నాటింగ్‌హామ్: గాయం కారణంగా రాబోయే ప్రపంచకప్ మ్యాచ్‌లకు దూరమైన శిఖర్ ధావన్ తన ప్రతిస్పందనను కవితా రూపంలో వెల్లడించాడు. గాయం తనను దెబ్బ తీయలేదనే ఉద్దేశం అతని మాటల్లో కనిపించింది. ప్రఖ్యాత ఉర్దూ రచయిత రాహత్ ఇందోరీ రాసిన పంక్తిని అతను ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. ‘కభీ మహక్ కీ తరహ్ హమ్ గులోన్‌సే ఉడ్తే హై.. కభీ ధుయే కీ తరహ్ పర్బతోన్‌సే ఉడ్తే హై..యే కైంచియా హమే ఉడ్నే సే ఖాఖ్ రోకేంగీ.. కే హమ్ పరోన్‌సే నహీ హౌస్‌లోసే ఉడ్తే హై’ (పూలల్లో ఉండే సువాసనలా ఒకసారి, పర్వతాల మీదుగా వెళ్లే పొగ మంచులా మరోసారి ఎగురుకుంటూ వెళ్లిపోతాను.
నేను ఎగరకుండా ఈ కత్తెరలు ఏం ఆపగలవు. నేను ఎగిరేది రెక్కలతో కాదు, సంకల్పంతో) అని ధావన్ తన భావాన్ని పంచుకున్నాడు. తన కవితతో ధావన్ స్ఫూర్తి పొందే ప్రయత్నం చేయగా... స్వయంగా రాహత్ ఇందోరి వెంటనే మరో కవితతో స్పందించడం విశేషం. ‘సెలయేటికి తన అస్తిత్వంపై చాలా గర్వం ఉంది. దాహంతో ఉన్న నాతో పెట్టుకుంటే తన సంగతేమౌతుందో తెలియదా’ (బహుత్ గురూర్ హై దరియాకో అప్నే హోనేపర్. జో మేరీ ప్యాస్ సే ఉల్‌ఝేతో ధజ్జియా ఉడ్‌జాయే, జిందాబాద్) అంటూ మరింతగా ప్రోత్సహించే ప్రయత్నం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment