నిధుల విషయం తేలాకే పీపీపీపై ముందడుగు
అద్భుతాలు చేయడానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు
30 అంశాలతో స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలు నిర్దేశించుకున్నాం
వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిర్మిస్తున్న కొత్త వైద్య కళాశాలలకు నిధుల లభ్యత, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో దానిని ఎలా అధిగమించాలో ఆలోచించిన తర్వాత పీపీపీ విధానంపై ముందుకు వెళ్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి చర్యలు తీసుకోలేదని చెప్పారు. వైద్య రంగంలో అద్భుతాలు చేయడానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని అన్నారు.
వైద్య రంగంలో సమస్యల పరిష్కారానికి 30 అంశాలతో స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకున్నామని తెలిపారు. ముందుగా ప్రభుత్వాస్పత్రుల్లో వనరుల ఆవశ్యకతపై ఆడిట్ చేస్తామన్నారు. అనంతరం ఆరు నెలల్లోగా ఆస్పత్రుల్లో వసతులు, సాంకేతిక నిపుణుల కొరతను అధిగమిస్తామని చెప్పారు. ఏడాదిలోగా అవసరాల మేరకు సీటీ, ఎమ్మారై వంటి ఆధునిక యంత్ర పరికరాలు అందుబాటులోకి తెస్తామన్నారు. ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించేలా ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశా)తో చర్చించామన్నారు. ఇప్పటికే రూ.200 కోట్లు విడుదల చేశామని, మరో రూ.300 కోట్లు త్వరలో విడుదల చేస్తామని చెప్పారు. నెలవారీగా బిల్లులు విడుదల చేయాలని ఆశా ప్రతినిధులు కోరినట్టు వెల్లడించారు.
గత ప్రభుత్వం అభివృద్ధి చేయలేదంటూనే..
గత ప్రభుత్వంలో వైద్య రంగంలో అభివృద్ధి చెందింది ఏమీ లేదని, ఎక్కడ చూసినా సమస్యలున్నాయని ఆరోపిస్తూనే.. అనంతపురం జీజీహెచ్‌లో పొరుగు రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చి చికిత్స పొందుతున్నారని, గుంటూరు జీజీహెచ్‌లో కిడ్నీ, గుండె, లివర్ వంటి అవయవాల మారి్పడి సర్జరీలు కూడా చేస్తున్నారని చెప్పారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు
తరగతుల ప్రారంభానికి సిద్ధమైన పులివెందుల, మదనపల్లె, మార్కాపురం, పాడేరు, ఆదోని వైద్య కళాశాలల ప్రారంభంపై మంత్రి స్పందించారు. వైద్య శాఖలో స్వల్ప కాలంలో పరిష్కరించదగ్గ సమస్యలపై దృష్టి పెట్టామన్నారు. ఐదు వైద్య కళాశాలల్లో సరిపడా ఫ్యాకల్టీ లేరని, వసతులు పూర్తిస్థాయిలో కల్పించలేకపోవడంతో నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతులు నిరాకరించిందన్నారు. రెండు నెలల్లో పోస్టులేమీ భర్తీ చేయలేదని తెలిపారు. పులివెందుల వైద్య కళాశాలలో 50 సీట్లకు అండర్‌టేకింగ్ ఇస్తామన్నారు. ఐదు వైద్య కళాశాలల్లో ఈ ఏడాది ప్రవేశాలు ఉంటాయని విద్యార్థులు ఎదురు చూస్తున్న మాట వాస్తవమేనన్నారు. అయితే తొలి, మలి, చివరి విడతల కళాశాలల్లో పనులు చేసిన కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించాల్సి ఉందని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని.. స్వల్ప వ్యవధిలో అద్భుతాలు సృష్టించలేమని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment