2.28 లక్షల ర్యాంక్‌కు.. ఎంబీబీఎస్‌ సీటు | Telangana: Lowest Marks Students Got MBBS Seats In Convener Quota | Sakshi
Sakshi News home page

2.28 లక్షల ర్యాంక్‌కు.. ఎంబీబీఎస్‌ సీటు

Published Fri, Dec 2 2022 12:27 AM | Last Updated on Fri, Dec 2 2022 11:31 AM

Telangana: Lowest Marks Students Got MBBS Seats In Convener Quota - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్‌ కాలే­జీలు పెరగడంతో ఈసారి తక్కువ మార్కులు.. ఎక్కువ ర్యాంకు వచ్చిన విద్యార్థులకు కూడా కన్వీనర్‌ కోటాలో ఎంబీబీఎస్‌ సీట్లు దక్కాయి. ప్రస్తుతం కన్వీనర్‌ కోటా సీట్లకు రెండో విడత కౌన్సెలింగ్‌ పూర్తయింది. ఇంకా మూడో విడత కౌన్సెలింగ్‌ ఉంది. అందులో సీట్లు మిగిలితే మాప్‌ అప్‌ రౌండ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు.

రెండో విడత కౌన్సెలింగ్‌ పూర్తయ్యే సరికి రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ కాలేజీల్లోని కన్వీనర్‌ కోటా సీట్లలో ఎక్కువ ర్యాంకు సాధించిన విద్యార్థులకు కూడా సీట్లు దక్కాయని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రభుత్వానికి పంపిన నివేదికలో స్పష్టం చేసింది. రెండో విడతలో బీసీ ‘ఏ’కేటగిరీ కింద, నీట్‌లో 2,28,059వ ర్యాంకు సాధించిన విద్యార్థికి ఎంబీబీఎస్‌లో సీటు వచ్చింది.

ఆ విద్యార్థికి 360 మార్కులు వచ్చాయి. ఇంత తక్కువ మార్కులకు, ఎక్కువ ర్యాంకుకు సీటు రావడం ఇదే తొలిసారని కాళోజీ వర్సిటీ వర్గాలంటున్నాయి. జనరల్‌ కోటాలో 451 మార్కు­లతో 1,25,070వ ర్యాంకు పొందిన విద్యార్థికి కూడా ఎంబీబీఎస్‌ సీటు వచ్చింది. కొన్ని రాష్ట్రాలతో పోలిస్తే, అక్కడి ర్యాంకుల కంటే ఇక్కడ రెట్టింపు ఉన్నా తెలంగాణలో సీటు రావడం గమనార్హం.  

పెరిగిన సీట్లతో చిగురించిన ఆశలు  
రాష్ట్రంలో ప్రస్తుతం 17 ప్రభుత్వ, 24 ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలు ఉన్నాయి. అందులో ఈసారి కొత్తగా ఎనిమిది ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు ప్రారంభం కావడంతో ఒక్కసారిగా సీట్ల సంఖ్య పెరిగింది. అవన్నీ కూడా కన్వీనర్‌ సీట్లే కావడం గమనార్హం. ప్రభుత్వ కాలేజీల్లో అన్నిసీట్లు, ప్రైవేట్‌లో సగం సీట్లు కన్వీనర్‌ కోటా కింద కేటాయిస్తారు. ప్రైవేట్‌లో ఏడాదికి రూ.60 వేలు, ప్రభుత్వంలో ఏడాదికి రూ.10 వేల ఫీజు ఉంటుంది.

ఇంత తక్కువ ఫీజు, మెరుగైన మౌలిక సదుపాయాలు ఉండటంతో ఈ సీట్లకు గట్టి పోటీ ఉంటుంది. కాగా, గత వైద్య విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో కన్వీనర్‌ కోటా సీట్లు 3,303 ఉండగా, ఈ ఏడాది మొత్తం కన్వీనర్‌ కోటా సీట్లు 4,425కు పెరిగాయి. అంటే ఏడాది కాలంలో ఏకంగా 1,122 సీట్లు పెరిగాయి. దీంతో ఇక్కడి విద్యార్థులకు ప్రయోజనం కలుగుతోంది. మరోవైపు బీ కేటగిరీలో స్థానిక రిజర్వేషన్‌ను 85 శాతం చేయడంతో అదనంగా వెయ్యికి పైగా సీట్లు మన రాష్ట్ర విద్యార్థులకు దక్కనున్నాయి. దీంతో వైద్య విద్య చదవాలనుకునే విద్యార్థుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement