సాక్షి, హైదరాబాద్: సకాలంలో వర్షాలు లేక ఓవైపు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతోంటే... బొగ్గు కొరత, నాణ్యత లేమి కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరా పరిస్థితి అస్తవ్యస్తంగా తయారవుతోంది. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోవడంతో విద్యుత్ కోతలు అమలు చేయాల్సి వస్తోంది. ఇటు తెలంగాణలో నాణ్యతలేని బొగ్గు సరఫరా అవుతుండటంతో ప్లాంట్లలో తక్కువ విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. అటు ఆంధ్రప్రదేశ్ బొగ్గు లేక ప్లాంట్లలో ఉత్పత్తి నిలిచిపోతోంది. వీటికితోడు ఒకవేళ సాంకేతిక కారణాలతో ప్లాంట్లలో సరఫరా నిలిచిపోతే అనధికారికంగా మరింత కోత విధించాల్సి వస్తోంది. ఫలితంగా ఇరు రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు భారీగా అమలవుతున్నాయి.
ఇటు నాణ్యతలేమి.. అటు బొగ్గులేమి!
నాణ్యతలేని నాసిరకం బొగ్గుతో (తక్కువ గ్రేడ్) తెలంగాణలోని విద్యుత్ ప్లాంట్లలో సామర్థ్యం కంటే తక్కువగా విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఉదాహరణకు ఖమ్మం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్)లో 65 మెగావాట్ల యూనిట్లలో 40 నుంచి 45 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అవుతోంది. 125 మెగావాట్ల సామర్థ్యం కలిగిన యూనిట్లలో 65 నుంచి 90 మెగావాట్ల విద్యుత్ మాత్రమే వస్తోంది.
ఇక 500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన యూనిట్‌లో విద్యుత్ ఉత్పత్తి 440 మెగావాట్లకు మించడం లేదు. తక్కువ గ్రేడ్ బొగ్గు వస్తుండటంతో.. బాయిలర్లలో అనుకున్న మేరకు ఉష్ణోగ్రత స్థాయి రావడం లేదు. దీంతో ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోతోంది. మొత్తంగా విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోతుండటంతో కోతలను అమలు చేయాల్సి వస్తోంది.
అటు ఆంధ్రప్రదేశ్‌లో బొగ్గు లేకపోవడంతో వైఎస్సార్ జిల్లాలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ (ఆర్‌టీపీపీ), విజయవాడలోని నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్‌టీటీపీఎస్)ల్లో ఒక్కో యూనిట్‌లో ఉత్పత్తి నిలిపివేసి.. నిర్వహణ మరమ్మతులు చేస్తున్నారు. ఫలితంగా మొత్తం 420 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.
విద్యుత్‌కు బొగ్గు దెబ్బ!
Published Thu, Jun 26 2014 2:06 AM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM
Advertisement
Advertisement