పాల్వంచ, న్యూస్‌లైన్: ఉద్యోగుల మెరుపు సమ్మెతో పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్(కేటీపీఎస్)లో విద్యుదుత్పత్తి చేసే యూనిట్లు క్రమంగా నిలిచిపోతున్నాయి. విద్యుత్ ఉద్యోగులకు వెంటనే పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిబ్బంది సమ్మె బాట పట్టడంతో రాష్ట్ర గ్రిడ్‌కు అందించే విద్యుత్ ఉత్పత్తి భారీ స్థాయిలో పడిపోయింది. కేటీపీఎస్ ఓఅండ్‌ఎం, ఐదు, ఆరు దశల్లోని మొత్తం 11 యూనిట్లలో రోజుకు 1,720 మెగావాట్ల విద్యుదుత్పత్తి కావాల్సి ఉండగా, సిబ్బంది సమ్మెతో ఆది, సోమవారాల్లో 180 మెగావాట్లకు పడిపోయింది. సమ్మె ఇలానే కొనసాగితే మరి కొద్దిగంటల్లో విద్యుదుత్పత్తి పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పీఆర్సీ విడుదల చేయాలని కోరుతూ విద్యుత్ ఉద్యోగులు ఆదివారం చేపట్టిన సమ్మెను సోమవారం ఉధృతం చేశారు. విధులు బహిష్కరించిన సిబ్బంది అధికారులను సైతం లోనికి వెళ్లనివ్వలేదు. దీంతో కర్మాగారంలో పనిచేసే సిబ్బంది లేక విద్యుదుత్పత్తి క్రమంగా పడిపోతోంది. బంకర్లలో బొగ్గు నిల్వలు నిండుకుంటుండటంతో యూనిట్లు ఒక్కొక్కటిగా నిలిచిపోతున్నాయి. 6వ దశలోని 500 మెగావాట్ల సామర్థ్యం గల 11వ యూనిట్ ఆదివారమే నిలిచిపోగా, 250 మెగావాట్ల సామర్థ్యం గల 10వ యూనిట్ సోమవారం పడిపోయింది. 9వ యూనిట్‌లో 250 మెగావాట్లకు గాను 120 మెగావాట్ల ఉత్పత్తి మాత్రమే వస్తోంది.
ఓఅండ్‌ఎం పరిధిలో మొత్తం 720 మెగావాట్ల సామర్థ్యం కాగా అందులో 8వ యూనిట్‌లోని 120 మెగావాట్లను వార్షిక మరమ్మతుల కోసం గత శనివారమే షట్‌డౌన్ చేశారు. దీంతో ప్రస్తుతం 600 మెగావాట్లు ఉత్పత్తి అవుతుండగా సమ్మె కారణంగా ఇక్కడ బొగ్గు లెవల్ పడిపోవడంతో 60 మెగావాట్లు తగ్గినట్లు అధికారులు తెలిపారు. సమ్మె ఇలాగే కొనసాగితే కొద్ది గంటల్లోనే పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తి తగ్గే ప్రమాదం ఉందని సమాచారం. ఈ ప్రభావం రాష్ట్ర గ్రిడ్‌తో పాటు జిల్లాలోని బూడిదంపాడు, సీతారాంపట్నం, ఇతర ప్రాంతాలైన సీలేరు, మిర్యాలగూడెం, శ్రీశైలం తదితర ఫీడర్లపై పడవచ్చని అధికారులు ఆందోళన చెందుతున్నారు.
రోజుకు పదికోట్ల విలువైన హెచ్‌ఎఫ్‌వో ఆయిల్ వాడకం?
బొగ్గు నిల్వలు అందించే మార్గం లేకపోవడంతో విద్యుదుత్పత్తికి బొగ్గు స్థానంలో హెచ్‌ఎఫ్‌వో (హెవీ ఫ్యూయల్ ఆయిల్)ను వాడుతున్నారు. అయితే ఇప్పటికే సుమారు రూ.10 కోట్ల విలువైన ఆయిల్‌ను వాడినట్లు సమాచారం. దీని వల్ల జెన్కోపై ఆర్థిక భారం పడుతున్నట్లు తెలుస్తోంది. అంతేగాక జీరో లెవల్‌లో హెచ్‌ఎఫ్‌వోను అధికంగా వాడటం వల్ల బాయిలర్ దెబ్బతిని యూనిట్ల జీవితకాలం కూడా తగ్గే ప్రమాదం ఉందని కార్మిక సంఘాల వారు అంటున్నారు. బొగ్గు లేని సమయాల్లో సేఫ్టీగా యూనిట్లను నిలిపి వేయాలనే ఆదేశాలు ఉన్నప్పటికీ అధికారులు మొండి వైఖరితో నడిపిస్తూ తమ ఆధిపత్యం చూపేందుకు ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.
5,6 దశల కర్మాగాల ఎదుట ధర్నా..
కేటీపీఎస్ 5, 6 దశల కర్మాగారం ఎదుట వివిధ యూనియన్ల నాయకులు సోమవారం టెంట్ వేసి ధర్నా చేపట్టారు. వారు విధులు బహిష్కరించడంతో పాటు ఉద్యోగులు, కార్మికులు లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆందోళనతో విద్యుత్ ఉత్పత్తి తగ్గే ప్రమాదం ఉందని, సమ్మె విరమించి సహకరించాలని చీఫ్ ఇంజనీర్ సిద్దయ్య, ఇతర అధికారులు ధర్నా శిబిరం వద్దకు వచ్చి కోరినా ఆందోళనకారులు అంగీకరించలేదు. పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, మెడికల్ రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని, కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, ఈపీఎఫ్‌ను జీపీఎఫ్‌గా మార్చాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో 1104 యూనియన్ నాయకులు కేశబోయిన కోటేశ్వరరావు, సునీల్ రెడ్డి, 327 నాయకులు పి.వి.కోటేశ్వరరావు, 1535 నాయకులు సాంబయ్య, లీవెన్, అంబాల శ్రీను, హెచ్ 67 నాయకులు ఎం.రమేష్, తెలంగాణ విద్యుత్ ఇంజనీర్స్ అసోసియేషన్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి భాస్కర్, ఏఈస్ అసోసియేషన్ నాయకులు అన్వర్‌బాషా, టీఎన్‌టీయూసీ నాయకులు గొర్రె వేణుగోపాల్, కట్టా శ్రీధర్, డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ నాయకులు సురేష్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
సమ్మెను పర్యవేక్షించిన ఓఎస్డీ, డీఎస్పీ
విద్యుత్ ఉద్యోగులు చేపట్టిన సమ్మెను కొత్తగూడెం ఓఎస్‌డీ తిరుపతి , డీఎస్పీ ఆర్.భాస్కర్ పర్యవేక్షించారు. ఆందోళన గురించి ఎస్‌ఈ బిచ్చన్నను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఎస్పీఎఫ్ కమాండెంట్ జమీల్ పాషాతో పాటు ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ రావు, ఎస్‌ఐ సుధీర్, రూరల్ ఎస్‌ఐ అంజయ్య తదితరులు బందోబస్తు నిర్వహించారు.
రెండోరోజూ విధుల బహిష్కరణ
Published Tue, May 27 2014 2:04 AM | Last Updated on Wed, Sep 5 2018 1:45 PM
Advertisement
Advertisement