అవనిగడ్డ అభ్యర్థి ఎంపికలో అయోమయం
జనసేన ఆశావహులను కాదని టీడీపీ నేతల వైపు పవన్ చూపు
తెరపైకి మండలి, రాధా పేర్లు
పార్టీ శ్రేణుల్లో పెరుగుతున్న అసహనం
సాక్షి, మచిలీపట్నం: కృష్ణాజిల్లా అవనిగడ్డ అసెంబ్లీ అభ్యర్థి ఎంపికపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయోమయంలో పడ్డారు. ఇక్కడ పార్టీలోని ఆశావహులను కాదని టీడీపీ నేతల వైపు ఆయన చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనికి బలం చేకూరుస్తూ జనసేన రోజుకో పేరుతో ఫోన్ సర్వేలు చేయిస్తుండడం పార్టీ శ్రేణుల్లో అసహనం పెంచుతోంది. గతనెలలో జనసేనలో చేరిన అవనిగడ్డకు చెందిన కాంట్రాక్టర్ విక్కుర్తి శ్రీనుతోపాటు ఎడ్లంకకు చెందిన ఎన్‌ఆర్‌ఐ బొబ్బా గోవర్ధన్, జనసేన ఉమ్మడి కృష్ణాజిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ, జనసేన మచిలీపట్నం నియోజకవర్గ కన్వినర్ బండి రామకృష్ణ ఈ సీటును ఆశిస్తున్నారు.
బండ్రెడ్డి రామకృష్ణ సొంతూరు నాగాయలంక మండలం మర్రిపాలెం. ఈయన తొలి నుంచీ పార్టీలో ఉన్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లా అధ్యక్షుడిగా ఇంతకాలం పార్టీకి సేవలందించానని తనకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే బందరు అసెంబ్లీ టికెట్ టీడీపీకి కేటాయించడంతో తనకు అవనిగడ్డలో అవకాశం ఇవ్వాలని బండి రామకృష్ణ అడుగుతున్నారు.
ఎన్‌ఆర్‌ఐ బొబ్బా గోవర్ధన్ ఇంగ్లాండ్‌లో ఉద్యోగం చేసుకుంటూ.. హోటల్ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఆయన ఇంత వరకు పార్టీలో చేరలేదు. టికెట్‌పై స్పష్టమైన హామీ ఇస్తే చేరతానని చెబుతున్నట్టు సమాచారం. బాపట్ల జిల్లాకు చెందిన సర్పంచ్‌ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిలకలపూడి పాపారావు కూడా అవనిగడ్డ టికెట్ కోసం తీవ్రంగా యత్నిస్తున్నారు.
రేసులో ముందున్న టీడీపీ నేతలు
ఈ సీటు కోసం జనసేన నుంచి టీడీపీ నేతలూ పోటీ పడుతున్నారు. ఇక్కడ వంగవీటి రాధాకృష్ణను బరిలోకి దించుతారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇక్కడ మండలి బుద్ధప్రసాద్‌కే టికెట్ ఇవ్వాలని టీడీపీ నేతలు రాజీనామాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment