కొత్తగూడెం : దక్షిణ భారత అయోధ్య అయిన భద్రాద్రి.. సిరులతల్లి సింగరేణి.. రాష్ట్రానికి విద్యుత్ వెలుగులు అందించే కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్‌తో దేశంలోనే పేరెన్నిక కలిగిన ఖమ్మం జిల్లాకు రైల్వే శాఖ మొండిచేయి చూపుతోంది. బ్రిటిష్ అధికారులు వేసిన లైన్లు మినహా కొత్త పట్టాలు మాత్రం ముందుకు సాగడం లేదు. జిల్లా వాణిజ్య, వ్యాపార, పర్యాటక రంగాలపై ప్రభావం చూపే రవాణా వ్యవస్థను మెరుగు పరచడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.
దీంతో నాలుగు దశాబ్దాలుగా పెండింగ్‌లోనే ఉన్న కొవ్వూరు, సత్తుపల్లి - కొత్తగూడెం, పాండురంగాపురం - సారపాక లైన్లు ముందుకు సాగడం లేదు. సింగరేణి బొగ్గు సరఫరాపైనే జిల్లా నుంచి రైల్వే శాఖకు ప్రతి ఏటా రూ.600 కోట్ల ఆదాయం లభిస్తోంది. దీంతోపాటు పర్యావరణశాఖ విధించిన నిబంధనలను అనుసరించి రైల్వేల ద్వారానే బొగ్గు రవాణా చేయాలి. ఈ నేపథ్యంలో సత్తుపల్లి - కొత్తగూడేనికి కొత్త మార్గం ఏర్పాటు చేసేందుకు సింగరేణి సంస్థ ముందుకొచ్చినప్పటికీ భూ సేకరణ సమస్యగా మారింది.
సర్వేకే పరిమితమవుతున్న కొవ్వూరు..
భద్రాచలం రోడ్ (కొత్తగూడెం) నుంచి తూర్పుగోదావరి జిల్లాలోని కొవ్వూరు వరకు రైల్వేలైన్ నిర్మించాలనే ప్రతిపాదనలు ఐదు దశాబ్దాలుగా సర్వేలకే పరిమితమవుతున్నా యి. ఈ లైన్ నిర్మిస్తే హైదరాబాద్ నుంచి విశాఖపట్టణం వెళ్లేందుకు 149 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. దీంతోపాటు జిల్లాలో ఉత్పత్తి అయ్యే బొగ్గును విశాఖపట్నం తది తర ప్రాంతాలకు రవాణా చేయడం సులభమవుతుంది.
సుమారు 100 గిరిజన గ్రామాలకు రైలు సౌకర్యం ఏర్పడుతుంది. ప్రస్తుతం పారిశ్రామిక ప్రగతి మందగించిన కొత్తగూడెం ప్రాంతంలో ఈ రైల్వేలైన్ నిర్మాణంతో ఆర్థికంగా ఊరట కలుగుతుం ది. కొవ్వూరు రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని 1969 నుంచి ఆందోళనలు సాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2012లో ఈ లైన్‌ను మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటి వరకూ ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు.
రెండింతలైన సత్తుపల్లి లైన్ వ్యయం..
సత్తుపల్లిలోని జేవీఆర్ ఓసీపీ, కిష్టాపురం ఓసీపీల ద్వారా ఉత్పత్తి చేసే బొగ్గును ప్రతి ఏటా 2 మిలియన్ టన్నుల మేర సరఫరా చేసుకునేందుకు కొత్తగూడెం నుంచి సత్తుపల్లి వరకు 60 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మాణానికి నిధులు విడుదల చేసేందుకు సింగరేణి ముందుకొచ్చింది. ఫైనల్ సర్వే పూర్తి చేసేందుకు గాను ఏడాదిన్నర క్రితమే రూ.6 కోట్లు రైల్వే శాఖకు అందించగా,సర్వే పనులు కూడా పూర్తయ్యాయి.
అయితే రెండేళ్ల క్రితం రూ.337.5 కోట్ల మేరకు అంచనా వేసినప్పటికీ నిర్మాణంలో జాప్యం జరగడంతో ఆ వ్యయం రెండింతలకు పైగానే పెరిగింది. ప్రస్తుతం ఈ లైన్ పూర్తి చేసేందుకు సుమారు రూ.800 కోట్లు అవరసమని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు అండగా నిలబడితే సత్తుపల్లి లైన్ త్వరితగతిన పూర్తయ్యే అవకాశాలున్నాయి.
పెండింగ్‌లోనే ప్రాజెక్టులు..
ప్రధాన లైన్లతోపాటు అనేక లైన్లు కూడా జిల్లాలో ఏళ్ల తరబడి పెండింగ్‌లోనే ఉంటున్నాయి. భద్రాచలం పుణ్యక్షేత్రానికి రైలు మార్గం విస్తరించేందుకు పాండురంగాపురం నుంచి సారపాక వరకు ఏర్పాటు చేయతలపెట్టిన లైన్ కేవలం కాగితాలకే పరిమితమైంది. దీంతోపాటు సింగరేణి సంస్థ త్వరలో ఏర్పాటు చేయనున్న కోల్ కారిడార్‌లో బాగంగా మణుగూరు - రామగుండం లైన్, సత్తుపల్లి లైన్ పూర్తయితే దానిని అనుసందానం చేసుకుని కొండపల్లి నుంచి కొత్తగూడెం వరకు రైల్వే లైన్‌ను విస్తరించే అవకాశాలున్నాయి. మరి ఈ లైన్ల ఏర్పాటుకు ఈ సారైనా కేంద్రం కరుణిస్తుందా.. లేదా అని జిల్లా ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.
పట్టాలెక్కని హామీలు
Published Tue, Jul 8 2014 1:57 AM | Last Updated on Sat, Sep 2 2017 9:57 AM
Advertisement