బాలకార్మిక వ్యవస్థను నిషేధించే ఆర్టికల్? | Article prohibiting the scourge of child labor? | Sakshi
Sakshi News home page

బాలకార్మిక వ్యవస్థను నిషేధించే ఆర్టికల్?

Published Sat, Oct 11 2014 10:27 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

బాలకార్మిక వ్యవస్థను నిషేధించే ఆర్టికల్? - Sakshi

బాలకార్మిక వ్యవస్థను నిషేధించే ఆర్టికల్?

వ్యక్తి పరిపూర్ణ వికాసానికి, స్వేచ్ఛగా జీవించేందుకు తోడ్పడే అవకాశం కల్పించేదే హక్కు. ఒక రాజ్యం స్వభావం దాని పౌరులకు కల్పించే హక్కుల ద్వారానే తెలుస్తుందని హెచ్.జె. లాస్కి పేర్కొన్నారు. ‘సమాజం కోరిన, రాజ్యాంగంతో  గుర్తింపు పొందిన అంశాలే హక్కులు’ అని గార్నర్ పేర్కొన్నారు. ‘భారతీయులకు సమాన హక్కులు కావాలి, స్వరాజ్యం మా జన్మ హక్కు’ అని మొదటిసారిగా 1895 కాంగ్రెస్ సమావేశంలో బాలగంగాధర్ తిలక్ డిమాండ్ చేశారు. 1928 మోతిలాల్ నెహ్రూ నివేదికలో భారతీయులకు సమాన హక్కులు ఉండాలనీ, మైనార్టీ వర్గాలకు ప్రత్యేక హక్కులు కల్పించాలని కోరారు. 1931లో కరాచీలో నిర్వహించిన కాంగ్రెస్ సమావేశంలో సర్దార్ పటేల్ హక్కుల తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
 
ప్రాథమిక హక్కులు
హక్కుల రూపకల్పన కోసం పటేల్ అధ్యక్షతన ప్రాథమిక హక్కుల కమిటీ, జె.బి. కృపలానీ అధ్యక్షతన ప్రాథమిక హక్కుల ఉపకమిటీని రాజ్యాంగ పరిషత్ నియమించింది. ఈ కమిటీలు అమెరికా బిల్ అ్‌ఫ్ రైట్స్ ద్వారా ప్రభావితమై హక్కులను రూపొందించాయి. ప్రాథమిక హక్కులను మూడో భాగంలో చేర్చారు. వీటి గురించి అధికరణలు 12- 35 వరకు వివరిస్తాయి.

*   అధికరణ 12 - రాజ్య నిర్వచనం: రాజ్యం అంటే కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు; అవి చేసే శాసనాలు.
*   అధికరణ 13 - హక్కుల అమలు: హక్కులకు విరుద్ధంగా ఉన్న చట్టాలు చెల్లవు. వీటి రక్షణ కోసం న్యాయస్థానాలకు న్యాయ సమీక్ష అధికారం కల్పించారు. న్యాయ సమీక్ష గురించి రాజ్యాంగంలో పరోక్షంగా ప్రస్తావించారు.
 
 సమానత్వపు హక్కు (అధికరణ 14-18)
*   అధికరణ - 14: చట్టం ముందు అందరూ సమానమే. చట్టం అందరికీ సమాన రక్షణ కల్పిస్తుంది. దీన్నే సమన్యాయ పాలనగా పేర్కొంటారు. దీని నుంచి అధికరణ 361 ప్రకారం రాష్ట్రపతి, గవర్నర్‌లకు మినహాయింపు ఇచ్చారు.
అధికరణ - 15: పౌరుల పట్ల జాతి, మత, కుల, లింగ పుట్టుక ప్రాతిపదికన రాజ్యం వివక్ష చూపకూడదు.
*  15(2): ప్రజా ఉపయోగమైన ప్రదేశాల్లో అందరికీ సమాన ప్రవేశం కల్పించాలి.
*    15(3): మహిళలకు తోడ్పడే ఉద్యోగాల్లో వారికే ప్రాముఖ్యత ఇవ్వాలి.
* 15(4): బలహీన వర్గాలకు ప్రత్యేక మినహాయింపులు ఇవ్వాలి.
*    15(5): వృత్తి విద్యా సంస్థల్లో ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించాలి. దీన్ని 2006లో 93వ సవరణ ద్వారా చేర్చారు.
*    అధికరణ 16: ప్రభుత్వ ఉద్యోగ, విద్య అవకాశాల్లో అందరికీ సమాన అవకాశం కల్పించాలి.
*    16(1): ఉద్యోగ అవకాశాల్లో కుల, మత, లింగ విభేదాలు పాటించకూడదు.
*    16(2): సామాజికంగా వెనుకబడిన వారికి ప్రత్యేక మినహాయింపులు ఇవ్వాలి.
*    16(3):అవసరమైనప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్ కల్పించాలి.
*    16(4): ప్రభుత్వ ఉద్యోగాల్లో సామాజికంగా వెనుకబడిన వారికి పదోన్నతుల్లో రిజర్వేషన్ కల్పించాలి.
*   అధికరణ 17 - అస్పృశ్యత నిషేధం: ఇది ఒక సామాజిక దూరాచారం. కాబట్టి దీన్ని నిషేధించారు. దీని అమలుకు పార్లమెంట్ చట్టాలు చేయవచ్చు. అంటరానితనం నిషేధ చట్టాన్ని 1955లో రూపొందించారు. దీన్ని 1976లో పౌర హక్కుల చట్టంగా మార్చారు.
*    అధికరణ 18 -  బిరుదుల రద్దు: బ్రిటిషర్లపాలనా కాలంలో కల్పించిన రావ్‌బహద్దూర్, రావు సాహెబ్, రాజా విక్రమార్క మొదలైన బిరుదులను నిషేధించారు. విదేశీ బిరుదులను కూడా నిషేధించారు. వీటిని రాష్ట్రపతి ఆమోదంతో మాత్రమే స్వీకరించాలి. స్వదేశీ బిరుదులపై కూడా రాష్ట్రపతి నిషేధం విధించవచ్చు.
ఉదా: 1977 నుంచి 1980 వరకు భారతరత్న, పద్మ విభూషణ్ మొదలైన బిరుదులను నిషేధించారు.
 
స్వేచ్ఛ, స్వాతంత్రపు హక్కు (అధికరణ19-22)
*   అధికరణ 19: భారత పౌరులందరికీ ఏడు రకాల స్వేచ్ఛ కల్పించారు. ప్రస్తుతం ఆరు రకాల స్వేచ్ఛ ఉంది.
*    అధికరణ 19(1)(ఎ) భావ ప్రకటన స్వేచ్ఛ: వ్యక్తిగత భావాలను వార్తా పత్రికలు, రేడియో, టీవీ, పుస్తకాలు, కరపత్రాలు మొదలైన సాధనాల ద్వారా వ్యక్తపర్చుకోవచ్చు.
*    అధికరణ 19(1)(బి): మారణాయుధాలు ధరించకుండా, శాంతియుతంగా బహిరంగ సభలను నిర్వహించుకోవచ్చు.
*  అధికరణ 19(1)(సి): సంస్థలను, సంఘాలను ఏర్పాటు చేసుకోవచ్చు.
*   అధికరణ 19(1)(డి): దేశంలో ఎక్కడైనా సంచరించవచ్చు.
*   అధికరణ 19(1)(ఇ): దేశంలో ఎక్కడైనా స్థిర నివాసాన్ని ఏర్పర్చుకోవచ్చు.
*    అధికరణ 19(1)(ఎఫ్): ఆస్తిని సంపాదించుకునే స్వేచ్ఛ. దీన్ని 1978లో 44వ సవరణ ద్వారా తొలగించారు.
*    అధికరణ 19(1)(జి): ఇష్టమైన వృత్తిని చేపట్టవచ్చు.
*    అధికరణ 20 - నేర నిరూపణ, వ్యక్తులకు కొన్ని రక్షణలు
*    20(1): ఏ వ్యక్తినైనా చట్ట ప్రకారమే శిక్షించాలి.
*  20(2): ఏ వ్యక్తినీ ఒకే నేరానికి రెండుపర్యాయాలు శిక్షించరాదు.
*    20(3): ఏ వ్యక్తినీ వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని బలవంత పెట్టరాదు.
*   అధికరణ 21 - జీవించే హక్కు: చట్టంలో నిర్దేశించిన పద్ధతిలో తప్ప మరేవిధంగానూ ఒక వ్యక్తి స్వేచ్ఛకు, ప్రాణానికి హాని తలపెట్టరాదు. ‘చట్టం నిర్ధారించే పద్ధతి’ అనే అంశాన్ని జపాన్ నుంచి గ్రహించారు.
*   అధికరణ - 21(ఎ): ఉచిత, నిర్బంధ విద్యాహక్కు. దీన్నే 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. 2010 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తెచ్చారు. దీని అమలుకు 65:35 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను భరిస్తాయి.
*   అధికరణ 22 - నిర్బంధంలోకి తీసుకున్న వ్యక్తికి రక్షణ: అరెస్టు చేసిన వ్యక్తిని 24 గంటల్లోపు కోర్టులో హాజరుపర్చాలి. అతడికి ఇష్టమైన అడ్వకేట్‌ను పెట్టుకునేందుకు అవకాశం కల్పించాలి. అరెస్టు చేసిన వ్యక్తిని చట్టప్రకారమే విచారించాలి. ప్రివెంటివ్ డిటెన్షన్  చట్టం కింద అరెస్టైన వారికి ఇది వర్తించదు.
 
పీడనాన్ని నిరోధించే హక్కు (అధికరణ - 23, 24) దీన్ని ప్రత్యేకంగా మహిళలు, పిల్లల కోసం చేర్చారు.
*   అధికరణ - 23: మహిళలను దోపిడీకి గురిచేస్తున్న వెట్టిచాకిరి, దేవదాసి, పడుపు వృత్తి మొదలైన దూరాచారాలను నిషేధించారు. మనుషుల అక్రమ రవాణాను నిషేధించారు.
*   అధికరణ 24 - బాలకార్మిక వ్యవస్థ నిషేధం: బాలల సంరక్షణ కోసం బాలల హక్కుల చట్టం 1938, ఫ్యాక్టరీల చట్టం - 1948, మనుషుల అక్రమ రవాణా నిషేధ చట్టం 1956 మొదలైనవాటిని రూపొందించారు. పాఠశాలల్లో విద్యార్థులను భౌతికంగా దండించడం కూడా పీడించడం కిందకే వస్తుందని 2006లో ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది.
 
మతస్వాతంత్రపు హక్కు(అధికరణ-25, 28)
*   అధికరణ - 25: దీని ప్రకారం మతస్వేచ్ఛ కల్పించారు. ఇష్టమైన మతాన్ని స్వీకరించవచ్చు. బలవంతంగా మత మార్పిడి చేయకూడదు.
*  అధికరణ - 26: ఎవరి మతాన్ని వారు ప్రచారం చేసుకోవచ్చు. స్థిర, చరాస్థులను సంపాదించుకోవచ్చు. మతాభివృద్ధి కోసం సంస్థలను స్థాపించుకోవచ్చు.
*    అధికరణ - 27: దీని ప్రకారం మత ప్రాతిపదికన, మత కార్యక్రమాలపై పన్ను విధించరాదు. మత కార్యక్రమాల కోసం విరాళాలను వసూలు చేసుకోవచ్చు.
*    అధికరణ - 28: ప్రభుత్వ, ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడిచే విద్యా సంస్థల్లో మత బోధన నిషేధం.
 
సాంస్కృతిక, విద్యాహక్కు (అధికరణలు - 29, 30)
*   అధికరణ-29: భారత ప్రజలు తమ భాషను, లిపిని, సంస్కృతిని రక్షించుకోవచ్చు, అభివృద్ధి చేసుకోవచ్చు. మైనార్టీ లు అనే కారణంతో విద్యాసంస్థల్లో ప్రవేశం నిరాకరించరాదు. ఆదివాసీలు సంస్కృతిని పరిరక్షించుకోవచ్చు.
*   అధికరణ - 30: మైనార్టీ వర్గాలు ప్రత్యేక విద్యాసంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు. వీటి నిర్వాహణలో యాజమాన్యానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది.
 
ఆస్తిహక్కు (అధికరణ - 31)
ఇది ఒకప్పుడు ప్రాథమిక హక్కు. దీనికి 1, 17, 24వ సవరణల ద్వారా మార్పులు చేశారు.    1978లో 44వ సవరణ ద్వారా దీన్ని తొలగించి, నిబంధన 300(ఎ)లో చేర్చారు. ప్రస్తుతం ఇది ఒక చట్టబద్ధమైన హక్కు.
 
రాజ్యాంగ పరిహార హక్కు (అధికరణ-32)
ఇది అతి ముఖ్యమైంది. మిగతా అన్ని హక్కులకు రక్షణ కల్పిస్తుంది. హక్కులకు నష్టం వాటిల్లినప్పుడు న్యాయ స్థానాలను ఆశ్రయించే అవకాశం కల్పిస్తుంది. వీటి రక్షణ కోసం సుప్రీంకోర్టు 32వ, హైకోర్టులు 226వ అధికరణల ప్రకారం రిట్లను జారీ చేస్తాయి. రిట్ల జారీ విషయంలో హైకోర్టు అధికార పరిధి ఎక్కువ. అవసరమైతే రిట్ల జారీ అధికారాన్ని పార్లమెంట్ చట్టం ద్వారా కింది కోర్టులకూ కల్పించవచ్చు.

రిట్లు
హెబియస్ కార్పస్: ఈ పదం లాటిన్ భాష నుంచి వచ్చింది. అరెస్టు చేసిన వ్యక్తిని 24 గంటల్లోపు న్యాయస్థానంలో హాజరుపర్చాలి. ఈవిధంగా హాజరు పర్చని సందర్భంలో కోర్టు ఈ రిట్‌ను జారీ చేస్తుంది.
మాండమస్: ఏదైనా ప్రభుత్వ సంస్థ లేదా ప్రభుత్వ అధికారి తన విధిని సక్రమంగా నిర్వహించనప్పుడు నిర్వహించాలని ఆదేశిస్తూ జారీ చేసే రిట్ ఇది. దీని నుంచి రాష్ట్రపతికి, గవర్నర్‌కు మినహాయింపు ఉంది.
 కో వారెంటో: ప్రజా సంబంధమైన పదవుల్లోకి అక్రమంగా ప్రవేశించడం, ఆ పదవులను దుర్వినియోగపర్చడం లాంటి సందర్భాల్లో ఆ పదవిలో కొనసాగరాదని జారీ చేసే రిట్.
ప్రొహిబిషన్: ఏదైనా కోర్టు తన పరిధిలోకి రాని కేసును విచారిస్తున్న సందర్భంలో ఆ కేసు మీ పరిధిలోకి రాదు కాబట్టి విచారణ ఆపేయాలని కింది కోర్టుకు హైకోర్టు జారీ చేసే రిట్.
సెర్షియరీ: ఏదైనా కింది కోర్టు  తన అధికార పరిధిలోకి రాని కేసును విచారిస్తుంటే.. ఆ కేసు మీ పరిధిలోకి రాదు కాబట్టి దాన్ని పై కోర్టుకు బదిలీ చేయాలని కింది కోర్టుకు హైకోర్టు జారీ చేసే రిట్.
* అధికరణ - 33: దీని ప్రకారం సైన్యంలో, పోలీస్ వ్యవస్థలో పనిచేసే అధికారుల హక్కులపై పరిమితులు విధించవచ్చు.
* అధికరణ - 34: జాతీయ అత్యవసర సమయంలో ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా రద్దు చేయవచ్చు. వీటిని రద్దు చేసే అధికారం నిబంధన 359 ప్రకారం రాష్ట్రపతికి ఉంది.  ఈ సందర్భాల్లో నిబంధనలు 20, 21 రద్దు కావు.
* అధికరణ - 35: దీని ప్రకారం హక్కులకు సంబంధించి చట్టాలను చేసే అధికారం పార్లమెంట్‌కు ఉంది.
 
గతంలో అడిగిన ప్రశ్నలు
 
 
 1.    హెబియస్ కార్పస్ అనేది?
     1) గ్రీక్ పదజాలం 2) లాటిన్ పదజాలం
     3) ఇంగ్లిష్ పదజాలం
     4) ఫ్రెంచ్ పదజాలం
 2.    భారత రాజ్యాంగం ప్రకారం కిందివాటిలో ఏది మౌలికమైన హక్కు కాదు?
     1) సంఘాలను ఏర్పర్చుకోవడం
     2) భావ ప్రకటన హక్కు
     3) ఉచిత నిర్బంధ విద్యా హక్కు
     4) సంచరించే హక్కు
 3.    రాజ్యాంగంలోని 19వ ఆర్టికల్‌లో కిందివాటిలో దేన్ని చేర్చలేదు?
     1) వాక్కు, భావ స్వాతంత్య్రం
     2) వినోదం, ఉల్లాసం, హాస్యం
         స్వాతంత్య్రం
     3)    సమావేశాలు, సంఘాలను
         ఏర్పర్చుకునే స్వాతంత్య్రం
     4)    చలన, నివాస, వృత్తి, వ్యాపార
         స్వాతంత్య్రం
 4.    రాజ్యంగంలోని 21వ ఆర్టికల్ ఏ విషయా నికి సంబంధించింది?
     1)    మాట్లాడే హక్కుకు సంబంధించిన కొన్ని హక్కులను సంరక్షిస్తుంది
     2)    నేర నిర్ధారణకు సంబంధించిన సంరక్షణ
     3) వ్యక్తిగత స్వేచ్ఛ, జీవితం సంరక్షణ
     4)    కొన్ని కేసుల్లో అరెస్టుకు వ్యతిరేకంగా రక్షణ
 5.    రాజ్యాంగంలోని ఎన్నో ఆర్టికల్ బాల కా ర్మిక వ్యవస్థను నిషేధిస్తుంది?
     1)  24    2)  36     3)  18     4)  28
 6.    {పాథమిక హక్కులను సవరించరాదని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పునిచ్చింది?
     1) కేశవనంద భారతి ఠిట స్టేట్ ఆఫ్ కేరళ
     2) గోలక్‌నాథ్ ఠిట స్టేట్ ఆఫ్ పంజాబ్
     3) ఇందిరాగాంధీ ఠిట రాజ్‌నారాయణ్
     4)    శంకర్ ప్రసాద్ ఠిట యూనియన్  ఆఫ్ ఇండియా
 
 సమాధానాలు
     1) 2;    2) 3;    3) 2;    4) 3;
     5) 1;    6) 2.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement