సత్తా చాటిన సర్కారు కాలేజీలు | Government Colleges Top in Intermediate Results 2018 in Telangana | Sakshi
Sakshi News home page

సత్తా చాటిన సర్కారు కాలేజీలు

Published Sat, Apr 14 2018 1:18 AM | Last Updated on Wed, Aug 15 2018 7:59 PM

Government Colleges Top in Intermediate Results 2018 in Telangana - Sakshi

ఇంటర్‌ ఫలితాలు విడుదల చేస్తున్న డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ తదితరులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ప్రభుత్వ కాలేజీల హవా కొనసాగింది. ప్రైవేటు కాలేజీలను మించి ప్రభుత్వ కాలేజీల విద్యార్థులు అత్యధిక ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్‌లో ప్రైవేటు కాలేజీల విద్యార్థులు 69 శాతం ఉత్తీర్ణత సాధించగా.. గురుకులాలు సహా ప్రభుత్వ కాలేజీల విద్యార్థులు 71 శాతానికి పైగా ఉత్తీర్ణత నమోదు చేశారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో ఇంట ర్మీడియెట్‌ ఫలితాలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విడుదల చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. క్రమక్రమంగా ప్రైవేటు కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం తగ్గుతోందని.. ప్రభుత్వ కాలేజీల్లో పెరుగుతోందని కడియం చెప్పారు. ప్రైవేటు కాలేజీలే బాగుంటాయన్న భ్రమలు తొలగిపోతున్నాయని, ఈ విషయాన్ని తల్లిదండ్రులు గ్రహించాలని పేర్కొన్నారు. ముఖ్యంగా గురుకులాల్లో ఉత్తీర్ణత శాతం అధికంగా ఉందని తెలిపారు. మొత్తంగా ఎప్పటిలాగే ఈసారి కూడా బాలికల ఉత్తీర్ణతాశాతం అధికంగా నమోదైనట్టు చెప్పారు. కార్యక్రమంలో ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్, కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ సుశీల్‌కుమార్, ఇంటర్‌ విద్యా జేఏసీ చైర్మన్‌ మధుసూదన్‌రెడ్డి, ఇంటర్‌ బోర్డు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

రెండింటా మేడ్చల్‌ టాప్‌ 
ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు రెండింటిలోనూ మేడ్చల్‌ జిల్లా టాప్‌గా నిలిచింది. 

  • ఫస్టియర్‌లో 79 శాతం ఉత్తీర్ణతతో మేడ్చల్‌ టాప్‌లో, 74 శాతంతో రంగారెడ్డి రెండో స్థానంలో నిలిచాయి. 42 శాతం ఉత్తీర్ణతతో మెదక్‌ చివరి స్థానంలో నిలిచింది. వొకేషనల్‌లో 72 శాతం ఉత్తీర్ణతతో కొమురంభీం జిల్లా టాప్‌లో, 71 శాతంతో వనపర్తి రెండో స్థానంలో నిలవగా.. 46 శాతం ఉత్తీర్ణతతో నాగర్‌కర్నూల్, జగిత్యాల చివరి స్థానంలో నిలిచాయి. 
  • సెకండియర్‌ జనరల్‌ ఇంటర్‌లో 80 శాతం ఉత్తీర్ణతతో మేడ్చల్, కొమురంభీం జిల్లాలు టాప్‌లో నిలవగా.. 77 శాతంతో రంగారెడ్డి రెండో స్థానంలో నిలిచింది. 40 శాతం ఉత్తీర్ణతతో మహబూబాబాద్‌ చివరి స్థానంలో ఉంది. వొకేషనల్‌లో 86 శాతం ఉత్తీర్ణతతో వనపర్తి ప్రథమ స్థానంలో, 84 శాతంతో కొమురంభీం రెండో స్థానంలో నిలవగా.. 55 శాతంతో సిద్దిపేట చివరి స్థానంలో నిలిచింది. 


సత్తా చాటిన గురుకులాలు 
ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణతలో గురుకులాలు సత్తా చాటాయి. 97.7 శాతం ఉత్తీర్ణతతో విద్యాశాఖ గురుకులాలు (టీఎస్‌ఆర్‌జేసీ) అత్యధిక ఉత్తీర్ణతను సాధించగా.. తరువాత స్థానంలో గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని గురుకులాలు నిలిచాయి. మొత్తంగా గురుకులాలు, మోడల్‌ స్కూల్స్, ప్రభుత్వ కాలేజీలు కలిపి 71.42 శాతం ఉత్తీర్ణత సాధించగా.. ప్రైవేటు కాలేజీలు 69 శాతం ఉత్తీర్ణత నమోదు చేశాయి. 

18 నుంచి మార్కుల మెమోలు 
ఇంటర్‌ ఫలితాలకు సంబంధించి మార్కుల మెమోలను ఈనెల 18 నుంచి విద్యార్థులకు అందజేయనున్నట్టు ఇంటర్‌ బోర్డు వెల్లడించింది. మెమోల్లో ఏవైనా తప్పిదాలు ఉన్నట్టయితే.. మే 14వ తేదీలోపు సంబంధిత కాలేజీ ప్రిన్సిపాల్‌ల ద్వారా బోర్డుకు దరఖాస్తు చేయాలని పేర్కొంది. నిర్దేశిత తేదీ తర్వాత వచ్చే వినతులు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేసింది. 


రీవెరిఫికేషన్, జవాబు పత్రాల ప్రతుల కోసం.. 
విద్యార్థులు తమ జవాబు పత్రాల రీవెరిఫికేషన్, రీకౌంటింగ్, జిరాక్స్‌ ప్రతులు పొందేందుకు బోర్డు అవకాశం కల్పించింది. ఇందుకోసం విద్యార్థులు tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌ నుంచి రీవెరిఫికేషన్‌/ రీకౌంటింగ్‌/ వాల్యూడ్‌ ఆన్సర్‌ స్క్రిప్ట్‌లో ఒక ఆప్షన్‌ను ఎంపిక చేసుకుని.. దరఖాస్తును పూరించాలని బోర్డు సూచించింది. ఈనెల 16 నుంచి 20వ తేదీలోపు ఆన్‌లైన్‌లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. రీకౌంటింగ్‌ కోసం ఒక్కో సబ్జెక్టుకు రూ.100 చొప్పున ఫీజు చెల్లించాలి. జవాబు పత్రాల నకలు కోసం ఒక్కో సబ్జెక్టుకు రూ.600 చెల్లించాలి. నిర్ణీత తేదీ తర్వాత దరఖాస్తులు స్వీకరించరు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement