సాక్షి, సిటీబ్యూరో: నగర పోలీసు విభాగంలో పని చేస్తున్న హోంగార్డుల్లో అనేక మంది సకాలంలో జీతాలు అందక సతమతం అవుతున్నారు. ఈ నెల్లో శుక్రవారం వరకు అనేక మంది ‘హోం’గడవని గార్డులుగా మారారు. ఫిబ్రవరి నెలకు సంబంధించి వేతనాలు అందరికీ సకాలంలో అందకపోవడం, గతంలో కోత పెట్టిన జీతం ఇవ్వకపోవడం, బందోబస్తులకు సంబంధించిన ఫీడింగ్ చార్జీల అంశాన్ని అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఈ విషయంలో ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. పోలీసు విభాగంలో మిగతా సిబ్బందితో సమానంగా డ్యూటీలు చేస్తున్నా హోంగార్డులకునెలకు దక్కేది రూ.22 వేలే. కాగా ఈ నెలలో వివిధ విభాగాల్లో పని చేస్తున్న వారికి ఒక్కసారిగా వేతనాలు అందలేదు. హోంగార్డుల హాజరు నమోదు చేయడానికి బయోమెట్రిక్ విధానం అమలులో లేదు. ఈ నేపథ్యంలో ప్రతి నెల వారు పని చేసిన రోజులకు సంబంధించి పోలీసుస్టేషన్లు, ప్రత్యేక యూనిట్ల నుంచి అటెండెన్స్ హోంగార్డ్స్ కార్యాలయానికి చేరాల్సి ఉంటుంది. అక్కడ వీరి వేతనాల బిల్లులు రూపొంది కమిషనర్ ఆఫీసుకు చేరతాయి. ఇక్కడ ఆమోద ముద్రపడిన అనంతరం జీతం డబ్బు ఆయా హోంగార్డులకు ఖాతాల్లోకి చేరుతుంది.
అప్పట్లో గడిచిన పోయిన నెలకు సంబంధించి ఒకటో తేదీ నుంచి 30 లేదా 31 వరకు నెలగా లెక్కించే వారు. ఈ నేపథ్యంలో ఎన్నో ఏళ్లుగా వీరికి తర్వాతి నెల్లో 20వ తారీఖున జీతాలు అందేవి. ఈ విధానాన్ని మారుస్తున్నామని, ఇకపై ఒకటో తేదీకల్లా జీతం బ్యాంకు ఖాతాలో పడేలా చర్యలు తీసుకుంటున్నామంటూ గత ఏడాది మేలో అధికారులు ప్రకటించారు. అయితే ఈ ప్రక్రియ ప్రారంభించడానికి ఆ నెల్లో 20 వరకు హాజరు తీసుకుంటామని, కోల్పోతున్న పది రోజుల మొత్తాన్ని రెండు మూడు నెలల్లో ఖాతాల్లోకి జమ చేస్తామని అధికారులు పేర్కొన్నారు. తాత్కాలిక ఇబ్బంది అయినప్పటికీ ప్రతి నెలా ఒకటో తేదీ నాటికి జీతం అందుకోవచ్చనే ఉద్దేశంతో హోంగార్డులు అందుకు అంగీకరించారు. దీంతో గత ఏడాది మే నెలలో వీరికి 20 రోజుల జీతమే అందింది. ఆ తర్వాత నుంచి ప్రతి నెలా మొదటి వారంలోనే జీతం వస్తోంది. అయితే ఇప్పటికి పది నెలలు కావస్తున్నా... ఆ పది రోజుల వేతన బకాయి విషయం మాత్రం అధికారులు మర్చిపోయారు.
దీనికి తోడు ఫిబ్రవరి నెలకు సంబంధించి అందరు హోంగార్డులకు ఒకేసారి వేతనాలు అందలేదు. సిటీలో ట్రాఫిక్ విభాగంతో పాటు మరో మూడు యూనిట్లలో కలిపి 6700 మంది హోంగార్డులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో ట్రాఫిక్‌లో పని చేస్తున్న వారికి ముందుగా జీతాలు అందాయి. శుక్రవారం యూనిట్–1, 2, 3లకు చెందిన వారి బ్యాంకు ఖాతాల్లో జీతం జమయ్యాయి. ఆలస్యమైనా ఈసారి పది రోజుల బకాయితో సహా జీతం వస్తుందని భావించిన సిబ్బందికి నిరాశే మిగిలింది. తమకు బత్తా కింద రూ.12 వేల వరకు రావాల్సి ఉందని, కనీసం రూ.6 వేలైనా ఇవ్వాల్సిందిగా మెరపెట్టుకుంటున్నా వీరి బాధ అరణ్యరోదనగా మారింది. సిటీ పోలీసు విభాగానికి చెందిన ఓ హోంగార్డు ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘జీతం కూడా ప్రతి నెలా సరైన సమయానికి రాకపోతే ఇక మా గతి ఏంటి? గతంలో కట్ చేసిన పది రోజుల జీతం విషయం ఇప్పుడు ఎవరూ పట్టించుకోవట్లేదు. బత్తా ఇమ్మన్నా ఆదుకునే నాథుడే లేకుండా పోయాడు’ అని వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment