అద్దెలు లేవు.. అన్నం కూడా లేదా? | The education sector is completely corrupt under the Congress rule | Sakshi
Sakshi News home page

అద్దెలు లేవు.. అన్నం కూడా లేదా?

Published Wed, Oct 16 2024 3:30 AM | Last Updated on Wed, Oct 16 2024 3:30 AM

The education sector is completely corrupt under the Congress rule

కాంగ్రెస్‌ పాలనలో పూర్తిగా భ్రషు్టపట్టిన విద్యారంగం 

విద్యార్థులు, యాజమాన్యాలు ధర్నాలు చేసే దుస్థితి : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యారంగాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా భ్రష్టు పట్టించిందని, విద్యాశాఖ బాధ్యతలు చూస్తున్న సీఎం రేవంత్‌రెడ్డికి ఆ శాఖలో నెలకొన్న సమస్యలు తెలుసుకునే ఓపిక లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మండిపడ్డారు. గురుకుల పాఠశాలల భవనాల అద్దె చెల్లించలేని స్థితిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం..విద్యార్థులకు కనీసం అన్నం కూడా పెట్టలేని స్థితికి దిగజారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ మేరకు కేటీఆర్‌ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కాలేజీల యాజమాన్యాలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీలు నిరవధికంగా మూసివేశారన్నారు. దీంతో ఆ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. 

మూసీనది ప్రక్షాళనకు రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి గురుకుల విద్యా సంస్థల భవనాల అద్దె, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌íÙప్‌ల డబ్బు ఇచ్చేందుకు చేతకావడం లేదని కేటీఆర్‌ మండిపడ్డారు. 

చదువుకు దూరం చేసే కుట్ర 
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఓ వైపు ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేస్తూ, మరోవైపు ప్రైవేట్‌ విద్య పేద, మధ్య తరగతి విద్యార్థులకు అందకుండా చేసే కుట్రలకు పాల్పడుతోందని కేటీఆర్‌ అన్నారు. నాసిరకం భోజనం, భద్రత లోపాలతో ఇప్పటికే గురుకుల విద్యార్థుల్లో భయాందోళన నెలకొందని చెప్పారు. 

ఫీజు బకాయిలను సాకుగా చూపుతూ కాలేజీ యాజమాన్యాలు మెమో, టీసీలు ఇవ్వకపోవడంతో పేద విద్యార్థులు పైచదువులు, ఉద్యోగాలకు వెళ్లడంలో ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్రం ఏర్పడిన సమయంలో అంతకుముందు ఉన్న ప్రభుత్వం ఇవ్వాల్సిన రూ. 2 వేల కోట్ల ఫీజు బకాయిలను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. 

సీఎం రేవంత్‌కు పాలన అనుభవం లేకపోవడంతో విద్యార్థులు నష్టపోతున్నారని, ఢిల్లీకి మూటలు పంపడంలో తీరిక లేకుండా ఉన్న ఆయనకు విద్యార్థులు, కాలేజీల సమస్యలు పట్టడం లేదన్నారు. సమస్యలను పరిష్కరించకుంటే విద్యార్థులతో కలిసి బీఆర్‌ఎస్‌ ఉద్యమిస్తుందని కేటీఆర్‌ హెచ్చరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement