నాణ్యమైన సేవలందించాలి
రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సుబ్రహ్మణ్యం
విజయనగరంఆరోగ్యం, న్యూస్‌లైన్: రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంక్ ద్వారా నాణ్యమైన సేవలందించాలని రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.సుబ్రహ్మణ్యం ( విశాంత్ర ఐఏఎస్) అన్నారు. స్థానిక రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంక్‌ను శుక్రవారం ఆయన పరిశీలించారు. రక్తదానం చేస్తున్న దాతల వద్దకు వెళ్లి అభినందించారు. రోజుకు ఎంత రక్తాన్ని సేకరిస్తున్నదీ, ఎంతమంది రోగులకు అందజేస్తున్నదీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక రైల్వేస్టేషన్‌కు రెండు వీల్ చైర్‌లను వితరణగా అందజేశారు.
ఈ సందర్భంగా పట్టణంలోని ఒక ప్రైవేటు హోటల్‌లో రెడ్‌క్రాస్ బ్లడ్‌బ్యాంకు సిబ్బందితో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బ్లడ్ బ్యాంకు అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. అన్ని రకాల పరీక్షలు నిర్వహించిన తర్వాతే దాతల నుంచి రక్తం సేకరించాలని తెలిపారు. పార్వతీపురం రెడ్‌క్రాస్ బ్లడ్‌బ్యాంకుకు జనరేటర్ సదుపాయం లేకపోవడంతో రక్తాన్ని నిల్వ చేయలేకపోతున్నారని, దీంతో రక్తాన్ని తీసుకెళ్లడానికి రోగులు కూడా ముందుకు రావడం లేదని అక్కడి సిబ్బంది సుబ్రహ్మణ్యం దృష్టికి తీసుకువచ్చారు.
దీనికి సుబ్రహ్మణ్యం స్పందిస్తూ బ్లడ్‌బ్యాంకులకు కావాల్సిన పరికరాల వివరాలు తెలియజేయాలన్నారు. బ్లడ్ బ్యాంక్‌ల్లో వైద్య పరీక్షల కోసం తీసుకుంటున్న ఫీజును తగ్గించాలని పలువురు కోరారు. గతంలో వైద్య పరీక్షలకు రూ. 850 తీసుకోగా ప్రస్తుతం రూ. 1400 వసూలు చేస్తున్నారని, దీంతో నిరుపేదలు ఇబ్బంది పడుతున్నట్లు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అబ్దుల్ రవూఫ్, బాలు, తదితరులు సుబ్రహ్మణ్యం దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో విజయనగరం రెడ్‌క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ చైర్మన్ అట్టాడ హేమసుందర్, బ్లడ్ బ్యాంక్ వైద్యుడు కరుణాకర్, జిల్లా విపత్తుల నివారణ దళం మేనేజర్ పి.శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.
రక్తదానం సామాజిక బాధ్యత
రక్తదానం చేయడం సామాజిక బాధ్యతని రెడ్‌క్రాస్ సొసైటీ స్టేట్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ రామచంద్రరావు అన్నారు. స్థానిక రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయంలో నిర్వహించిన అత్యవసర రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అత్యవసర సమయంలో రక్తం అందక చాలా మంది మరణిస్తున్నారన్నారు. ఆరోగ్యంగా ఉన్న వారు ప్రతి మూడు నెలలకొకసారి రక్తదానం చేయవచ్చన్నారు. కార్యక్రమంలో అట్టాడ హేమసుందర్, కరుణాకర్, అబ్దుల్ రవూఫ్ , బి.రామకృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు.