తెలంగాణలో 5,115 ఎంబీబీఎస్‌ సీట్లు | Kaloji Narayana Rao Health University Has Announced That MBBS Seats Available | Sakshi
Sakshi News home page

తెలంగాణలో 5,115 ఎంబీబీఎస్‌ సీట్లు

Published Tue, Nov 2 2021 1:01 AM | Last Updated on Tue, Nov 2 2021 11:52 AM

Kaloji Narayana Rao Health University Has Announced That MBBS Seats Available - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు, మైనారిటీ కాలేజీల్లో మొత్తం 5,115 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. 10 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 1,765 సీట్లు ఉండగా, 23 ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలు, మైనారిటీ కాలేజీల్లో 3,350 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయని విశ్వవిద్యాలయం ప్రకటించింది. సోమవారం నీట్‌ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో రాష్ట్రంలో సీట్లపై స్పష్టత వచ్చింది.

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నుంచి నీట్‌లో అర్హత సాధించిన రాష్ట్రానికి చెందిన అభ్యర్థుల వివరాల డేటా రాగానే అడ్మిషన్లకు నోటిఫికేషన్‌ జారీచేస్తామని విశ్వవిద్యాలయం వెల్లడించింది. వారంలో ‘నీట్‌’రాష్ట్రస్థాయి ర్యాంకుల ప్రకటన వెలువడుతుందని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు చెబుతున్నాయి. 

ఆందోళన చెందొద్దు.. 
రాష్ట్రంలో చాలామంది జాతీయస్థాయిలో వేలల్లో వచ్చిన ర్యాంకులను చూసి ఆందోళన చెందుతున్నారు. అయితే రాష్ట్ర స్థాయిలో చూస్తే ర్యాంకు తక్కువగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. జాతీయస్థాయిలో 90 వేల లోపు ర్యాంకులు వచ్చిన విద్యార్థులకు రాష్ట్రంలో కన్వీనర్‌ కోటాలోనే సీట్లు వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు.

జాతీయ స్థాయిలో లక్షపైన ర్యాంకులు వచ్చిన వారికి మన దగ్గర ప్రైవేటు కాలేజీల్లోనూ ఎంబీబీఎస్‌ సీటు వస్తుందంటున్నారు. రాష్ట్ర స్థాయి ర్యాంకుల ప్రకటన అనంతరం త్వరలో మొదటి విడత కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్‌ జారీ చేస్తామని హెల్త్‌ వర్సిటీ వర్గాలు తెలిపాయి. అయితే తరగతులు ఎప్పుడు ప్రారంభమవుతాయన్న దానిపై ఇంకా షెడ్యూల్‌ రాలేదని చెప్పాయి. 

అఖిల భారత కోటాకు 15 శాతం సీట్లు.. 
ఈసారి వైద్య విద్యా సంవత్సరం కరోనా కారణంగా నెలల పాటు వాయిదా పడింది. ఈసారి తరగతులు ఎప్పుడు ప్రారంభం అవుతాయన్న దానిపై స్పష్టత రాలేదు. ప్రభుత్వ కాలేజీల్లోని అన్ని సీట్లను, ప్రైవేటు కాలేజీల్లోని 50 శాతం సీట్లు కన్వీనర్‌ కోటాలో భర్తీ చేస్తారు. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లోని సీట్లలో 15 శాతం సీట్లు అఖిల భారత కోటా కిందకు వస్తాయి. వాటిల్లో రెండు విడతల కౌన్సెలింగ్‌ తర్వాత సీట్లు మిగిలితే తిరిగి వాటిని మన రాష్ట్రానికే ఇస్తారు.

మరోవైపు కేంద్రం అగ్రవర్ణాల్లో ఆర్థికంగా బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌)కు 10 శాతం రిజర్వేషన్‌ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ మేరకు సీట్ల కేటాయింపు జరిగింది. ఆలిండియా కోటాలో సీట్లు వచ్చినా కరోనా నేపథ్యంలో ఎక్కువ మంది విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్తారో లేదోనన్న అనుమానాలను విశ్వ విద్యాలయం వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement