
రక్తహీనత
బ్లడ్‌బ్యాంకుల్లో రక్తపు నిల్వల కొరత
అరుదైన గ్రూప్ రక్తం కోసం అవస్థలు
రెండేళ్లుగా పనిచేయని రెడ్‌క్రాస్ బ్లడ్‌బ్యాంక్
రక్తదానంపై కొరవడుతున్న అవగాహన
{పోత్సాహం లేక ముందుకు రాని యువత
డోనర్స్‌కు సమ్మర్ ఎఫెక్ట్
గుంటూరు మెడికల్ : జిల్లాను రక్తకొరత పీడిస్తోంది. రక్త నిల్వ కేంద్రాలు నిండుకుంటున్నాయి. అరుదైన గ్రూప్ రక్తం అవసరమైతే అంతే సంగతులు. ఏదైనా ప్రమాదం జరిగి అత్యవసరంగా బ్లడ్ అవసరమైనవారికి అందించేందుకు కూడా తగిన రక్తం లేకపోవడం దురదృష్టకరం. మండుతున్న ఎండలతో రక్తదానం చేసేందుకు ఎవ్వరూ ముందుకు రావకపోవడం..., రక్తదానం చేసేవారిలో అధికంగా ఉండేది విద్యార్థులే. కళాశాలలకు ఏప్రిల్, మే నెలల్లో సెలవులు రావడంతో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసే అవకాశాలు లేకవడంతో ఈ పరిస్థితి కనిపిస్తోంది. రోడ్డు ప్రమాద బాధితులకు, ప్రాణాపాయస్థితిలో ఉన్న వారికి ఆపరేషన్లు చేసి ప్రాణాలు కాపాడేందుకు అవసరమవుతున్న రక్తపు నిల్వలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ముఖ్యంగా అరుదైన బి-నెగిటివ్ రక్తపు నిల్వలు ఎక్కడా లభించటం లేదు.
జిల్లావ్యాప్తంగా.: జిల్లాలో 16 బ్లడ్‌బ్యాంకులు ఉన్నాయి. వీటిల్లో గుంటూరు ప్రభుత్వసమగ్ర ఆస్పత్రిలోని బ్లడ్‌బ్యాంక్‌లో ప్రతి రోజూ 20 నుండి 30 రక్తపు సంచులు రోగులకు వినియోగిస్తున్నారు. ఎందరో పేద రోగులు, దిక్కులేనివారు, నిస్సహాయులు ఇక్కడకు చికిత్స కోసం వస్తుంటారు. రోగుల సహాయకులు రక్తం ఇస్తే తప్ప రక్తం ఇవ్వని పరిస్థితి పెద్దాసుపత్రిలో ఉంది. ఇటీవల కాలంలో రక్తదాన శిబిరం నిర్వహించటం వల్ల కొద్దిమేరకు రక్తపు నిల్వలు చేరినా... అవి ఏ మాత్రం సరిపోవని నిపుణులు చెబుతున్నారు. నరసరావుపేట, తెనాలి,రేపల్లె, మంగళగిరి తదితర ప్రాంతాల్లో ఉన్న బ్లడ్‌బ్యాంకుల్లో ఆశించిన మేరకు రక్తం దొరకటంలేదు.
పనిచేయని రెడ్‌క్రాస్‌బ్లడ్ బ్యాంక్.: జిల్లాపరిషత్ ఆవరణంలోని ఇండియన్‌రెడ్‌క్రాస్‌సొసైటీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న బ్లడ్‌బ్యాంక్ సుమారు రెండేళ్లుగా పనిచేయటం లేదు. జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరించే రెడ్‌క్రాస్ బ్లడ్‌బ్యాంకులో గతంలో రక్తపు నిల్వలు బాగా లభించేవి. ఇక్కడ కేవలం వ్యాధి నిర్థారణ పరీక్షల కోసం అయ్యే ఖర్చును మాత్రమే తీసుకుని రక్తాన్ని అందించేవారు. అధిక సంఖ్యలో రోగులు వినియోగించుకుంటున్న బ్లడ్‌బ్యాంక్ రెండేళ్లుగా పనిచేయకపోవటంతో నిల్వల కొరత కనిపిస్తోంది.
విద్యార్థులే దిక్కు.: బ్లడ్‌బ్యాంకులన్నీ ఎక్కువగా విద్యార్థులపైనే ఆధారపడి పనిచేస్తున్నాయి. కళాశాలల పనిదినాల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటుచేసి నిల్వ చేస్తున్నారు. వేసవి సెలవుల్లో విద్యార్థులు లేకపోవటంతో రక్తపు నిల్వల కోసం ఎదురు చూపులు చూడాల్సి వస్తుంది. రక్తదానంపై ప్రజల్లో తగినంత అవగాహన కల్పించలేకపోవడం వల్లే ఇలాంటి సమస్య ఏటా ఉత్పన్నమవుతోంది. జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా కేవలం ఒక్క కళాశాలలోనే రక్తదానశిబిరం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఒక్కచోట మాత్రమే రక్తదానశిబిరం జరిగిందంటే ఇక ఏ మేరకు వైద్యాధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి రక్త నిల్వల పెంపునకు ప్రత్యేక శ్రద్ద చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.