‘‘మెడికల్‌ కాలేజీ సీట్లు వదులుకోవడం ఆంధ్రకు దోహం చేయడమే’’ | Chandrababu Govt Wrong Decisions On Medical Colleges | Sakshi
Sakshi News home page

‘‘మెడికల్‌ కాలేజీ సీట్లు వదులుకోవడం ఆంధ్రకు దోహం చేయడమే’’

Published Sat, Sep 14 2024 11:15 AM | Last Updated on Sat, Sep 14 2024 11:42 AM

Chandrababu Govt Wrong Decisions On Medical Colleges

‘‘ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌లో ‍ప్రజారోగ్యానికి ఉరితాడు వేస్తున్నారు’’ ప్రతిపక్ష నేత వై.ఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్య ఇది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తే చంద్రబాబు ప్రభుత్వం కచ్చితంగా ఇదే పనిలో ఉన్నట్లు స్పష్టమవుతుంది. దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత ఘోరంగా వ్యవహరించి ఉండదు. జగన్‌ ప్రాతినిథ్యం వహిస్తున్నందుకు పులివెందులపై కక్షా? లేక రాయలసీమపై వ్యతిరేకతో తెలియదు కానీ.. బాబు ప్రభుత్వం బంగారం లాంటి మెడికల్‌ కాలేజీ సీట్లను వదులుకుంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇది ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు బాబు చేసిన ద్రోహమే అవుతుంది.

జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలో ఉండగా రాష్ట్రంలో 17 మెడికల్‌ కాలేజీలు తెచ్చారు నాలుగు ఓడరేవులు, తొమ్మిది ఫిషింగ్‌ హార్బర్లు కూడా ఆయన హయాంలోనే వచ్చాయి. విజయవాడ వద్ద కృష్ణా నదికి రీటెయినింగ్‌ వాల్‌ కట్టడం వల్ల ఇటీవలి వరదల్లో వేలాది మంది ముంపునకు గురయ్యే ప్రమాదం తప్పింది కూడా. ఇన్ని చేసినా చంద్రబాబు నాయుడు ఎల్లోమీడియా సాయంతో ఆంధ్రలో అభివృద్ధి లేకుండా పోయిందని నిత్యం దుష్ప్రచారం చేసేవారు. విధ్వంసం తప్ప మరేమీ లేదని అభాండాలు మోపేవారు.

జనం ఓట్లు వేశారో, లేక ఈవీఎంల మహిమో గానీ.. ఇటీవలి ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి రావడం, బాబు ముఖ్యమంత్రి అవడం అయిపోయింది. అంతే! ఏపీలో హింస, విధ్వంసం చెలరేగిపోయింది. కరోనా మహమ్మారి పెచ్చరిల్లిన సమయంలోనూ చక్కగా పనిచేసిన వలంటీర్ల వ్యవస్థతో మొదలుపెట్టి అనేక ఇతర వ్యవస్థలను నిర్వీర్యం చేసే పనికీ దిగజారారు. జగన్ మొదలుపెట్టిన అనేక ప్రజోపయోగ పథకాలను నీరుగార్చేందుకే ప్రభుత్వం తన శక్తియుక్తులన్నింటినీ ఖర్చు పెట్టడం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే... ప్రజారోగ్యం కూడా చేరింది!

వైఎస్ జగన్ పాలనలో ప్రజలందరికీ వైద్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంటింటికీ వైద్యుడిని పంపే ఆలోచన చేశారు. ప్రస్తుతం బాబు ప్రభుత్వం ఏం చేసిందో తెలియదు. విద్యార్థులకు ఇంట్లోనే కంటి పరీక్షలు చేసి కళ్ల జోళ్లు పంపిణీ చేయడాన్ని నిలిపివేయమని ఆదేశించినట్లు సమాచారం. ఇక తాజాగా బాబు గారి దృష్టి జగన్‌ సృష్టించిన వైద్య విద్య వ్యవస్థపై పడింది. వైద్యాన్ని సామాన్యుడికి కూడా చేరువ చేసే లక్ష్యంతో జగన్‌ ప్రభుత్వ రంగంలోనే వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఈ సంకల్పానికి బాబు ప్రభుత్వం తన తప్పుడు నిర్ణయాలతో తూట్లు పొడుస్తోంది.

ఇదీ చదవండి: కాలేజీలపై 'చంద్రబాబు' కత్తి!

తెలంగాణలో అదనంగా నాలుగు మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు కేంద్రం పచ్చ జెండా ఊపింది. ఫలితంగా ఈ ఏడాది కొత్తగా 8 కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి. ఇవన్నీ ప్రభుత్వ కాలేజీలే. వీటన్నింటితో తెలంగాణలో మొత్తం వైద్యవిద్య సీట్ల సంఖ్య 4090కి చేరబోతుంది. అయితే తెలంగాణతో పోటీపడి ప్రభుత్వ కాలేజీలు ఏర్పాటు చేయాల్సిన ఆంధ్రప్రదేశ్ గతంలో జగన్‌ హయాంలోనే తీసుకొచ్చిన కాలేజీలను వదులుకునేందుకు లేదా ప్రైవేట్‌ వారికి అప్పగించే దిశగా సాగుతూండటం దురదృష్టకరం.

జగన్ ప్రభుత్వ హయాంలోనే 2023-24లో విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలల్లో  కొత్త మెడికల్‌ కాలేజీల్లో క్లాసులు ప్రారంభమయ్యాయి.  మొత్తం 750 సీట్లు అందుబాటులోకి రావడంతో మెరిట్‌ కలిగిన పేద విద్యార్థులకు మేలు జరిగింది. 2024-25లో పాడేరు, మార్కాపురం, మదనపల్లి, పులివెందుల, ఆదోనిలల్లో కొత్త కాలేజీలు ప్రారంభం కావాలి. వీటికి భవనాల నిర్మాణం కూడా జరిగింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం వీటన్నిటినీ ప్రైవేటు పరం చేయాలన్న ఉద్దేశంతో ఆరంభించడంలేదన్న విమర్శలు వస్తున్నాయి. లితంగా మరో 750 సీట్లు అందుబాటులోకి రాకుండా పోయాయి. మరో వైపు కేంద్రం పులివెందుల వైద్య కళాశాలకు ఇస్తానన్న యాభై సీట్లను కూడా తమకు వద్దంటూ చంద్రబాబు సర్కార్ లేఖ రాయడం రాయలసీమకు అన్యాయం చేయడమే. మౌలిక వసతులు సిద్దంగా లేవని ప్రభుత్వం చెప్పడం అంటే  విధ్వంసానికి పాల్పడుతున్నట్లే.

జగన్ ప్రభుత్వ రంగంలోకి తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలని చంద్రబాబు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. మంత్రివర్గ సమావేశంలో కూడా ఈ అంశాన్ని చర్చించి గుజరాత్ మోడల్ లో ప్రైవేటు రంగానికి అప్పగించాలన్న ఆలోచనలో ప్రభుత్వముంది. దీనివల్ల సామాన్య విద్యార్థులు సైతం అధిక ఫీజుల్ని చెల్లించాల్సి వస్తుంది. మెరిట్‌ ఉన్నా  పేదలు వైద్య విద్యను అభ్యసించలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇక వచ్చే ఏడాది ప్రారంభించాల్సిన ఏడు మెడికల్ కాలేజీల నిర్మాణ పనులు కూడా అటకెక్కినట్లు వార్తలు వచ్చాయి. కొన్ని కాలేజీల నిర్మాణం నత్తనడక సాగుతుండడంతో అందులోని వస్తువులు చోరీకి గురవుతున్నాయి.

ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి ఈ కాలేజీలకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించడం కోసం సెల్ఫ ఫైనాన్స్ స్కీమ్ కింద యాభై శాతం సీట్లను అధిక ఫీజుకు కేటాయించాలని జగన్ నిర్ణయిస్తే ఇదే చంద్రబాబు, పవన్, లోకేష్‌లు నానా గగ్గోలు చేశారు. సంబంధిత 107, 108 జీవోలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. తాము అధికారంలోకి వస్తే మొత్తం సీట్లు కన్వీనర్ కోటాలోనే అంటే ప్రభుత్వపరంగానే  కేటాయిస్తామని బడాయి మాటలు చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చాక సెల్ఫ్‌ ఫైనాన్స్‌ విధానం మార్చుకోవడంలేదని హైకోర్టులో వేసిన అఫిడవిట్లో తేల్చేశారు. ఈ నేపథ్యంలో కొత్త మెడికల్‌ కాలేజీల్లో అన్ని సీట్లను కన్వీనర్ కోటాలోనే భర్తీ చేస్తామని చంద్రబాబు, పవన్, లోకేష్‌లు ఇచ్చిన హామీని గాలి కొదిలేశారని జగన్‌ విమర్శించడం ఎంతైనా సహేతుకం. బీజేపీతో పొత్తులో ఉన్నా, ఐదు కాలేజీలకు అనుమతులు తెచ్చుకోలేకపోవడం చంద్రబాబు వైఫల్యమని కూడా జగన్‌ సరైన వ్యాఖ్యే చేశారు.

గతంలో నేదురుమల్లి జనార్ధన్‌ రెడ్డి హయాంలో ప్రైవేటు రంగంలో 12 మెడికల్ కాలేజీలను మంజూరు చేస్తే విద్యను వ్యాపారం చేస్తారా అంటూ తెలుగుదేశం నానా యాగీ చేసిన విషయం ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే అన్ని ప్రైవేటు వారే చేయాలని అప్పట్లోనూ చెప్పారు. ఈ ఒక్కరంగంలోనే కాదు అన్నిటిలో ఆయన ధోరణి ఇలాగే ఉంటుంది. తన రాజకీయ ప్రత్యర్థులు ప్రభుత్వంలో ఉండి ప్రజలకు ఉపయోగపడే పనులు ఏవైనా చేపడితే వంకలు పెట్టి ఎలా పాడు చేయాలనే దృష్టితో చంద్రబాబు, తెలుగుదేశంసర్వదా కృషి చేస్తుంది.

దానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి ఎల్లో మీడియా వంతపాడతాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ఒక విధంగా చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం అభివృద్ధి నిరోధకంగా మారింది. తానే అభివృద్ధి చేస్తున్నట్టు ముసుగు వేసుకోవడంలో మాత్రం గొప్ప ప్రావీణ్యం సంపాదించుకున్నారు. ఇప్పుడు చేజేతులా ప్రభుత్వ రంగంలో రావాల్సిన మెడికల్ కాలేజీలను వదులుకుంటున్న వైనం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై ఆయా రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు స్పందిస్తున్నట్టు కనపడడం లేదు. చంద్రబాబు ఎవరినైనా మేనేజ్ చేయగలరనడానికి ఇదొక ఉదాహరణ.

ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వచ్చిన తర్వాత జరిగిన హింసాకాండ, విధ్వంసం గతంలో ఎన్నడూ జరగలేదు. ఇప్పుడు జగన్ తెచ్చిన వ్యవస్థలను, అభివృద్ధిని, విధ్వంసం చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. ఆ విధ్వంసంలో పవన్‌ కల్యాణ్ కూడా భాగస్వాములవుతున్నారు. ప్రతిపక్షంలో వున్నప్పుడు సూపర్ సిక్స్ అంటూ ఎక్కడలేని హామీలను ఇచ్చి ఇప్పుడు మాట తప్పుతున్నారు. అందులో మెడికల్‌ కాలేజీలు కూడా సమిధలవుతున్నాయి.ఇది ఆంధ్ర ప్రజలు చేసుకున్న ఖర్మ అనుకోవాలా!

 
- కొమ్మినేని శ్రీనివాస రావు,
సీనియర్‌ జర్నలిస్టు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement