ఈ మధ్యనే మైన్మార్‌లో ఒక మహిళ గుండెకు శస్త్ర చికిత్స జరిగింది. అయితే ఆమెది బాంబే బ్లడ్ గ్రూప్ కావడంతో ఆ దేశంలో ఎక్కడా ఆ గ్రూపు రక్తం దొరకలేదు. దీంతో ఆమె కోసం రెండు యూనిట్ల బాంబే బ్లడ్ గ్రూప్ రక్తాన్ని భారత్ నుంచి మైన్మార్ పంపించారు. ఆ దేశంలో రక్తం దొరక్కపోవడంతో మైన్మార్‌లోని యాంగూన్ ఆస్పత్రి డాక్టర్లు భారత్‌లో ఉన్న సంకల్ప్ ఇండియా సంస్థను సంప్రదించారు. ఈ ఫౌండేషన్ బాంబే బ్లడ్ ఉన్న బ్లడ్ బ్యాంకులు, డోనర్స్‌ను రక్తం అవసరమైన వారు సంప్రదించేలా చేస్తుంది. http://www.bombaybloodgroup.org/ వెబ్‌సైట్ ద్వారా వారికి రక్తం అందేలా చూస్తుంది. మైన్మార్ కేసులో ఫౌండేషన్ కర్ణాటకలోని దావణగెరెలో ఉన్న బ్లడ్ బ్యాంకును సంప్రదించడంతో వారి పని సులువైంది.
అరుదుగా...
సాధారణంగా రక్తం అవసరమైతే బ్లడ్ బ్యాంకులను సంప్రదిస్తారు. లేదా చుట్టుపక్కల ఎవరైనా డోనర్ ఉంటే వారి నుంచి తీసుకుంటారు. కానీ ‘బాంబే’ బ్లడ్ గ్రూప్ విషయంలో మాత్రం కష్టం. ఎందుకంటే భారతదేశంలో సుమారు 10 వేల మందిలో ఒకరు మాత్రమే ఈ బ్లడ్ గ్రూప్ కలిగినవారు ఉన్నారట. ‘ఈ గ్రూప్ వాళ్లను వెతకడం చాలా కష్టం. సాధారణ పరీక్షల వల్ల బాంబే బ్లడ్ గ్రూప్ గురించి తెలుసుకోలేం. అందుకే చాలా మందికి తమది బాంబే బ్లడ్ గ్రూప్ అని తెలీదు. రక్తం ఎక్కిస్తున్న సమయంలో ‘ఓ’ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కానప్పుడే వారికి బ్లడ్ గ్రూప్ తెలుస్తుంది.
ఎలా గుర్తిస్తారు?
ఈ గ్రూపు మనలో ఉందో లేదో తెలుసుకోవాలంటే.. ఒక ‘ఓ’ సెల్ పరీక్ష చేయాలి. రక్తం ‘ఓ’ బ్లడ్ గ్రూప్‌కు సంబంధించినది అయితే, ఆ పరీక్షలో రియాక్షన్ రాదు. కానీ ‘బాంబే’ బ్లడ్ గ్రూప్‌లో యాంటీబాడీస్ ఉండడం వల్ల ‘ఓ’ సెల్‌తో కూడా రియాక్షన్ ఉంటుంది. దాంతో అది ‘బాంబే’ గ్రూప్ అని తెలుస్తుంది. ఆ రక్తం గురించి తెలుసుకోడానికి యాంటీ కేపిటెల్ ‘ఎ’ లాక్టిన్ టెస్ట్ కూడా చేస్తారు. బాంబే బ్లడ్ గ్రూప్ అరుదైనది కాబట్టి... క్రయో ప్రిజర్వేషన్ అనే ఒక టెక్నిక్ ద్వారా ఆ రక్తాన్ని నిల్వ చేస్తారు. ఈ పద్ధతిలో రక్తాన్ని చాలా తక్కువ ఉష్ణోగ్రతలో ఉంచుతారు.
భిన్నంగా ఎందుకంటే..?
బాంబే బ్లడ్ గ్రూప్ మిగతా బ్లడ్ గ్రూపులకంటే భిన్నంగా ఉండడానికి ప్రత్యేక కారణం ఉంది. మన రక్తంలో ఉండే ఎర్ర రక్తకణాల్లో కొన్ని షుగర్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఎవరి బ్లడ్ గ్రూప్ ఏదో అవే నిర్ధారిస్తాయి. ఈ మాలిక్యూల్స్ నుంచి ‘కేపిటల్ హెచ్ యాంటీజన్’ తయారవుతుంది. దానివల్ల మిగతా యాంటీజెన్ ఎ, బి తయారయ్యి బ్లడ్ గ్రూప్ ఏర్పడుతుంది. బాంబే బ్లడ్ గ్రూప్ వారిలో షుగర్ మాలిక్యూల్స్ తయారు కాలేవు. అందుకే అందులో ‘కేపిటల్ హెచ్ యాంటిజెన్’ ఉండదు. అవి ఎలాంటి బ్లడ్ గ్రూపులోకి రాదు. కానీ, ఆ రక్తం ఉన్న వారి ప్లాస్మాలో యాంటీబాడీ ఎ, బి, హెచ్‌లు ఉంటాయి. ఈ బ్లడ్ గ్రూపు ఉన్న వారి జీవితం పూర్తిగా మామూలుగా ఉంటుంది.– విజయ దిలీప్ పోకల
బాంబే అనే పేరు ఎలా వచ్చింది
అన్ని బ్లడ్ గ్రూపులు ఇంగ్లిష్ అల్ఫాబెట్స్ ఎ, బి, ఓ లాంటి పేర్లతో ఉంటాయి. కానీ ఈ బ్లడ్ గ్రూప్ ఒక నగరం పేరుతో ఉంది. దీనికి ఒక ప్రత్యేకమైన ఒక కారణం ఉంది. మొట్టమొదట దీనిని మహారాష్ట్ర రాజధాని బాంబే (ప్రస్తుతం ముంబై)లో గుర్తించారు. వైఎం భెండె 1952లో ఈ గ్రూప్ రక్తం కనుగొన్నారు. ఇప్పుడు కూడా ఈ గ్రూప్ రక్తం ఉన్నవారు ఎక్కువగా ముంబైలోనే కనిపిస్తున్నారు. ఇక్కడ ఎక్కువగా కనిపించడానికి వంశపారంపర్యమే కారణం. ప్రస్తుతం బాంబే బ్లడ్ గ్రూప్ ఉన్న వారు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment