kothagudem thermal power station
-
కేటీపీఎస్‌లో కాలుష్య నియంత్రణ ప్లాంట్
పాల్వంచ: విద్యుత్ కర్మాగారాల నుంచి వెలువడుతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా కొత్తగా నిర్మాణం చేస్తున్న కర్మాగారాల్లో ఫ్లూ గ్యాస్ డిసల్ఫరైజేషన్ ప్లాంట్ (ఎఫ్‌జీడీ) నిర్మాణాలు చేపట్టింది. తెలంగాణ స్టేట్ పొల్యూషన్ సెంట్రల్ బోర్డు ఆదేశాల మేరకు తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారి పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్) కేంద్రంగా ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నా రు. ఈ మేరకు టీఎస్ జెన్కో అధికారులు స్థల సేకరణ పనులు చేపట్టారు. నిర్మాణ పనులను సుమారు రూ.300 కోట్లతో బీహెచ్ఈఎల్ సంస్థ ఆధ్వర్యంలో పూర్తి చేయనున్నారు. దీని వల్ల కర్మాగారం నుంచి వెలువడే పొగలో హానికర వాయువులను పూర్తిగా నివారించే అవకాశం ఉంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్ డిమాండ్ దృష్ట్యా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాల్వంచ కేంద్రంగా కేటీపీఎస్ 7వ దశ (800మెగావాట్లు), మణుగూరు వద్ద బీటీపీఎస్ (1080 మెగావాట్లు), నల్లగొండ జిల్లా దామరచర్ల వద్ద యాదాద్రి పవర్ ప్లాంట్ (4వేల మెగావాట్లు) నిర్మాణ పనులు చేపట్టింది. ఈ క్రమంలో కేటీపీఎస్ 7వ దశ నిర్మాణ పనులు 2015లో ప్రారంభమై 2018 డిసెంబర్ 26న సీవోడీ (కమర్షియల్ ఆపరేషన్ డిక్లరేషన్) చేశారు. అప్పటి నుంచి 800 మెగావాట్ల ఉత్పత్తి నిరంతరాయంగా వస్తోంది. భద్రాద్రి, యాదాద్రి ప్లాంట్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అయితే ఉత్పత్తి సాధిస్తున్న కేటీపీఎస్ 7వ దశ సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ కేంద్రంగా కాలుష్య నియంత్రణ కోసం ఇప్పుడు పాటిస్తున్న ప్రమాణాలతో పాటు కొత్తగా ఫ్లూ గ్యాస్ డిసల్ఫరైజేషన్ ప్లాంట్ నిర్మించి కాలుష్యాన్ని మరింత తగ్గించేందుకు చర్యలు చేపడుతుండటం గమనార్హం. దీని ద్వారా బొగ్గు మండినప్పుడు వచ్చే సల్ఫర్ వాయువు (పొగ)లో నార్మల్ మీటర్ క్యూబ్ 50 మిల్లి గ్రామ్స్‌కు మించకుండా ఈ ప్లాంట్ ఉపయోపడుతుంది. దీని వల్ల హానికర వాయువులు తగ్గుతాయి. స్థల సేకరణకు యాజమాన్యం కసరత్తు బీహెచ్ఈఎల్ సంస్థ ఆధ్వర్యంలో రూ.300 కోట్లతో నిర్మించే ఈ ప్లాంట్ నిర్మాణానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఇందుకు గాను కేటీపీఎస్ కాంప్లెక్స్ పరిధిలో స్థల సేకరణ పనుల్లో జెన్కో అధికారులు నిమగ్నమయ్యారు. సుమారు 420 ఎకరాల్లో కేటీపీఎస్ 7వ దశను నిర్మించగా పక్కనే ఉన్న సెక్యూరిటీ కాలనీని ఎఫ్‌జీడీ ప్లాంట్ కోసం కేటాయించారు. సుమారు ఆరు దశాబ్దాల క్రితం సెక్యూరిటీ కాలనీలో నిర్మించిన క్వార్టర్లలో సిబ్బందిని ఖాళీ చేయించారు. వెంటనే వాటిని నేలమట్టం చేసే పనులు చేపట్టారు. 16 బ్లాక్‌లు(92 క్వార్టర్లు) గతంలో చాలా వరకు శిథిలావస్థకు చేరడంతో వీటిని తొలగించి నిర్మిస్తే మేలనే నిర్ణయంతో వీటిని తొలగిస్తున్నారు. క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్లు కూడా ఏర్పాటు కర్మాగారాల వల్ల వెలువడుతున్న కాలుష్యం వల్ల సమీప జీవరాశులు అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉండటంతో ఎఫ్‌జీడీ ప్లాంట్‌తో పాటు ఆంబియస్ట్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్ల (ఎఎక్యూఎంఎస్)ను ఏర్పాటు చేస్తున్నారు. కేటీపీఎస్ 7వ దశ పరిధిలో గల సురారం, పునుకుల, పుల్లాయిగూడెం, పాత ప్లాంట్, కూలింగ్ టవర్, బొల్లేరుగూడెం ఏరియాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. గాలిలో వచ్చే కాలుష్యాన్ని అంచనా వేయడం జరుగుతుంది. దీనిని ఇక్కడి అధికారులతో పాటు ఆన్లైన్ ద్వారా హైదరాబాద్‌లో ఉండే పొల్యూషన్ సెంట్రల్ బోర్డు అధికారులు కూడా మానిటరింగ్ చేయనున్నారు. ఎఫ్‌జీడీ ప్లాంట్‌తో కాలుష్య నియంత్రణ విద్యుత్ ఉత్పత్తి కర్మాగారాల్లో వెలువడే కాలుష్యాన్ని ఎఫ్‌జీడీ ప్లాంట్ నియంత్రిస్తుంది. ఇప్పటి వరకు తీసుకున్న చర్యలతో పాటు కొత్తగా ఈ ప్లాంట్ నిర్మాణం తప్పక చేయాలని పొల్యూషన్ బోర్డు అధికారుల ఆదేశాలు స్పష్టంగా ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారి రూ.300కోట్లతో ఏర్పాటు చేస్తున్నాం. సెక్యూరిటీ కాలనీ వద్ద స్థలాన్ని కేటాయించాం. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఖర్చు అధికమైనా ఈ ప్లాంట్ నిర్మాణం చేస్తున్నాం. జె.సమ్మయ్య, సీఈ కేటీపీఎస్ ఓఅండ్ఎం, 7వ దశ -
పట్టాలెక్కని హామీలు
కొత్తగూడెం : దక్షిణ భారత అయోధ్య అయిన భద్రాద్రి.. సిరులతల్లి సింగరేణి.. రాష్ట్రానికి విద్యుత్ వెలుగులు అందించే కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్‌తో దేశంలోనే పేరెన్నిక కలిగిన ఖమ్మం జిల్లాకు రైల్వే శాఖ మొండిచేయి చూపుతోంది. బ్రిటిష్ అధికారులు వేసిన లైన్లు మినహా కొత్త పట్టాలు మాత్రం ముందుకు సాగడం లేదు. జిల్లా వాణిజ్య, వ్యాపార, పర్యాటక రంగాలపై ప్రభావం చూపే రవాణా వ్యవస్థను మెరుగు పరచడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీంతో నాలుగు దశాబ్దాలుగా పెండింగ్‌లోనే ఉన్న కొవ్వూరు, సత్తుపల్లి - కొత్తగూడెం, పాండురంగాపురం - సారపాక లైన్లు ముందుకు సాగడం లేదు. సింగరేణి బొగ్గు సరఫరాపైనే జిల్లా నుంచి రైల్వే శాఖకు ప్రతి ఏటా రూ.600 కోట్ల ఆదాయం లభిస్తోంది. దీంతోపాటు పర్యావరణశాఖ విధించిన నిబంధనలను అనుసరించి రైల్వేల ద్వారానే బొగ్గు రవాణా చేయాలి. ఈ నేపథ్యంలో సత్తుపల్లి - కొత్తగూడేనికి కొత్త మార్గం ఏర్పాటు చేసేందుకు సింగరేణి సంస్థ ముందుకొచ్చినప్పటికీ భూ సేకరణ సమస్యగా మారింది. సర్వేకే పరిమితమవుతున్న కొవ్వూరు.. భద్రాచలం రోడ్ (కొత్తగూడెం) నుంచి తూర్పుగోదావరి జిల్లాలోని కొవ్వూరు వరకు రైల్వేలైన్ నిర్మించాలనే ప్రతిపాదనలు ఐదు దశాబ్దాలుగా సర్వేలకే పరిమితమవుతున్నా యి. ఈ లైన్ నిర్మిస్తే హైదరాబాద్ నుంచి విశాఖపట్టణం వెళ్లేందుకు 149 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. దీంతోపాటు జిల్లాలో ఉత్పత్తి అయ్యే బొగ్గును విశాఖపట్నం తది తర ప్రాంతాలకు రవాణా చేయడం సులభమవుతుంది. సుమారు 100 గిరిజన గ్రామాలకు రైలు సౌకర్యం ఏర్పడుతుంది. ప్రస్తుతం పారిశ్రామిక ప్రగతి మందగించిన కొత్తగూడెం ప్రాంతంలో ఈ రైల్వేలైన్ నిర్మాణంతో ఆర్థికంగా ఊరట కలుగుతుం ది. కొవ్వూరు రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని 1969 నుంచి ఆందోళనలు సాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2012లో ఈ లైన్‌ను మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటి వరకూ ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. రెండింతలైన సత్తుపల్లి లైన్ వ్యయం.. సత్తుపల్లిలోని జేవీఆర్ ఓసీపీ, కిష్టాపురం ఓసీపీల ద్వారా ఉత్పత్తి చేసే బొగ్గును ప్రతి ఏటా 2 మిలియన్ టన్నుల మేర సరఫరా చేసుకునేందుకు కొత్తగూడెం నుంచి సత్తుపల్లి వరకు 60 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మాణానికి నిధులు విడుదల చేసేందుకు సింగరేణి ముందుకొచ్చింది. ఫైనల్ సర్వే పూర్తి చేసేందుకు గాను ఏడాదిన్నర క్రితమే రూ.6 కోట్లు రైల్వే శాఖకు అందించగా,సర్వే పనులు కూడా పూర్తయ్యాయి. అయితే రెండేళ్ల క్రితం రూ.337.5 కోట్ల మేరకు అంచనా వేసినప్పటికీ నిర్మాణంలో జాప్యం జరగడంతో ఆ వ్యయం రెండింతలకు పైగానే పెరిగింది. ప్రస్తుతం ఈ లైన్ పూర్తి చేసేందుకు సుమారు రూ.800 కోట్లు అవరసమని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు అండగా నిలబడితే సత్తుపల్లి లైన్ త్వరితగతిన పూర్తయ్యే అవకాశాలున్నాయి. పెండింగ్‌లోనే ప్రాజెక్టులు.. ప్రధాన లైన్లతోపాటు అనేక లైన్లు కూడా జిల్లాలో ఏళ్ల తరబడి పెండింగ్‌లోనే ఉంటున్నాయి. భద్రాచలం పుణ్యక్షేత్రానికి రైలు మార్గం విస్తరించేందుకు పాండురంగాపురం నుంచి సారపాక వరకు ఏర్పాటు చేయతలపెట్టిన లైన్ కేవలం కాగితాలకే పరిమితమైంది. దీంతోపాటు సింగరేణి సంస్థ త్వరలో ఏర్పాటు చేయనున్న కోల్ కారిడార్‌లో బాగంగా మణుగూరు - రామగుండం లైన్, సత్తుపల్లి లైన్ పూర్తయితే దానిని అనుసందానం చేసుకుని కొండపల్లి నుంచి కొత్తగూడెం వరకు రైల్వే లైన్‌ను విస్తరించే అవకాశాలున్నాయి. మరి ఈ లైన్ల ఏర్పాటుకు ఈ సారైనా కేంద్రం కరుణిస్తుందా.. లేదా అని జిల్లా ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. -
విద్యుత్‌కు బొగ్గు దెబ్బ!
సాక్షి, హైదరాబాద్: సకాలంలో వర్షాలు లేక ఓవైపు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతోంటే... బొగ్గు కొరత, నాణ్యత లేమి కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరా పరిస్థితి అస్తవ్యస్తంగా తయారవుతోంది. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోవడంతో విద్యుత్ కోతలు అమలు చేయాల్సి వస్తోంది. ఇటు తెలంగాణలో నాణ్యతలేని బొగ్గు సరఫరా అవుతుండటంతో ప్లాంట్లలో తక్కువ విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. అటు ఆంధ్రప్రదేశ్ బొగ్గు లేక ప్లాంట్లలో ఉత్పత్తి నిలిచిపోతోంది. వీటికితోడు ఒకవేళ సాంకేతిక కారణాలతో ప్లాంట్లలో సరఫరా నిలిచిపోతే అనధికారికంగా మరింత కోత విధించాల్సి వస్తోంది. ఫలితంగా ఇరు రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు భారీగా అమలవుతున్నాయి. ఇటు నాణ్యతలేమి.. అటు బొగ్గులేమి! నాణ్యతలేని నాసిరకం బొగ్గుతో (తక్కువ గ్రేడ్) తెలంగాణలోని విద్యుత్ ప్లాంట్లలో సామర్థ్యం కంటే తక్కువగా విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఉదాహరణకు ఖమ్మం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్)లో 65 మెగావాట్ల యూనిట్లలో 40 నుంచి 45 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అవుతోంది. 125 మెగావాట్ల సామర్థ్యం కలిగిన యూనిట్లలో 65 నుంచి 90 మెగావాట్ల విద్యుత్ మాత్రమే వస్తోంది. ఇక 500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన యూనిట్లో విద్యుత్ ఉత్పత్తి 440 మెగావాట్లకు మించడం లేదు. తక్కువ గ్రేడ్ బొగ్గు వస్తుండటంతో.. బాయిలర్లలో అనుకున్న మేరకు ఉష్ణోగ్రత స్థాయి రావడం లేదు. దీంతో ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోతోంది. మొత్తంగా విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోతుండటంతో కోతలను అమలు చేయాల్సి వస్తోంది. అటు ఆంధ్రప్రదేశ్‌లో బొగ్గు లేకపోవడంతో వైఎస్సార్ జిల్లాలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ (ఆర్టీపీపీ), విజయవాడలోని నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్టీటీపీఎస్)ల్లో ఒక్కో యూనిట్లో ఉత్పత్తి నిలిపివేసి.. నిర్వహణ మరమ్మతులు చేస్తున్నారు. ఫలితంగా మొత్తం 420 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. -
రెండోరోజూ విధుల బహిష్కరణ
పాల్వంచ, న్యూస్‌లైన్: ఉద్యోగుల మెరుపు సమ్మెతో పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్(కేటీపీఎస్)లో విద్యుదుత్పత్తి చేసే యూనిట్లు క్రమంగా నిలిచిపోతున్నాయి. విద్యుత్ ఉద్యోగులకు వెంటనే పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిబ్బంది సమ్మె బాట పట్టడంతో రాష్ట్ర గ్రిడ్‌కు అందించే విద్యుత్ ఉత్పత్తి భారీ స్థాయిలో పడిపోయింది. కేటీపీఎస్ ఓఅండ్ఎం, ఐదు, ఆరు దశల్లోని మొత్తం 11 యూనిట్లలో రోజుకు 1,720 మెగావాట్ల విద్యుదుత్పత్తి కావాల్సి ఉండగా, సిబ్బంది సమ్మెతో ఆది, సోమవారాల్లో 180 మెగావాట్లకు పడిపోయింది. సమ్మె ఇలానే కొనసాగితే మరి కొద్దిగంటల్లో విద్యుదుత్పత్తి పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పీఆర్సీ విడుదల చేయాలని కోరుతూ విద్యుత్ ఉద్యోగులు ఆదివారం చేపట్టిన సమ్మెను సోమవారం ఉధృతం చేశారు. విధులు బహిష్కరించిన సిబ్బంది అధికారులను సైతం లోనికి వెళ్లనివ్వలేదు. దీంతో కర్మాగారంలో పనిచేసే సిబ్బంది లేక విద్యుదుత్పత్తి క్రమంగా పడిపోతోంది. బంకర్లలో బొగ్గు నిల్వలు నిండుకుంటుండటంతో యూనిట్లు ఒక్కొక్కటిగా నిలిచిపోతున్నాయి. 6వ దశలోని 500 మెగావాట్ల సామర్థ్యం గల 11వ యూనిట్ ఆదివారమే నిలిచిపోగా, 250 మెగావాట్ల సామర్థ్యం గల 10వ యూనిట్ సోమవారం పడిపోయింది. 9వ యూనిట్లో 250 మెగావాట్లకు గాను 120 మెగావాట్ల ఉత్పత్తి మాత్రమే వస్తోంది. ఓఅండ్ఎం పరిధిలో మొత్తం 720 మెగావాట్ల సామర్థ్యం కాగా అందులో 8వ యూనిట్‌లోని 120 మెగావాట్లను వార్షిక మరమ్మతుల కోసం గత శనివారమే షట్‌డౌన్ చేశారు. దీంతో ప్రస్తుతం 600 మెగావాట్లు ఉత్పత్తి అవుతుండగా సమ్మె కారణంగా ఇక్కడ బొగ్గు లెవల్ పడిపోవడంతో 60 మెగావాట్లు తగ్గినట్లు అధికారులు తెలిపారు. సమ్మె ఇలాగే కొనసాగితే కొద్ది గంటల్లోనే పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తి తగ్గే ప్రమాదం ఉందని సమాచారం. ఈ ప్రభావం రాష్ట్ర గ్రిడ్‌తో పాటు జిల్లాలోని బూడిదంపాడు, సీతారాంపట్నం, ఇతర ప్రాంతాలైన సీలేరు, మిర్యాలగూడెం, శ్రీశైలం తదితర ఫీడర్లపై పడవచ్చని అధికారులు ఆందోళన చెందుతున్నారు. రోజుకు పదికోట్ల విలువైన హెచ్ఎఫ్వో ఆయిల్ వాడకం? బొగ్గు నిల్వలు అందించే మార్గం లేకపోవడంతో విద్యుదుత్పత్తికి బొగ్గు స్థానంలో హెచ్ఎఫ్వో (హెవీ ఫ్యూయల్ ఆయిల్)ను వాడుతున్నారు. అయితే ఇప్పటికే సుమారు రూ.10 కోట్ల విలువైన ఆయిల్‌ను వాడినట్లు సమాచారం. దీని వల్ల జెన్కోపై ఆర్థిక భారం పడుతున్నట్లు తెలుస్తోంది. అంతేగాక జీరో లెవల్లో హెచ్ఎఫ్వోను అధికంగా వాడటం వల్ల బాయిలర్ దెబ్బతిని యూనిట్ల జీవితకాలం కూడా తగ్గే ప్రమాదం ఉందని కార్మిక సంఘాల వారు అంటున్నారు. బొగ్గు లేని సమయాల్లో సేఫ్టీగా యూనిట్లను నిలిపి వేయాలనే ఆదేశాలు ఉన్నప్పటికీ అధికారులు మొండి వైఖరితో నడిపిస్తూ తమ ఆధిపత్యం చూపేందుకు ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. 5,6 దశల కర్మాగాల ఎదుట ధర్నా.. కేటీపీఎస్ 5, 6 దశల కర్మాగారం ఎదుట వివిధ యూనియన్ల నాయకులు సోమవారం టెంట్ వేసి ధర్నా చేపట్టారు. వారు విధులు బహిష్కరించడంతో పాటు ఉద్యోగులు, కార్మికులు లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆందోళనతో విద్యుత్ ఉత్పత్తి తగ్గే ప్రమాదం ఉందని, సమ్మె విరమించి సహకరించాలని చీఫ్ ఇంజనీర్ సిద్దయ్య, ఇతర అధికారులు ధర్నా శిబిరం వద్దకు వచ్చి కోరినా ఆందోళనకారులు అంగీకరించలేదు. పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, మెడికల్ రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని, కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, ఈపీఎఫ్‌ను జీపీఎఫ్‌గా మార్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో 1104 యూనియన్ నాయకులు కేశబోయిన కోటేశ్వరరావు, సునీల్ రెడ్డి, 327 నాయకులు పి.వి.కోటేశ్వరరావు, 1535 నాయకులు సాంబయ్య, లీవెన్, అంబాల శ్రీను, హెచ్ 67 నాయకులు ఎం.రమేష్, తెలంగాణ విద్యుత్ ఇంజనీర్స్ అసోసియేషన్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి భాస్కర్, ఏఈస్ అసోసియేషన్ నాయకులు అన్వర్‌బాషా, టీఎన్టీయూసీ నాయకులు గొర్రె వేణుగోపాల్, కట్టా శ్రీధర్, డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ నాయకులు సురేష్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. సమ్మెను పర్యవేక్షించిన ఓఎస్డీ, డీఎస్పీ విద్యుత్ ఉద్యోగులు చేపట్టిన సమ్మెను కొత్తగూడెం ఓఎస్డీ తిరుపతి , డీఎస్పీ ఆర్.భాస్కర్ పర్యవేక్షించారు. ఆందోళన గురించి ఎస్ఈ బిచ్చన్నను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఎస్పీఎఫ్ కమాండెంట్ జమీల్ పాషాతో పాటు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రావు, ఎస్ఐ సుధీర్, రూరల్ ఎస్ఐ అంజయ్య తదితరులు బందోబస్తు నిర్వహించారు. -
కేటీపీఎస్‌లో 10 యూనిట్లలో సాంకేతిక లోపం
ఖమ్మం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్‌లోని10 యూనిట్లలో బుధవారం సాంకేతిక లోపం ఏర్పడింది. దాంతో 1660 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దాంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. కేటీపీఎస్‌లో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని నివారించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. -
రాష్ట్రానికి వరం...పాల్వంచకు శాపం
సాక్షి, కొత్తగూడెం రాష్ట్రానికి కాంతి రేఖలు ప్రసాదిస్తున్న కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్) జనావాసాల్లో కాలకూట విషాన్ని విరజిమ్ముతోంది. పవర్ స్టేషన్ నుంచే వచ్చే పొగ, బూడిదతో పాల్వంచతో పాటు మండలంలోని సుమారు 25 గ్రామాల ప్రజలు కాలుష్యకోరల్లో చిక్కుకుంటున్నారు. పశుపక్ష్యాదుల మనుగడకూ ఇది ప్రమాదంగా మారింది. అయినా యాజమాన్యం పరిశ్రమల సామాజిక బాధ్యత (సీఎస్ఆర్ )పాలసీని మాత్రం అమలు చేయడం లేదు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న సంస్థల్లో కేటీపీఎస్ ప్రధానమైంది. ఇక్కడి 11 యూనిట్లు రాష్ట్ర గ్రిడ్‌కు రోజుకు సుమారు 40 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను అందిస్తున్నాయి. కేటీపీఎస్‌లోని ఓఅండ్ఎం, 5, 6 దశలకు 1720 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. ఇక్కడి విద్యుత్ ఉత్పత్తికి సింగరేణి బొగ్గు కీలకం. ఈ బొగ్గును మండించి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నా.. ఈ ప్రక్రియలో వెలువడే కాలుష్య ఉద్గారాల విషయంలో సంస్థ నిబంధనలకు నీళ్లొదిలింది. ఈ కర్మాగారంతో తమ జీవితాల్లో వెలుగులు నిండుతాయని భావించిన పాల్వంచ ప్రాంత వాసుల బతుకుల్లో చీకట్లు అలుముకున్నాయి. చిమ్మీల నుంచి నిరంతరం నిబంధనలకు విరుద్ధంగా 4, 5 రెట్లు అధికంగా పొగ, బూడిద వెలువడుతుండడంతో ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. ప్రభుత్వం అధికారికంగా ముద్రించిన 5వ తరగతి సామాన్యశాస్త్రంలో కేటీపీఎస్ కాలుష్యాన్ని ప్రస్తావించడం గమనార్హం. కాలుష్య ప్రభావిత గ్రామాల్లో వైద్య పరీక్షలు, పర్యావరణ సమతుల్యత కార్యక్రమాలు చేపట్టాలనే నిబంధనను సంస్థ తుంగలో తొక్కుతోంది. చుట్టుపక్కల గ్రామాల్లో మొక్కలు పెంచాల్సి ఉన్నా.. అదికూడా పాటించడం లేదు. కాలుష్య ప్రభావంతో ఇక్కడి ప్రజలు వయసు మీరకముందే రోగనిరోధక శక్తి కోల్పోతూ శ్వాసకోశ, చర్మవ్యాధులతో మంచాన పడుతున్నారు. కలుషితమవుతున్న కిన్నెరసాని, బూడిదవాగు జలాలు.. కిన్నెరసాని నీటిని సంస్థ ఉపయోగించుకుంటోంది. అయితే వాడిన తర్వాత వచ్చే బూడిద నీరు ఈ నదిలో వదలడంతో నీరు కలుషితమవుతోంది. కేటీపీఎస్ సమీపంలోని బూడిదవాగు కూడా కలుషితమవుతోంది. నిరంతరం బూడిద వస్తుండడంతో కిన్నెరసాని పరివాహక ప్రాంతాల్లో ఉన్న పాండురంగాపురం, సూరారం, సోములగూడెం, బిక్కుతండా ప్రజలు తాగునీటికి ఇంకా చలమలపైనే ఆధారపడుతున్నారు. ఆ నీళ్లు కూడా బూడిదతో ఉంటున్నాయి. ఒకప్పుడు చెలమల్లో నీరు స్వచ్ఛంగా ఉండేవని, ఇప్పుడవి తాగేందుకు పనికి రావడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొగ, బూడిదతో పాటు భూగర్భ జలాలు కూడా కలుషితం కావడంతో రంగాపురం, పునుకుల, పుల్లాయిగూడెం, కరకవాగు, కోడిపుంజులవాగు గ్రామాల్లో చేతిపుంపుల నీరు మురికిగా వస్తోంది. కాలుష్యం 30 కిలోమీటర్ల మేరకు వ్యాపిస్తుండడంతో సమీప పంటలపైనా ప్రభావం చూపుతోంది. కర్మాగారం చుట్టూ పాల్వంచ మండలానికి చెందిన రైతులు వేలాది ఎకరాల్లో పత్తి, వరి, పామాయిల్ సాగు చేశారు. చిమ్మీల నుంచి వచ్చే పొగ, బూడిద.. పంటలపై పడడంతో దిగుబడి అనుకున్న స్థాయిలో రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాంతకంగా మారిన కాలుష్యం.. కేటీపీఎస్‌లోని చిమ్మీల నుంచి నిబంధనల ప్రకారం విడుదలవ్వాల్సిన ధూళి కన్నా నాలుగైదు రెట్లు అధికంగా బయటకు విరజిమ్ముతోంది. దీనిపై కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి. ఓఅండ్‌ఎంలో ధూళి శాతం సాధారణంగా 100 మైక్రో గ్రామ్స్ ఫర్ మీటర్ క్యూబ్ విడుదలవ్వాలి. కానీ 246.1 మైక్రో గ్రామ్స్/ మీటర్ క్యూబ్ విడుదలవుతోంది. టీఎస్‌పీఎం (మొత్తం ధూళి శాతం) 200 మైక్రో గ్రామ్స్బై మీటర్ క్యూబ్ విడదలవ్వాల్సి ఉండగా 567.0 మైక్రో గ్రామ్స్/ మీటర్ క్యూబ్ విడుదలవుతోంది. దీంతో ఈ ప్రాంత వాసులు శ్వాస కోశ వ్యాధుల బారిన పడుతున్నారు. కాలుష్యం ఎక్కువ మోతాదులో ఉంటుందని, దీని నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కాలుష్య నియంత్రణ మండలి పలుమార్లు యాజమాన్యాన్ని హెచ్చరించినా బేఖాతర్ చేసింది. ఈ క్రమంలో త్వరలో కేటీపీఎస్ విస్తరణలో భాగంగా చేపట్టనున్న 7వ దశ నిర్మాణంపై అప్పుడే నిరసనలు వెలువడుతున్నాయి. ఇప్పటికే నిర్మించిన దశల ద్వారా సీఎస్ఆర్ పాలసీ అమలు చేయకుండా, మళ్లీ ఇంకో దశ నిర్మాణంపై జెన్కో దృష్టి పెట్టడంతో ఇక్కడి గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఎస్ఆర్ పాలసీ అమలెక్కడ ..? కాలుష్య ప్రభావిత ప్రాంతాల్లో సంస్థ తన లాభాల్లో 2 శాతం నిధులతో అభివృద్ధి పనులు, పర్యావరణ పరిరక్షణ, వైద్య సదుపాయాలు కల్పించాలి. కానీ కేటీపీఎస్ యాజమాన్యం వీటిని విస్మరించింది. వందల కోట్ల టర్నోవర్ కలిగి ఉన్న ఈ సంస్థ పాల్వంచ మండలంలో ప్రభావిత గ్రామాల్లో చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలున్నాయి. తాగునీరు కలుషితం అవుతున్నా రక్షిత మంచినీటిని అందించడం లేదు. తీవ్ర ప్రభావం ఉన్న గ్రామాలను దత్తత తీసుకొని అక్కడ మౌలిక వసతులు కల్పించాలని సీఎస్ఆర్ పాలసీ స్పష్టం చేస్తోంది. కానీ యాజమాన్యం ప్రజల ప్రాణాలను గాలికి వదిలి.. రాష్ట్రానికి వెలుగులు అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నా.. ప్రభావిత గ్రామాల ప్రజల జీవితాల్లో చీకట్లు నింపింది. కాలుష్యంతో బాలుతండా ఖాళీ.. సూరారం శివారులో ఒకప్పుడు గిరిజన కుటుంబాలతో కళకళలాడిన బాలుతండా కేటీపీఎస్ కాలుష్యంతా ఖాళీ అయింది. ఇక్కడ 70 కుటుంబాలు నివాసం ఉండేవి. అయితే కేటీపీఎస్ వద్ద నిర్మించిన యాష్‌పాండ్ ఈ తండాకు అతి దగ్గరగా ఉంది. కర్మాగారం నుంచి యాష్పాండ్లలో బూడిద నీరు నిల్వ ఉంటుండడంతో తండాలో ఉన్న చేతిపంపు నీరు బూడిద రంగులో వచ్చేది. దీంతో తాగునీటికి వీరు ఇబ్బంది పడ్డారు. అలాగే యాష్‌పాండ్ నుంచి ఊట వచ్చి వీరి ఇళ్లు కూలిపోయాయి. దీంతో చేసేదేమీ లేక ఈ కుటుంబాలన్నీ 2004 -05లో ఆ ప్రాంతాన్ని వదిలి సమీపంలో పాత సూరారం రోడ్డుకు తరలివెళ్లాయి. ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయిస్తే వారే ఇళ్లు నిర్మించుకున్నారు. కాగా అప్పట్లో జెన్కో ఎండీ కూడా వీరి పరిస్థితులను స్వయంగా పరిశీలించి ఆదుకుంటామని భరోసా ఇచ్చినా అది నీటి మూటే అయింది. దీంతో కాలనీవాసులు ఇప్పటికీ తమకు సంస్థ నుంచి ఏమైనా సహాయం అందుతుందేమోనని నిరీక్షిస్తున్నారు. ప్రమాదస్థాయిలో వ్యర్థాలు వెలువడుతున్నాయి : ఎం.నారాయణ, కాలుష్య నియంత్రణాధికారి, కొత్తగూడెం బూడిద కిన్నెరసానిలో కలుస్తోందని, ప్రమాద స్థాయిలో వ్యర్థాలు వెలువడుతున్నాయని.. వాటి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే కేటీపీఎస్ యాజమాన్యానికి పలుమార్లు నోటీసులు ఇచ్చాం. పరిశ్రమ నుంచి వెలువడే వ్యర్థాలు సాధారణంగా 115 ఎంజీ/ఎన్ఎం క్యూబ్ స్థాయిలో ఉండాలి. కానీ ఇది 500 నుంచి 1000 పైగా ఉంటోంది. ప్లాంట్ నుంచి యాష్‌పాండ్‌కు వెళ్లే బూడిద పైపులైన్లు లీకేజీ కావడంతో కిన్నెరసాని నీరు కలుషితమవుతోందని నోటీసులు ఇచ్చినా స్పందన లేదు. అలాగే 5, 6 దశలోల షెర్మింటేషన్ ట్యాంకులు లేకపోవడంతో ఈ ప్లాంట్లలో వాషింగ్ ద్వారా వచ్చే నీరంతా నేరుగా కిన్నెరసానిలో కలిసి నీరు కలుషితమవుతోంది.