అమరుల త్యాగాలు మరువలేం
- జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యాన రక్తదాన శిబిరం
- రక్తదానం చేసిన 61 మంది సిబ్బంది
- అభినందించిన ఎస్పీ
కోనేరుసెంటర్ (మచిలీపట్నం) : అంకితభావంతో విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా ఎస్పీ విజయ్ కుమార్ పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర, వారు చూపే చొరవ విశేషమైందని ఆయన కొనియాడారు. ఈ నెల 21వ తేదీన పోలీసు అమరులవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక పోలీస్ కల్యాణ మండపంలో శనివారం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యాన స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
ఈ శిబిరాన్ని ఎస్పీ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విధుల్లో ప్రాణాలు కోల్పోయిన అమరులను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబరు 21వ తేదీన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని లాంఛనంగా నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలో జరిగే వారోత్సవాల్లో పోలీస్ సిబ్బంది అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, ఓపెన్ హౌస్, రక్తదాన శిబిరాలు వంటివి నిర్వహిస్తున్నట్లు వివరించారు. బాధితులకు న్యాయం చేయటంతోపాటు సేవా కార్యక్రమాల్లోనూ పోలీసులు భాగస్వాములు కావాలని ఎస్పీ సూచించారు. సమాజానికి ఉత్తమ సేవలను అందిస్తూ ప్రజల నుంచి మన్ననలను పొందేందుకు విశేష కృషి చేయాలన్నారు. శాఖాపరమైన విషయాల్లో నిజాయితీగా వ్యవహరిస్తూ అధికారుల మన్ననలు పొందాలని పేర్కొన్నారు.
ఈ శిబిరంలో జిల్లాలోని 61 మంది వివిధ హోదాల్లో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానం చేసిన అధికారులు, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా ప్రభుత్వాస్పత్రి బ్లడ్ బ్యాంకు సిబ్బంది, పట్టాభి రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంకు సిబ్బంది పాల్గొని రక్తాన్ని సేకరించారు. ఈ కార్యక్రమంలో బందరు డీఎస్పీ డాక్టర్ కేవీ శ్రీనివాసరావు, ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్, వోఎస్‌డీ వృషికేశవరెడ్డి, సీఐలు పి.మురళీధర్, జి.శ్రీనివాస్, టి.సత్యనారాయణ, వీఎస్‌ఎస్‌వీ మూర్తి, ఆర్మ్‌డ్ రిజర్వు ఇన్‌స్పెక్టర్ కృష్ణంరాజు, నాగిరెడ్డి, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.