Minister kollu
-
రాష్ట్రంలో కొత్తగా ఆరు మత్స్యకార వసతిగృహాలు
అవనిగడ్డ: రాష్ట్రంలో కొత్తగా ఆరు మత్స్యకార వసతిగృహాలను ఏర్పాటు చేసినట్లు బీసీ సంక్షేమశాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. స్థానిక రెండో వార్డులో నూతంగా ఏర్పాటుచేసిన బీసీ కళాశాల వసతి గృహాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికే నాలుగు మత్స్యకార వసతిగృహాలు ఉన్నాయని తెలిపారు. మరో ఆరు ఏర్పాటుకు శుక్రవారం జీవో జారీ చేశామని చెప్పారు. త్వరలోనే వీటి ఏర్పాటుకు చర్యలు చేపడతామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 374 బీసీ వసతిగృహాలు, 32 రెసిడెన్సియల్ స్కూల్స్ ఉన్నాయని, కార్పొరేట్‌కు దీటుగా మంచి ఫలితాలు సాధిస్తున్నాయని వివరించారు. బీసీ వసతిగృహాల్లో ఈ ఏడాది పదో తరగతిలో 97.4 శాతం ఫలితాలు సాధించగా, వచ్చే ఏడాది నూరు శాతం సాధించే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది బీసీ విద్యార్థులకు రూ.1,600 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ చేసినట్లు మంత్రి చెప్పారు. విదేశాల్లో చదువుకునే బీసీ విద్యార్థుల కోసం ఒక్కొక్కరికి రూ.10లక్షలు ఖర్చు చేస్తున్నామన్నారు. ఈ ఏడాది 250మంది బీసీ విద్యార్థులను విదేశాల్లో చదివించేందుకు పంపామని తెలిపారు. ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, కోడూరు, అవనిగడ్డ జడ్పీటీసీ సభ్యులు బండే శ్రీనివాసరావు, కొల్లూరి వెంకటేశ్వరరావు, కోడూరు, మోపిదేవి ఎంపీపీలు మాచర్ల భీమయ్య, మోర్ల జయలక్ష్మి, బీసీ సంక్షేమ శాఖ డీడీ యుగంధర్, డివిజనల్ అధికారి కృష్ణారావు, గ్రామీణ యువజన వికాస సమితి అధ్యక్షుడు మండలి వెంకట్రామ్ (రాజా), టీడీపీ మండల అధ్యక్షుడు బచ్చు వెంకటనాథ్, ఎంపీటీసీ సభ్యులు గాజలు మురళీకృష్ణ, చిలకా శ్రీనుబాబు, బెల్లంకొండ రాణీధనలక్ష్మి పాల్గొన్నారు. -
రక్తదానంతో పునర్జన్మ
మచిలీపట్నం టౌన్: ప్రతి ఒక్కరికీ పునర్జన్మ ప్రసాదించేది ఒక్క రక్తదానమేనని అందుకే అన్ని దానాల్లోకెల్లా రక్తదానం గొప్పదని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖామంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జాతీయ స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవాన్ని శనివారం స్ధానిక జిల్లా ప్రభుత్వాసుపత్రి బ్లడ్‌బ్యాంక్ విభాగ వైద్యాధికారి డాక్టర్ అల్లాడ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మంత్రి రవీంద్ర మాట్లాడుతూ రక్తదానం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ప్రాణాపాయంలో ఉన్న రోగుల ప్రాణాలను కాపాడవచ్చునన్నారు. విద్యార్థులు, యువత స్వచ్ఛందంగా రక్తదానం చేస్తే సమాజానికి ఎంతో ఉపయోగమన్నారు. రక్తదానంతో పాటు అవయవదానం గురించి చైతన్యానికి అధికారులు, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకురావాలన్నారు. ఎంపీ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ ఎవరైనా ప్రాణాపాయ ప్రమాదంలో ఉంటే రక్తదానం చేసి వారి ప్రాణాలను కాపాడేందుకు విద్యార్థులు, యువకులు ముందుకురావాలని కోరారు. ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ ఎం జయకుమార్, జిల్లా లెప్రసీ అధికారి టీవీఎస్ఎన్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. ఎక్కువసార్లు రక్తదానం చేసిన రక్తదాతలను ఘనంగా సన్మానించారు. -
బోయ ఫెడరేషన్ ఏర్పాటు చేస్తాం
విజయవాడ (భవానీపురం): బోయల సంక్షేమానికి రూ.48 కోట్లతో బోయ ఫెడరేషన్తో పాటు దానికి పాలకవర్గాన్నికూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని బీసీ, ఎక్సైజ్, చేనేత మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. బీసీ శాఖ ఆదివారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన మహర్షి వాల్మీకీ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇకపై ప్రతి ఏడాది ఆశ్వీయుజ పౌర్ణమి రోజున వాల్మీకి జయంతి ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తామన్నారు. బీసీ వర్గాల్లోని యువతను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేందుకు ప్రతి నియోజకవర్గంలోనూ పరిశ్రమల పార్క్ ఏర్పాటు చేయనున్నాయని చెప్పారు. జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ మహర్షి వాల్మీకి 5వేల ఏళ్ల క్రితమే రామాయణ మహాకావ్యాన్ని రచించారని, ఆయనను ఆదర్శంగా తీసుకుని చదువు ప్రాముఖ్యతను గుర్తించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి.అనంతరామ్, బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ హర్షవర్ధన్, వాల్మీకి బోయ సంక్షేమ సంఘం కన్వీనర్ ఎమ్ జగదీష్, వాల్మీకి బోయ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ సీహెచ్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.