సాక్షి, ఒంగోలు: ప్రజాగొంతుక ‘సాక్షి’ దినపత్రిక జిల్లాలోని బ్లడ్‌బ్యాంకుల్లో రక్తనిల్వలను పెంచడానికి చేసిన కృషి ఫలించింది. జిల్లాలో ప్రస్తుతం రెడ్‌క్రాస్ రక్తనిల్వల కేంద్రాల్లో సరిపడా నిల్వలు పెరిగాయి. ప్రభుత్వ వైద్యకేంద్రాల్లో రక్తనిల్వలు నిండుకున్నాయని గుర్తించిన వెంటనే ‘సాక్షి’ సమరశంఖం పూరించింది. రెడ్‌క్రాస్ సొసైటీ నిల్వల కేంద్రాల పనితీరు..రోజువారీ క్షతగాత్రులకు అవసరమైన రక్తనిల్వల యూనిట్లపై ప్రచురించిన వరుస కథనాలతో అధికార యంత్రాంగంతో పాటు విద్యార్థి, ప్రజా, స్వచ్ఛంద సంఘాలు, వివిధ ఇంజినీరింగ్, డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు కదిలాయి.
కలెక్టర్ జీఎస్‌ఆర్‌కేఆర్ విజయ్‌కుమార్ స్వయంగా రెడ్‌క్రాస్ సొసైటీ పనితీరుపై దృష్టిపెట్టి.. ఎప్పటికప్పుడు ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాలపై స్పందించి సమీక్షలు చేశారు. కొద్దిరోజుల్లోనే ఆయన జిల్లాలో రక్తనిల్వలను పరిపూర్ణం చేశారు. ఒంగోలు రిమ్స్ ప్రభుత్వ వైద్యశాలతో పాటు ఒంగోలు, కందుకూరు, కనిగిరి, దర్శి, మార్కాపురం, గిద్దలూరు రెడ్‌క్రాస్ సొసైటీ బ్లడ్‌బ్యాంకుల్లో అవసరమైనంత మేర రక్తనిల్వలు అందుబాటులోకి వచ్చాయి.
అన్నిచోట్లా తెరుచుకున్న కేంద్రాలు..
జిల్లాలో దాదాపు 33 లక్షలకు పైగా జనాభా ఉన్నారు. కొన్ని ప్రత్యేక ప్రాంతాలు మినహా అన్నిచోట్లా కార్మిక, కర్షక, సామాన్య, దిగువ మధ్యతరగతి కుటుంబాలే అధికంగా ఉంటాయి. అయితే, జాతీయరహదారి పక్కనే ఉన్న జిల్లాప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలతో పాటు ఫ్లోరైడ్ పీడిత ప్రభావం నేపథ్యంలో రోజూ వందలాది మంది రోగపీడితులు ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు.
జిల్లాలో పురుషుల కంటే మహిళల్లో రక్తహీనత సమస్య కూడా అధికంగానే ఉందని గైనిక్ వైద్యనిపుణులు ఇప్పటికే సర్వేల ద్వారా నిగ్గుతేల్చారు. మాతాశిశు మరణాల రేటు ఏమాత్రం తగ్గలేదు. రోడ్డుప్రమాద బాధితులతో పాటు గర్భిణులకు అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాల్సి వచ్చినప్పుడు రక్తం ఎక్కించాలంటే.. నెలకిందటి వరకు కనాకష్టమయ్యేది. రక్తనిల్వల కేంద్రాల్లో రోజుకు సగటున 50 యూనిట్ల రక్తం అవసరం కాగా కేవలం 20 యూనిట్లు అందడం కూడా కష్టమైంది. సరిపడా రక్త నిల్వలు లేనందున రెడ్‌క్రాస్ సొసైటీ బ్లడ్‌స్టోరేజీ కేంద్రాలు కూడా మూతపడిపోయాయి.
రెడ్‌క్రాస్ కార్యదర్శిగా ఉన్న డాక్టర్ చలమయ్య తన పదవికి రాజీనామా చేసి వైదొలగడంతో.. ఈ విషయాన్ని గుర్తించిన ‘సాక్షి’ సమరశంఖం పూరించింది. వరుస కథనాలతో స్పందించిన కలెక్టర్ విజయకుమార్ జిల్లాలోని అన్ని ప్రభుత్వశాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రెడ్‌క్రాస్ సొసైటీ కార్యదర్శి బాధ్యతలను జెడ్పీసీఈవో ప్రసాద్‌కు అప్పగించారు. ఆ సొసైటీలో ఎక్స్‌అఫిషియో సభ్యులుగా జిల్లా రెవెన్యూ అధికారితో పాటు స్టెప్ సీఈవో, సీపీవో, డీఎంహెచ్‌వోలను నియమించారు. మూతపడిన రెడ్‌క్రాస్ కేంద్రాలన్నీ మళ్లీ తెరుచుకున్నాయి.
సమష్టి బాధ్యతగా రక్తదాన శిబిరాలు : తొలుతగా జూలై ఎనిమిదో తేదీన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని ‘సాక్షి’ సిబ్బంది యూనిట్ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. అనంతరం పొదిలి మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శిబిరంలో 183 యూనిట్లు రక్తం అందించారు. కనుమళ్లలోని ఎంఎల్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు 63 యూనిట్లు, ఒంగోలులోని నాగార్జున డిగ్రీ కాలేజీ విద్యార్థులు 26 యూనిట్లు అందజేశారు. అదేవిధంగా ఒంగోలు వాసవీక్లబ్ ప్రతినిధులు 21 యూనిట్లు రక్తదానం చేశారు. చీరాల, వేటపాలెం, కందుకూరు, కనిగిరి రెడ్‌క్రాస్ బ్లడ్‌బ్యాంకుల్లో ప్రస్తుతం సరిపడా రక్తనిల్వలున్నాయి.
నిండుగా రక్తనిల్వలు
Published Mon, Aug 25 2014 3:09 AM | Last Updated on Wed, Apr 3 2019 4:24 PM
Advertisement
Advertisement