ఇంటర్‌ బోర్డు ‘ప్రైవేట్‌’ బేరం | Certification is being done under the auspices of the Board | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ బోర్డు ‘ప్రైవేట్‌’ బేరం

Published Sat, Apr 29 2017 1:22 AM | Last Updated on Tue, Sep 5 2017 9:55 AM

ఇంటర్‌ బోర్డు ‘ప్రైవేట్‌’ బేరం

ఇంటర్‌ బోర్డు ‘ప్రైవేట్‌’ బేరం

- ప్రైవేట్‌ సంస్థ ఆన్‌లైన్‌ పాఠాల యాప్‌కు బోర్డు అండ!
- బోర్డు ఆధ్వర్యంలోనే రూపొందిస్తున్నట్లు సర్టిఫికేషన్‌
- సీనియర్‌ అధికారుల ప్రోత్సాహంతోనే ప్రైవేట్‌ వ్యాపారం


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఇంటర్మీడియెట్‌ బోర్డులో భారీ అక్రమానికి తెర లేచింది. ఆన్‌లైన్‌లో పాఠాలు అందిస్తామంటూ ఓ ప్రైవేట్‌ సంస్థ రూపొందిస్తున్న మొబైల్‌ యాప్‌ను బోర్డే సర్టిఫై చేసేందుకు సిద్ధమైంది. ఇంటర్‌ చదివే 10 లక్షల మంది విద్యార్థులకు ఆ యాప్‌ అందుబాటులోకి తేవడం ద్వారా రూ. కోట్లు సంపాదించవచ్చన్న ప్రైవేట్‌ సంస్థ ఆలోచనకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. బోర్డు సర్టిఫై చేసిందంటే సహజంగానే కంటెంట్‌ బాగుంటుందనే ఆలోచనతో విద్యార్థులంతా కొనుగోలు చేస్తారు. బాగా ఉపయోగపడు తుందని భావిస్తారు. విద్యార్థుల ఆ ఆశలను క్యాష్‌ చేసుకొని భారీగా దండుకోవచ్చన్న ప్రైవేట్‌ సంస్థ ప్రణాళికకు బోర్డు ఓకే చెప్పింది. దానిపై ఒప్పందం చేసుకుంది. యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునే విద్యార్థి నుంచి ఏటా రూ. 300 చొప్పున వసూలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ వ్యవహారంలో భారీగా ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

మరోవైపు దీన్ని వ్యతిరేకించిన అధికారులపై బోర్డు ఉన్నతాధికారి ఒకరు కక్ష సాధింపు చర్యలకు దిగారు. యాప్‌ను వ్యతిరేకించినందుకు, అనుకూలంగా సంతకం చేయనందుకు ఓ అధికారిని రాత్రికి రాత్రే బదిలీ చేశారు. ఒత్తిడి తట్టుకోలేక మరో అధికారి రీప్యాట్రేషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. అకడమిక్‌ విభాగం లోని మరికొంత మంది అదే బాటలో ఉన్నారు. అయినా ప్రైవేట్‌ సంస్థ వ్యాపారానికి బోర్డును అడ్డగోలుగా తాకట్టు పెట్టేందుకు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు.

డిస్క్‌ పేరుతో : ఇంటర్మీడియెట్‌కు గాను ఆన్‌లైన్‌ డిజిటల్‌ పాఠాలు అందిస్తామంటూ డిజిటల్‌ స్టడీ కంటెంట్‌ (డిస్క్‌) పేరుతో వ్యాపారం చేసేందుకు ఓ ప్రైవేటు సంస్థ సిద్ధమైంది. బోర్డును సంప్రదించి ఉన్నతాధి కారులను ఒప్పించింది.ప్రభుత్వంలోని ఓ ముఖ్య నేత నుంచి బోర్డుకు ఓ మాట చెప్పిం చింది.చకచకా పనులు మొదలయ్యాయి. ఒప్పందాలు జరిగాయి. విద్యార్థులకు ఇంటర్‌ పాఠాలను అందిస్తామని.. అలాగే ఎంసెట్, జేఈఈ మెటీరియల్‌ రూపొందిస్తామని సదరు సంస్థ చెప్పగా అందుకూ బోర్డు ఓకే చెప్పింది. దీంతో యాప్‌ను త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు పనులు మొదలయ్యాయి. ఇంటర్‌ బోర్డు సర్టిఫై చేసిన యాప్‌ అంటూ విద్యార్థుల నుంచి దండుకునేందుకు సంస్థ సిద్ధమైంది.

బోర్డు ఆన్‌లైన్‌ పాఠాలు మూలకు...
రెండేళ్ల కిందట సిలబస్‌ మార్పులు చేసిన సమయంలో ఆన్‌లైన్‌ పాఠాలను బోర్డు రూపొందించినా ఇంతవరకూ విద్యార్థులకు అందుబాటులోకి తేలేదు. గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల్లో 10 నుంచి 15 మంది సీనియర్‌ ప్రొఫెసర్లు, లెక్చరర్లు రోజుల తరబడి కూర్చొని రూపొందిం చిన పాఠాలను మూలన పడేసింది. విద్యార్థులకు అందించాలన్న ధ్యాస అధికారుల్లో లేదు. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద విద్యార్థులకు కనీసం మన టీవీ ద్వారా ఆ పాఠాలను చెప్పించాలన్న ఆలోచ నలూ రావడం లేదు. మరోవైపు గతేడాది గ్రామీణ విద్యార్థులకు ఉచితంగా ఎంసెట్‌ కోచింగ్‌ ఇచ్చిన ప్రభుత్వ జూనియర్‌ లెక్చరర్లు.. ఈసారీ కోచింగ్‌ సిద్ధమవగా బోర్డు పట్టించుకోకుండాప్రైవేటు సంస్థ రూపొంది స్తున్న యాప్‌కు ఓకే చెప్పింది. బోర్డులోని కిందిస్థాయి అధికారులంతా వ్యతిరేకించినా యాప్‌నే అమల్లోకి తెచ్చేందుకు సిద్ధమైంది.

అనుమతి కుదరదన్నందుకు బదిలీ..
ఇంటర్‌ బోర్డులో అకడమిక్‌ విభాగం అనుమతి లేకుండా ఆ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు. కాబట్టి అకడమిక్‌ విభాగంలోని అధికారులంతా ఆ యాప్‌కు సంతకం చేయాలని, అనుమతివ్వాలని బోర్డు ఉన్నతాధికారి ఒకరు ఒత్తిడి పెంచారు. అయితే ప్రైవేటు సంస్థ యాప్‌ ఎందుకు, బోర్డు ఆధ్వర్యంలో రూపొందించిన ఆన్‌లైన్‌ పాఠాలున్నాయి, మొబైల్‌ యాప్‌ ద్వారా వాటిని అందిద్దాం అని అసోసియేట్‌ ప్రొఫెసర్‌ సునంద వివరించారు. దాన్ని ఏమాత్రం వినిపించుకోని అధికారి.. సంతకం చేయాలని సునందపై ఒత్తిడి పెంచారు. ప్రైవేటు సంస్థ వ్యాపారానికి బోర్డు వత్తాసు పలకడం సరికాదని, ఆ సంస్థ కంటెంట్‌కు మనం ఓకే చెప్పడం కుదరదని, సంతకం చేయనని ఆమె స్పష్టం చేశారు. దీంతో రాత్రికి రాత్రే పెద్దపల్లిలో ఓ కాలేజీకి ఆమెను బదిలీ చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement