రాష్ట్రంలో కొత్తగా ఆరు మత్స్యకార వసతిగృహాలు
అవనిగడ్డ: రాష్ట్రంలో కొత్తగా ఆరు మత్స్యకార వసతిగృహాలను ఏర్పాటు చేసినట్లు బీసీ సంక్షేమశాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. స్థానిక రెండో వార్డులో నూతంగా ఏర్పాటుచేసిన బీసీ కళాశాల వసతి గృహాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికే నాలుగు మత్స్యకార వసతిగృహాలు ఉన్నాయని తెలిపారు. మరో ఆరు ఏర్పాటుకు శుక్రవారం జీవో జారీ చేశామని చెప్పారు. త్వరలోనే వీటి ఏర్పాటుకు చర్యలు చేపడతామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 374 బీసీ వసతిగృహాలు, 32 రెసిడెన్సియల్ స్కూల్స్ ఉన్నాయని, కార్పొరేట్‌కు దీటుగా మంచి ఫలితాలు సాధిస్తున్నాయని వివరించారు. బీసీ వసతిగృహాల్లో ఈ ఏడాది పదో తరగతిలో 97.4 శాతం ఫలితాలు సాధించగా, వచ్చే ఏడాది నూరు శాతం సాధించే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది బీసీ విద్యార్థులకు రూ.1,600 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ చేసినట్లు మంత్రి చెప్పారు. విదేశాల్లో చదువుకునే బీసీ విద్యార్థుల కోసం ఒక్కొక్కరికి రూ.10లక్షలు ఖర్చు చేస్తున్నామన్నారు. ఈ ఏడాది 250మంది బీసీ విద్యార్థులను విదేశాల్లో చదివించేందుకు పంపామని తెలిపారు. ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, కోడూరు, అవనిగడ్డ జడ్పీటీసీ సభ్యులు బండే శ్రీనివాసరావు, కొల్లూరి వెంకటేశ్వరరావు, కోడూరు, మోపిదేవి ఎంపీపీలు మాచర్ల భీమయ్య, మోర్ల జయలక్ష్మి, బీసీ సంక్షేమ శాఖ డీడీ యుగంధర్, డివిజనల్ అధికారి కృష్ణారావు, గ్రామీణ యువజన వికాస సమితి అధ్యక్షుడు మండలి వెంకట్రామ్ (రాజా), టీడీపీ మండల అధ్యక్షుడు బచ్చు వెంకటనాథ్, ఎంపీటీసీ సభ్యులు గాజలు మురళీకృష్ణ, చిలకా శ్రీనుబాబు, బెల్లంకొండ రాణీధనలక్ష్మి పాల్గొన్నారు.