'టాప్‌లో కటాఫ్‌' | New medical colleges stopped under administration of Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు సర్కార్‌ నిర్వాకంతో ఆగిన కొత్త మెడికల్‌ కాలేజీలు

Published Tue, Sep 17 2024 5:09 AM | Last Updated on Tue, Sep 17 2024 5:09 AM

New medical colleges stopped under administration of Chandrababu

నీట్‌ స్కోర్‌ 600 దాటినా ఈసారి నిరాశే.. కన్వీనర్‌ కోటా తొలి కౌన్సెలింగ్‌లో దక్కని సీటు

గతేడాది 563 స్కోర్‌కే ఎంబీబీఎస్‌ సీటు.. ఐదు కొత్త కాలేజీలు, 750 సీట్లు అదనంగా రావడమే కారణం 

ఈ దఫా మంచి ర్యాంకు సాధించినా రిజర్వేషన్‌ వర్గాలకూ రిక్త హస్తం 

పోటీకి అనుగుణంగా సీట్లు పెరగకపోవడంతో విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన 

వైద్య విద్య కలలతో లాంగ్‌ టర్మ్‌ శిక్షణ తీసుకున్న వారిలో నిస్పృహ 

ఏరు దాటాక తెప్ప తగలేసిన కూటమి నేతలు.. సెల్ఫ్‌ ఫైనాన్స్‌ విధానం 100 రోజుల్లో రద్దు హామీకి తిలోదకాలు 

కొత్త వైద్య కళాశాలలను అడ్డుకుని 700 ఎంబీబీఎస్‌ సీట్లు పోగొట్టిన కూటమి సర్కారు.. రెండేళ్లలో విద్యార్థులు కోల్పోతున్న

సీట్లు ఏకంగా 1,750 పాడేరు కాలేజీలో సెల్ఫ్‌ ఫైనాన్స్‌ విధానంలో సీట్ల భర్తీకి సన్నద్ధం

సాక్షి, అమరావతి: గతేడాది ఏయూ పరిధిలో ఓసీ విద్యార్థికి ఎంబీబీఎస్‌లో ప్రవేశాలకు నీట్‌ కటాఫ్‌ మార్కులు 563.. ఈ ఏడాది ఏకంగా 615..! ఇదే కేటగిరీకి ఎస్‌వీయూ పరిధిలో గతేడాది కటాఫ్‌ 550.. ఈ ఏడాది 601..!! ఆదివారం కన్వీనర్‌ కోటా తొలిదశ కౌన్సెలింగ్‌లో ఎంబీబీఎస్‌ సీట్ల కేటాయింపు పరిస్థితి ఇదీ!! అప్పుడు సీటు దొరకటానికి.. ఇప్పుడు గగనంగా మారటానికి కారణం.. కొత్త మెడికల్‌ కాలేజీలే!


గతేడాది 5 కొత్త మెడికల్‌ కాలేజీలు 
అందుబాటులోకి రావడంతో సీట్లు పెరిగి మన విద్యార్థులు ఎంతో మంది డాక్టర్లు కాగలిగారు! ఇప్పుడు నాలుగు కొత్త కాలేజీలకు కూటమి సర్కారు నిర్వాకంతో అనుమతులు రాకపోగా పాడేరులో వచ్చింది 50 సీట్లే! ఎంబీబీఎస్‌ సీట్లు పెరగకపోవడంతో మనకు ఎంత నష్టం జరిగిందో తొలి దశ కౌన్సెలింగ్‌లోనే స్పష్టంగా కనిపించింది!!

గతేడాది ప్రభుత్వ ఆధ్వర్యంలో 5 కొత్త వైద్య కళాశాలలు ప్రారంభం కావడంతో అదనంగా 750 సీట్లు సమకూరి మన విద్యార్థుల ఎంబీబీఎస్‌ కలలు నెరవేరాయి. ఏటా పెరుగుతున్న పోటీకి అనుగుణంగా దూరదృష్టితో వ్యవహరించి మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏకంగా 17 ప్రభుత్వ వైద్య కశాశాలలకు శ్రీకారం చుట్టారు. 

ఈక్రమంలో ఐదు కొత్త కాలేజీలు గతేడాది అందుబాటులోకి రాగా ఈ సంవత్సరం కూడా మరో ఐదు నూతన మెడికల్‌ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రారంభమైతే తమ కలలు ఫలిస్తా­యని విద్యార్థులు, తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు! కూటమి సర్కారు ప్రైవేట్‌ జపం, కొత్త కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయంతో ఆ ఆశల సౌథాలు కుప్పకూలాయి. 

ఏడాదంతా లాంగ్‌ టర్మ్‌ శిక్షణతో రూ.లక్షలు వెచ్చించి సిద్ధమైన విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. తొలి దశ కౌన్సెలింగ్‌లోనే సీట్‌ దొరక్కపోవడంతో ఇక మిగిలిన దశల్లో సీటు లభించే అవకాశాలు తక్కువేనని నిపుణు­లు అభిప్రా­యపడుతున్నారు. ఇప్ప­టికే రెండు మూడు సార్లు లాంగ్‌ టర్మ్‌ కోచింగ్‌ కోసం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు అప్పు చేసిన మధ్యతరగతి కుటుంబాలు మేనేజ్‌మెంట్‌ కోటా సీట్‌ కొనే పరిస్థితి లేదు. 

మరోసారి ధైర్యం చేసి లాంగ్‌ టర్మ్‌ కోచింగ్‌కి పంపుదామంటే కూటమి సర్కారు ప్రైవేట్‌ మోజుతో వచ్చే ఏడాదైనా సీట్లు పెరుగుతాయనే నమ్మకం పోయింది. చంద్ర­బాబు ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో నీట్‌ యూజీ విద్యార్థుల భవి­ష్యత్తు తలకిందులైంది. ప్రైవేట్‌కు కట్టబెట్టే ఉద్దేశంతో నాలుగు కొత్త కాలేజీలకు అనుమతులు రాకుండా ప్రభుత్వమే అడ్డుపడింది. కేవలం పాడేరు కళాశా­లలో 50 సీట్లకే అనుమతులు లభించాయి. 

పిల్లల గొంతు కోశారు!
ప్రభుత్వ నూతన వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌ సీట్లకు సెల్ఫ్‌ ఫైనాన్స్‌ విధానాన్ని రద్దు చేస్తామని.. అది కూడా అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే చేసి చూపిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కూటమి సర్కారు దాన్ని గాలికి వదిలేసి బేరాలకు తెర తీసింది. వైఎస్సార్‌ సీపీ హయాంలో తీసుకున్న చర్యల ఫలితంగా గిరిజన ప్రాంతంలోని పాడేరు మెడికల్‌ కాలేజీకి ఈ ఏడాది అరకొరగానైనా 50 ఎంబీబీఎస్‌ సీట్లు మంజూరు కాగా వాటిలో 21 సీట్లను సెల్ఫ్‌ఫైనాన్స్‌ కోటా కింద తాజాగా అమ్మకానికి పెట్టింది. 


ఈమేరకు 2024–25 విద్యా సంవత్సరానికి కొత్త వైద్య కళాశాలల్లో సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోటా కింద ప్రవేశాలకు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసు­కోవాలని ఆరోగ్య విశ్వవిద్యాలయం సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేయడంపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో పులివెందుల, పాడేరు, మార్కాపురం, మదనపల్లె, ఆదోనిలో ప్రారంభించాల్సిన ఐదు నూతన వైద్య కళాశాలలను కుట్రపూరితంగా అడ్డుకుని ఏకంగా 700 ఎంబీబీఎస్‌ సీట్లను పోగొట్టి పిల్లల భవిష్యత్తును అంధకారంగా మార్చారని మండిపడుతున్నారు. 

పులివెందుల వైద్య కళాశాలకు అనుమతులు వచ్చినా.. మేం నిర్వహించలేమంటూ దేశంలో ఎక్కడా లేనివిధంగా ఎన్‌ఎంసీకి కూటమి ప్రభుత్వమే లేఖ రాయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. అధికారం చేపట్టిన తొలి వంద రోజుల్లో సెల్ఫ్‌ఫైనాన్స్‌ విధానానికి సంబంధించిన 107, 108 జీవోలను రద్దు చేస్తామని ఎన్నికలకు ముందు టీడీపీ పలు సందర్భాల్లో హామీ ఇచ్చింది. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్‌కు హామీ గుర్తు లేదా? అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. 


తమది ప్రజా ప్రభుత్వం.. పేదల పక్ష­పాత ప్రభుత్వ­మంటూ తరచూ చెప్పే సీఎం చంద్రబాబు పేదరిక నిర్మూల­నకు పీ 4 ప్రణాళిక పేరుతో ప్రభుత్వ విద్యా సంస్థలను ప్రైవేట్‌ పరం చేయడాన్ని తీవ్రంగా నిరసి­స్తు­న్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌కు అప్ప­గించి పేదలకు వైద్య విద్యను దూరం చేస్తున్నా­రని ప్రజా సంఘాలు మండిపతు­న్నా­యి. ఈ నిర్ణ­యాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

రెండేళ్లలో కోల్పోతున్న సీట్లు 1,750
టీడీపీ అధికారంలో ఉండగా ప్రభుత్వ వైద్య విద్యారంగం బలోపేతానికి చర్యలు తీసుకో­లేదు. చంద్రబాబు హయాంలో ఒక్కటి కూడా ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఏర్పాటు కాకపోవడం దీనికి నిదర్శనం. 2004–09 మధ్య దివంగత వైఎస్సార్‌ సీఎంగా ఉండగా ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో రిమ్స్‌లను నెలకొల్పారు. రాష్ట్ర విభజన అనంతరం వైఎస్సార్‌ సీపీ హయాంలో జగన్‌ ప్రజారో­గ్యాన్ని బలోపేతం చేస్తూ 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వీటిలో ఐదు కొత్త వైద్య కళాశాలలు గత ఏడాది ప్రారంభం అయ్యాయి. 

750 ఎంబీబీఎస్‌ సీట్లు ఒక్కసారిగా అదనంగా పెరగడంతో తల్లిదండ్రులు, విద్యార్థుల్లో ఆశలు చిగురించాయి. ఈ విద్యా సంవత్సరంలో కూడా మరో ఐదు కళాశాలలు ప్రారంభించేలా గత ప్రభు­త్వం చర్యలు చేపట్టినా కూటమి సర్కారు దాన్ని కొనసాగించలేదు. దీంతో కేవలం 50 సీట్లు  సమకూరగా అదనంగా రావాల్సిన 700 సీట్లను రాష్ట్రం నష్టపోయింది. ఇక వచ్చే ఏడాది ప్రారంభం కావాల్సిన మరో ఏడు కొత్త మెడికల్‌ కాలేజీలను ప్రైవేట్‌ పరం చేయడం వల్ల అదనంగా మరో 1,050 మెడికల్‌ సీట్లను విద్యార్థులు నష్టపోతున్నారు. వెరసి మొత్తం 1,750 ఎంబీబీఎస్‌ సీట్లను కోల్పోవడం ద్వారా జరుగుతున్న నష్టం ఊహించలేనిది!!.

ఎంబీబీఎస్‌ యాజమాన్య కోటా ఆప్షన్ల నమోదు ప్రారంభం
2024–25 విద్యా సంవత్సరానికి కొత్త వైద్య కళాశాలల్లో సెల్ఫ్‌ ఫైనాన్స్, ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో యాజ­మాన్య కోటా ఎంబీబీఎస్‌ ప్రవేశాల కోసం తొలి దశ కౌన్సెలింగ్‌కు వెబ్‌ఆప్షన్ల నమోదు ప్రక్రియను ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాల­యం సోమవారం నుంచి ప్రారంభించింది. ఈ నెల 19వ తేదీ రాత్రి తొమ్మిది గంటలను ఆప్షన్ల నమోదు చివరి గడువుగా విధించారు. https://drntr.uhsap.in వెబ్‌సైట్‌లో విద్యార్థులు ఆప్షన్‌ నమోదు చేసుకోవాలని రిజిస్ట్రార్‌ డాక్టర్‌ రాధికారెడ్డి తెలిపారు. 

గతే­డాది ప్రారంభించిన విజయనగరం, ఏలూ­రు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల, ఈ ఏడాది ప్రారంభించనున్న పాడే­రు వైద్య కళాశాలలో 240 సెల్ఫ్‌ఫైనాన్స్, 101 ఎన్‌ఆర్‌­ఐ కోటా (సీ కేటగిరి) సీట్లు ఉన్నట్లు వెల్లడించారు. అదే విధంగా ప్రైవేట్, మైనార్టీ, స్విమ్స్‌ కళాశాలల్లో బీ కేటగిరి 1078, సీ కేటగిరి 495 సీట్లున్నట్లు పేర్కొన్నారు. ఆప్షన్ల నమోదు సమయంలో సాంకేతిక సమస్యలుంటే 9000780707, 8008250842 నంబర్లలో విద్యార్థులు సంప్రదించాలని తెలిపారు.

ప్రైవేటీకరణ దుర్మార్గం
పులివెందుల కళాశాలకు సీట్లను నిరాకరించడమేంటి? 
సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సుల రద్దు హామీ ఏమైంది? 
సీఎం చంద్రబాబుకు ఎస్‌ఎఫ్‌ఐ లేఖ 

విద్యార్ధుల వైద్య విద్య ఆశలను కూటమి ప్రభుత్వం చిద్రం చేస్తోందని భారత విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ) మండిపడింది. రాష్ట్రంలో మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ దుర్మార్గమని పేర్కొంది. ఈమేరకు ప్రభుత్వ తీరును తప్పుబడుతూ సీఎం చంద్రబాబుకు రాసిన లేఖను ఎస్‌ఎఫ్‌ఐ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె.ప్రసన్న కుమార్, ఎ.అశోక్‌లు సోమవారం మీడియాకు విడుదల చేశారు. విద్యను హక్కుగా అందించాల్సిన బాధ్యతను విస్మరించి ప్రైవేట్‌ వైద్య విద్యకు పట్టం కట్టడం దారుణమన్నారు. 

కేంద్రంతో సంప్రదించి 5 కొత్త కళాశాలలకు అనుమతులు తేవాల్సిన కూటమి ప్రభుత్వం పులివెందుల కాలేజీకి వచ్చిన 50 సీట్లను కూడా వద్దంటూ  నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌(ఎన్‌ఎంసీ)కి లేఖ రాయడం ఏమిటని ప్రశ్నించారు. ఒక్క పాడేరుకు 50 సీట్లు వచ్చాయని, మిగిలిన నాలుగు కొత్త కళాశాలలకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌వోపీ ఇచ్చి ఉంటే అనుమతులు లభించేవన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా  విద్యార్థులు 700 సీట్లు కోల్పోయారన్నారు. ప్రైవేటీకరణ వల్ల పేద, మధ్య తరగతి విద్యార్ధులు వైద్య విద్యకు దూరం కావడం ఖాయమన్నారు. 

రిజర్వేషన్ల ఊసే ఉండదని, తద్వారా వెనకబడిన తరగతుల విద్యార్ధులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. భవిష్యత్తులో పేదలకు ఉచిత వైద్య సేవలు కూడా అందవని ఆందోళన వ్యక్తం చేశారు.  సెల్ఫ్‌ ఫైనాన్స్‌ విధానాన్ని అధికారంలోకి వస్తే వంద రోజుల్లో రద్దు చేస్తామన్న హామీపై ఎందుకు నోరు మెదపడం లేదని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. వెంటనే వైద్య విద్య  ప్రైవేటీకరణను విరమించుకుని ఎన్‌ఎంసీకి రాసిన లేఖను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ తీరు మార్చుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

రాయలసీమకు బాబు ద్రోహం  
మెడికల్‌ సీట్లు వద్దనడం దారుణం 
పేద విద్యార్థులకు అన్యాయం చేయొద్దు 
వైఎస్సార్‌ సీపీ నేత వెన్నపూస రవీంద్రారెడ్డి 

టీడీపీ కూటమి ప్రభుత్వం రాయలసీమ ప్రాంతానికి తీరని అన్యాయం చేస్తోందని వైఎస్సార్‌ సీపీ పంచాయితీ రాజ్‌ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి మండిపడ్డారు. వైద్య, ఆరోగ్య రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తోందని ధ్వజమెత్తారు. ఈమేరకు సోమవారం ఆరు అంశాలతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌కి లేఖ రాశారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఒకేసారి 17 మెడికల్‌ కాలేజీల పనులు మొదలుపెట్టి ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లారని, 5 కాలేజీలు గత విద్యా సంవత్సరంలో ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు. 

సీఎం చంద్రబాబు నిర్వాకం వల్ల ఈ ఏడాది ఐదు కొత్త మెడికల్‌ కాలేజీలు ప్రారంభం కాకపోగా ఎన్‌ఎంసీ పులివెందుల మెడికల్‌ కాలేజీకి ఇచ్చిన 50 సీట్లు కూడా పోయాయని మండిపడ్డారు. ఇది రాయలసీమ ప్రజలకు ద్రోహం చేయడం కాదా? అని ప్రశ్నించారు. మంత్రి సత్యకుమార్‌ పులివెందుల మెడికల్‌ కళాశాలను ఎప్పుడైనా సందర్శించారా? అని నిలదీశారు. ప్రశ్నించారు. రాయల సీమ నుంచి గెలిచి వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఉంటూ ఇలా చేయటం దుర్మార్గం అనిపించటం లేదా? అని దుయ్యబట్టారు. 

2023 డిసెంబర్‌ 15వ తేదీన పులివెందుల మెడికల్‌ కళాశాల స్టాఫ్‌ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ జారీచేసి పోస్టులు భర్తీ చేసి 2023లో మార్చిలో కాలేజీని ప్రారంభించిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. చిన్న చిన్న ఇబ్బందులుంటే రాష్ట్ర ప్రభుత్వాలు అండర్‌ టేకింగ్‌ లెటర్‌ ఇస్తే అడ్మిషన్లు నిర్వహించుకోవటానికి ఎంఎన్‌సీ అనుమతిస్తుందన్న విషయం తెలియదా? అని ప్రశ్నించారు. కేవలం మాజీ సీఎం జగన్‌ హయాంలో నిర్మాణం, ప్రారంభం అయిందన్న విషయాన్ని జీర్ణించుకోలేక అడ్మిషన్లకు కూటమి ప్రభుత్వం అడ్డుపడిందని విమర్శించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement