రాష్ట్రానికి వరం...పాల్వంచకు శాపం | palvancha power plant releases poision water | Sakshi
Sakshi News home page

రాష్ట్రానికి వరం...పాల్వంచకు శాపం

Published Mon, Sep 23 2013 3:19 AM | Last Updated on Fri, Sep 1 2017 10:57 PM

palvancha power plant releases  poision water

 సాక్షి, కొత్తగూడెం
 రాష్ట్రానికి కాంతి రేఖలు ప్రసాదిస్తున్న కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్) జనావాసాల్లో కాలకూట విషాన్ని విరజిమ్ముతోంది. పవర్ స్టేషన్ నుంచే వచ్చే పొగ, బూడిదతో పాల్వంచతో పాటు మండలంలోని సుమారు 25 గ్రామాల ప్రజలు కాలుష్యకోరల్లో చిక్కుకుంటున్నారు. పశుపక్ష్యాదుల మనుగడకూ ఇది ప్రమాదంగా మారింది. అయినా యాజమాన్యం పరిశ్రమల సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్ )పాలసీని మాత్రం అమలు చేయడం లేదు.
 
 రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న సంస్థల్లో కేటీపీఎస్ ప్రధానమైంది. ఇక్కడి 11 యూనిట్లు రాష్ట్ర గ్రిడ్‌కు రోజుకు సుమారు 40 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను అందిస్తున్నాయి. కేటీపీఎస్‌లోని ఓఅండ్‌ఎం, 5, 6 దశలకు 1720 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. ఇక్కడి విద్యుత్ ఉత్పత్తికి సింగరేణి బొగ్గు కీలకం. ఈ బొగ్గును మండించి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నా.. ఈ ప్రక్రియలో వెలువడే కాలుష్య ఉద్గారాల విషయంలో సంస్థ నిబంధనలకు నీళ్లొదిలింది. ఈ కర్మాగారంతో తమ జీవితాల్లో వెలుగులు నిండుతాయని భావించిన పాల్వంచ ప్రాంత వాసుల బతుకుల్లో చీకట్లు అలుముకున్నాయి. చిమ్మీల నుంచి నిరంతరం నిబంధనలకు విరుద్ధంగా 4, 5 రెట్లు అధికంగా పొగ, బూడిద వెలువడుతుండడంతో ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. ప్రభుత్వం అధికారికంగా ముద్రించిన 5వ తరగతి సామాన్యశాస్త్రంలో కేటీపీఎస్ కాలుష్యాన్ని ప్రస్తావించడం గమనార్హం. కాలుష్య ప్రభావిత గ్రామాల్లో వైద్య పరీక్షలు, పర్యావరణ సమతుల్యత కార్యక్రమాలు చేపట్టాలనే నిబంధనను సంస్థ తుంగలో తొక్కుతోంది. చుట్టుపక్కల గ్రామాల్లో మొక్కలు పెంచాల్సి ఉన్నా.. అదికూడా పాటించడం లేదు. కాలుష్య ప్రభావంతో ఇక్కడి ప్రజలు వయసు మీరకముందే రోగనిరోధక శక్తి కోల్పోతూ శ్వాసకోశ, చర్మవ్యాధులతో మంచాన పడుతున్నారు.
 
 కలుషితమవుతున్న కిన్నెరసాని, బూడిదవాగు జలాలు..
 కిన్నెరసాని నీటిని సంస్థ ఉపయోగించుకుంటోంది. అయితే వాడిన తర్వాత వచ్చే బూడిద నీరు ఈ నదిలో వదలడంతో నీరు కలుషితమవుతోంది. కేటీపీఎస్ సమీపంలోని బూడిదవాగు కూడా కలుషితమవుతోంది. నిరంతరం బూడిద వస్తుండడంతో కిన్నెరసాని పరివాహక ప్రాంతాల్లో ఉన్న పాండురంగాపురం, సూరారం, సోములగూడెం, బిక్కుతండా ప్రజలు తాగునీటికి ఇంకా చలమలపైనే ఆధారపడుతున్నారు. ఆ నీళ్లు కూడా బూడిదతో ఉంటున్నాయి. ఒకప్పుడు చెలమల్లో నీరు స్వచ్ఛంగా ఉండేవని, ఇప్పుడవి తాగేందుకు పనికి రావడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొగ, బూడిదతో పాటు భూగర్భ జలాలు కూడా కలుషితం కావడంతో రంగాపురం, పునుకుల, పుల్లాయిగూడెం, కరకవాగు, కోడిపుంజులవాగు గ్రామాల్లో చేతిపుంపుల నీరు మురికిగా వస్తోంది. కాలుష్యం 30 కిలోమీటర్ల మేరకు వ్యాపిస్తుండడంతో సమీప పంటలపైనా ప్రభావం చూపుతోంది. కర్మాగారం చుట్టూ పాల్వంచ మండలానికి చెందిన రైతులు వేలాది ఎకరాల్లో పత్తి, వరి, పామాయిల్ సాగు చేశారు. చిమ్మీల నుంచి వచ్చే పొగ, బూడిద.. పంటలపై పడడంతో దిగుబడి అనుకున్న స్థాయిలో రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
 ప్రాణాంతకంగా మారిన కాలుష్యం..
 కేటీపీఎస్‌లోని చిమ్మీల నుంచి నిబంధనల ప్రకారం విడుదలవ్వాల్సిన ధూళి కన్నా నాలుగైదు రెట్లు అధికంగా బయటకు విరజిమ్ముతోంది. దీనిపై కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి. ఓఅండ్‌ఎంలో ధూళి శాతం సాధారణంగా 100 మైక్రో గ్రామ్స్ ఫర్ మీటర్ క్యూబ్ విడుదలవ్వాలి. కానీ 246.1 మైక్రో గ్రామ్స్/ మీటర్ క్యూబ్ విడుదలవుతోంది. టీఎస్‌పీఎం (మొత్తం ధూళి శాతం)  200 మైక్రో గ్రామ్స్‌బై మీటర్ క్యూబ్ విడదలవ్వాల్సి ఉండగా 567.0 మైక్రో గ్రామ్స్/ మీటర్ క్యూబ్ విడుదలవుతోంది. దీంతో ఈ ప్రాంత వాసులు శ్వాస కోశ వ్యాధుల బారిన పడుతున్నారు. కాలుష్యం ఎక్కువ మోతాదులో ఉంటుందని, దీని నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కాలుష్య నియంత్రణ మండలి పలుమార్లు యాజమాన్యాన్ని హెచ్చరించినా బేఖాతర్ చేసింది. ఈ క్రమంలో త్వరలో కేటీపీఎస్ విస్తరణలో భాగంగా చేపట్టనున్న 7వ దశ నిర్మాణంపై అప్పుడే నిరసనలు వెలువడుతున్నాయి. ఇప్పటికే నిర్మించిన దశల ద్వారా సీఎస్‌ఆర్ పాలసీ అమలు చేయకుండా, మళ్లీ ఇంకో దశ నిర్మాణంపై జెన్‌కో దృష్టి పెట్టడంతో ఇక్కడి గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  
 
 సీఎస్‌ఆర్ పాలసీ అమలెక్కడ ..?
  కాలుష్య ప్రభావిత ప్రాంతాల్లో సంస్థ తన లాభాల్లో 2 శాతం నిధులతో అభివృద్ధి పనులు, పర్యావరణ పరిరక్షణ, వైద్య సదుపాయాలు కల్పించాలి. కానీ కేటీపీఎస్ యాజమాన్యం వీటిని విస్మరించింది.  వందల కోట్ల టర్నోవర్ కలిగి ఉన్న ఈ సంస్థ పాల్వంచ మండలంలో ప్రభావిత గ్రామాల్లో చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలున్నాయి. తాగునీరు కలుషితం అవుతున్నా రక్షిత మంచినీటిని అందించడం లేదు. తీవ్ర ప్రభావం ఉన్న గ్రామాలను దత్తత తీసుకొని అక్కడ మౌలిక వసతులు కల్పించాలని సీఎస్‌ఆర్ పాలసీ స్పష్టం చేస్తోంది. కానీ యాజమాన్యం ప్రజల ప్రాణాలను గాలికి వదిలి.. రాష్ట్రానికి వెలుగులు అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నా.. ప్రభావిత గ్రామాల ప్రజల జీవితాల్లో చీకట్లు నింపింది.
 
 కాలుష్యంతో బాలుతండా ఖాళీ..
 సూరారం శివారులో ఒకప్పుడు గిరిజన కుటుంబాలతో కళకళలాడిన బాలుతండా కేటీపీఎస్ కాలుష్యంతా ఖాళీ అయింది. ఇక్కడ 70 కుటుంబాలు నివాసం ఉండేవి. అయితే కేటీపీఎస్ వద్ద నిర్మించిన యాష్‌పాండ్ ఈ తండాకు అతి దగ్గరగా ఉంది. కర్మాగారం నుంచి యాష్‌పాండ్‌లలో బూడిద నీరు నిల్వ ఉంటుండడంతో తండాలో ఉన్న చేతిపంపు నీరు బూడిద రంగులో వచ్చేది. దీంతో తాగునీటికి వీరు ఇబ్బంది పడ్డారు. అలాగే యాష్‌పాండ్ నుంచి ఊట వచ్చి వీరి ఇళ్లు కూలిపోయాయి. దీంతో చేసేదేమీ లేక ఈ కుటుంబాలన్నీ 2004 -05లో ఆ ప్రాంతాన్ని వదిలి సమీపంలో పాత సూరారం రోడ్డుకు తరలివెళ్లాయి. ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయిస్తే వారే ఇళ్లు నిర్మించుకున్నారు. కాగా అప్పట్లో జెన్‌కో ఎండీ కూడా వీరి పరిస్థితులను స్వయంగా పరిశీలించి ఆదుకుంటామని భరోసా ఇచ్చినా అది నీటి మూటే అయింది. దీంతో కాలనీవాసులు ఇప్పటికీ తమకు సంస్థ నుంచి ఏమైనా సహాయం అందుతుందేమోనని నిరీక్షిస్తున్నారు.
 
 ప్రమాదస్థాయిలో వ్యర్థాలు వెలువడుతున్నాయి : ఎం.నారాయణ, కాలుష్య నియంత్రణాధికారి, కొత్తగూడెం
 బూడిద కిన్నెరసానిలో కలుస్తోందని, ప్రమాద స్థాయిలో వ్యర్థాలు వెలువడుతున్నాయని.. వాటి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే కేటీపీఎస్ యాజమాన్యానికి పలుమార్లు నోటీసులు ఇచ్చాం. పరిశ్రమ నుంచి వెలువడే వ్యర్థాలు సాధారణంగా 115 ఎంజీ/ఎన్‌ఎం క్యూబ్ స్థాయిలో ఉండాలి. కానీ ఇది 500 నుంచి 1000 పైగా ఉంటోంది. ప్లాంట్ నుంచి యాష్‌పాండ్‌కు వెళ్లే బూడిద పైపులైన్లు లీకేజీ కావడంతో కిన్నెరసాని నీరు కలుషితమవుతోందని నోటీసులు ఇచ్చినా స్పందన లేదు. అలాగే 5, 6 దశలోల షెర్మింటేషన్ ట్యాంకులు లేకపోవడంతో ఈ ప్లాంట్లలో వాషింగ్ ద్వారా వచ్చే నీరంతా నేరుగా కిన్నెరసానిలో కలిసి నీరు కలుషితమవుతోంది.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement