమవుతున్న రక్తపు నిల్వలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ముఖ్యంగా అరుదైన బి-నెగిటివ్ రక్తపు నిల్వలు ఎక్కడా లభించటం లేదు. జిల్లావ్యాప్తంగా.: జిల్లాలో 16 బ్లడ్‌బ్యాంకులు ఉన్నాయి. వీటిల్లో గుంటూరు ప్రభుత్వసమగ్ర ఆస్పత్రిలోని బ్లడ్‌బ్యాంక్‌లో ప్రతి రోజూ 20 నుండి 30 రక్తపు సంచులు రోగులకు వినియోగిస్తున్నారు. ఎందరో పేద రోగులు, దిక్కులేనివారు, నిస్సహాయులు ఇక్కడకు చికిత్స కోసం వస్తుంటారు. రోగుల సహాయకులు రక్తం ఇస్తే తప్ప రక్తం ఇవ్వని పరిస్థితి పెద్దాసుపత్రిలో ఉంది. ఇటీవల కాలంలో రక్తదాన శిబిరం నిర్వహించటం వల్ల కొద్దిమేరకు రక్తపు నిల్వలు చేరినా... అవి ఏ మాత్రం సరిపోవని నిపుణులు చెబుతున్నారు. నరసరావుపేట, తెనాలి,రేపల్లె, మంగళగిరి తదితర ప్రాంతాల్లో ఉన్న బ్లడ్‌బ్యాంకుల్లో ఆశించిన మేరకు రక్తం దొరకటంలేదు. పనిచేయని రెడ్క్రాస్బ్లడ్ బ్యాంక్.: జిల్లాపరిషత్ ఆవరణంలోని ఇండియన్రెడ్క్రాస్సొసైటీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న బ్లడ్‌బ్యాంక్ సుమారు రెండేళ్లుగా పనిచేయటం లేదు. జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరించే రెడ్‌క్రాస్ బ్లడ్‌బ్యాంకులో గతంలో రక్తపు నిల్వలు బాగా లభించేవి. ఇక్కడ కేవలం వ్యాధి నిర్థారణ పరీక్షల కోసం అయ్యే ఖర్చును మాత్రమే తీసుకుని రక్తాన్ని అందించేవారు. అధిక సంఖ్యలో రోగులు వినియోగించుకుంటున్న బ్లడ్‌బ్యాంక్ రెండేళ్లుగా పనిచేయకపోవటంతో నిల్వల కొరత కనిపిస్తోంది. విద్యార్థులే దిక్కు.: బ్లడ్‌బ్యాంకులన్నీ ఎక్కువగా విద్యార్థులపైనే ఆధారపడి పనిచేస్తున్నాయి. కళాశాలల పనిదినాల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటుచేసి నిల్వ చేస్తున్నారు. వేసవి సెలవుల్లో విద్యార్థులు లేకపోవటంతో రక్తపు నిల్వల కోసం ఎదురు చూపులు చూడాల్సి వస్తుంది. రక్తదానంపై ప్రజల్లో తగినంత అవగాహన కల్పించలేకపోవడం వల్లే ఇలాంటి సమస్య ఏటా ఉత్పన్నమవుతోంది. జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా కేవలం ఒక్క కళాశాలలోనే రక్తదానశిబిరం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఒక్కచోట మాత్రమే రక్తదానశిబిరం జరిగిందంటే ఇక ఏ మేరకు వైద్యాధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి రక్త నిల్వల పెంపునకు ప్రత్యేక శ్రద్ద చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
నాణ్యమైన సేవలందించాలి
రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సుబ్రహ్మణ్యం విజయనగరంఆరోగ్యం, న్యూస్‌లైన్: రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంక్ ద్వారా నాణ్యమైన సేవలందించాలని రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.సుబ్రహ్మణ్యం ( విశాంత్ర ఐఏఎస్) అన్నారు. స్థానిక రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంక్‌ను శుక్రవారం ఆయన పరిశీలించారు. రక్తదానం చేస్తున్న దాతల వద్దకు వెళ్లి అభినందించారు. రోజుకు ఎంత రక్తాన్ని సేకరిస్తున్నదీ, ఎంతమంది రోగులకు అందజేస్తున్నదీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక రైల్వేస్టేషన్‌కు రెండు వీల్ చైర్లను వితరణగా అందజేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఒక ప్రైవేటు హోటల్లో రెడ్‌క్రాస్ బ్లడ్‌బ్యాంకు సిబ్బందితో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బ్లడ్ బ్యాంకు అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. అన్ని రకాల పరీక్షలు నిర్వహించిన తర్వాతే దాతల నుంచి రక్తం సేకరించాలని తెలిపారు. పార్వతీపురం రెడ్‌క్రాస్ బ్లడ్‌బ్యాంకుకు జనరేటర్ సదుపాయం లేకపోవడంతో రక్తాన్ని నిల్వ చేయలేకపోతున్నారని, దీంతో రక్తాన్ని తీసుకెళ్లడానికి రోగులు కూడా ముందుకు రావడం లేదని అక్కడి సిబ్బంది సుబ్రహ్మణ్యం దృష్టికి తీసుకువచ్చారు. దీనికి సుబ్రహ్మణ్యం స్పందిస్తూ బ్లడ్‌బ్యాంకులకు కావాల్సిన పరికరాల వివరాలు తెలియజేయాలన్నారు. బ్లడ్ బ్యాంక్‌ల్లో వైద్య పరీక్షల కోసం తీసుకుంటున్న ఫీజును తగ్గించాలని పలువురు కోరారు. గతంలో వైద్య పరీక్షలకు రూ. 850 తీసుకోగా ప్రస్తుతం రూ. 1400 వసూలు చేస్తున్నారని, దీంతో నిరుపేదలు ఇబ్బంది పడుతున్నట్లు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అబ్దుల్ రవూఫ్, బాలు, తదితరులు సుబ్రహ్మణ్యం దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో విజయనగరం రెడ్‌క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ చైర్మన్ అట్టాడ హేమసుందర్, బ్లడ్ బ్యాంక్ వైద్యుడు కరుణాకర్, జిల్లా విపత్తుల నివారణ దళం మేనేజర్ పి.శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు. రక్తదానం సామాజిక బాధ్యత రక్తదానం చేయడం సామాజిక బాధ్యతని రెడ్‌క్రాస్ సొసైటీ స్టేట్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ రామచంద్రరావు అన్నారు. స్థానిక రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయంలో నిర్వహించిన అత్యవసర రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అత్యవసర సమయంలో రక్తం అందక చాలా మంది మరణిస్తున్నారన్నారు. ఆరోగ్యంగా ఉన్న వారు ప్రతి మూడు నెలలకొకసారి రక్తదానం చేయవచ్చన్నారు. కార్యక్రమంలో అట్టాడ హేమసుందర్, కరుణాకర్, అబ్దుల్ రవూఫ్ , బి.రామకృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు.