రక్తదానంతో పునర్జన్మ
మచిలీపట్నం టౌన్: ప్రతి ఒక్కరికీ పునర్జన్మ ప్రసాదించేది ఒక్క రక్తదానమేనని అందుకే అన్ని దానాల్లోకెల్లా రక్తదానం గొప్పదని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖామంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జాతీయ స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవాన్ని శనివారం స్ధానిక జిల్లా ప్రభుత్వాసుపత్రి బ్లడ్‌బ్యాంక్ విభాగ వైద్యాధికారి డాక్టర్ అల్లాడ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మంత్రి రవీంద్ర మాట్లాడుతూ రక్తదానం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ప్రాణాపాయంలో ఉన్న రోగుల ప్రాణాలను కాపాడవచ్చునన్నారు. విద్యార్థులు, యువత స్వచ్ఛందంగా రక్తదానం చేస్తే సమాజానికి ఎంతో ఉపయోగమన్నారు. రక్తదానంతో పాటు అవయవదానం గురించి చైతన్యానికి అధికారులు, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకురావాలన్నారు. ఎంపీ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ ఎవరైనా ప్రాణాపాయ ప్రమాదంలో ఉంటే రక్తదానం చేసి వారి ప్రాణాలను కాపాడేందుకు విద్యార్థులు, యువకులు ముందుకురావాలని కోరారు. ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ ఎం జయకుమార్, జిల్లా లెప్రసీ అధికారి టీవీఎస్‌ఎన్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. ఎక్కువసార్లు రక్తదానం చేసిన రక్తదాతలను ఘనంగా సన్మానించారు.